శాపగ్రస్థుడు

చదువరి -16

                                      శాపగ్రస్థుడు

                               -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          గ్రీకు రచనల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నది హోమర్ ఒడిస్సీ. యుద్ధాలు చాలాసార్లు దేశాల మధ్య ఆధిపత్యం కోసం సంభవిస్తాయి. కానీ ఓ స్త్రీ కోసం జరిగిన ట్రోజన్ వార్ తర్వాత ఒడిస్సీ (రష్యన్ లో ఉలసేస్ అని పిలుస్తారు) 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు పడ్డాక తన దేశమైన ఇటాచాకు చేరుకున్నాడో తెలిపే ఇతిహాసమే ఇది. అతనే  ట్రోజన్ వార్ లో హెలెన్ భర్త గెలుపుకు కారకుడు. ఈ ఇతిహాసంలో దేవుళ్ళు కూడా మనుషులతో కలిసి వారికి సాయం చేయడం లేదా కష్టాలు పెట్టడం వంటి అంశాలు చదువరులకు ఆసక్తి కలిగిస్తాయి. ఒడిస్సీ గురించి అర్థం కావాలంటే ట్రోజన్ వార్ గురించి కొంత అవగాహన అవసరం.

          గ్రీక్ దేవతల నివాస స్థలం మౌంట్ ఒలంపస్. అక్కడి నుండే వారు మానవుల జీవితాలను గమనించేవారు. జూస్ దేవతల రాజు. అతనికి అథెనా అనే కూతురు,హెర్మ్స్ అనే కొడుకు ఉన్నారు. అథెనా జ్ఞానం,శక్తి,యుద్ధాలకు దేవత.హెర్మ్స్ దేవతలందరికి సందేశకుడు. ఆఫ్రోడైట్ ప్రేమ దేవత. హెరా స్త్రీలకు,పెళ్ళిళ్ళకు దేవత. పోసిడాన్ సముద్ర దేవుడు. మానవుల జీవితాలు దేవతల భావోద్వేగాలపై ఆధారపడి ఉండేవి. ఒడిస్సీ యుద్ధం అయిపోయాక కూడా 10 ఏళ్ళు ఇంటికి తిరిగి వెళ్లలేకపోవడానికి కారణం కొందరి దేవతల ఆగ్రహం అతనిపై ఉండటం వల్లే.

          ట్రోజన్ వార్ మొదలవ్వడానికి కారణం ప్రేమ,అసూయ మరియు ద్రోహం వల్ల. ఓ రోజు జూస్ మౌంట్ ఒలంపస్ లో ఓ పెళ్ళి వేడుకను జరుపుతున్నాడు. అందరూ దేవతలు, సగం దేవతలైన వారు, మనుషుల్లో ఉత్తములు కూడా ఆహ్వానించబడ్డారు. ఒక్క కష్టాలు కలిగించే దేవత అయిన ఎరిస్ ను తప్ప అందరినీ ఆహ్వానించారు. దీనితో కోపం తెచ్చుకున్న ఎరిస్ దీని మీద బదులు తీర్చుకోవడానికి ఓ హాల్ లో ఓ యాపిల్ ను విసురుతుంది మారువేషంలో వచ్చి. అది అక్కడ ఉన్న వారందరిలో అందమైన దేవతకు ఓ బహుమతి అని చెప్తుంది. దాని కోసం అథెనా, హెరా, ఆఫ్రోడైట్ మధ్య గొడవ మొదలైంది. వారు జూస్ ను న్యాయం చెప్పమంటే అతను తెలివిగా ట్రాయ్ సిటీకి చెందిన పారిస్ అనే యువకుడిని న్యాయనిర్ణేతగా ఉంచుతాడు. ఆ పండు కోసం పారిస్ తో ఒప్పందం చేసుకోవడానికి ముగ్గురు దేవతలు ప్రయత్నిస్తారు. అథెనా జ్ఞానం,తెలివి, ధైర్యాలను హెరా  అధికారాన్ని, ఆఫ్రోడైట్  ప్రపంచంలోనే అందగత్తె ప్రేమను ఇస్తామంటే ఆఫ్రోడైట్ చెప్పింది  ఆకర్షిస్తుంది పారిస్ ను. ఆమెకే యాపిల్ ఇస్తాడు.

