పిచ్చి పక్కవాళ్ళకు ఎక్కిస్తే ?

చదువరి-10 
  పిచ్చి పక్కవాళ్ళకు ఎక్కిస్తే ? 
  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



     తెలుగు సాహిత్యంలో వాసిరెడ్డి సీతాదేవి గారి సాహిత్యం ప్రత్యేకమైనది. సమాజంలోని ఎన్నో కోణాలను ఆమె తన రచనల ద్వారా స్పృశించారు. సైకలాజికల్  నవల అయిన 'మానిని-మనసు' సీతాదేవి గారి నవలల్లో విశిష్టమైనది.  ఓ వ్యక్తి తన భయాన్ని, మానసిక అపసవ్యతలను  పక్క వారికి ఎలా అనుభవంలోకి తెస్తాడో అన్న అంశంతో సూటిగా,అనవసర పాత్రలు సంభాషణలు లేకుండా రాయబడిన రచనే ఇది. 
అనసూయ, సావిత్రి ఇద్దరు స్నేహితులు. ఇద్దరు బి.ఏ దాకా కలిసి చదువుకున్నారు. అనసూయ తనకు  నచ్చినా,లేక తెలిసిన వ్యక్తినే వివాహం చేసుకోవాలనే కచ్చితమైన అభిప్రాయాలూ ఉన్న యువతి. సావిత్రి ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎవరిని తల్లిదండ్రులు సూచిస్తే వారినే చేసుకుందామనే  నిర్ణయంతో ఉన్న స్త్రీ ఆమె. అనసూయ తండ్రి మరణంతో ,ఎమ్ ఏ చదవలేకపోయింది అనసూయ. తన అన్నయ్యకు, తల్లికి భారం అవ్వడం ఇష్టం లేక వారు తెచ్చిన రెండో వివాహం వాడైన రమణమూర్తిని  వివాహం చేసుకుని, కాపురానికి వెళ్తుంది. 
రమణమూర్తి ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. పెళ్ళైన  ఆరు నెలల తర్వాత భార్యతో కలిసి ఆఫీసు పనిలో భాగంగా మద్రాసు వెళ్ళి ,ఆ తర్వాత ఊటీ వెళ్దామని  ప్లాన్ చేస్తాడు రమణమూర్తి. వారిద్దరు ఆ ఉత్సాహంలో ఉండగా సావిత్రి తాను వస్తున్నానని  టెలిగ్రామ్ ఇవ్వడంతో అనసూయ తన ప్రయాణం  మానుకుంటుంది. ఆఫీసు పని మీద మద్రాసుకు వెళ్తాడు  రమణమూర్తి. 
సావిత్రిని  స్టేషన్ నుండి ఇంటికి తీసుకు వస్తుంది అనసూయ. ఆ తర్వాత సావిత్రి తన జీవితం గురించి, అనుభవాల గురించి చెప్తుంది. తాను రామకృష్ణను ప్రేమించానని,అతను  వేరే పెళ్ళి చేసుకోవడంతోనూ ,ఇంకో సంఘటనతోనూ తనకు మగవాళ్ళంటే  అసహ్యం కలిగిందని చెప్తుంది సావిత్రి. 
రెండేళ్ళ క్రితం తమ ఇంటికి ఓ యువ జంట అద్దెకి వచ్చారని, ఆ అమ్మాయి తన తల్లితో బాగా కలిసిపోయిందని, కానీ తనకు మాత్రం తాను రాత్రుళ్ళు చదువుకుంటున్నప్పుడూ ఆ వారి గది నుండి ఎప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టు ,తనను చంపవద్దని వేడుకుంటునట్టు ఏడుపులు వినిపించేవని,ఆ విషయం అమ్మా నాన్నలతో చెప్పినా, నమ్మలేదని ,ఓ ఉదయం ఆమె గాస్ స్టవ్ పేలి చనిపోయిందని అని చెప్పినా తనకు మాత్రం కచ్చితంగా అతనే చంపి ఉంటాడని అభిప్రాయం అని చెప్తుంది సావిత్రి. 
