వ్యక్తిత్వ వికాసం


నమ్మకమే ఊపిరి!

(వార్త ఆదివార అనుబంధ పత్రికలో ప్రచురితం) 


సాహిత్యం, సేవ, ఇతరుల్ని ప్రభావితం చేయడం అనేవి ఆమెకు ఇష్టమైన అంశాలు. ఇంట్లో వాళ్ళు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయమన్నారు. అంతో ఇంతో అర్ధం చేసుకుంటారు అని అనుకున్నవాళ్ళు ఓ ప్రభుత్వ ఉద్యోగం లేదా ఓ భద్రతతో కూడిన ఉద్యోగాన్ని సాధించి, తర్వాత ఇటువంటివి సమయం దొరికినప్పుడు చేయమని ఉపదేశాలు చేశారు. ఆమె సందిగ్దంలో పడింది.

          జీవితం అంటే నచ్చినదాన్ని సాధించడానికి వ్యక్తిగతంగా ఉన్న వనరులను, సామర్ధ్యాన్ని కేంద్రీకరించడం అని ఆమె అనుకుంది. కానీ భద్రత కోసం లొంగిపోయి జీవితంలో ముప్పావు వంతు  సమయాన్ని ఎలాగో నలుగురి గుర్తింపు కోసం, డబ్బు కోసం గడిపేసి మిగిలిన పావు సమయాన్ని  నచ్చినదానికి కేటాయించడం అని అందరూ ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు.

          ఇప్పుడు ఆమెకు, తనకు నచ్చినదానికి, తన అనుబంధాలకు, సమాజానికి  మధ్య విపరీతమైన సంఘర్షణ. ఆర్థికంగా పేదరికమే తప్ప లక్ష్మీకటాక్షం లేదు. నమ్మకం తప్ప ఆమెకు బలంగా ఉన్న అస్త్రం ఏమీ లేదు.

          చదువుతూ ఉంటే మీలోని లోపలి వాడు ఎక్కడో సంఘర్షణను అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది కదూ! జీవితంలో మీరో యాంకర్ కావాలి  అని అనుకుంటారు. ఇంత మందితో  సంఘర్షణ కన్నా పరిస్థితులతో రాజీ పడిపోవటమే మంచిది  అనుకుంటారు. రాజీ పడిపోతారు. చక్కగా రోజూ టీవీల్లో వచ్చే యాంకర్లను చూసి .....

          నాకు కూడా ఇంత ప్రతిభ ఉంది ...ఆ రోజు నేను కూడా ధైర్యంగా ప్రయత్నిస్తే బావుండేది అని అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వచ్చి,’ఏమోయ్! నీకేం తక్కువ ...చక్కని జీతం ...ఇలా జేబులు నింపని పనులు ఎందుకు ? నువ్వు చేసింది రైట్  అని ఉచిత ఉపదేశాలు చేసేస్తారు.

          జీవితం అంటే ఒక్కసారే జీవించేది అన్న మాట ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. కానీ ఆ జీవించడం అన్న విషయాన్ని ఎంతమంది కోసం మనం పక్కన పెట్టి అందరూ మెచ్చుకోవాలని మనది కానీ జీవితాన్ని గడిపేస్తున్నాం ? ఆలోచించండి!

          ఈ ప్రపంచంలో ఏ అభిరుచి తక్కువ కాదు. ఇంకో అభిరుచి ఎక్కువ కాదు. ఈ చిన్న విషయం మనకు తెలియక కాదు. కానీ అందరూ మనల్ని బుద్ధిమంతులు, మంచి వాళ్ళు  అని చెప్పుకోవాలి అని నరనరాల్లో ఉండిపోయే కోరిక మనల్ని చాలాసార్లు అందరి కోసం బతికేలా చేస్తుంది.

          నిజం చెప్పండి ...!ఇవన్నీ పైకి కనిపించే అంశాలు! కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి! అసలు కారణం మీ లక్ష్యాన్ని సాధించడానికి, మీలో అనుక్షణం జ్వాలను రగిలించే నమ్మకం లేకపోవడం కదూ!

