మనసు -మెదడు మధ్య సమన్వయం లేకుండా ఐక్యూ పెంచితే ?

మనసు -మెదడు మధ్య సమన్వయం లేకుండా ఐక్యూ పెంచితే ?  
(ఫ్లవర్స్ ఫర్ అల్గరనాన్ సినీ సమీక్ష) 
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత డానియల్ కీస్ రచించిన 'ఫ్లవర్స్ ఫర్ అల్గరనాన్ ' మొదట చిన్న కథగా ,తర్వాత నవలగా మలిచారు.ఇది ఎన్నో పురస్కారాలు పొందింది. చార్లెస్ గోర్డాన్ అనే 32 ఏళ్ళ వ్యక్తి  మానసికంగా ఎదగని మనిషి (మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ ).ఫినైల్ కెటోన్యూరియా వల్ల అనే వ్యాధి వల్ల అతని ఐక్యూ 68 దగ్గరే ఆగిపోయింది. సాధారణ మనిషికి ఉండే ఐక్యూ 95-105 మధ్య ఉంటుంది. చార్లెస్ ని తల్లి వద్దనుకుంటుంది. అతని అంకుల్ ఓ బేకరీలో ఉద్యోగం ఇప్పిస్తే దానితో బతుకుతూ ఉంటాడు. 
మనుషుల తెలివితేటలను (ఐక్యూ స్థాయిని ) పెంచే పరిశోధనలో భాగంగా అప్పటికే అల్గరనాన్ అనే ఎలుక మీద చేస్తాడు ఓ శాస్త్రవేత్త. తర్వాత మనుషుల మీద చేసే ప్రయత్నంలో భాగంగా చార్లెస్ కు ఆ ఆపరేషన్ చేస్తారు. ఆ తర్వాత అతని తెలివి నిజంగానే పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు తనను బేకరీలో అందరూ ఎగతాళి చేసినా అర్ధం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అతనికి అన్నీ అర్ధమవుతూ ఉంటాయి. 
అదే సమయంలో అతనికి చదువు చెప్పే టీచర్ తెలివిని కూడా మించిపోతాడు. ఆమె పేరు మిస్ కినిస్. కానీ తెలివితేటలు పెరిగే కొద్ది అతనిలో కోపం, తన తెలివైన వాడినని నిరూపించుకోవాలన్న తపన పెరిగిపోతూ ఉంటుంది. అతని ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల అతను ఉండటం తమకిష్టం లేదని ఆ బేకరీలో మిగిలిన వర్కర్స్ పిటిషన్ రాయడం వల్ల అతన్ని ఆ పనిలో నుండి తొలగిస్తాడు యజమాని. 
అంతకు ముందు మనసుతో మాత్రమే ఆలోచించే చార్లెస్ , ఈ కొత్త మార్పు వల్ల అతని మెదడు అతని మనసును డామినేట్ చేయడంతో అతనిలో కోపం,తానే తెలివైనవాడనే అహంకారం కూడా పెరిగిపోతుంది.దీని ఫలితంగా అతని ఐక్యూ 185 కు పెరుగుతుంది. తెలివితేటలు, అర్ధం చేసుకోగలగడం, విశ్లేషణ వంటివి పెరిగినా, మనుషులతో అనుబంధాలు మాత్రం  సరిగ్గా ఉండలేడు. ఆ పరిశోధన మీద మళ్ళీ రీసెర్చ్ చేసిన చార్లెస్ ఈ తెలివితేటలు ఎంతవర్కు పెరుగుతాయి ? ఎప్పటికీ ఆగుతుంది ? అన్న దానికి కొన్నాళ్ళకు పెరిగిన తెలివితేటలాన్ని కూడా తగ్గిపోయి పూర్వం ఉన్న స్థాయికే ఆ తెలివి పడిపోతుందని అర్ధం చేసుకుంటాడు పూర్వం జరిగిన పరిశోధనలను అనుసరించి.
