బుర్ఖా వెనుక .....

చదువరి- 14 
బుర్ఖా వెనుక .....
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
 

మంచి సాహిత్యం ఏ దేశానిది అయినా సరే పాఠకులను కదిలిస్తుంది. ఖాలిద్ హుస్సేన్ పేరుకు సాహిత్య లోకంలో పరిచయం అక్కర్లేదు. అఫ్ఘానిస్తాన్ లో పుట్టి పెరిగిన ఈ రచయిత తరువాత అమెరికాలో స్థిరపడ్డా, ఆఫ్ఘన్  జీవనంలో వివిధ కోణాల్ని తన రచనల  ద్వారా పరిచయం చేస్తూ, మొదటి నవల 'కైట్ రన్నర్ 'తో రచయితగా ప్రపంచ ఖ్యాతి పొందిన వ్యక్తి. 'A Thousand Splendid Suns' ఆయన రెండో నవల . దాదాపు 45 ఏళ్ళ ఆఫ్ఘన్ చరిత్రను ,ఇద్దరు స్త్రీల జీవితాలను ఈ నవలలో కథాంశంగా ,అలిచారు రచయిత. కథలో ఉన్న మలుపులను పాఠకులకు చెప్పడంలో , పెద్ద నవలలు రాసేటప్పుడూ పాఠకులకు ఆసక్తి కలిగేలా రాయడంలో ఖాలిద్ హుస్సేన్ శైలి గొప్పది అని ఈ నవల చదివాక అర్థమవుతుంది. 
మరియమ్ బాల్యంలో కథ మొదలవుతుంది. మరియమ్ తల్లి నానా, తండ్రి జలీల్. జలీల్ కు ముగ్గురు భార్యలు, తొమ్మిది మంది పిల్లలు. నానా అతని దగ్గర హౌస్ కీపర్ గా పని చేసే సమయంలో ఆమెతో అతనికి సంబంధం ఏర్పడుతుంది. ఆమె గర్భవతి అవుతుంది. జలీల్ నివసించేది హెరాత్ లో . ఈ విషయం తెలిసాక ఆమెను ఊరి బయట ఓ గుడిసె కట్టి అందులో ఉంచుతాడు. ఆమె పోషణా భార, వహిస్తాడు. అలా మరియమ్ ఆ గుడిసెలో జన్మిస్తుంది. 
జలీల్ ప్రతి గురువారం మరియమ్ ను చూడటానికి వచ్చేవాడు. అతని మీద ఎంతో ప్రేమ పెంచుకుంటుంది మరియమ్. నానా ఎప్పుడు అతన్ని నమ్మవద్దని  హెచ్చరిస్తూ ఉంటుంది. అవేమీ పట్టించుకొని మరియమ్ అతన్ని పూర్తిగా నమ్ముతుంది. జలీల్ కు ఓ సొంత సినిమా హాలు, ఇంకా వ్యాపారాలు ఉన్నాయి. ఏదో ఒక రోజు తనని కూడా అతని కుటుంబంలోకి ఆహ్వానిస్తాడని ఆశపడుతుంది. ఆమె పదిహేనవ పుట్టినరోజున అతను సినిమాకు తీసుకు వెళ్తానని మాట ఇస్తాడు . నానా అతన్ని నమ్మవద్దని, అలా వెళ్తే తను చచ్చిపోతానని అంటుంది. పుట్టిన రోజు నాడు ఎదురుచూసి అతను రాకపోయేసరికి ఆమె బయల్దేరి నడుచుకుంటూ అతని చిరునామా కనుక్కుని మరి వెళ్తుంది. అక్కడ అతను లేడని ఇంట్లో వాళ్ళు చెప్తారు. అతని కోసం ఎదురు చూస్తానని ఆ చలిలో ఆ రాత్రి అంతా ఆ ఇంటి ముందే ఉంటుంది. మరునాడు ఉదయం తండ్రిని పైన చూస్తుంది, ఇంట్లో ఉండి కూడా కావాలనే తనని చూడటానికి రాలేదని అర్థమౌతుంది. అప్పుడు డ్రైవర్ ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టడానికి వెళ్తే అప్పటికే నానా చెట్టుకి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. 
