నెత్తుటి మరకల చాటున న్యాయం
నెత్తుటి మరకల చాటున న్యాయం
(పోన్ మాగల్ వందాల్ )
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)
సినిమాల్లో సక్సెస్ ఫార్ములా ఎప్పటి నుండో మారకుండా అలాగే
ఉండిపోయింది. ఎక్కడో కొన్ని సినిమాలు తప్ప దాదాపు అన్ని దక్షిణ భారత సినిమాలు
కమర్షియల్ ఎలిమెంట్ సూత్రం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు చూస్తే
వీటినీ ప్రేక్షకులు ఎందుకు ఆదరించలేదనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అటువంటి
కోవలోకి చెందినదే తమిళ సినిమా పోన్ మాగల్ వందాల్. దీని అర్థం Precious Girl Arrives
అని. ఇది పూర్తిగా కోర్టు రూమ్ డ్రామా సినిమా అనే చెప్పవచ్చు.
హీరోయిన్లలో దాదాపు
అందరూ గ్లామరస్ పాత్రల వయసు దాటాక వుమన్ సెంట్రిక్ సినిమాల పట్ల ఆసక్తి
చూపిస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. జ్యోతిక మాత్రం తనది ప్రధాన పాత్రగా ఉండే సినిమాలు
ఎంచుకున్నా, వాటిని వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఎంచుకుంటూ తనకంటూ ఓ
సినీశైలిని ఏర్పరచుకుంటూ సాగుతుంది. రాక్షసి అయినా ఇప్పటి పోన్ మాగల్ వందాల్ అయినా
సరే సామాజిక సమస్యల ప్రతిఫలాలే.
పోన్ మాగల్ వాందల్ లో
చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటాన్ని అంశంగా తీసుకున్నా దాన్ని
థ్రిల్లర్ ,ఎమోషనల్ ,వుమన్ సెంట్రిక్ కాంబినేషనగా
చేయడానికి ఆ దర్శకుడు చేసిన ప్రయత్నం కచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశమే.కథ,కథనంలో ఇప్పుడు వచ్చే మూస పోకడలు అవలంబిస్తున్న సినిమాలతో పోలిస్తే
కచ్చితంగా ఎంతో వినూత్నంగా ఉందనే చెప్పాలి.
జ్యోతి అనే
స్త్రీ ఇద్దరు మగవాళ్ళను చంపుతున్న వీడియో వైరల్ అవ్వడం, ఆమె
నార్త్ ఇండియన్ అని, అప్పటికే తప్పిపోయిన ఆడపిల్లల శవాలు ఆమె ఇంటి పెరట్లో
దొరకడంతో ఆమెను ఎన్ కౌంటర్ చేయడంతో సినిమా మొదలవుతుంది. ఇది నిమిషాల్లో చూపించిన
సీన్ .అప్పటినుండి జ్యోతిని మనసు లేని కర్కోకటకురాలిగా,ఆమె
పేరు చెబితేనే జనాలు అసహ్యించుకోవడం మొదలుపెట్టారు.
15 ఏళ్ళ తర్వాత
వెంబా(జ్యోతిక) అనే లాయర్ తండ్రి తన కూతురు మొదటి కేసుగా దాన్ని రీఓపెన్ చేయిస్తుందని
చెప్తాడు. ఇదంతా చీప్ పబ్లిసిటీ కోసమే అని, అందుకే ఆమె ఈ
కేసు తీసుకుందని అందరూ భావిస్తారు. అయితే ఈ కేసులో చనిపోయిన ఓ యువకుడి తండ్రి అయిన
ఇండస్ట్రియలియస్ట్ వరదరాజన్ ప్రఖ్యాత చెన్నై హైకోర్టు లాయర్ ని పెట్టుకుంటాడు.
కేసు
నడుస్తున్న క్రమంలో చాలా విషయాలు బయటపడతాయి.జ్యోతిని నార్త్ ఇండియన్ గా
చిత్రీకరించారని,కానీ ఆమె తమిళియన్ అని,ఆమె భర్తను హానర్ కిల్లింగ్ పేరుతో చంపేసాక, పాపతో
జైపూర్ నుండి తమిళనాడు వచ్చింది.ప్రస్తుతం వెంబను పెంచిన తండ్రి ఆమెకు
ఆశ్రయమిచ్చాడని,ఆడపిల్లల కిడ్నాపుల అక్కడ పెరుగుతున్న
క్రమంలో జ్యోతి కూతురు వెంబాను కూడా కిడ్నాప్ చేశారని,ఎలాగో
వెతుక్కుని వెళ్ళేసరికి అక్కడ తన కూతురు వెంబా రేప్ కు గురై ఉందని,అక్కడో ఉన్న ఇంకో బాలిక ఏంజెల్ మరణించిందని,ఇంకా
ఎందరో పిల్లలు శవాలై ఉన్నారని,అప్పుడు వెంబాను
తీసుకువెళ్తున్న క్రమంలో ఆ యువకులిద్దరూ అడ్డు పడితే,కాపాడుకునే
క్రమంలో కాల్చించిందని,ఆ వెంబా తనే అని చెప్తుంది లాయర్
వెంబా.
