లాయర్లు కాదు,లా టీచర్లు కావాలి!
లాయర్లు కాదు,లా టీచర్లు కావాలి!
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
హాలీవుడ్ సినిమాల్లో జాన్ గ్రిషమ్ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ కూడా న్యాయ పరమైన అంశాలకు సంబంధించినవే. అందులో 'ద రెయిన్ మేకర్ 'సినిమా లాయర్ వృత్తిలో ఉన్న వ్యాపార కోణాన్ని ఎత్తి చూపిస్తుంది. న్యాయ శాస్త్ర పట్టా, జనులకు న్యాయం చేయాలనే ఆలోచన కన్నా కూడా ఎలా ఈ వృత్తిని వ్యాపారంగా మార్చుకునే ధోరణిలోనే కొందరు వ్యవహరిస్తారో, నిజమైన ఆశయాలతో వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు పడటారో కూడా ఈ సినిమాలో స్పష్టం అవుతుంది.
రూడి బేలర్ లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఓ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సమయంలో బ్రూయిజర్ స్టోన్ ను కలుస్తాడు. అతను అంబులెన్స్ ల చుట్టూ తిరుగుతూ ఇన్సూరెన్సులు చేస్తూ ఉంటాడు. అతనికి అసోసియేట్ గా చేరతాడు రూడి. అక్కడే డెక్ షెఫ్ లెట్ ను కూడా కలుస్తాడు. అతను బార్ పరీక్ష ఆరు సార్లు తప్పినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కేసు విజయవంతం చేయడంలో దిట్ట. రూడి తన ఫీజు తాను సంపాదించుకోవడం కోసం రోజు హాస్పటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి మరణానికి సమీపంలో ఉన్న వారి చేత ఇన్సూరెన్సు కట్టిస్తే లాభసాటిగా ఉంటుందని బ్రూయిజర్ ఆలోచన. ఎప్పుడైతే బ్రూయిజర్ ను ఎఫ్ బి ఐ రైడ్ చేస్తుందో అప్పుడు డెక్, రూడి లు ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ మొదలుపెడతారు.
ఇదే సమయంలో కెళ్ళి ని కలుస్తాడు. ఆమెను భర్త వేధిస్తూ ఉంటాడు. ఆమెను కాపాడే సమయంలో అతన్ని హత్య చేస్తాడు రూడి. అతన్ని కాపాడటం కోసం తానే ఆత్మరక్షణ కోసం చేశానని ఒప్పుకుంటుంది కెళ్ళి. ఆమె ఆత్మరక్షణ కింద శిక్ష పడదు. అలా వారిద్దరు ఒకటవుతారు.
డాట్, బడ్డీ బ్లాక్ దంపతులకు 22 ఏళ్ల కొడుకు డాని రే.అతనికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేస్తే అతను బ్రతికే అవకాశాలు ఉంటాయి. వారి ఇన్సూరెన్స్ సంస్థ అయిన గ్రేట్ బెనిఫిట్ దానికి సహకరించదు, నిరాకరిస్తుంది. వారి తరపున కేసు తీసుకుంటాడు రూడి. కానీ అతను అంతకు ముందు ఎప్పుడు వాదించలేదు. గ్రేట్ బెనిఫిట్ తరపున వాదించే లాయర్ ముందు నిలవలేకపోతాడు రూడి. కొన్నాళ్ళకు రే మరణిస్తాడు. రే మరణించే ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలంతో మళ్ళీ కేసు ట్రయల్ కి వస్తుంది.
గ్రేట్ బెనిఫిట్ లో పని చేసే ఓ ఉద్యోగిని ఎలా వారు మోసం చేస్తున్నారో ఇచ్చిన సాక్ష్యం వల్ల, గ్రేట్ బెనిఫిట్ ప్రెసిడెంట్ ను రూడి చేసిన క్రాస్ ఎగ్జామినేషన్ వల్ల ఆ కేసు గెలుస్తాడు రూడి. వారిని అరెస్ట్ చేయడం జరిగినా, ఆ సంస్థ బ్యాంక్రప్ట్సీ ప్రకటించడం వల్ల అటు ఆ తల్లిదండ్రులకు ,ఇటు లాయర్ రూడి కి ఫీజు కూడా దక్కకపోయినా ఇన్సూరెన్స్ లో జరుగుతున్నా స్కాములు బయట పెట్టడ రూడికి ఘన విజయం అవుతుంది.
ఈ కేసు తర్వాత రూడి లాయర్ గా ఉండటం కన్నా లా ను బోధించే టీచర్ గా మారదామని నిర్ణయం తీసుకుంటాడు. 'Every lawyer atleast once in every case, feels himself crossing a line he doesn't really mean to cross. It just happens. And if you cross it enough times,it disappears forever. Then you're nothing but another lawyer's joke. Just another share in the dirty water.' అన్న రూడి వాక్యాలతో ఈ సినిమా ముగుస్తుంది.
ప్రతి లాయర్ మొదట్లో వృత్తి మీద అంకిత భావంతోనే ఉంటాడు. కానీ ప్రతి కేసులో ఆ లాయర్ కనీసం ఒక్కసారి అయినా న్యాయ గీతను దాటవలసి వస్తుంది. క్రమేపీ అలా కేసుల వారీగా దాటుతూ ఉంటే ఓ సమాయానికి ఆ గీత చెరిగిపోతుంది , ఆ అన్యాయపు ప్రవృత్తిలో లాయర్ ఉండిపోవాల్సి ఉంటుంది. అందుకనే లాయర్లు కాదు ,లాను బోధించే వారు కావాలి అన్న అంతర్లీన సందేసంతో సినిమా ముగుస్తుంది. విద్యా వ్యవస్థలో సిలబస్ లే తప్ప వృత్తి నైతికత పట్ల అంకిత భావం పెంపొందే అవకాశాలు తక్కువ. అందుకే వృత్తిలోని అంకిత భావం వ్యాపార ప్రవృత్తికి అమ్ముడుపోతుంది.
* * *

Comments
Post a Comment