ఓపెన్ సేల్ మార్కెట్
చదువరి-11
ఓపెన్ సేల్ మార్కెట్
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
కొన్ని కథలు మనల్ని కదిలిస్తాయి,ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. అలా కదిలించి ఆలోచింపజేసే మరాఠీ కథే కల్పన పాటిల్ 'ఓపెన్ మార్కెట్.' ఆమె వేశ్యా వృత్తిని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దానికి కారణాలు చెప్తున్నప్పుడు, ఆమెలో అంతర్లీన కోణాల ద్వారా నేటి సమాజధోరణి స్పష్టమవుతుంది.
సమాజంలోని అన్నీ బంధాల్ని గౌరవిస్తూ ఆమె కూడా ఎంతో పద్ధతిగా పెరిగింది. మధ్యతరగతి జీవితం ఆమెది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమె ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే ఆ డబ్బుతో ఆమె పెళ్ళి జరపొచ్చని ఆమె తల్లిదండ్రుల ఆలోచన. అలాగే ఆమె ఓ ఉద్యోగం సంపాదిస్తుంది.
ఆడపిల్ల ఉద్యోగంలో రోజూ ఎన్ని పాట్లు పడాలో అన్నీ అనుభవించింది ఆమె. ప్రతిరోజూ ఉదయం లోకల్ ట్రెయిన్ అందుకునే ఆత్రుతలో రైల్వే స్టేషన్ చేరుకునే లోపు ఎందరి భుజాలు రాసుకుంటాయో, ఎందరి చేతులు ఆమె అవయవాలను తాకుతాయో , ఒక్కోసారి విపరీతమైన రద్దీలో ఏ పోకిరి చేతులో ఛాతినో ,నడుమునో తడమడానికి సిద్ధమవుతాయి,అవన్నీ సహించింది.
ఆఫీసుకు చేరుకున్నాక అక్కడ బంట్రోతు నుంచి బాస్ దాకా అందరి చూపులు భరించాలి. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లిపోయేటప్పుడు అదే రద్దీలో అదే తతంగం పునరావృతం. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆఫీసులో పని చేసే క్లర్కులందరితోనూ టీ తాగే వంతు అయిపోయింది.ఇక బాస్ తన కేబిన్ లో కూర్చోపెట్టుకుని టీ తాగించడం,తర్వాత ఆమెను క్యాంపు పేరుతో తీసుకువెళ్ళి శారీరకంగా వాడుకోవడం ,తిరిగొచ్చాక మళ్ళీ మామూలే. లోకల్ ట్రెయిన్ కోసం ఉరుకులు,పరుగులు ,జనం తోపుడు.
కొన్నాళ్ళ తర్వాత ఆమెకు పెళ్లి అయ్యింది. అతను కూడా ఆమె ఉద్యోగం చూసి చేసుకున్నాడు.ఆ తర్వాత మళ్ళీ అదే ఉద్యోగం ,లోకల్ ట్రెయిన్ బ్రతుకు.
'కేవలం డబ్బు సంపాదించడానికే జీవించే పక్షంలో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది ? ఎలాగూ వస్తూ పోతూ ఉండగా ఎవరో ఒకరు నా శరీరాన్ని ఆకలి చూపులతో తడిమేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిఫలం ఏమయినా లభిస్తుందా నాకు? ఏమీ లేదు. ఎవడు పడితే వాడు ,ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ నన్ను చూపులతో చూసో , చేతులతో తాకో, తన మనోవాంఛ తీర్చుకుంటున్నాడు. అంటే ఉచితంగా వాడి ముచ్చట తీరుతుంది. నాకు మాత్రం మనోక్షోభ కలుగుతుంది. అందుకే నేనీ సమాజంలోని అన్ని అనుబంధాలను తెంచుకుని ఇక వేశ్యను కాబోతున్నాను. ఏనాడో కలుషితమయిపోయిన శరీరాన్ని ఓయత్తుకుని ,మరింత ఆత్మవంచన చేసుకుని బతికే బదులు భవబంధాలను తెంచుకుని స్వేచ్చగా, హాయిగా జీవించడమే మేలు.' అని అనుకుని ఆమె వేశ్యగా మారుతుంది.
సొంత ఫ్లాట్ తీసుకుంటుంది. భర్తను ,కుటుంబాన్ని వదిలేస్తుంది. ఎవరైతే ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడో ,ఆ బాస్ కు కాల్ చేసి డబ్బులు ఇచ్చి కోరిక తీర్చుకొమంటుంది ,దానితో అతను కంగు తింటాడు.
ఆమె నిర్ణయం పిచ్చిగా అనిపించినా, ఆ ఆక్రోశంలో అర్ధముందని మనమందరం ఒప్పుకోక తప్పదు. స్త్రీ స్పర్శ ను ఆస్వాదించాలని దొంగ చాటుగా అవకాశం తీసుకునే వారందరితో కలిసి ఏమి తెలియనట్లు రాజీ పడే బదులు దానినే వృత్తిగా చేసుకుంటే మనసులో పవిత్రత కోల్పోయామనే భావనే ఉండదు అని ఆమె ఆలోచన,డబ్బు కోసం జీవించే మనిషి ఎలా సంపాదిస్తే ఏమి ? అని ఆమె నిర్ణయంలో మనిషి నైతికతను, సమాజంలో కేవలం డబ్బును అనుసరించే సరళలులను ప్రశ్నిస్తుంది ఈ కథ.
* * *

Comments
Post a Comment