కళాకారుల అల్లకల్లోల అంతరంగాలు

చదువరి -2: 

కళాకారుల అల్లకల్లోల అంతరంగాలు
(అడవి బాపిరాజు గారి జాజిమల్లి సమీక్ష)  
         -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)




పెద్ద జాజిపువ్వును మద్రాసులో  జాజిమల్లి అంటారు.మల్లెపూవు సౌందర్యం,జాజి సుకుమారత్వం కలిసిన పువ్వే జాజిమల్లి.
   పద్మావతి,బుచ్చి వెంకట్రావులు భార్యాభర్తలు.వారికి ఓ పాప,బాబు. పద్మావతి ఓ గాయని. ఆమె తన జీవితాన్ని గుర్తు చేసుకోవడంతో కథ మొదలవుతుంది.పద్మావతి(పద్దాలు)కి పూలంటే  చాలా ఇష్టం. దగ్గరలో ఉన్న నాగమల్లిపూలు ఏరుకొని జడలకు కట్టుకునేది.పద్మావతి,బుచ్చి వల్లీలకు చెందినవారు.గ్రామం కావలికి 4 మైళ్ళ దూరంలో ఉంది.పడవలు కట్టుకొని చేపలు పట్టడం,అమ్ముకోవడం వారి వృత్తి.ఆమెకు 12 ఏళ్ళ వయసప్పుడు 16 ఏళ్ళ వయసున్న బుచ్చి వెంకూ(బుచ్చి వెంకట్రావు అసలు పేరు)తో   సంబంధం నిర్ణయిస్తారు.కానీ అదే సమయంలో అతను చేపలు పట్టడానికి వెళ్ళి నాలుగురోజుల వరకు తిరిగిరాడు.అతను తిరిగి వచ్చాక ఇద్దరికి వివాహం జరుగుతుంది.
    తర్వాత జపాన్ యుద్ధం రావడంతో బుచ్చి ఆ యుద్ధంలో చేరతాడు.ఆ క్రమంలో దేశాలన్నీ తిరుగుతాడు. ఎన్నో ప్రదేశాలకు తిరిగిన అతనికి ఆ పల్లెటూరు నచ్చదు.కావలికి భార్యతో మారతాడు.విద్య మీద ఆసక్తి కలిగి తను,తన భార్య చదువుకోవటానికి నరసింహం మాష్టారిని పెట్టుకుంటాడు.భార్య పేరును పద్దాలు నుండి పద్మావతిగా మారుస్తాడు.ఆమెలోని గాన ఆసక్తిని గమనించిన నరసింహం మాష్టారు ఆమెకు సంగీతం నేర్పించమని సలహా ఇస్తాడు.
ఏదైనా నేర్చుకునేటప్పుడు  పద్మావతి  సులువుగా గ్రహించి మళ్ళీ మర్చిపోయేది. వెంకట్రావు ఆలస్యంగా గ్రహించినా మర్చిపోయేవాడు కాదు.అలా ఆ భర్త ఆమెకు రెండో ఉపాధ్యాయుడు అవుతాడు.సంగీతం సభలకు తనను తీసుకువెళ్ళమని భార్య కోరడంతో,మద్రాసు సభలకు తీసుకువెళ్ళేవాడు ఆ భర్త.తను కూడా గొప్ప గాయకురాలు కావాలంటే గొప్ప పట్టణంలో గొప్ప వారి వద్ద సంగీతం నేర్చుకోవాలని అనుకుంటుంది పద్మావతి.భార్య మనసు తెలుసుకున్న ఆ భర్త తన వ్యాపారాన్ని  మద్రాసుకు మారుస్తాడు.
