వ్యక్తిత్వ వికాసం
'ఓటమి ముగింపు కాదు
.....
ప్రయత్న విరమణే ముగింపు
-రచన శ్రీ దత్త (శృంగవరపు రచన)
క్రికెట్ ...పరిచయం అక్కర్లేని క్రీడ. అలాంటి క్రికెట్ క్రీడాకారుల్లో ‘అనిల్ కుంబ్లే’ గురించి తెలియని వారుండరు. భారత దేశపు అత్యున్నత స్పిన్ బౌలర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన పేరే. అయితే అనిల్ కుంబ్లే క్రికెట్ జీవితం అంతా సాఫీగా సాగింది అనుకుంటే పొరపాటే. అతను తన క్రికెట్ కెరియర్ లో ఎన్ని ఘన విజయాలు సొంతం చేసుకున్నాడో అన్ని అడ్డంకులని ఎదుర్కొన్నాడు. అకారణంగా ఎదురుదెబ్బలు తిన్నాడు.
అతని క్రికెట్ రంగప్రవేశమే విమర్శలతో మొదలైంది. సోడాబుడ్డి కళ్ళద్దాలతో , బక్క పలుచగా ఉన్న ఇతనా బౌలింగ్ చేసేది ? అని కొందరు ,ఇతను మాకు లెగ్ స్పిన్నర్ లా కాదు మీడియం పేస్ బౌలర్ లా కనిపిస్తున్నాడు అని ఇంకొందరు , మరి కొందరైతే ఇతను స్పిన్నరే కాదని ,స్పిన్నర్లకు ఆయువు పట్టు అయిన బంతిని గిరిగిట్లు తిప్పడం చేతకాదని మిగిలిన వారు విమర్శలతో నిరుత్సాహపరిచారు.
ఇలా ఆదిలోనే గుండెల్లో గునపాల్లా గుచ్చుకునే మాటలతో ,ప్రోత్సహించాల్సింది పోయి దారుణంగా అవమానించారు. కేవలం వీరి మాటలే కాదు, భ్రష్టు రాజకీయాలకు ,దరిద్రపుగొట్టు రికమెండషన్లకు పేరైన భారత క్రికెట్ బోర్డు కూడా ఇతని క్రికెట్ కెరియర్ తో ఆడుకుంది.అకారణంగా అతనిని జట్టులో నుంచి తొలగించడం ,వన్డే లకు అతన్ని దూరంగా ఉంచడం ,ఎప్పుడు పడితే అప్పుడు టీమ్ లోకి తీసుకోవడం ,జట్టులో సీనియర్ ఆటగాడైన తుది 11 మంది దాకా జట్టులోకి ఎంపిక చేయకపోవడం ,వైస్ కెప్టెన్ స్థాయి నుంచి కెప్టెన్ స్థాయి ఇవ్వాల్సింది పోయి వైస్ కెప్టెన్సి తో పాటు జట్టులోంచితొలగించడం ...ఇలా ఎన్నెన్నో ఆటుపోట్లు కుంబ్లే జీవితంలో.
చివరికి ప్రభుత్వాలు కూడా ...ఒంటి చేత్తో లెక్కకు మించి జట్టుకి ఘన విజయాలు అందించినా ,ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సమం చేసిన అతని ప్రతిభకు సరి తూగే పురస్కారాలు అతని దరి చేరనే లేదు. మొన్నటికి మొన్న వచ్చిన వారికి ‘పద్మ ‘ పురస్కారాలు అందించిన ప్రభుత్వాలు జాతి గర్వపడే విజయాలందించే వ్యక్తికి మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు.ఘన విజయాలు అందించినా ఎప్పుడు జట్టులో ఉంటాడో తెలియని పరిస్థితి. ఆపద సమయాల్లో నిలిచే రాజకీయ పెద్దలు,బోర్డు సభ్యులు లేకపోవడం ,నిత్యం విమర్శలు ...ఇవన్నీ తన ఎదుగుదలకు సోపానాలుగా భావించారు కుంబ్లే. ఏనాడూ ఎవరిని ఒక్క మాట అనలేదు. ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నించను లేదు. కెప్టెన్సి రాలేదని కుమిలిపోనూ లేదు.
అన్నింటికీ ఒక్కటే సమాధానం. తన చేతి ఆయుధమైన బంతితో విజృంభించటం. విమర్శలకు తన ఆట తీరుతో చెంప చెళ్లుమనే సమాధానలివ్వడం. అతన్ని ఎంత అణగదొక్కాలని చూస్తే అంత ఎత్తుకి ఎదిగాడు.ఆపద కాలంలో గుండె నిబ్బరం కోల్పోకుండా ఉండటం, అధైర్యపడకుండా , ఎప్పటికప్పుడు విమర్శలను విజయాలకు బాటలుగా మార్చుకుంటూ, తన బౌలింగ్ కి పదును పెడుతూ , ఆటలో మరింత రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏ కెప్టెన్ అయినా సరే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటే ‘బంతి’ కుంబ్లే చేతికి ఇస్తే చాలు అని అనుకునే స్థాయికి ఎదిగాడు. వన్డేల్లో , టెస్టుల్లో అధిక వికెట్లు సాధించిన భారతీయుడయ్యాడు. అది అనిల్ కుంబ్లే ప్రత్యేకత . అది విజేతల పయనమే ఇది.


Comments
Post a Comment