తన తల్లి
నిర్దోషిత్వాన్ని నిరూపించడానికే ఆమె ఆ కేసు తీసుకుందని అర్థమౌతుంది అందరికీ.ఈ
క్రమంలో అసలు జ్యోతిని పోలీసులు అరెస్టు చేయలేదని,ఆమె తనని పిల్లల
హంతకురాలిగా ప్రకటించినప్పుడు,తనే వెళ్ళి ఓ ఆఫీసర్ కి
లొంగిపోయిందని,కోర్టుకు తీసుకువెళ్ళె క్రమంలో వరదరాజన్
దగ్గరకు పై ఆఫీసర్ తీసుకువెళ్తే అతనే హత్య చేసాడని తెలుస్తుంది.కానీ ఈ సాక్ష్యం
చెప్పడానికి ఆ ఆఫీసర్ ముందే వస్తానని మాట ఇవ్వడంతో, అదే
ధైర్యంతో ఈ కేసు రీఓపెన్ చేసినప్పటికీ సరిగ్గా అదే సమయంలో అతను ఆత్మహత్య
చేసుకున్నాడనే వార్త వస్తుంది. ఈ సమయంలోనే అప్పటివరచు జ్యోతిదే తప్పనుకున్న అందరూ వెంబ వైపు
న్యాయం ఉండవచ్చని నమ్మడం భావిస్తారు.
ఈ కేసులో
వరదరాజన్ పేరు రావడం వల్ల అతన్ని కూడా రమ్మని జడ్జి ఆదేశం ఇస్తాడు.వరదరాజన్ కు
ఉన్న ఈగోను రెచ్చగొట్టి కొన్ని విషయాలు బయటపెడుతుంది వెంబా.ఈ క్రమంలోనే చనిపోయిన
తన కొడుకును హీరోని చేయడానికే జ్యోతిని హంతకురాలిగా చిత్రీకరించారని,అందుకే
వాళ్ళు హత్య చేసిన అమ్మాయిల శవాలు ఆమె
ఇంట్లో పాతిపెట్టారని నిరూపించబడుతుంది.దాంతో వరదరాజన్ కు శిక్ష పడుతుంది.
వాస్తవానికి
వెంబగా ఉన్న అమ్మాయి వెంబ కాదు,ఏంజెల్ . ఆరోజు జ్యోతి వెళ్ళేసరికే ఆమె
కూతురు వెంబా మరణిస్తుంది,ఏంజెల్ ప్రాణాలతో ఉంటుంది. ఆమెను
కాపాడుతుంది జ్యోతి. ఆ కృతజ్ఞతతోనే
ఆమెను నిర్ధోషిగా నిరూపిస్తుంది ఏంజెల్ .
సినిమాలో ధృఢంగా
ఎలిమెంట్స్ ,లింకులను కనక్ట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. మరీ ప్రతి
నిముషం ఆసక్తి కలిగించే రీతిలో ఉంటే ఎమోషన్ ఆఫ్ వుమన్ పలచబడుతుందని,ఓ అమ్మ బిడ్డల మధ్య అనుబంధాన్ని ధృఢపరుస్తూ కోర్టు థ్రిల్లర్ గా మలిచే
ప్రయత్నం చేసారు ఈ సినీ కర్షకులు.
ప్రతి అంశంలో
కొత్తదనం ఉండదు. ముఖ్యంగా సమస్యల్లో కొత్తదనం ఉండదు.కేవలం బాధితులు,నిందితులు
మారతారు అంతే.చిన్నారులపై జరిగే లైంగిక వేధింపుల్లో తమిళనాడు మూడో స్థానంలో
ఉంది.పిల్లలు ఈ విషయాన్ని చెప్పుకోలేకపోవడం వల్లే వెలుగులోకి రాకుండా ఎన్నో
ఉదంతాలు మిగిలిపోతున్నాయి.
ప్రవీణ్ ఉరిశిక్ష
తీర్పు 24 గంటల్లో అమలైనా సరే చిన్నారులపై జరిగే ఈ అత్యాచారాలు ఆగలేదు.ఇటువంటి
సున్నితమైన అంశాలను సినిమా చేయడం అంటే కత్తి మీద సామే. పాత్రల ఔచిత్యం దెబ్బ
తినకుండా,వాస్తవానికి మరీ దూరంగా వెళ్ళకుండా ,అంతో ఇంతో ఇది
నిజమే అనిపించేలా ఉండకపోతే అది కనక్ట్ అవ్వదు.
ఈ సినిమా సమీక్షలు
అన్ని 2,2.5,3 స్టార్స్ దగ్గరే ఆగిపోయాయి.కానీ సినిమాలను
ప్రేమించేవారు మాత్రం మారుతున్న సినీ వైవిధ్యాలను,సమస్యల
కోణాలను చూపించే తీరుతెన్నులు తెలుసుకోవాలంటే తప్పకుండా చూడాల్సిన చిత్రమే ఇది.
* * *

Comments
Post a Comment