జీవితానికి ఊపిరి ఆనందమే
జీవితానికి ఊపిరి ఆనందమే
-రచనశ్రీదత్త(శృంగవరపు
రచన)
వింబుల్డన్ ప్లేయర్ ఆర్థర్ 1983లో గుండె ఆపరేషన్ కోసం
రక్తం ఎక్కించుకోవవలసి వచ్చింది. ఆ రక్తం ద్వారా అతడికి ఎయిడ్స్ వచ్చింది. ఈ విషయం
పేపర్ల ద్వారా ప్రపంచం అంతటా తెలిసింది.
అనేక ఉత్తరాలు, మెయిళ్ళు.. అతడికి ఎన్నెన్నో సానుభూతి
వచనాలు, అందులో ఒక మెయిలులో ఇలా ఉంది.”ఆర్థర్! నీకే ఇలా అయ్యింది ఏమిటి? ఇంతటి భయంకరమైన
వ్యాధికి దేవుడు నిన్నే ఎంచుకున్నాడేమిటి?”
ఈ మెయిల్ చదివిన ఆర్థర్ దానికి ఇలా సమాధానం ఇచ్చాడు.
“డియర్ మిష్టర్! మీ మెయిల్ నన్ను ఆలోచింపజేసింది. అయిదు
కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడటం మొదలుపెడితే, 5 లక్షల మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్
లోకి వచ్చారు. వారిలో 50 వేల మంది మాత్రమే సర్క్యూట్ దశకు చేరుకున్నారు. వారిలో 5 వేల
మంది మాత్రమే గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు. వారిలో 50 మంది మాత్రమే వింబుల్డన్
కి వచ్చారు. వారిలో నలుగురు మాత్రమే సెమీ ఫైనల్ కి వచ్చారు. వారిలో ఇద్దరు మాత్రమే
ఫైనల్స్ కి వచ్చారు. వారిలో నేను మాత్రమే టైటిల్ గెలుచుకున్నాను.
మిత్రమా! అప్పుడు నేను అడిగాను.
“నాకు మాత్రమే ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు?” అని దేముడిని
నేను అడగలేదు కదా! నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు? అని అడగలేదు.
మరి బాధను కలుగజేసినప్పుడు ఎందుకు అడగాలి?
సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది. పరీక్షలు నిన్ను ధైర్యవంతుందిని
చేస్తాయి. బాధలు నిన్ను మానవుడిని చేయాయి. ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది.
విజయం నిన్ను ఆనందపరుస్తుంది. నమ్మకం నిన్ను నడిపిస్తుంది.
నీ జీవితం నీకు ఆనందం కలిగించక పోవచ్చు. నీల జీవించాలని
కళలు కనేవారు ఎందరో ఉంటారు.ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది
అని ఒక పిల్లవాడు అనుకుంటాడు. కింద ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడదామా! అని
ఆ విమానం నడిపే ఫైలెట్ అనుకుంటాడు. అదే జీవితం!
డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్లమీద
డాన్సులు చేస్తూ కనిపించాలి. కానీ రోడ్డు మీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా
ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు.
అధికారమే భద్రత అనుకుంటే విఐపిలు అందరూ ఎటువంటి రక్షణ
లేకుండా తిరగాలి. కానీ అలా జరగడం లేదు. సింపుల్ గా ఉండేవాళ్లే హాయిగా తిరుగుతున్నారు.
హాయిగా నిద్రపోతున్నారు.
చూడు నేస్తం!
సింపుల్ గా జీవించు!
వినమ్రతతో మెలుగు!
మనసారా ప్రేమించు!
తృప్తిగా ఉండు!”
ఆర్థర్ మెయిల్
మనిషి విజయనికి రహస్యాన్ని స్పష్టం చేస్తుంది. జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ మనకు
అనుకూలంగా ఉండవు. అప్పటివరకూ అనుకూలతకు, విజయ వాతావరణానికి అలవాటు పది ఒక్కసారిగా ఊహించని
ప్రతికూలకను ఆహ్వానించడం అంత తేలికైన విషయం కాదు. మారే పరిస్థితుల్లో విజయాన్ని నిర్వహించటం
కష్టమే.
కొన్ని నిర్దిష్ట పరిస్థితుల మేలు కలయికగానే ఒక నిత్యసంతోషి
జనించడు, కానీ కొన్ని నిర్దిష్ట మనోదృక్పథాల ఫలితంగా మాత్రమే వ్యక్తి నిత్య సంతోషి
కాగలడు.