          ప్రపంచంలోనే అందగత్తె హెలెన్. ఆమెకు అప్పటికే వివాహమైంది. స్పార్టా రాజు మెలనస్ ఆమె భర్త. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆమెను ట్రాయ్ కు తీసుకువస్తాడు పారిస్. దానితో మెలనన్ తన భార్య కోసం ఎంతో మంది రాజులతో కలిసి వారి పైకి యుద్ధానికి వెళ్తాడు. అతను తీసుకువెళ్ళిన రాజుల్లో ఒడిస్సీ కూడా ఒకరు. వీరి సైన్యాన్ని ఏకీయన్స్ అంటారు. వీరు ట్రాయ్ లతో హెలెన్ కోసం చేసిన యుద్ధమే ట్రోజన్ వార్. ఇది పదేళ్ళ పాటు సాగింది. ఏకీయన్స్ ట్రాయ్ ల పై విజయం సాధించారు. మొత్తానికి హెలెన్ తన భర్తను చేరుకుంది. ఒడిస్సీ ,అతని రాజ్యం వారు తప్ప యుద్ధంలో గెలిచిన వారు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఒడిస్సీ మాత్రం ట్రాయ్ ను పూర్తిగా నాశనం చేసి యుద్ధాన్ని సమాప్తం చేద్దామని ఉండిపోతాడు.

          అతను తన సైన్యాన్ని  ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేయమని తర్వాట్ అందులో వారిని ప్రవేశించమని చెప్తాడు. ఆ గుర్రాన్ని ట్రాయ్ గేట్ల దగ్గర ఉంచుతారు. ఆ గుర్రం మెడలో ఆ గుర్రం అథెనా దేవతకు ఒడిస్సీ బహుమానం అని రాసి ఉంటుంది. దానితో పాటు ఏకీయన్స్ వెళ్ళిపోయారు అని ఉంటుంది. దానితో ట్రాయ్ లు ఆ గుర్రాన్ని లోపలికి తీసుకువచ్చి విందు చేసుకుంటూ ఉంటారు. వారు ఊహించని సమయంలో ఆ గుర్రం నుండి బయటకు వచ్చి ఒడిస్సీ అతని సైన్యంతో కలిసి వారిపై దాడి చేసి ట్రాయ్ ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.

          కానీ ఈ యుద్ధ ప్రక్రియలో ఏకీయన్స్ ఎందరో గ్రీకు దేవతలకు కోపం తెప్పించారు. ఒడిస్సీ సైన్యం ఎన్నో దేవాలయాలను కూడా ధ్వంసం చేశాయి. దానితో వీరిపై కోపగించిన కొందరు దేవతలు వీరు తిరిగి వెళ్ళేటప్పుడు కష్టాలు ఎదుర్కునేలా చేస్తారు . అలా ఇంటికి ఒక్క ఒడిస్సీ మాత్రమే తిరిగి వెళ్తాడు, మిగిలిన సైన్యం మరణిస్తుంది. అలా ఒడిస్సీ యుద్ధం తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఎదుర్కున్న  పోరాటమే ఈ ఒడిస్సీ.

