బ్యూటీ మిత్ ను ఛేదిస్తున్న వనితా మేధస్సు
బ్యూటీ మిత్ ను ఛేదిస్తున్న వనితా మేధస్సు
-రచన శ్రీ దత్త
అందం, అలంకారం అనాదిగా స్త్రీకి సంపదగా పరిగణించబడుతున్నవే. మనిషిని రూపు రేఖలచే అంచనా వేయకూడదని వారి వ్యక్తిగత గుణాలు, వివిధ పరిస్థితుల్లో వారు స్పందించే ప్రజ్ఞ అనుగుణంగా ఓ వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది అనబడే జనరంజక వాక్యాలు అందరికీ తెలిసినవే. కానీ మానసిక అస్థిత్వం కన్నా శారీరక మెరుపులే ఏనాటి నుండో స్త్రీ జీవితాన్ని నిర్దేశిస్తుంది అన్నది కాదనలేని సత్యం.
ఈ అంశం పూర్తిగా చదవగా ముందే స్త్రీలు ఆశావాహకంగా ముందుకు దూసుకుపోతున్నారు, వారిని ఎటువంటి ఆలోచనలు కూడా వెనకడుగు వేసేలా చేయడం లేదు అని కొందరు అభిప్రాయం ఏర్పరచుకునే ప్రమాదం ఉంది. కానీ అది సత్యానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు వారి వ్యక్తిగతం.
ఓ వ్యక్తిని సంపూర్ణంగా కేవలం వృత్తి పరంగా మాత్రమే చూడలేము. నాటి నుండి నేటికీ స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్ర్యం పెరిగింది అన్నది సత్యం. అలాగే ఒకప్పుడు మగవారికి మాత్రమే అనుకున్న పరిశోధన,నావీ ఇంకా ఎన్నో రంగాల్లో కూడా వారు తమకంటూ ఓ స్థానం సాధించారు అన్నది కూడా వాస్తవమే. కానీ ఈ ప్రగతితో మాత్రమే స్త్రీకి ఇప్పుడు ఏ విషయంలోనూ తన స్వేచ్ఛను అణచుకోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయానికి సంపూర్ణ పుష్టిని ఇవ్వదు.
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. స్త్రీ వ్యక్తిగత జీవితంలో ఆమె ఆరోగ్యం, సౌందర్యం ప్రధాన భూమికను ఒకప్పుడు పోషించాయి. రోజులు మారుతున్న కొద్దీ జనులు పై పై మెరుపులు దాటి మేధస్సును, ప్రజ్ఞ ను బట్టి వారి మీద గౌరవాన్ని పెంచుకుంటున్నారు.
ఇప్పటి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే వయసుతో నిమిత్తం కాకుండా తాము అందంగా ఉన్నామా ?లేదా ? తమను అందరూ గమనిస్తున్నారా ? లేదా ? అని ఆలోచించే వనితలు అధికమని. అలాగే తాము అందరూ అందానికి కొలమానంగా భావించే విధంగా శారీరాకృతి లేకపోతే తమకు పెళ్ళి అవదని చింతించే యువతలో అమ్మాయిలే అధికమట.
ఇక్కడ అందం,అలంకరణ అనేవి తమకు వచ్చే ఓ గుర్తింపుగా భావించే ధోరణి కచ్చితంగా స్త్రీలలో ఎక్కడో దాగి ఉన్న ఓ రకమైన ఆత్మన్యూనతకు నిదర్శనమని కొందరి సైకాలజిస్టుల అభిప్రాయం. ఇక్కడ చర్చించాల్సిన విషయం ఇంకొకటి ఉంది.
మానసిక మేధస్సుకి ,స్త్రీలలో శరీరం పై ఉండే అతి స్పృహకు మధ్య ఒక్కోసారి సంబంధం ఉండదు. అది వారు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే స్నేహితులు, పని చేసే వాతావరణం వంటి అంశాల ప్రభావం ఎక్కువ ఉంటుంది.
రంగనాయకమ్మ గారి నవల ‘కళ్ళు తెరిచిన సీత’లో సీతకు చిన్నప్పటి నుండి పుస్తకాలతో తనదైన ఓ సొంత ప్రపంచం ఉంది. ఆమె అక్క,స్నేహితులు,తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తారు. అందుకే ఆమె స్కూల్ కి వెళ్లినప్పుడు కూడా చెవికి పోగులు, మెడలో గొలుసు వంటి ఆభరణాలు పెట్టుకోదు. ఇటువంటి వాతావరణంలో పెరిగినప్పటికి ఆమెకి ఉద్యోగం వచ్చాక అక్కడ ఉండే అందరూ కూడా ఏవో ఆభరణాలు ధరిస్తూ ఉండటంతో ఆమె కూడా తాను అన్ని సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వారిలో తను ఒక్కతే విభిన్నంగా ఉంటే ఏమనుకుంటారో అనే భీతితో ఆమె కూడా తనకు ఇష్టం లేకపోయినా అవి కొని వేసుకుంటుంది.