తల్లి మరణం తర్వాత మరియమ్ ను తన ఇంటికి తీసుకువెళ్తాడు జలీల్. రెండు మూడు రోజుల తర్వాత 45 ఏళ్ళ వయసున్న రషీద్ తో 15 ఏళ్ళ వయసులో ద్వితీయ వివాహం జరిపిస్తారు మరియమ్ కు. ఆమెకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వివాహం చేసుకుంటుంది మరియమ్.అదే వివాహ సమయమని చెప్తారు జలీల్ భార్యలు ఆమెతో. 'అంటే వారి కూతుళ్ళు మాత్రం యూనివర్సిటీల్లో చదువుకోవచ్చు ,ఈ వివాహ వయస్సు వారికి వర్తించదనుకుంటా' అనుకుంటుంది మరియమ్ మనసులో.  రషీద్ ను వివాహం చేసుకున్నాక అతనితో పాటు కాబూల్  వెళ్తుంది మరియమ్. తండ్రితో ఇంకెప్పుడూ తనకు మొహం చూపించవద్దని ,తాను ఎంతో ప్రేమించానని కానీ అతను నటించాడని అని వెళ్లిపోతుంది భర్తతో. 
రషీద్ తో కాపురం కొన్నాళ్లు బాగానే సాగుతుంది. అతనికి తన భార్య పరాయి మగవాళ్ళ ముందుకు రావడం ఇష్టం ఉండదు. అలా అతని అభీష్టం మేరకు బుర్ఖా ధరిస్తూ అతనికి నచ్చినట్టు బ్రతుకుతూ ఉంటుంది మరియమ్. ఆరు సార్లు గర్భం వచ్చినా అది మరియమ్ కు నిలవదు. దానితో ఆమెతో క్రూరంగా ఉంటాడు రషీద్. 
లైలా మరియమ్ పొరుగింటి వారైనా ఫరీబా,హకీం లా కూతురు. మరియమ్ కు పిల్లలు లేక వారి కుటుంబాన్ని చూసి దేవుడు భలేగా ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు ,నాకు ఒకరిని ఇవ్వలేదని బాధ పడుతుంది మరియమ్. 
లైలా తల్లికి నూర్ ,అహ్మద్ అనే కొడుకుల తర్వాత కూతురు లైలా. వారిని యుద్ధానికి  వెళ్తారు. 1978 నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అలా ఓ యుద్ధంలో వారు మరణించారనే వార్త వస్తుంది. వారిద్దరిని ప్రేమించినట్టు లైలాను ప్రేమించదు తల్లి. ఆమె తండ్రి హకీం మాత్రం తన కూతురు బాగా చదవాలని కోరుకునే వ్యక్తి . కానీ 1979-1989 మధ్య సోవియట్ -ఆఫ్ఘన్ యుద్ధం జరుగుతున్న సమయం అది. కూతురి క్షేమం కోసం పాఠశాల మాన్పించి ఇంట్లోనే చదువు చెప్తుండేవాడు తండ్రి . ఈ కమ్యూనిస్ట్ భావజాలం వల్ల హకీం తన ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయినా పని చేసుకుంటూ బ్రతుకుతాడు.లైలా పొరుగులో ఉండే బాలుడు తారిక్ . అతనితో బాల్యం నుండి ఏర్పడిన స్నేహం ప్రేమగా మారుతుంది. 
అప్పటికే యుద్ధం తీవ్రం అవ్వడంతో అందరూ ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుండి పాకిస్తాన్ కు ,ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు శరణార్ధులుగా. తారిక్ కూడా తప్పని  సరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది.  ఆ ముందు రోజు తారిక్ ,లైలా ఒక్కటవుతారు. తారిక్ కు బాల్యంలో జరిగిన ప్రమాదం వల్ల ఒక కాలు ఉండదు. వాళ్ళు వెళ్లిపోయాక తాము కూడా వెళ్ళిపోవడానికి భార్యను ఒప్పిస్తాడు హకీం. కానీ అలా వెళ్ళే సమయంలో జరిగిన బాంబు దాడుల్లో తల్లీతండ్రీ మరణిస్తారు .లైలా గాయాలతో కుప్పకూలిపోతుంది . ఆమెను ఆ స్థితిలో చూసిన రషీద్ ఆమెను తన ఇంటికి తీసుకు వస్తాడు. 
మొదట ఆమెకు బాగయ్యేవరకు బాగానే ఉన్న భర్త మనసులో ఆమెను పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఉన్నట్టు మరియమ్ కు అర్థమౌతుంది. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి తారిక్ మరణించాడని, హాస్పటల్ లో తన పక్క బెడ్ అని చెప్పడంతో లైలా కుప్పకూలిపోతుంది. అప్పటికే ఆమె కడుపులో తారిక్ బిడ్డ పెరుగుతున్నాడు. ఈ విషయం నుండి కాపాడుకోవడానికి రషీద్ తో వివాహానికి అంగీకరిస్తుంది. అలా తారిక్ కూతురు అజీజాకు జన్మనిస్తుంది లైలా. 
