పుణ్యభూమిలో పూజారిణి

చదువరి-8 :
పుణ్యభూమిలో  పూజారిణి 
             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 




    
       కోడూరి కౌసల్యాదేవి గారి 'పూజారిణి' నవల తప్పు చేయకపోయినా సమాజపు విష వలయంలో చిక్కుకున్న తల్లి నుండి దూరం అయినప్పటికీ, ఆమె భవిష్యత్తులో ప్రేమించే భర్త కూడా ఎలా సంకుచిత్వ ధోరణికి దశల వారీగా మార్పు చెందాడో తెలుపుతూనే, తప్పు చేసినా చివరకు కలిసిన వారి మనసుల ద్వారా భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవమే ముఖ్యమని సూచిస్తుంది. 
  తన 12 ఏళ్ల కూతురు మీరాను  రామదాసు దగ్గర వదిలి వెళ్తాడు  శ్రీనివాసరావు. ఆమె తల్లి కళంకిత అవ్వడం వల్ల ఆమెను అక్కడికి దూరంగా పెంచాలనుకున్నట్టు పాఠకులకు అర్ధమవుతుంది. అలా వెళ్ళిన మీరా తండ్రి తిరిగి రాడు. దైవ భక్తితో, ఆశ్రమ వాతావరణంలో  రామదాసు దంపతుల దగ్గరే  కూతురిగా పెరుగుతుంది. కోటీశ్వరుడి కూతురైన  మీరా అలా పెరుగుతుంది. పెంపుడు తండ్రి రామదాసు దగ్గర సంగీత జ్ఞానం పెంచుకుంటుంది.  
యుక్తవయస్కురాలైన  తర్వాత రామదాసు శిష్యుడైన నరహరి  మీరా పరస్పరం ఇష్టపడటంతో  వారిద్దరికి వివాహం చేసి పంపిస్తారు  రామదాసు దంపతులు. కానీ నరహరి సినిమా దర్శకుడు. అతని తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం ఉండకపోవడంతో అక్కడ  మీరాను బాధలు పెడుతుంటే ఆమెతో వేరే కాపురం పెడతాడు నరహరి. 
అక్కడ కూడా వారిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా శతవిధాలా ప్రయత్నిస్తారు ఆమె ఆడపడచు,అత్త మామాలు. తర్వాత నరహరి ఓ సినీ కథను రాసుకుంటాడు. దానికి మీరా 'పూజారిణి 'అనే శీర్షిక సూచిస్తుంది. ఆమెకు  కూడా సంగీత పరిజ్ఞానం ఉండటంతో ఆ సినీ పాటల చర్చలో ఆమె కూడా పాలుపంచుకుంటుంది. నరహరి అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్ళిన సమయంలో ఆమెను కన్న తల్లి ఆఖరి ఘడియల్లో  ఉందని కబురు పెట్టడంతో వెళ్తుంది మీరా. ఆ విషయం నరహరి నుంచి దాచినా, అతనికి తెలుస్తుంది. ఆఖరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు  మీరా అక్కడ ఉండటం, నరహరి ఆమెను తీసుకురావడం, ఆమెను కనీసం అంత్యక్రియలకు కూడా వెళ్ళకుండా చేస్తాడు నరహరి. 
తల్లి జారిణి అని ,ఆమె తల్లి చరిత్ర తనకు చెప్పలేదని నిందిస్తాడు నరహరి. ఆ విషయాలన్నీ తెలుసు అని అనుకున్నానని అంటుంది మీరా. అప్పటికే గర్భవతి అయిన మీరా భర్త నిరాదరణ భరించలేక పుట్టింటికి వెళ్తుంది,అతనే ఆమెను దింపుతాడు. తర్వాత ఆమె ఇద్దరు కవలలను ప్రసవిస్తే ఓ బిడ్డ మరణించినా ఆమె స్పందించదు, ఓ శిలలా మారిపోతుంది. 