          యుద్ధం తర్వాత వారు మొదట వెళ్ళే దారిలో గాలి వల్ల సిసోన్స్ రాజ్యానికి వెళ్తారు. వారు ట్రాయ్ రాజ్య మిత్రులు అవ్వడంతో యుద్ధం జరగడం,ఒడిస్సీ కూడా కొంత సైన్యం కోల్పోయినా గెలుస్తాడు. తర్వాత వెళ్ళే దారిలో లోటస్ ఈటర్స్ ప్రాంతానికి వస్తారు.అక్కడ తామరలు తింటే ఇంటికి వెళ్లాలనే స్పృహ ఉండదు.అక్కడే ఉండిపోవాలని కోరిక ఉంటుంది. అది దాటాక, సైక్లోప్స్ దీవికి వెళ్తారు. సైక్లోప్స్ కు ఒక కన్ను ఉంటుంది. అందులో ఒక సైక్లోప్ సముద్ర దేవుడైన పోసిడాన్ కొడుకు. ఆ దీవిలో చిక్కుకుపోతారు ఒడిస్సీ సైన్యం. ఆ పోసిడాన్ కొడుకు పూటకో ఇద్దర్ని భోజనంలా తినేస్తూ ఉంటాడు. అలా అతని నుండి తప్పించుకునే క్రమంలో అతనికి మత్తు మందు ఇచ్చి, ఆ కన్ను గుడ్డిది చేసి, అతని గొర్రెల పొట్టల కింద వేలాడుతూ బయట పడతారు ఒడిస్సీ, అతని సైన్యం. తన కొడుకుని గుడ్డివాడిని చేసినందుకు పగ పట్టిన పోసిడాన్ సముద్రం అతనికి సహకరించకుండా ఉండేలా చేస్తాడు.

          తర్వాత వారు ఇంకో దీవికి చేరుకుంటారు. దాని రాజు ఒలస్ ను జూస్ విండ్స్ కెప్టెన్ చేస్తాడు.  ఒడిస్సీ కథ విని,అతనికి సాయం చేయడానికి ఒలస్ అతను సహకరించని గాలుల్ని ఓ బ్యాగ్ లో కట్టి ఇస్తాడు. ఈ  విషయం ఒడిస్సికి తప్ప అతని సైన్యానికి తెలియదు. వారు ఒడిస్సీ దగ్గర ఉంది గొప్ప సంపద అనుకుని అతను నిద్ర పోయిన సమయంలో ఆ బ్యాగ్ ను తెరుస్తారు దానితో గాలులు అన్నీ విడిపించబడటంతో ప్రయాణం అల్ల కల్లోలం అవుతుంది. తిరిగి ఒలస్ దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి ఇంకో బ్యాగ్ అడిగినా అతను ఇవ్వడు. దానితో అతని సాయం లేకుండానే ప్రయాణం కొనసాగిస్తారు.

          దీని తర్వాత సిర్సి దేవత ఉన్న దీవికి వెళ్తారు. అక్కడ ఓ ఇల్లు ఉంటుంది. అక్కడ ఓ స్త్రీ పెట్టిన భోజనం తింటారు ఆ సైన్యం. వారిని తన మ్యాజిక్ తో పందుల్లా మార్చేస్తుంది.ఆమె నుండి తప్పించుకోవడం,అక్కడి నుండి సైరెన్స్ దీవికి వెళ్ళడం, ఆకక్ది పాటలు వింటే అక్కడే ఉండిపోవాలనిపించడం, అది కూడా దాటి సిసిల్లా ,చార్బిదాస్ రాక్షసులను దాటుకుని సూర్యదేవుని దీవికి చేరుకోవడం,అక్కడ ఆకలికి తట్టుకోలేక ఒడిస్సీ సైన్యం సూర్య దేవుని ఆవును చంపి తినడంతో సూర్య దేవుని శాపం వల్ల తర్వాత సముద్రంలో వారంతా మునిగిపోతే ఒడిస్సీ ఒక్కడే మిగులుతాడు. అతను అప్పుడు కలిప్సో దీవికి చేరుకున్నప్పుడు ఆ దేవత అతన్ని వివాహం చేసుకోవాలనుకోవడం,ఒడిస్సీ అంగీకరించకపోవడం,అక్కడే అతను కొన్నేళ్లు ఉండిపోవాల్సి రావడం ,చివరకు  అథెనా అతనకు సాయం చేయడం వల్ల ఫెసియా చేరుకుంటాడు. అక్కడి రాజు ఆ కథ విని చివరకు అతన్ని అతనికి ఇంటికి పంపిస్తాడు.

