ఎందుకు చచ్చిపోవాలి ?

   చదువరి -13                                 

ఎందుకు చచ్చిపోవాలి ?

                                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          మనిషి జీవితం మనకు తెలిసినంతవరకు మరణిస్తే  అంతమైనట్టే అని భావిస్తాం. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే, అయ్యో! బాధలు మనకు మాత్రం లేవా? అంత మాత్రం దానికే ప్రాణాలు తీసుకోవాలా?’ అని కొన్నిసార్లు వ్యాఖ్యానిస్తాం కూడా. అన్నీ ఆత్మహత్యలు మనకు ఆవేశంలో లేదా పిరికితనంతో చేసుకున్నట్టే అనిపిస్తాయి. కానీ కొన్ని ఆత్మహత్యలు జీవన సత్యాలను కూడా ఆవిష్కరిస్తాయి. అటువంటి ఓ వ్యక్తి ఆత్మహత్య కల్పనను కథాంశంగా తీసుకుని, దాని ద్వారా జీవితంలో మనలో అంతర్లీనంగా ఉండే అహాలు ,ఇగో సంతృప్తి పరచుకోవడాలు, మనకు తెలిసిందే నిజం అనే భ్రమ పొరను తొలగించుకోలేని అశక్తతలు ఇలా మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేసే రచనే రచయిత్రి ఆత్మహత్య. ప్రముఖ రచయిత్రి, గుర్తింపుకు ఆమడ దూరంలో ఉంటూ సింపుల్ గా ఉంటూనే ,’ఈవిడలో ఇంత ఆలోచనా శక్తా ?’ అని అబ్బురపరిచే జలంధర గారు దీనిని రచించారు. చదువుతున్నప్పుడు,చదివాక కూడా మనలో ఈ నవలలో ఉన్న ప్రశ్నలు అన్నీ మనల్ని ప్రశ్నించినట్టు ఉండటం ఈ నవల అసలైన ఆకర్షణ.

          ఉమ మంచి రచయిత్రి, భావుకురాలు,జ్ఞాన పిపాసి. మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టింది. ఓ అరబ్బు ధనవంతుడితో ఆమెకు పెళ్ళి అయ్యింది.అతను ఆమెను ముంబై మార్గంలో కలుసుకుంటే అక్కడి నుండి ఇద్దరు అతని దేశానికి వెళ్ళే ప్రణాళిక ఉంది. కానీ ముంబై చేరక ముందే ఆమె ట్రెయిన్ లో శవంలా మారింది. ఆమె స్లీపింగ్ పిల్స్ తీసుకుని మరణించినా సరే తమకు చెడ్డ పేరు రాకూడదని ఏదో గుండె జబ్బుతో పోయినట్టు రిపోర్ట్ రాయించాడు తండ్రి.

          ఇక్కడ ఉమ మరణం చుట్టూ ఉండే మనస్తత్వాలను ఎంతో చక్కగా పాఠకులకు పరిచయం చేశారు రచయిత్రి. రచనలో పాత్రలను వివిధ రకాలుగా పాఠకులకు పరిచయం చెయ్యవచ్చు. అందులో ఆ పాత్రల మనస్తత్వంలో ఉన్న ముఖ్య లక్షణాల ద్వారా ఆ పాత్రను పరిచయం చేస్తే పాఠకులకు ఆ రచన కథగా మాత్రమే కాకుండా ఆ రచయిత చెప్పదలచుకున్న అంశం కూడా జ్ఞప్తిలో ఉండిపోతుంది. అటువంటే ప్రక్రియే జలంధర గారు రచయిత్రి ఆత్మహత్యలో కూడా ఉంది. ఉమ కుటుంబం,మీడియా,ఉమ సాహిత్య సన్నిహితులు అనే మూడు భాగాల ద్వారా ఉమ ఆత్మహత్య చూపిన ప్రభావం, ఎలా ఆలోచనా పరిధుల్ని విస్తృతం చేసింది? వంటి అంతర్లీన సూత్రాలను చెప్పిచెప్పకుండానే  ఈ రచనా స్పష్టం చేస్తుంది. ఉమ మరణం తర్వాత ఆమె సాహితీ మిత్రుల్లో తమ్ముడిగా భావించే విరించికి ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం ద్వారా,ఆమె సాహితీ మిత్రుల ద్వారా ఆమెను ఆమె మామయ్య శంకరం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

          ఉమ మంచి భావుకురాలు,ఆమె ఆలోచనల్లో ఏదో తెలుసుకోవాలి అనే తపన, తనదైన ప్రత్యేకతను కాపాడుకోవాలనే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆమె తల్లిదండ్రులు డబ్బు చుట్టూ తిరిగే మనుషులు.వారికి ఉమ,రమ ఇద్దరు కూతుళ్ళు. ఉమ పెళ్ళి కూడా వారి స్టేటస్ కు తగ్గట్టు చెయ్యాలనే తాపత్రయంతోనే ఆమెకు పెళ్ళి కుదిర్చారు. కానీ ఆమె పెళ్ళి చేసుకున్న వ్యక్తికి సాహిత్య స్పర్శ లేదు, సున్నిత మనస్సు లేదు. అదో రకమైన మొరటుతనం స్త్రీ పట్ల అతని ప్రవృత్తిలోనే ఉంది. అతను ఉండే దేశంలో స్త్రీ పరదా చాటున ఉంటూ,పురుషుల కోసం భోగ వస్తువుగా భావించబడే దేశ సంస్కృతిలో అతనితో జీవితం ఎలా ఉంటుందో గ్రహించగలిగిన ఉమ ఆ జీవితం బతకలేక ఆత్మహత్య చేసుకుందని ఆ ఉత్తరం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ  ఉత్తరాన్ని విరించి శంకరానికి ఇస్తాడు.అది చదవమని బయటకు వెళ్తాడు అతను.

          డియర విరించీ!

ఈ ఉత్తరం  నీకు చేరేటప్పటికి ఉమ ఈ లోకంలో ఉండదు.

          స్వప్న ప్రపంచాల  సౌగంధికాస్వాదనంలో ఉంటుంది. కలగా మిగిలిపోయిన నా అనుభూతుల్ని  తిరగబడిన దేవతల్లా  నా ప్రాణాల్ని  దిగంతాల వైపుకు తరుముతున్నాయి.

          అసలు మృత్యువు  అంటే ఏమిటి విరించీ! నీ జీవితం, అనుభవమూ కూడా చాలా చిన్నది. ఈ ప్రశ్నకు  జవాబు చెప్పలేదు. జీవి ఈ దేహాన్ని  వదిలి, అదృష్టవంతులైతే అమృతత్వంలోకి వెళ్ళిపోవడమే కదూ! మరి చావు ఏమిటంటావు? ఎందుకు ఏడుపు? ఈ చేదునిజాలు, బాధానుభవాలు ఈ కట్టెవి; స్వప్నసౌందర్యాలు, నిర్హేతుక జాయమాన మాధుర్యాలు ఆత్మవే అయితే, ఈ పీడకల లాంటి శరీరాన్ని వదిలి నేను తప్పు  చేస్తున్నానంటావా? నాకు తెలుసు నువ్వు ఏడుస్తావు.. కానీ అర్థం  చేసుకోడానికి ప్రయత్నించు.

          బతకలేక వెళ్ళిపోతున్నాను. విసుగే మృత్యువైతే  నాకు ఇరవై ఐదేళ్ళకే విసుగు వచ్చేసింది తమ్ముడూ. చాలు జీవితం అనిపించింది. ఇది నైరాశ్య౦

 విజృంభించి నరనరాలా పాకి, ఏ బలహీన క్షణాన్నో నా ప్రాణాన్ని లాక్కుపోతున్న  అపస్మారక క దశ కాదు. ఆలోచించి ఆలోచించి రాజీపడలేక, మిథ్యాప్రపంచికత కోసరం ఆత్మను తాకట్టు పెట్టుకుని జీవచ్చవంలా బతకలేక వెళ్ళిపోతున్నాను.

          నువ్వు, నేను, రాఘవ.... మరి కొందరు... మనలా ప్రపంచాన్ని  ఎదగలేని ఎత్తుల్లోకి హృదయాన్ని  సంధించి ఆత్మావలోకనం చెయ్యగలిగిన వ్యక్తితో  మనకొక సంబంధం ఏర్పడుతుంది. ఒక వేవ లెంగ్త్ లో ఆలోచించే ప్రతి వ్యక్తి మనకు ఆత్మబంధువే.  . ఈ స్నేహంలో నైత్యం, కోరిక, పతనం, పసితనం ఉండవు తమ్ముడూ ... అనుభవమే ఉంటుంది. తద్వారా ఆనందముంటుంది. ఇది నా అనుభవమే కాదు - చాలామంది భావం కూడా.

          నీకు తెలుసు 'రాఘవ' నాకే సొంతం కాలేడని... కాడని. హృదయం సంధించి విడిచిన బాణం గమ్యం చేరాలని రూలు లేదు  తమ్ముడూ. ఒకొక్కక్కరి లక్ష్యం తప్పుతుంది. అతను చెప్పకపోయినా అతని బాధానురాగాలకు ఆరాధ్య దేవతను నేనని, అతని సౌందర్యాస్వప్నాల  రంగవల్లులలో అధిష్టించిన  అనురాగ దీపాన్ని  నేనని అతని అక్షరాల్లో,  అలంకారాల్లో , ఆవేదనలో అతను నాకు చెబుతూనే ఉన్నాడు.

          కానీ అతన్ని  పోగొట్టుకున్న దుఃఖంతో చచ్చిపోతున్నాననుకోకు. అంత అమాయుకురాల్ని కాను. అతన్ని ఏనాడు పొందానని? అతని చేరువలో లేనని వెళ్లిపోతున్నాననుకోకు - ఏనాడు దూరమయ్యానని?

          ఈ చేరువులు, దూరాలు, పొందడాలు, పోగొట్టుకోవడాలు – అన్నీ  ఒక పరిధి దాకనే. ఆ తరవాత అంతా శూన్యం. అందులో తేజస్సు... అది అణువణువు పునీతం చేస్తుంది తమ్ముడూ! కవిత్వాలకు, ఆనందాలకు, దుఃఖాలకు, విభిన్నత్వాలకు, సౌందర్యాలకు ,స్వప్నాలకు  అది పతాకానుభవం.

          'ఎపుడో కల్పాంతాల క్రితం  విడిపోయాం. అయినా క్షణం కూడా దూరంగా లేము. నిత్యం పరస్పరం ఎదురవుతూనే ఉన్నా  ఏనాడూ కలువనేలేదు’ అనే సూక్తి  ఎంత నిజం. అంతలో ఎంత ఊహ?

          కానీ ఈ రాఘవ, ఈ ఉమకు  వీటన్నింటికన్నా అతీతమైన జగత్తు. ఈ నామ రూపాలు పరిధులు విధించలేని పునీతమైనది ఉన్నది తమ్ముడూ. అది తెలిస్తే ఈ లోకం, ఈ స్వార్థం , ఈ కచ్చ, ఈ కోపం, సంకెళ్ళు , శిక్షలు చాలా అర్థం  లేనివిగా ఉంటాయి.

          రాఘవ వ్యక్తిగా  నాకు మామూలు మనిషే కానీ అతని ఊహ, కవిత్వం, ఆరాధన ఇవే నాలో రాగరాగిణత్వాన్ని నిద్ర లేపాయి.

          'చీకటి చిరుదారుల్లో , చుక్కల  దీవుల్లో దిక్కు తోచని   పయనంలో చిక్కుకున్న చిన్నారి  మనసుకు అనుభవాల సంకెళ్ళు  వేసి వాస్తవంలోకి  లాగనా? అనుభూతుల ఆర్ధ్ర   పవనాలతో అవతలి ఒడ్డుకు  పంపనా? ప్రపంచం నన్ను  రమ్మంటోంది చెలీ, నీ ఊహ నన్ను  పొమ్మంటోంది' అని కాప్షన్  రాసి అతను పంపిన బర్త్ డే కార్డు గుర్తుంది  నాకు. నా మదిలో, హరిచందనాల పెట్టెలో ,కర్పూర మాలలతో, పొగడ పూవుల జాడలతో దాచుకున్నాను  తమ్ముడూ. అది నా జ్ఞాపకాల పేటిక.

          అక్షరాలు, కాగితాలు - అవి మనుషులకు దొరికితే మాలిన్యాలు  అంటగడతారు. అందుకే నా హృదయాంతరాళాల్లో కర్పూర సుమాల మధ్య దాచుకున్నాను.

          కాబట్టి అతను వద్దు  నాకు. అతని ఆత్మావలోకనంలో ఎప్పుడూ  నే ఉంటాను.

          రాఘవలా లౌకిక ప్రపంచపు  పరిధుల్లో  మామూలుగా బతకడానికి నాకభ్యంతరం లేదు. ఒప్పుకున్నాను. ఆత్మకు, ఊహకు అందమైన అనుభూతి చాలు. కానీ శరీరానికి కాదే?

          ఏదో కొంత ఇవ్వగలిగితే కానీ రవ్వంత పొందలేని లౌకిక ప్రపంచం ఇది. కానీ, నా కాలి పారాణి ఆరలేదింకా. 'నాకు ఈ ఆచారాలు, ఈ అలంకారాలు అంటే అసహ్యం' అన్నారు  నా భర్త. అవును మరి. అతనుండేది నాగరికతల ఒయాసిస్సులో, అక్కడ  గంగావతరణమేమిటి?

          'కవిత్వమంటే అసహ్యం నాకు. వేదాంతమంటే మంట. జీవితాన్ని  అనుభవించకుండా ముడుపుకట్టే  ఈ ట్రెడిషన్స్  మారాలి' అంటూ విసిరి పుచ్చుకుని  నా చేతిలోనుంచి రవీంద్రుడి కవిత్వాన్ని విసిరేశారు. చిరిగిపోయిన కాగితాలను, విరిగిపోయిన ఆలోచనలను దాచుకున్నాను.

          సౌకుమార్యం, సౌందర్యం,భావుకత ఇవన్నీ  ఆడపిల్లల్లో  ఎంత ఉండాలో అంతే ఉండాలేమో? నా కన్నె జీవితపు మొదటి రాత్రి. భౌతిక శరీరమనే వీణను శృతి చేయించకుండానే రుద్రవీణగా  చేసి వాయించారు నా భర్త. బాధ చెప్పుకోగూడదు  తమ్ముడూ! ఇది సంసారం.

          ఆ నాలుగురోజుల్లో  నాకు నానా రకాల బహుమతులు కురిపించారు. నేనిస్తున్న  దేనికో అవి పణంగా కనిపించాయేమో కానీ 'నావి'అనిపించలేదు.

          అతడు ఉండే చోటున ఆడది పరదాల్లో  ఉంటుంది. మొగవాడి భోగవస్తువు. తనువు తప్ప ఆత్మే ఉండకూడని ఆ నిశ్శబ్ద ప్రపంచంలో, నిరూహతో, నిస్తేజంతో, నిద్రబుచ్చుతున్న  మనసు నిద్రలేస్తుందేమోనన్న భయంతో అతనింటికి అలంకారంగా, అతని సుఖానికి శయ్యగా, అతని అలంకారానికి హరిచందనగా, అతను అనుభవాల గదిలో అగరు వత్తిగా బతకాలట తమ్ముడూ. అర్థమైంది జీవితం నాకు.

          అతను కొన్న  చీరలను, పెట్టిన  నగలను, అతని కళ్ళల్లో  మాదకతను 'ప్రేమ'గా అర్థం చేసుకున్న ఈ మనుషులకు నా పరిస్థితి  అర్థం కాదు. దీనికి తోడు అతని పొసెసివ్ నెస్  ఒకటి. అది ఆరాధనతో కూడినదైతే అద్భుతంగా  ఉంటుందేమో కానీ, అధికారంతో వచ్చింది . నా అస్థిత్వం  మీద అతనికి అపనమ్మకం. నామీద మరొకరి నీడను కూడా భరించలేడతను. అతను వినే సంగీతంలో మృగత్వం, అతని మనసులో అనుభవాల కోసం పరితపించే కాళ నాట్యం, అతని శారీరక అనుభవాలు, అతని గరల్ ఫ్రెండ్స్ – అవన్నీ  వింటున్న కొద్దీ నా శరీరం వణికింది తమ్ముడూ. మనస్సు  కరిగి, చుక్కలు చుక్కలుగా కంటినించి  వచ్చే  నీరు కన్నీరు  తమ్ముడూ. మనసే కరిగితే దాని పేరేమిటి?

          అతనితో జీవితం పంచుకోవడమే వరం అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ దానికి 'ఉమ' అక్కర్లేదు.

          అతని ఊహల్లో తప్పు లేదు .  మా ఇద్దరి   కలయికలోనే  ఉంది తప్పంతా. సుస్వరమైన   రాగంలో  కూడని  అక్షరం కలిస్తే అపస్వరమౌతుంది. మహామంత్రానికి  చేరకూడని బీజాక్షరం కలిస్తే భయంకరమౌతుంది. అందుకే తప్పుకుంటున్నాను తమ్ముడూ. అతణ్ణి ద్వేషించలేను. అందుకే దూరమౌతున్నాను.

అమ్మా నాన్నా ఈ నా నిష్క్రమణను తట్టుకోలేరు. వారికి కూతురుగా తప్ప, 'ఉమ'గా ఏనాడూ నేను తెలియను. అతని దగ్గర  ఉండగా ఈ నా మృత్యువు సంభవిస్తే నింద అతని మీద పడుతుందేమో?

          అతనున్న  అరబ్బు  దేశానికి తీసుకుపోవడానికి మార్గ మధ్యంలో కలుసుకుంటానన్నారు  నా భర్త. అందుకే కదులుతున్న ప్రకృతి అశాశ్వతమనుకుంటూ, నాతోపాటు వచ్చే  చంద్రుడికి నా నిర్వేదం చెప్పుకుంటూ ఈ అలౌకిక ప్రపంచం  నుంచీ శలవు తీసుకుంటున్నాను.

          నా ఈ మృత్యువుకు  కారణాలు వెతుకుతుంది ప్రపంచం. ఏమర్థం  చేసుకుంటుంది? వీరందరిలో  నువ్వు  పడే తపన నాకు తెలుసు. రాఘవలా కన్నీళ్ళు  దాచుకుని కలంతో వర్షించడం  చేతకాదు నీకు. నీ పట్ల  నాకుండే ఇష్టం  నాచేత ఈ ఉత్తరం రాయిస్తోంది. జీవి 84 లక్షల జన్మలు ఎత్తాలట ముక్తి పొందడానికి. ఈ నా గమ్యానికి  నేనెంత దూరంలో ఉన్నానో  తెలియదు నాకు.

          చచ్చిపోయేముందు స్నేహితురాలు  'ఉమ'గా ఒక్కటి కోరుకుంటున్నాను విరించీ.

          నేను చదివిన కవిత్వం, వేదాంతం ఈ మిధ్యా ప్రపంచపు వాదాల్ని  దాటి చీకటి చిట్టడవుల్లో నీరెండను వెతుక్కునేటట్లు  చేసింది. ఈ జన్మకు  నేను నేర్చుకున్న  జీవన సారాంశం ఇదే.

          ఏ పని వెనకాలైనా దేముడో, కాస్మిక్ ఎనర్జీయో, మరొకటో ఏదో తెలియని స్పూర్తి ఒకటే 'థాట్!' సర్వ  భౌతిక ప్రపంచపు సృష్టికి కారణం  మన ఆలోచన. కన్ను మూస్తే మరుగయ్యే ఈ ప్రపంచం, కన్ను తెరిస్తే రూపు కట్టుకునేది  కేవలం  '  థాట్ పవర్’  తోనే.  దానికి రకరకాల ద్వేషాలు, అనురాగాల బట్టలు కట్టి,స్వరూపాన్నిచ్చి ,ప్రపంచాన్ని  , మన కోణంలోనించి ఆలోచించి అనుభూతుల్ని  అలికి స్వరూపమే మార్చడం కంటే దేన్ని దానిగా చూడటం, నెగిటివ్  థింకింగ్ తో 'థాట్ 'ను మలినపరచకుండా ఉండటం జరిగితే ప్రపంచం  ఇంత ఇరుకుగా కనిపించదేమో?  మన  స్వార్ధం,  అసూయ,  క్రౌర్యం,  మన  థాట్ ను  అపవిత్రం  చెయ్యగానే  తద్వారా   మాటా, చేతా  కూడా  మరింత  మలినమై పోతున్నాయి. దయచేసి ఈ అద్భుత  అవలోక నా జ్ఞానాన్ని  మరూగుపరచకండి. చేసే ప్రతి  పని వెనకాలా ఈ జ్ఞానం వర్ధిల్లి మాటతో జతగూడితే ఇప్పుడున్న  మామూలు మానవత్వపు  వైతరిణి దాటి సుస్నాతకతతో అవతలి ఒడ్డుకు  చేరుకోగలమనిపిస్తుంది.

          రాఘవతో చెప్పు  విరించీ ఉమ నీ అవలోకిక జ్ఞాన  ఊహాసింహాసనంలో రాణిలా దర్శనమిస్తుందని, అతని కర్తవ్యం  వెనకాల నిజాయితీ నీడలో ఉంటుందని.

          ప్రపంచపు  అజ్ఞానపు  చిరునీడల వెనకాల నిలిచే నిశ్శబ్దపు తేజస్సు జ్ఞానావలోకమే తమ్ముడూ.

          నా  బతుకొక  చెదిరిపోయిన  ముత్యాలదండ  తమ్ముడూ.  అన్నీ   మంచివికావేమో?  ఏరుకున్న    కొద్దివాటిలోనో  జీవన సత్యాలు ప్రతిఫలించవా? 

కనబడని మౌక్తికాలను కలల ప్రపంచాన్నించీ ఏరి మీకు కానుకగా ఇచ్చి వెళ్ళిపోతున్నా. 

                                                                                                          మీ ఉమ.

          ఈ ఉత్తరం పాఠకులలో ఎవరి మనఃస్థితిని బట్టి వారి వలయాన్ని ఆకర్షిస్తుంది. విరించి ఎందుకు ఉమ పట్ల గౌరవం పెంచుకున్నాడు అనే విషయానికి పునాదిగా అతని జీవితం గురించి చెప్పినప్పుడు తెలుస్తుంది. విరించి తల్లి దుర్గమ్మ గయ్యాళి. ముగ్గురు కొడుకులు ,ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కొడుకు భార్య సుభద్ర. రెండో కొడుకు రఘు. అతను అత్త దగ్గర పెరుగుతాడు. ఆమె మరణించాక ఇంటికి వస్తాడు. కానీ తల్లిని ఎదిరించే ధైర్యం ఉన్నవాడు. చిన్న వాడు విరించి. సుభద్ర పట్ల ఆకర్షణ పెంచుకున్న రఘు డానిని పరోక్షంగా చూపిస్తూ ఉంటాడు. చేయని తప్పుకు సుభద్రను అందరూ దోషిగా చూస్తారు. రఘు చక్కగా వేరే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.సుభద్ర మనసులో విరక్తి కలుగుతుంది కానీ ఆప్యాయత మాత్రం మిగిలిపోతుంది. సుభద్రను తల్లిలా భావిస్తాడు విరించి. ఆమె స్వభావంలోని సున్నితత్వమే ఉమలో అతనికి కనిపించడంతో ఆమె మీద అభిమానం పెంచుకుంటాడు. ఆమె మరణంతో రాఘవలో సినిసిజం మరణిస్తుంది. ఆమె కుటుంబంలో మాత్రం ఏ మార్పు రాదు.ఆస్తి కోసం అదే అబ్బాయికి రమను ఇచ్చి పెళ్ళి చేయడానికి నిర్ణయిస్తారు.ఆమె కూడా సంతోశంగా ఒప్పుకుంటుంది. రామేశం గారి ద్వారా తాత్విక లోకాన్ని పాఠకులకు పరిచయం చేశారు రచయిత్రి.

          ఓ కళాత్మక హృదయం కల రచయిత్రి ప్రాపంచిక సౌఖ్యల కోసం పరితపించే భవిష్యత్తులో బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంది.

          ఈ నవలలో కథాంశంతో పాటు మనల్ని వెంటాడే ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి ఎవరికి వారు చదివి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ రచనను ఫిలాసఫికల్ ఫిక్షన్ అని చెప్పవచ్చు. జలంధర గారి రచనలు పాఠకులను మోటివేట్ చేసేలా ఉంటాయి. జలంధర గారి పున్నాగపూలు కూడా చదివినకొద్ది చదవాలనిపించే రచన. చదవడంతో పాటు  మెదడును చర్చల్లో పెట్టాలనుకుంటే ఈ రచన తప్పక చదవాల్సిందే .

  *   *  * 


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