మొదట్లో ఆమెకు ,మరియమ్ కు పడకపోయినా తర్వాత ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడంతో ఇద్దరు మంచి మిత్రులవుతారు. రషీద్ కూడా అజీజా తారిక్ బిడ్డే అని అనుమానిస్తాడు. తర్వాత రషీద్ కు తెలియకుండా కొంత డబ్బు రోజు తీసుకుంటూ బిడ్డతో పారిపోవాలనుకుంటున్నానని మరియంతో చెప్తుంది లైలా. ఆమె కూడా అంగీకరించడంతో ముగ్గురు పారిపోతారు. కానీ ఆఫ్ఘన్ స్త్రీలు భర్త,బంధువు లేకుండా వెళ్ళడం నిషిద్ధం. అక్కడ బంధువులా ఉంటానని మాటిచ్చిన అపరిచితుడు పోలీసులకు పట్టివ్వడంతో మళ్ళీ రషీద్ ఇంటికే వచ్చి పడతారు. 
రషీద్ శారీరకంగా ఎంతో హింసించి, ఇద్దర్ని హెచ్చరిస్తాడు. తర్వాత రషీద్ వల్ల లైలాకు జల్మాయ్ జన్మిస్తాడు. అతన్ని పూర్తిగా ముద్దు చేస్తాడు రషీద్. తర్వాత ఓ ప్రమాదంలో రషీద్ షూ షాప్ నాశనం అవ్వడంతో అతని ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. బలవంతపెట్టి అజీజాను అనాథాశ్రమంలో చేర్పించేలా చేస్తాడు. హఠాత్తుగా తారిక్ లైలాను చూడటానికి వస్తాడు. దానితో తనను పెళ్ళి చేసుకోవడానికి రషీద్ చేసిన కుట్ర అర్థమౌతుంది లైలా ,మరియమ్ లకు. 
ఈ విషయం జల్మాయ్ ద్వారా తెలుసుకున్న రషీద్ లైలా ను చంపే ప్రయత్నం చేస్తుండగా ఆమెను కాపాడటానికి అతన్ని హత్య చేస్తుంది మరియమ్. లైలా ను ఆమె  బిడ్డల్ని తారిక్ తో పంపేసి తాను నేరానికి లొంగిపోతుంది. ఆమెను ఊరి తీస్తారు. 
తారిక్ తో మొదట పాకిస్తాన్ కు  ఎక్కడైతే తారిక్ ఉద్యోగం చేస్తున్నారో అక్కడికి వెళ్తారు. అక్కడ కొంత కాలం గడిపాక మళ్ళీ కాబూల్ కి వెళ్దామనే ఆలోచనకు వస్తారు. ఆ మార్గమధ్యంలో హెరాత్ కు వెళ్ళి మరియమ్ పుట్టిన ప్రదేశాలను సందర్శిస్తుంది లైలా.అలా ఆమె చిన్నప్పటి గురువు కొడుకును కలుస్తుంది. అతను మరియమ్ తండ్రి ఆమెకు ఇమ్మని ఓ పెట్టె ఇచ్చాడని ఓ పెట్టె ఇస్తాడు. ఆ పెట్టెలో కొంత డబ్బు, క్షమాపణ కోరే ఉత్తరం ,వాల్ట్ డిస్నీ సినిమా సీడీ ఉంటాయి.  
    ఆ తరువాత కాబూల్ కి తిరిగి వచ్చాక ఓ ఎన్ జి ఓ తో కలిసి పని చేస్తాడు తారిక్ . అందులో భాగంగా అజీజా ను ఉంచిన అనాథాశ్రమాన్ని బాగు చేయిస్తారు. ఆ ఫోటో పేపర్లో పడుతుంది. లైలా కు తన తండ్రి తనను ఎలా గొప్ప వ్యక్తిగా చూడాలని కలలు కన్నాడో గుర్తుకు వస్తుంది . అందులోనే పిల్లలకు పాఠాలు చెప్తుంది లైలా. అలా కథ ముగుస్తుంది.ఈ కథకు శీర్షికను 17 వ శతాబ్దపు ఇరానియన్ కవి సాయిబ్ తాబ్రిజీ కవితా కాబుల్ నుండి తీసుకున్నట్టు రచయిత చెప్పారు.  దాదాపు 4 దశాబ్దాల కథ.దానితో పాటు యుద్ధ ప్రభావం , దేశ కాలమాన పరిస్థితులు, ప్రజల్లో ఉన్న భయం వాటితో కథతో కలిసి పయనించడం నిజంగా ఆఫ్ఘన్ జీవనాన్ని చూపే రచనలే ఖాలిద్ హుస్సేన్ వి . వీలైతే తప్పక చదవండి . ఆఫ్ఘన్ మీ కళ్ల ముందే దర్శనమిస్తుంది. 
*    *    * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