అల్గరనాన్  ను ఇంటికి తెచ్చుకున్న చార్లెస్ ,దానితో తనను తాను పోల్చుకుంటూ ఉంటాడు. చివరికి అది కూడా చచ్చిపోతుంది. తెలివిగా ఉన్నప్పుడూ మిస్ కినిస్ ను ఇష్టపడతాడు, ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ తాను తిరిగి పూర్వం చార్లెస్ అయిపోతానని తెలుసుకున్నా చార్లెస్ ఆమె ఎప్పటికీ తనను ఆ జీనియస్ గానే గుర్తుంచుకోవాలని ఆ ప్రేమను తిరస్కరిస్తాడు. తనను పరిశోధనలో భాగం చేసిన శాస్త్రవేత్తను నైతిక బాధ్యత గురించి ప్రశ్నిస్తాడు కాన్ఫరెన్స్ లోనే ప్రత్యక్షంగా. ఇలా తన తెలివి తనను మనుషుల నుండి దూరం చేస్తుందని అర్ధం చేసుకుంటాడు చార్లెస్. 
ఈ సమయంలోనే తల్లిని కలుసుకుంటాడు. ఆమె తనను ప్రేమించకపోవడానికి కారణం తనకు తెలివి లేకపోవడమే అని భావించిన అతను ,ఆమెను కలిసాక ఆమె ఎవరినీ ప్రేమించలేదని అర్ధం చేసుకుంటాడు. ఈ పరిశోధన వల్ల అంతకు పూర్వం లేని బాల్య స్మృతులు కూడా గుర్తొస్తాయి. దాని వల్ల అతని బాధ అధికమవుతుంది. తన తెలివితక్కువతనాన్ని ఎలా అందరూ హేళన చేసేవారో అర్ధం అవ్వడం వల్ల మనుషుల్ని ద్వేషిస్తూ, అందరూ తనను తక్కువ చేయడానికే ఉన్నారని భావిస్తూ ఉంటాడు. మొత్తానికి అతను తనలోని గత చార్లెస్ లానే బావుందని అనుకుంటాడు. 
కొన్నాళ్ళకి అతని తెలివి పూర్వ స్థాయికి వచ్చేస్తుంది. నవలలో అతను ఓ స్టేట్ హోమ్ ఫర్  మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ లో జేరినట్టు ముగిస్తే ,సినిమాలో మాత్రం పూర్వం పని చేసిన బేకరీలో చేరినట్టు ముగింపునిస్తారు. 
దీనిని నవల రూపంలో ఎపిస్తోలేటరీ శైలిలో డానియల్ కీస్ రాశారు. అంటే చార్లెస్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఆపరేషన్ ముందు ద్వారా కథను నడిపించారు. ఈ కథ డేనియల్ కీస్ 14 సంవత్సరాల పాటు ఆలోచించి తన జీవితం నుండి స్పూర్తి పొంది రాసింది. కీస్ విద్యా సమయంలో ఆయన తల్లిదండ్రులు ఆయన్ని మెడికల్ స్టూడెంట్ గా మారమని ఒత్తిడి తీసుకువచ్చారు. కీస్ కి రచయిత అవ్వాలని గాఢమైన కోరిక ఉంది. ఆ సమయంలోనే ఆయనకు ఇలా తెలివి పెంచే మార్గం ఉందా అనే ఆలోచన కలిగింది. దాని ప్రేరణతోనే ఆయన 'ఫ్లవర్స్ ఫర్ అల్గరనాన్' రచించారు. 
ఈ సినిమా తెలివి-భావోద్వేగాల మధ్య ఉండే ఘర్షణను, ఓ మనిషి గతం అతని వర్తమానంపై చూపే ప్రభావాన్ని, వీటితో పాటు మనసు-మెదడు మధ్య సమన్వయం లేకుండా ఏ ఒక్కటి అధికంగా పని చేసినా అది ఆ మనిషిలో సృష్టించే అల్లకల్లోలాను గురించి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.  
*      *      *  

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష