మాటే మంత్రము

మనిషి జీవితంలో మాటకు ఉండే ప్రాముఖ్యత గురించి తెలిపే ఆర్టికల్ ... 
(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం) 


మాటే మంత్రము

'అమ్మా.. నాన్న కూడా యాన్యువల్ డే  ఫంక్షన్ కి వచ్చి వుంటే బావుండేది.. చూశావుగా నాకు ఎన్ని ప్రైజులు వచ్చాయో..'

'అసలు... నువ్వు నాకే చెప్పలేదు కదరా... చివరి క్షణం వరకు.. ముందే చెప్పి వుంటే నాన్న కూడా వచ్చేవారేమో..!'

'ఎక్కడమ్మా.. పొద్దున్న అయితే చాలు వీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు.. మళ్ళీ రాత్రిప్పుడో వస్తారు.. ఎదో రోజు నాతొ కాసేపు సరదాగా మాట్లాడతారని... ఎలా చదువుతున్నావు? స్కూల్ విశేషాలు ఏంటి? అని అడుగుతారేమోనని ఎదురుచూస్తాను...

కానీ ఫీజు కట్టే రోజు తప్ప ఏమి అడగరు.. పట్టించుకోరు.. మీరు రోజుకొకసారైనా నాతో మాట్లాడాలని... నేను చెప్పేవి వినాలని ఉంటుంది... నాన్న అంటే నాకు చాలా భయం... ఎప్పుడూ ఫ్రీగా మాట్లాడని లేదు... మొన్న ఫంక్షన్ కి మా ఫ్రెండ్స్ ఫాథర్స్ అందరూ వచ్చారు...' బాధ ధ్వనించింది ఆ చిన్నోడి గొంతులో.

ఆలోచనలో పడింది ఆ అమ్మ...

                        ***

'అనుకున్నాను...మీరు ఇలాగే చేస్తారని.. అయినా ఇంట ఈగో దేనికి? అక్కడిదాకా వెళ్ళింది బెల్లం కొట్టిన రాయిలా నోరు మూసుకుని కూర్చోడానికా?' విసుక్కుంది భార్యామణి.

'అదికాదోయ్ కాంతామణి... ఈగో లేదు..పాడు లేదు... అక్కడ ఆ ఆఫీస్ వాతావరణం చూసేసరికి నాకు చెమటలు పట్టేస్తాయి.. ఏం చేయను?' సమర్దిన్చుకున్నాడు ఆ భర్త.

'వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ అలా ఉండక... నాలుగు గదులతో మన ఇల్లులా ఉంటుందా? అయినా అక్కడ చైర్మన్ మీ ప్రాణ స్నేహితుండి కదా!'

'అవుననుకో...కానీ స్నేహం చెడిపోదు!.. నోరు తెరిచి సాయం అడిగితే.. అయినా వాడి స్థాయి ఇప్పుడు చాల పెద్దది...'

'అయినా మీరు నోరు విప్పితేనే కదా తెలిసేది.. అక్కడి వాతావరణం, సానుకూలత ఏమిటో! అయినా మాటల వల్ల బంధం చెడిపోవడం అన్నది లేనేలేదు... మాట్లాడాలంటే భయం అని చెప్పండి...'

'అలా తిట్టకే భార్యామణి.. అదే నిజం అనుకో... ఆటను బాగానే పలకరించాడు.. కానీ, నేనే ఏమి మాట్లాడలేకపోయా.. బహుశా మాట్లాడి వుంటే బావుండేదేమో!'

ఆలోచనలో పడ్డాడు ఆ భర్త.

****

సీన్ లు మారినా, మనుషులు మారినా.. కరువైంది ఏమిటో అర్ధమయ్యే ఉంటుంది కదూ!

అదే..మాట..మాటకు మించిన ఆత్మీయ స్పర్శ ఏముంటుంది ఈ లోకంలో! అయినా పలకరిస్తూ ఆత్మీయంగా మాట్లాడితే పోయేదేముంది బిడియాలు, ఈగోలు తప్ప...

మహా అయితే 'మాట్లాడటం రాదు' అని అనుకుంటారు...

ఏమి లేని యాంత్రికత కన్నా మనుషుల మధ్య ఈ 'మాటల స్పర్శ ఆత్మీయత' బావుంటుందేమో.. ఆలోచించండి!

                        ***

విద్య, విగ్రహపుష్టి, వాక్కు, వస్త్రం, వైభవం.. ఈ ''కార పంచికం వున్న వ్యక్తి ఉన్నతికి లోకంలో కొదవ ఉండదట!

ఇకపోతే మన మాటల్లో మన పానుగంటి లక్ష్మి నరసింహారావుగారి (సాక్షి వ్యాసాలు) మాటల్లో చెప్పేయాలంటే...

'మాటకు వశుడు కాని మనుజుడేడీ? మాటకున్న వేగం గాలికెక్కడిది? మాటకున్న వైనం కల్లుకేక్కడిది? మాటకున్న ఆకర్షణ శక్తి భూమికెక్కడిది? పెద్దోళ్ల మాటలే కాదండోయ్.. మనం విసురుకునే సరదా ఛలోక్తులు కూడా... ఒకటా..రెండా... బోలెడన్నీ?!

'మాట చుడనిదే మనసీయరాదు', మాటల చేత మహంకాళిని నవ్వించవచ్చును', 'మాట్లాడనేర్పిస్తే..పోట్లాట పని లేదు'...

రాసుకుంటూ పొతే మహాభారతము!

                        ***

ఇన్నీ పక్కన పెట్టేస్తే...

మనం చాలాసార్లు కొత్తవాళ్లతో మాట్లాడటానికి ఎందుకు సంకోచిస్తాము? పోనీ కొత్తవాళ్లను పక్కన పెట్టేయండి... సన్నిహితులయినా సరే.. వాళ్ళ మనసులు చదవడానికి ప్రయత్నించి..వాళ్లకు తగినట్టు మన సమాధానం లేదా సంభాషణ ఉండాలని ఎందుకు తపన పడతారా? అయినా మనం కలిసేది మనుషులనే కదండీ..మెషిన్లను కాదుగా.. అవుట్ ఫుట్ లు అంచనా వేసెయ్యడానికి!(?) పోనీ ఏదైనా తెలిసి తెలియకుండానో... అప్పటికప్పుడు అనిపించింది మాట్లాడినా ఏమవుతుంది చెప్పండి?

ఆ క్షణం మాట్లాడటం సరిగా రాదు అని అనుకుంటారేమో! అంతేగా! అంతేకానీ అది జీవితాంతం గుర్తుపెట్టుకుని ఫలానా వ్యక్తి ఆ రోజు అలా మాట్లాడాడు అని డెయిరీలు రాసుకుని మరీ ప్రతిరోజూ దాన్నో లక్ష్యంగా చూసుకుంటారు!

ఇంట ఉపోద్గాతం తర్వాత... అసలు మాట్లాడితే ఏం లాభం అనే తర్కం ఒకటి మెదడును తొలిచేస్తోంది కదా! ఇంకెందుకు ఆలస్యం.. ఆ సమాధానం కూడా మనమే విశ్లేషించి చెప్పేసుకుందాం...

                        ***

టెక్నాలజీతో నిండిపోయిన యుగం ఇది. ఎవరి లోకం వారిది. విపరీతమైన వ్యక్తిగత ధోరణి ప్రబలే ప్రమాదం కూడా అధికంగా పొంచి వున్న కలం ఇది.

ప్రతి మనిషి తనకో ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ఆ గుర్తింపు మెషిన్లనుండి కాదు మనుషులనుండి కావాలని కోరుకుంటాడు. ఓ మనిషి ఇంకో మనిషి దూర ద్వారా గుర్తుంచుకునే దానికన్నా మాటల ద్వారా గుర్తుంచుకునే అవకాశాలే ఎక్కువని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి.

'సదభిప్రాయం' అనే స్టిగ్మా చాలావరకు మనుషులమధ్య మాటలకు అడ్డుగోడలా నిలుస్తుంది. మన ఎదుట ఉన్నవారు కూడా మొదట మనం మాట్లాడతారేమోనని ఎదురుచూస్తారు... ఆ 'మాటల మొదటి అడుగు' మనదైతే ఆ బంధం మానసికంగా శాశ్వతం!

పిల్లలు తమ చదువులు తాము చదువుకుంటున్నారు అని అనుకునే తల్లిదండ్రులు.. అలాగే పెద్దలు బిజీ అని నిర్లిప్తతో ఉండే పిల్లలు... ప్రేమ లేక కాదు...'మాటల్లో ఒరిగేదేముందిలే' అనే భావనతో.. లేకపోతె, మాటల ప్రాధాన్యత తక్కువ అని అనుకోవడంవల్లే తప్ప.. అనుబంధం మీద అపేక్ష లేక కాదు!

కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేడు అన్నిచోట్లా వినిపిస్తున్న ట్రెండ్... కేవలం అన్ని విభాగాల్లో, వర్గాల్లో... జాతీయంగా, అంతర్జాతీయంగా... మనుషుల మధ్య, సంస్థలమధ్య ఆత్మీయ స్పర్శను నిర్మించడానికి తప్ప ప్రజ్ఞకు గీటురాళ్ళు కాదు!

అలా అని ఎలాగోలా మాట్లాడేస్తే కుదరదు కదా! మొదట కాస్త బిడియాల్ని వదిలించుకున్నాక, మన మాటల్తో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించగలగాలి.

కొద్దీ మాటల్లోనే మనోహరంగా ఎవరు మహావిషయాల్ని చెప్పగలరా వారిని 'వాగ్మి' అంటాం. అలా కాకుండా అల్పంశాన్ని కూడా అతిగా చెప్పేవారిని వాగుడుకాయగా జమ కడతాం. ఇది మనుస్మృతి చెప్పిన మాట.

అలాగే,"మాన్పగలిగితే కొత్తకోతలు...మాన్పవశమే మాట కోతలు కత్తిచంపును: మాట వాతలు మానవేనాడున్" 

కత్తి దెబ్బతో, గొడ్డలి వేటుతో తెగిన చెట్టు మ్రనయితే తిరిగి ఎలాగోలా చివురిస్తుందేమో గాని, మాట పదునుతో చెడిపోయిన కార్యం తిరిగి సానుకూలమవదు. ఇది 'లవణరాజు కల' ఖండికలో గురజాడ వారి ముత్యాల సరాల మాటల మేడ. ఇంకెందుకు ఆలస్యం... వాగ్భూషణంతో ఆత్మీయ పూదోట పూయిస్తారు కదూ!

                       *     *     *       

 

                                                                                    -

 

 

 

 


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