సంగీతం మాష్టారు నరసింహమూర్తి మకామును కూడా తమతోపాటే మద్రాసుకు మారుస్తారు.సంగీతం బాగా రావాలంటే చదువు కూడా రావాలని సంగీతం మాష్టారు సూచించడంతో  భర్త అనుమతి పొంది,ఆంధ్ర మహిళా సభలో చేరుతుంది.అలా చదువుకుంటున్న సమయంలో  కొత్తగా వచ్చిన పట్టణపు వాతావరణంలో ఆమె మనఃస్థితిలో  కూడా మార్పు వస్తుంది. భర్తతో కలసి ఉండటం పట్ల కూడా నిరాసక్తత  చూపించి,ఆ కళాశాల హాస్టల్ లో ఉంటుంది.
భార్య నిర్లిప్తతకు కారణం తెలియని వెంకట్రావు కూడా అలానే ముభావంగా ఉండిపోతాడు.సంగీతం మాష్టారు పూర్వపు శిష్యుడు అయిన  రాధాకృష్ణ ఆయన్ని కలుస్తాడు.రాధాకృష్ణ ఓ సంగీత దర్శకుడు,అతని భార్య సుశీల నాట్యకత్తె.సంగీతం మాష్టారు ద్వారా వెంకట్రావుకు రాధాకృష్ణ స్నేహితుడౌతాడు.
రాధాకృష్ణ భార్య సుశీల వెంకట్రావుతో చనువుగా ఉంటుంది.రాధాకృష్ణ,సుశీలల ద్వారా ఎన్నో సంగీత కచేరీలు ఇచ్చి ప్రసిద్ధి పొందుతుంది పద్మావతి.సంగీతంపై  ఎక్కువ శ్రద్ధ చూపడంతో  చదువులో వెనుకబడుతుంది పద్మావతి.తన మాటకు గౌరవం తగ్గడం,భార్యాభర్తలు విడిగా ఉండటం,సుశీలతో వెంకట్రావు చనువుగా ఉండటం నచ్చకపోవడంతో నరసింహామూర్తి మాష్టారు  ఓ ఉత్తరం రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.
ఈ వార్త తెలుసుకుని మనస్తాపం పొందిన పద్మావతి మనశ్శాంతి కోసం  కళాశాలలో అనుమతి తీసుకుని తనకు సన్నిహితురాలైన ఓ ఉపాధ్యాయురాలితో కలిసి దక్షిణాదిన ఉన్న శిల్పాక్షేత్రాలను చూడటానికి వెళ్తుంది.అదే సమయంలో అక్కడ ఉన్న నరసింహాం మాష్టారుని అనుకోకుండా కలిసి,తిరిగి ఇద్దరూ యాత్ర పూర్తయ్యాక మద్రాసుకు తిరిగివస్తారు.ఈలోపు రాధాకృష్ణ తన భార్య సుశీల వెంకట్రావుతో చనువుగా ఉండటం చూసి వారిద్దరికీ ఇష్టమైతే సుశీలకు తాను విడాకులిచ్చి  తప్పుకుంటానని అంటాడు.దానితో తప్పు తెలుసుకున్న వెంకట్రావు మారతాడు. సినిమా తీయాలనే ఆలోచన ఉన్న వెంకట్రావు సుశీల,రామకృష్ణులతో కలసి ఆఫీస్ ,స్టూడియో తీసుకుంటాడు. పద్మావతి మద్రాసుకు తిరిగి వచ్చేటప్పటికీ ఈ విషయాలు తెలియడంతో విరక్తి కలిగి కాశీకి బయల్దేరుతుంది.
      కానీ  మధ్యలో ఎక్కడో మనసులో వెంకట్రావు మీద దాగి ఉన్న ప్రేమ వల్ల అతన్ని విడిచి ఉండలేక అతన్ని ఢిల్లీలో కలవమని టెలిగ్రామ్ ఇస్తుంది.వారిద్దరూ కలుస్తారు.వారిద్దరి జీవితాన్నే సినిమాగా మలుస్తారు.గొప్ప గాయనిగా ప్రసిద్ది పొందిన పద్మావతికి గీతాదేవి బిరుదు వస్తుంది.అలా ఆ జీవితాన్ని గుర్తు చేసుకోవడం సమాప్తం అవడంతో నవల కూడా ముగుస్తుంది.