'జారిణి ' అనే కథ ద్వారా తన తల్లి చరిత్రను ఓ పత్రికకు పంపి ప్రపంచానికి తెలియజేస్తుంది మీరా. ఆమె తల్లి తండ్రికి మూడో భార్య. మొదటి భార్యకు ఓ కూతురు, ఆమె మీరా తల్లి కంటే పెద్దది. రెండో భార్యకు ముగ్గురు కూతుళ్ళు. మూడో కూతురు మీరా వయసు
. మీరా తల్లిదండ్రులు ఆమెను చూడటానికి రాకూడదు. సవతుల పోరు, ముసలి భర్త అనుమానం. అందరూ ఆమె డబ్బు కోసం పెళ్ళి చేసుకుందని నిందించేవారు. తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోతే  ఓ నౌకరు అయిన సుబ్బారావు సాయంతో భర్తకు తెలియకుండా చూసి వచ్చినా, సవతి ద్వారా తెలుసుకున్న భర్త చావు దెబ్బలు కొడతాడు. తమ్ముడి పెళ్ళికని  సుబ్బారావుతో వెళ్ళి వచ్చేసరికి  ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి ,ఆమె బిడ్డ మీరాను లాక్కుని ఆమెను వెళ్లగొడతారు. తర్వాత సుబ్బారావు స్నేహితుడి ద్వారా ఆమె చిత్రపరిశ్రమలో ప్రవేశించి లక్షలు సంపాదించి పేరు తెచ్చుకున్నా ఆమెను జారిణిగా చిత్రీకరిస్తుంది సమాజం. సుబ్బారావు స్నేహితుడిగా మిగిలినా అక్రమ సంబంధం ఆపాదిస్తుంది. 
    'జారిణి'గా ముద్ర వేయబడిన ఆమె నిజంగా జారిణి కాదని, ఎక్కడ ఉన్న కనిపించని దైవాన్ని పూజారి అర్చించినట్టే  కనుచూపుకైనా నోచుకోని భర్తను, బిడ్డను అహరహమూ  తలుస్తూ పూజారిణిగా బ్రతికిన పవిత్రురాలనీ  లోకం గుర్తించకున్నా, కన్నబిడ్డవు నీవు తెలుసుకో' తో ఆ కథ ముగుస్తుంది. 
తర్వాత నరహరి ఆమె కోసం  రామదాసు దంపతుల దగ్గరకు వెళ్ళడం ,చివరకు దంపతులు  కలుస్తారు. 
"తన పూజా భక్తితో భక్తుడు దైవ ప్రసన్నతను సాధిస్తాడు. తన త్యాగ ఔన్నత్యాలను  హైందవ స్త్రీ ఈ జీవన పోరాటంలో పురుషునిపై  విజయాన్ని సాధిస్తుంది. ఇది యుగయుగాలుగా తరతరాలుగా  ఈ దేశంలో నడుస్తున్న  చరిత్ర. భర్త విదిలించినా, ఆదరించినా, తన సహనాన్ని, నిబ్బరాన్ని  కోల్పోక అతడి కొరకే ,అతని బిడ్డల కొరకే  తన తనువూ , జన్మ నిత్య పూజాగా అర్పించే త్యాగములు ఈ భారత పూజారిణి" అన్న నరహరి మాటతో నవల ముగుస్తుంది. 
ప్రేమించినప్పుడు, తల్లిదండ్రుల్ని ఎదురించి పెళ్ళి చేసుకున్నప్పుడు ఉన్న ఆ భర్త ప్రేమ ఆమెకు కూడా ప్రతిభ ఉండి, ఆమె మనుషులతో మాట్లాడినా అర్ధం చేసుకోలేని సహృదయత ఎందుకు లోపించింది? మొదటి నుండి ఓ రకమైన సంకుచిత్వ ప్రవర్తన కల మీరా కన్న తండ్రి ప్రవర్తనకు ,నరహరి ప్రవర్తనకు ఏం తేడా ఉంది? స్త్రీ పూజారిణి లా ఉంది అనే ముగింపు ఉన్నప్పటికీ ఆమె ప్రేమ అర్హతను ఆశించే హక్కు ఆ భర్తకు ఎంత మేరకు ఉంది ? భర్త అనేది ప్రేమ,బాధ్యత అనే  భావనల నుండి కేవలం అధికారం అనే ధోరణికి మనిషి మనస్తత్వంలో మార్పులు వస్తేనే మనుషుల ప్రవర్తన ఇలా మారుతుంది. నవల ఎప్పటిదో అయినా సరే మనుషుల జీవితాల కథలు ఎప్పుడు కొన్ని పునరావృతమవుతూనే ఉంటాయి. 
*   *   *  

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