-హ్యూ డౌన్స్
జీవితంలో బాధలు రాకుండా ఉండడమే విజయం అని కచ్చితంగా
చెప్పలేం. మరి విజయం అంటే ఏమిటి? సమాజం గుర్తించే ఓ మైలురాయి లాంటి అధ్బుతం ఏదో జరిగిపోవడమా?
అలాంటివి జరగకపోతే విజయమే లేనట్టా?
ఆనందమే విజయాన్ని నిర్ణయించే నిజమైన అంశం. ఆ ఆనందం
అన్నది వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ‘నేను ఆనందంగా ఉన్నాను’ అని అనుకోగలిగె
ప్రతి క్షణం విజయవంతమైనదే.
***
ఆమెకు నాట్యం అంటే ప్రాణం. కానీ ఓ
కిరాతకుడి చేతిలో పడింది. స్నేహితురాలి సాయంతో కష్టపడి అతని నుండి తప్పించుకుని ఓ
పల్లెటూరు చేరుకుంటుంది. ఆరు నృత్యలని కలిపి ఓ సరికొత్త నృత్యంగా నర్తించాలని ఆమె
కోరిక. నృత్యం తరువాతే ప్రేమ అనుకుంటుంది. గురువు దగ్గర అభ్యాసం చేస్తుంది. చివరకి
ఆ కిరాతకుడు ఆమె ఉనికి కనుక్కొని ఆమెను చంపడానికి తిరిగి వస్తాడు. అప్పటివరకూ
భయంతో నిండిన ఆమె తన లక్ష్యాన్ని సాధించి తీరాలి... అని పట్టుదలతో అతనికి ఎదురు
తిరుగుతుంది.
‘ఇది ‘వంశీ’గారి ‘ఆలాపన’ సినిమా కథ.
ఆమెకు నాట్యం అంటే అసలు ఆసక్తి లేదు.
కానీ ఇంట్లో నృత్య వాతావరణం ఉంది. తండ్రికి ఆమెను గొప్ప నర్తకిగా చూడాలని కోరిక.
ఆమెకు విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం
చేయాలని కోరిక.
కానీ తండ్రి మాటకోసం బలవంతంగా
నర్తిస్తూ ఉంటుంది. హీరో ఎంతో కష్టపడి ఆమెను నాట్యం వైపు మళ్లించడానికి చూస్తాడు.
ఇది ‘విశ్వనాథ్’గారి ‘స్వర్ణకమలం’ కథ.
ప్రతిభ, నైపుణ్యం అన్ని సార్లు విజయానికి
కావల్సిన అంశాలు కాకపోవచ్చు. పని చేసేటప్పుడు పొందే ఆనందమే ఎన్ని అవరోధాలు అయినా
ఎదుర్కొని విజయం సాధించాలనే కొత్త ఊపిరిని ఇస్తుంది.
విజయాలు ఆనందానికి పొడిగింపు చర్యలు
అవ్వాలే తప్ప ఆనందానికి విజయంలో వెతుక్కునే దుస్థితి ఉండకూడదు.
ఫైరింగ్ స్క్వాడ్ ముందు నిలబడ్డ ఒక
వ్యక్తిని అతని చివరి కోరిక ఏమిటని అడగడం జరిగింది. ఫైరింగ్ స్క్వాడ్ కెప్టెన్
అతని దగ్గరకు వచ్చి అతనికి రెండు మార్గాలున్నాయని చెప్పాడు. ఒకటి – ఫైరింగ్
స్క్వాడ్ చేతుల్లో చావడం; రెండోది – చీకటిలో అడవులు, చిత్తడి నేలల ద్వారా
వెళ్లిపోవడం, అతను తలెత్తి గుహకేసి చూసి అడిగాడు;
“ఇది ఎక్కడికి వెడుతుంది?”
“ఎవరికి తెలియదు” అని సమాధానం ఇచ్చాడు
కెప్టెన్.
అతను మళ్ళీ మళ్ళీ చూశాడు. చిత్తడి
నేల, చీకటి అడవులు భయంకరంగా అగుపించాయి. చివరన అతడు అన్నాడు.
“మీరు నన్ను కాల్చేయండి”
వాళ్ళు అతన్ని కాల్చేశారు.