          అవును! ఒక్కొక్కరి వ్యక్తిగత ప్రతిభ ఒక్కోలా ఉంటుంది. ఇది కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే! అంటే కాస్త తార్కికంగా ఆలోచిస్తే  ఇంకో విషయం కూడా మనకు తడుతుంది. ఓ వ్యక్తి అదే ప్రతిభను ఏ రంగంలోనైనా చూపగలడు అని. అంతే కానీ , అందరి కోసం ఒప్పుకుని, రాజీ పడిపోయే రంగంలో ఎక్కువ ప్రతిభను చూపడం, ఎక్కువ మంది ప్రోత్సహించని రంగంలో తక్కువ చూపడం లాంటివి ఏమీ ఉండవు అని!

                        *       *      * 

          ప్రపంచమంతా ఒకే సూత్రం మీద నడుస్తుంది. అదేమిటంటే ‘Straight line drawn between need and resource.’వనరుకి, అవసరానికి మధ్య సంబంధం మీద అవగాహన ఉంటే ఈ ప్రపంచంలో మనం అనుకున్న దేనినైనా సాధించవచ్చు.

          మన ప్రవృత్తికి ఎక్కడ డిమాండ్, అవసరం ఉందో , పరిశోధనకు మించిపోయి చేయడం  మన కనీస బాధ్యత! అలా చేయకుండా నాకు ఈ రంగంలో ప్రతిభ ఉంది, గుర్తించండి  అని  ఓ ట్యాగ్ మెడలో వేసుకుని కూర్చుంటే ఎవరూ మన దగ్గరకొచ్చి సువర్ణ కంకణం తొడగరు.

          అవును! ఇది జరగడానికి ముందు ఇంకో దశ కూడా ఉంటుంది. అనుభవజ్ఞులు అందరూ ఓ డైలాగ్ లిస్టుతో తమ అపార అనుభవాన్ని మనతో పంచుకుని, మనల్ని ఉద్దరించాలని, మనల్ని మంచి మార్గంలో పెట్టాలని తాపత్రయపడే దశ. ఇలాంటివి నా అనుభవంలో చాలా చూశాను. ఇలా చేస్తే  చివరకు ఇలా జరుగుతుంది. కావాలంటే మొన్నే నా మాట వినకుండా మూర్తి గారి అబ్బాయి ఇదే చేశాడు నీలాగా. ఇప్పుడు ఎలా ఉన్నాడో వాడు ...చూశావుగా! నాశనం అయిపోయాడు. ఇది కూడా కచ్చితంగా తమకు నచ్చినది సాధించాలి అని అనుకునేవారు ధైర్యంగా నిలబడాల్సిన దశ.

                       *       *      * 

          ఏ సమస్యకైనా పరిష్కారం మన మీద మనకుండే  నమ్మకం అంతే. జీవితంలో ఓ దశకొచ్చాక  ఆ రోజు కనీసం అది ఎందుకు ప్రయత్నించనైనా లేదు ?’ అనే ప్రశ్న జీవితంలో ఉదయించకుండా ఉండటమే నిజమైన విజయానికి చిరునామా.

          మన నమ్మకాన్ని అందరూ నమ్మాల్సిన అవసరం లేదు. పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఫలితం వస్తూనే ఉంటుంది. మనం రాజీ పడిపోవడానికి  కాదు ఉంది జీవితం. అనుకున్నది సాధించడానికి, ఆ దారిలోకి పయనించడానికి.

          నమ్మకం లేని చోట విజయం ఉండదు. నమ్మకం ఉన్న చోట అపజయానికి తావే లేదు. నమ్మకమే ఆశయాలకు, ఆదర్శాలకు ఊపిరిగా ఉన్నంతకాలం ఎవరూ మనల్ని మనకు నచ్చింది  చేయకుండా కన్విన్స్ చేయలేరు.

          నమ్మకం అనే నవ వసంతంతో  జీవితాన్ని నిజమైన నందనవనం చేసుకుంటారు కదూ!

                                    *     *     *  


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