          ఒడిస్సీ యుద్ధానికి వెళ్ళి ఇంటికి 20 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. ఈ లోపు అతని భార్య పెనోలోప్ ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వారు ఆమె ఇంటిని అట్టిపెట్టుకుని అక్కడే విలాసంగా జీవిస్తున్నారు. వారి నుండి తప్పించుకోవడానికి ఆమె ఓ డ్రస్ కుడుతున్నానని అది పూర్తయ్యాక ఎవరో ఒకరిని వివాహం చేసుకుంటానని చెప్తుంది. ప్రతి రోజు కుట్టి , ఆ రాత్రి కుట్టింది తీసెసేది ఆమె. అయితే ఓ సేవకురాలు ఈ విషయం ఆ వరులకు చేరవేస్తుంది. అందరూ ఒడిస్సీ మరణించాడనే భావించారు. ఒడిస్సీ కొడుకు తెలిమాకస్.స్వదేశానికి తిరిగి వచ్చిన ఒడిస్సీ ఓ బిచ్చగాడి రూపంలో ఇంటికి వెళ్ళి అక్కడి పరిస్థితులను గమనిస్తాడు.

          చివరకు ఎవరైతే ఓ బాణంతో ఎదురుగా సమాంతర రేఖగా ఉన్న 12 గొడ్డళ్ళ హోల్స్ నుండి వెళతాయో వారిని వివాహం చేసుకుంటానని చెప్తుంది. బిచ్చగాడి రూపంలో ఉన్న ఒడిస్సీ తప్ప మిగిలిన ఎవ్వరూ ధనుస్సు కూడా ఎత్తలేరు. ఈ ఉదంత౦ మన  రామాయణంలోని శివధనుస్సు విరవడం ను జ్ఞప్తికి తెస్తుంది. అలా వారితో యుద్ధం కెఃసి భార్యా,కొడుకుతో జీవిస్తాడు ఒడిస్సీ. భార్య అతన్ని వారిద్దరికి మాత్రమే తెలిసిన ఓ విషయం అడుగుతుంది. పడక గదిలో ఉన్న మంచాన్ని జరపమంటుంది.కానీ అది జరపలేని మంచమని ఒడిస్సీ చెప్పడంతో భర్తగా గుర్తిస్తుంది. అలా కథ సుఖాంతమవుతుంది.

          దేవతల మధ్య జరిగిన ఓ పండు పోరాటం ఎలా మనుషుల జీవితాల్లో ,దేశాల మధ్య యుద్ధల్ని తెచ్చిందో ,మళ్ళీ ఆ దేవతలే కోపం ,ప్రేమ చూపిస్తూ ఎలా సమస్యలు తీర్చారో చెప్తునే మనుషులు దేవతల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే ఇతిహాసమే ఒడిస్సీ. చదువుతుంటే చదివింపజేస్తుంది ఒడిస్సీ. ఎన్నో కథలు తెలుసుకోవడం, ఎన్నో దేశాలు మన ముందు ప్రత్యక్షం అవ్వడం చదవడం మనకు ప్రసాదించే వరం. ఏ పుస్తకమైనా సరే అది మనల్ని కచ్చితంగా వేరే లోకానికి తీసుకువెళ్తుంది,కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది. గ్రీకు వాతావరణాన్ని మీ ముందు ప్రత్యక్షం చేసే ఈ ఇతిహాసాన్ని తప్పక చదవండి.

ప్రతి దేశ ఇతిహాసానికి పోలికలు ఉంటాయి. భారత రామాయణానికి,హోమర్ ఒడిస్సికి కూడా పోలికలు కనబడతాయి. స్త్రీ అయిన సీత వివాహిత. ఆమె కోసం జరిగింది రామాయణం.అలాగే వివాహిత అయిన హెలెన్ కోసం జరిగిందే ట్రోజన్ యుద్ధం. దీని వల్లే ఒడిస్సి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. అలాగే రామాయణంలోని శివధనుస్సును వీరిచే ఉదంతం ఇక్కడ ఒడిస్సి పెనలోప్ కోసం చివర్లో కొన్ని పోలికలతో ఉంటుంది. వివిధ దేశాల ఇతిహాసాలు చదవడం వల్ల మన దేశ ఇతిహాసాలకు,వాటికి మధ్య ఉన్న వైరుధ్యం ,సామీప్యం కూడా తెలుస్తుంది.  

                               *    *   * 

         

         

           

         

         

         

 


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!