తర్వాత ఓ సైనికుడు “నేను వెళ్ళి గూహ
చూడవచ్చా?” అని అడిగాడు.
“ఇది నీ జీవితం. కానీ నేను నీ
స్తానంలో కనుక ఉంటే వెళ్ళి గుహ చూడను” అన్నాడు కెప్టెన్.
యువ సైనికుడు గుహ వైపు వెళ్ళాడు. యువ
సైనికుడు బురదలో పాకుతూ వెళ్ళాడు. చీకటిలో నడిచాడు. చివరకు గుహ చేరుకుని లోపలికి
ప్రవేశించాడు. గూహ అవతలివైపు, స్వేచ్ఛకు, అందమైన స్వేచ్ఛకు దారి తీసింది.
చాలామంది తమకు పరిచయమైన నరకంలో
ఉండిపోవడానికి ఇష్టపడతారు. ఆవల వైపు ఆనందానికి దారి చూపే దారి వున్నా దానిపట్ల
నిర్లిప్తంగా ఉంటారు. మన ఆనందం దేనిలో ఉంటుందో కేవలం మనం మాత్రమే చెప్పగలిగే అంశం.
ఆ ఆనందపు అంచులపై విజయ గమ్యాన్ని సాగించడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది.
ఓ అజ్ఞాత రచయిత ఇలా రాశాడు:
“ఈ వేగం, శబ్దాల మధ్య గంభీరంగా
పయనించు, నిశ్చబ్దంలో శాంతి ఉందని గుర్తుంచుకో. తల వంచకుండా అందరితోనూ మంచిగా
ఉండు. సత్యం స్పష్టంగా, నెమ్మదిగా మాట్లాడు. ఇతరులు చెప్పేది, విసుగు కలిగించేదీ,
జ్ఞాన రహితమైనదే అయినా విను. వారికి కూడా ఒక కథ ఉంది.
“జగదమాదే వ్యక్తులకు దూరంగా ఉండు.
వారు నీ ఆత్మని క్షోభ పెడతారు. నీ విజయాలను, నీ పథకాలను ఆనందించు. ఎంత చిన్నదైనా,
నీ వృత్తి పట్ల ఆసక్తితో ఉండు. అదృష్టాలు మారే కాలంలో అది ఒక్కటే నీకున్న ఆస్తి.
నీ వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ప్రపంచం మోసపూరితమైనది. అయినా ఈ
విషయం సుగుణాలను చూడలేని వ్యక్తిగా నిన్ను చేయకూడదు. యవ్వనంలోని విషయాలను సంతోషంగా
వాదులుకుంటూ, వయసు అందించే సలహా స్వీకరించు. హఠత్తుగా సంభవించే కష్టాల నుండి
కాపాడడానికి నీ ఆత్మశక్తి అభివృద్ది చేసుకో. కానీ ఊహాలతో నిన్ను నువ్వు బాధ
పెట్టుకోకు. అనేక భయాలు ఒంటరితనం వలనా, అలసట వలనా కలుగుతాయి.
క్రమశిక్షణతో ఉండు. నీ పట్ల నువ్వు
నెమ్మదిగా ఉండు. వృక్షాలు లాగే, నక్షత్రాలు లాగే,
నువ్వూ ఈ ప్రపంచ శిశువువు. ఇక్కడ జీవించడానికి నీకు హక్కు ఉంది. నీకు అర్థమైనా,
కాకపోయినా, ఈ సృస్టి ఎలా వికసించాలో అలా వికశిస్తోంది. కష్టాలు, కోరికలు జీవితపు
గాందరగోళం. ఏదైనా నీ ఆత్మతో నువ్వు శాంతిగా ఉండటం నేర్చుకో. కపటం, బండచాకిరీ,
కరిగిపోయిన కలలతో నిండి ఉన్నా, ఈ ప్రపంచం ఇంకా అందమైన ప్రాంపంచమే. నువ్వు సంతోషంగా
ఉండు, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు.
జీవిత పయనంలో ఎన్నో మజిలీలు ఉన్నా
‘ఆనందం’ అన్న ఊపిరి లేకపోతే అవన్నీ ఆసక్తికరంగా అనిపించవు. చిరునవ్వులు, చికాకులతో
కూడినదే జీవితం. అయినా ఆనందంగా సాగిపోవడమే జీవించడానికి నిజమైన శ్వాస.


Comments
Post a Comment