అనసూయ భర్త ఇంటికి తిరిగి వస్తాడు. అతనే తమ ఇంట్లో అద్దెకున్న అమ్మాయి భర్త అని కచ్చితంగా అనసూయను కూడా చంపేస్తాడనే భయపెడుతుంది సావిత్రి. ఆ భయాన్ని అనసూయలో నింపి తను ఉంటే తనని కూడా అతను చంపేస్తాడని హాస్టల్ కి వెళ్లిపోతుంది .సావిత్రి సైకాలజీ చదవడానికి వస్తుంది. అప్పటి నుండి రమణమూర్తి చూడగానే  భయపడిపోతుంటుంది  అనసూయ. ఆమె ద్వారానే విషయం తెలుసుకున్న  రమణమూర్తి ఆమెను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్తాడు . ఆమెలో భయం నింపిన సావిత్రి వస్తే తప్ప తను వైద్యం చేయలేనని అంటాడు ఆ వైద్యుడు. 
ఆమె అప్పటికే హాస్టల్ వదిలి ఇంటికి వెళ్లిపోవడంతో అక్కడకు వెళ్తాడు. ఆమె తండ్రి ఆమె పిచ్చాసుపత్రిలో ఉందని చెప్తాడు. మొదట్లో బాగానే ఉండేదని కానీ తన చెల్లెలి ఇంటికి ఓ సారి పంపినప్పుడు, ఆమెను భర్త పీక పట్టుకుని పిసకడం చూసిందని ,ఆమె అత్త అలా మరణించడంతో అప్పటి నుండి అలా మారిపోయిందని,అందుకే వారు అద్దెకు వచ్చినప్పుడు కూడా ఆ భర్త భార్యను చంపేస్తున్నాడని చెప్పేదని ,ఆఖరికి తండ్రినైన తనను కూడా తల్లి పీక పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నానని  అనేదాని చెప్తాడు తండ్రి. ఎలాగో మారుతుందని ఆశిస్తే ,తన స్నేహితురాలి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరిందని కానీ ఆమె కాపురం కూలుస్తుందని ఊహించలేదని అంటాడు ఆ తండ్రి . ఆ హాస్టల్ లో కూడా ఇలానే తలుపులు కొట్టి ఇలానే ఎవరినో చంపేస్తున్నారు అని అనేదని ,అర్థ రాత్రి అరిచేదని ఆమె ఉంటే హాస్టల్ లో ఉండమని మిగిలిన వారు అంటే ఆమెను పంపేశారని ,ఇక తప్పక పిచ్చాసుపత్రిలో చేర్చానని చెప్తాడు తండ్రి. 
ఆమెను చూడడానికి వెళ్తాడు రమణమూర్తి . అక్కడ ఆమెను చూడగానే తన భార్య అనసూయ కూడా అలానే ఉంటుందనే భయంకరమైన ఊహ రావడంతో నవల ముగుస్తుంది. పిచ్చికి ముందు ప్రతి మనిషికి భయం ఉంటుందని ,దాని తర్వాతి దశే పిచ్చి అని రచయిత్రి ఈ నవలలో చెప్తుంది.సావిత్రి మనసులో ఉన్న అసలైన సంఘటన అత్తయ్యది అయినా దాని గురించి ఆమె ఏనాడూ చెప్పలేదు ,కానీ దాని ఆధారంగా ప్రతి వ్యక్తికి అది ఆపాదించే ఆమె మనఃస్థితి లో ఆమె భయాన్ని చాలా తేలికగా ఎదుటి వారికి ఎక్కించే శక్తి ఉంది. ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తి లో భయనని నింపడం తేలిక ,ధైర్యవంతులను చేయడం కన్నా కూడా. 
అనుమానాలతో కాపురాలు కూల్చుకునే భార్యలు తమ భర్తల ప్రేమను నిజంగా తమ అనుభవం వల్ల తెలుసుకుంటే  తప్ప ఇటువంటి భయాలు అంతమవవు. ఎదుటి వారి భయాన్ని మనలో నింపుకోవడం కన్నా తేలికైనా పిరికితనపు సాధనం ఉండదు. పక్కవారి అనుభవం మనది కాదు ,వారు చెప్పేవి అన్నీ సత్యాలే అయ్యిఉండకపోవచ్చు ,ఆ విచక్షణ వినే వారిలో ఉండాల్సిందే . 
      *     *    *  

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