భర్త కోపం ఎక్కడ చూపించాలి?
చదువరి -12
భర్త కోపం ఎక్కడ చూపించాలి?
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
భార్యాభర్తల అనుబంధం గురచి ఎన్నో కామెంట్లు,వ్యంగ్యాలు మనం చూస్తూనే ఉంటాం. వారి మధ్య ఉండేది ప్రేమ,అనురాగాలా లేక భరించడాలా అన్నది ఎవరమూ కూడా చెప్పలేము.ఇల్లందుల సరస్వతీదేవి గారి కథ 'సైకాలజీ' ఓ భర్తగా ఉన్న సైకాలజీ ప్రొఫెసర్ గురించి చెప్తుంది.సోమసుందర్ సైకాలజీ ప్రొఫెసర్ . పెళ్ళయిన తరువాత అతనికి,భార్యకు మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇద్దరూ వేరే వేరే ఇళ్ళలోనే ఉంటున్నారు.దానితో మనసులో ఏర్పడిన వెలితి,అసంతృప్తి చిరాకు,కోపంగా మారాయి సోమసుందర్ లో.
దానితో విద్యార్థులతో అతని ప్రవర్తన కూడా మారిపోయింది.అంతకుముందు ఎంతో ప్రశాంతంగా,సౌమ్యుడిగా వ్యవహరించిన అతను హఠాత్తుగా విసుగు,కోపం పెంచుకున్నాడు.
సైకాలజీ ఆఖరి పరీక్షలు దగ్గర పడుతున్న సమయం అది.అప్పుడు ఓ నలుగురు సైకాలజీ విద్యార్థులు సోమసుందరం భార్య దగ్గరకు వస్తారు. సోమసుందరం గారి చేతుల్లోనే తమ భవిష్యత్తు ఉందని,విద్యార్థులు ఎంత బాగా రాసినా ఉపాధ్యాయులు సరిగ్గా దిద్దకపోతే వారి జీవితాలు నాశనమవుతాయని,తమ పేపర్లు దిద్దేది సోమసుందరమేనని,అందుకని ఓ నెల రోజులు ఆయనతో కలిసి ఉండమని అభ్యర్థిస్తారు.
తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా వారి అభ్యర్థన మేరకు అతని దగ్గరకు వెళుతుంది ఆమె.మొదట్లో ఆమె మీద చిరాకు ప్రదర్శించినా,ఆమె వచ్చాక ఇంట్లో వచ్చిన మార్పులు అతనిలో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.మొదటిరోజు ఆమెను వెళ్ళిపొమ్మన్న అతనే ఆమెను ప్రేమతో పలకరించి ఆమోదిస్తాడు.
తరువాత సైకాలజీ పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ క్లాసులో పాసైన మార్కులను ఫ్రేమ్ కట్టించి సోమసుందరం దంపతులకు పంపిస్తారు ఆ నలుగురు విద్యార్ధులు.
ఈ కథ చెప్పకుండానే ఎన్నో మానవ జీవితంలోని అంశాలను స్పృశిస్తుంది. ఇంటి వాతావరణం మనిషి వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అన్నది ఎవరు కాదనలేని సత్యం. ఓ సౌఖ్యవంతమైన లేదా మనసుకు ఆనందాన్ని కలిగించే వాతావరణానికి అలవాటు పడిన వ్యక్తి దానికి దూరమైతే అతనిలో కలిగే వెలితి అసంతృప్తి, చిరాకు ,కోపాలుగా మారి అతని మిగిలిన జీవితంలోకి కూడా విస్తరిస్తుంది.
మనిషి తన మీద తను అదుపు ఉంచుకోవాలి అనేది అందుకే పెద్దల మాట అయ్యింది. మనం కోరుకున్నట్టు జీవితం ఉండకపోవచ్చు, కానీ దాని ప్రభావాన్ని మనం సమాజం మీద ఏ మేరకు అందిస్తున్నాము అనేదే ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ. మన బాధలకు, కోపాలకు ఇంకొకరు బలి అయితే దానికి బాధ్యులము మనమే అవుతాము.
ఈ కథలో సైకాలజీ విద్యార్ధులైన ఆ నలుగురు నిజ జీవితంలో తమ ఉపాధ్యాయుడి సైకాలజీని అర్థం చేసుకున్నారు. సైకాలజీ ఉద్దేశ్యమే మనిషి సంస్యకు మూలాలు కనుగొని, పరిష్కారం చూపడం. అలా తమ మాష్టారి సంస్యకు మూలాలు కనుగొని తాము బాధితులు కాకుండా చూసుకుని విద్యార్ధులు మాష్టారి వల్ల బలి కాకుండా కాపాడారు. జీవితంలో సైకాలజీ ప్రయోగించలాన్తే భావోద్వేగాలను అర్థం చేసుకోగలగాలి, వైఫల్య భయం లేకుండా ఆచరించగలగాలి.
* * *

Comments
Post a Comment