నేటి వాస్తవిక పరిస్థితుల్లో దీన్ని గురించి విశ్లేషిస్తే వ్యక్తిగతంగా ఓ స్త్రీకి తన అందం,అలంకరణ అనే వాటి గురించి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికి ఓ వేడుకకో, నలుగురు కలుసుకునే ఏ సందర్భానికైనా సరే తన స్వాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోకుండా అక్కడికి వచ్చే మిగిలిన అతిధులు ఎలా వస్తారో దానికి అనుగుణంగా వారిలో ఒకరిగా ఉండాలనే తపనతో అలా తమను తాము మలచుకునే స్త్రీలు నేడు ఎంతోమంది ఉన్నారు.
ఎన్ని కష్టలొచ్చినా కుటుంబాన్ని సైతం పోషించే భారాన్ని తలకెత్తుకునే ధైర్యం నేటి స్త్రీకి ఉంది......
తన తెలివితేటలతో తనను తను అన్ని రంగాల్లో నిరూపించుకునే సామర్ధ్యం కూడా ఆమెకు ఉంది ......
కానీ ఇన్ని ఉన్నా అలంకారం, శరీర స్పృహ ను జయించిన స్త్రీలు నిజంగా ఎంతమంది? నిర్మొహమాటంగా అది ఒప్పుకోగలిగే ధైర్యం ఎంత మందికి ఉంది? మన వ్యక్తిత్వం అన్నది మనం మన జీవితంలో సాధించే ఓ సంపద. దానిని నిలబెట్టుకోవాలి అంటే మనం మనలానే ఉండాలి. అలా ఉంటేనేమనల్ని ఈ సమాజంలో గౌరవానికి అర్హులుగా చూస్తారు లేకపోతే లేదు అనే ధోరణిలో ఎంత ఎదిగినా స్త్రీ ఈ న్యూనతను జయించలేకపోతే ఆమె తనను తాను ముందు జయించినట్టు కాదు.
నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే ఈ బ్యూటీ మిత్ ను ఎంతోమంది స్త్రీలు జయించారు. వారు ఆ స్థితికి చేరుకున్నారు. అది కచ్చితంగా స్త్రీ అస్తిత్వవాద చరిత్రలో చెప్పుకోదగిన మార్పే. నలుగురు ఏమనుకుంటారో ? అన్న ప్రశ్న స్త్రీలను ఆ దశకు చేరుకోకుండా అడ్డుపడుతుంది.
నయోమి వుల్ఫ్ తన ‘బ్యూటీ మిత్ ‘పుస్తకంలో స్త్రీలు కేవలం ఈ అంశం వల్ల స్త్రీలు ఎలా తమ ఆత్మగౌరవాన్ని ,తమ మీద తమకు ఉండే నమ్మకాన్ని ఎలా కోల్పోతున్నారో వివరించింది. ఇంకా మనం సర్వసాధారణంగా చూసే విషయాల గురించే చెప్పుకోవాలంటే ఓ ఆడపిల్ల ఎటువంటి ఆభరణాలు ధరించకుండా బయటకు వెళ్తుందనుకోండి....అప్పుడు వెంటనే వచ్చే స్పందనలు మనకి తెలిసినవే. అలా బోసి మెడ,చేతులతో బయటికి ఎలా వెళ్తావు ? ఏవో ఒకటి వేసుకో అని అనడం మనం విన్నదే. అలా బాల్యం నుండి మొదలయ్యే ఈ శారీరక అతి స్పృహ వారి జీవితంలోని ప్రతి అంశానికి విస్తరిస్తుంది. దీనికి మానసిక మేధస్సుకి సంబంధం లేదు. ఇంకో కోణంలో చెప్పాలంటే మేధస్సు వారి ఉనికికి ఓ గుర్తింపు తెస్తే ,ఇలా బ్యూటీ మిత్ వలయం ద్వారా స్త్రీలు సమాజంలో నలుగురిలో ఒకరిగా ఉండిపోవాలి లేకపోతే మనం ఒక్కరే విభిన్నంగా ఉంటే అది మిగిలిన వారికి తప్పుగా కనిపిస్తుంది అని దానికి తగ్గట్టు సర్దుకుపోయే స్త్రీలే అధికం.
* * *



Comments
Post a Comment