ఎన్నో  అందాలు ఎందరి జీవితాలలోనే ప్రత్యక్షం కాకుండానే,భావమాత్రంగానైనా దర్శనం ఇవ్వకుండానే ఈ జగత్తు నడిచిపోతూ ఉంటుంది.కానీ ప్రాథమికమైన సౌందర్య భావం మానవులందరి జీవితంలోనూ వికసించి ఉండనే ఉంటుంది.జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోలేని కర్కశవాదులు రెండు చేతులా ఆ కాస్త అందాన్ని కూలద్రోసుకుని ధూళి నిండిన దారులలో యాత్ర కొనసాగిస్తారు అంటారు అడవిబాపిరాజుగారు నవలలో ఓ చోట.ఈ  మూడు  వాక్యాల్లోనే  తన  రచనా  దృష్టిని  స్పష్టం  చేశారు  బాపిరాజుగారు. 
కళాకారుల అంతరంగాల్లో  హఠాత్తుగా సంభవించే మార్పులు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి.జాజిమల్లిని ఈ నవలలో బాపిరాజుగారు కళ,ఆనందం,స్త్రీతో స్వరూప స్వభావంలో  నవలా ప్రవృత్తిని నిర్మించారు.పల్లె-పట్టణ వాతావరణ మార్పు,భార్యాభర్తల సంబంధాల్లో,కళాకారుల ప్రవృత్తిలో మారుతూ ఉండే ప్రపంచాన్ని ఎంతో చక్కగా భాషా సొగసుతో,భావ స్పూర్తితో రచన రక్తి కట్టేలా నవలను రచించారు బాపిరాజుగారు.
భార్యాభర్తల అనుబంధంలో  ముఖ్యంగా  ఉండే  అడ్డు గోడ  అవతలి వారే  తమను అర్ధం చేసుకోవాలనే  పట్టుదల కలిగి ఉండటం. ఈ జాజిమల్లిలో కూడా  పద్మావతి, వెంకట్రావులు కూడా  ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో  ప్రేమించుకుంటున్నప్పటికీ కూడా  ఆ అభిజాత్యానికి పోయే అనుబంధంలో  తెరకు  కారణమయ్యారు. స్వభావరీత్యా  పద్మావతి కళాకారిణి, వెంకట్రావు  కళారాధకుడు  అయినప్పటికీ కూడా కళా లోకంలో  ప్రజ్వరిల్లే  ఎన్నో అశాంతులు ఉత్ప్పన్నం  అవ్వడంతో వారి మధ్య సఖ్యత కొన్నాళ్ళు బీటలు వారింది. అయినా  అంతర్లీనంగా, మనస్తత్వ రీత్యా మనసుల్లో ఉండే ప్రేమకు ఇవేమీ ఆటంకం కాదు అని ఆ తెరను  సున్నితంగా  ఎవరి గౌరవానికి  ఆపద రాకుండా  తొలగించిన  తీరు  బాపిరాజు గారి రచనా  పుష్టికి  నిదర్శనం.
స్వతహాగా బహుముఖప్రజ్ఞాశాలి అయిన అడవిబాపిరాజుజారు మంచి కవి కూడా అవ్వటం వల్ల జాజిమల్లి లో అంతర్లీన తత్వంతో కూడా కవిత్వ శైలి కూడా కనిపిస్తుంది.కేవలం కథ కోసం మాత్రమే చదవాల్సిన  నవల కాదు జాజిమల్లి. భాషా సంపన్నత, భావోద్వేగ సమన్వయం,కళా దృష్టి పోషణ,అంతః సౌందర్య శీలత్వం వంటి ఎన్నో సాహిత్యానుభూతులను అందించే  ఓ మంచి స్మృతి కూడా.నాటి తరం పాఠకుల నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరూ చదవాల్సిన మస్తకభూషణమే ఈ జాజిమల్లి.
    *        *       *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