భ్రష్టురాలు

చదువరి- 15                             

                                         భ్రష్టురాలు

                                                  -రచనశ్రీదత్త(శృంగవరపు రచన) 


          కొన్ని నవలలు ఊహా చక్షువులను తెరిస్తే,ఇంకొన్ని వాస్తవ జీవిత చిత్రాలను మన మనసులో నిక్షిప్తం చేస్తాయి.మలయాళీ నవల భ్రష్ట్ మాత్రం కేరళలోని నంబుద్రి బ్రాహ్మణ స్త్రీల జీవితంలో చీకటి కోణాల్ని పాఠకులు ఏ ప్రాంతం వారైనా సరే వారి ఆలోచనల్లో కనిపించేలా చేస్తుంది. 1905 లో కురియేదతు తాట్రీ  ట్రయల్ కేరళ బ్రాహ్మణ వ్యవస్థను కుదిపేసింది, కేరళలో నంబుద్రి బ్రాహ్మణ వ్యవస్థ నాటి కేరళ మొత్తాన్ని దాదాపుగా పాలించింది. రాజు ఉన్నాప్పటికీ కూడా అధికారాన్ని అనుభవించింది వారే.

          కేరళలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. నంబుద్రి బ్రాహ్మణ స్త్రీలను అంతర్జానం అంటారు. అంటే ఇంటి లోపల ఉండేవారు అని. అంటే వారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. నంబుద్రి బ్రాహ్మణ పురుషుడు ఎన్ని వివాహాలు చేసుకున్నా తప్పు లేదు. కానీ స్త్రీ మాత్రం ఆ పురుషుడిని తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడకూడదు. అలా భర్త ప్రేమ కోసం సవతుల మధ్య ఉండే పోరు, కొందరు వయసులో ఉన్నప్పుడూ ముసలి వారికిచ్చి వివాహం చేయడం వల్ల వైధవ్యం అనుభవించాల్సి రావడం, పెళ్ళిళ్ళు కాకపోతే అలాగే ఉండిపోవడం ఇవన్నీ నంబుద్రి బ్రాహ్మణ స్త్రీ జీవితంలో భాగాలు. కానీ నంబుద్రి బ్రాహ్మణ స్త్రీ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే వారిద్దరిని భ్రష్టులుగా ప్రకటించి, ఆ స్త్రీని ,పురుషుడిని వెలి వేస్తారు. ఆ చోటు వదిలి వెళ్లిపోవాలి. ఇంకే బ్రాహ్మణ కార్యక్రమాల్లో ఆ పురుషుడు పాల్గొనకూడదు. స్త్రీ కూడా ఆ ప్రదేశం దాటి వెళ్ళిపోవాలి. ఇది కేవలం నంబుద్రి స్త్రీ సంబంధం పెట్టుకుంటే మాత్రమే.

          19 వ శతాబ్దపు చివరి దశలో మరియు 20 వ శతాబ్దాపు తొలి దశలో కేరళలో నాయిర్ ,క్షత్రియ జాతికి చెందిన స్త్రీలు ఒకరి కంటే ఎక్కువ మంది మగవారితో సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా ఉన్న మగవారికి జీత,భత్యాలు ఉండేవి. నంబుద్రి బ్రాహ్మణ పురుషులతోనే సంబంధం పెట్టుకునేవారు. వీరి దగ్గరికే మగవారు రావాలి తప్ప, వీరు పురుషుల ఇంటికి వెళ్లరు. ఈ సంప్రదాయాన్ని సంబంధం అంటారు. ఇది చట్టబద్ధమైనదే. అలాగే పురుషులు ఒక్క పరాయి నంబుద్రి స్త్రీలతో తప్ప ఎవరితో సంబంధం పెట్టుకున్నా సరే అది తప్పు కాదు.

          ఇటువంటి పరిస్థితుల్లో ఓ వివాహమైన నంబుద్రి మహిళా తమ పట్ల సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద కక్ష సాధించడం కోసం 64 మంది ఎవరితే గొప్ప వారు ఉన్నారో వారితో సంబంధం పెట్టుకుంది. ఫలితంగా వారందరూ ఆమెతో సహా బహిష్కరించబడ్డారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె కురియేదతు తాట్రీ. ఈ సంఘటన ఆధారంగా మలయాళీ రచయిత  మతంపు  కున్హుకుట్టన్  భ్రష్ట్ నవల రాశారు. దీనిని ఆంగ్లంలోకి ‘OUTCASTE’      గా వాసంతి శంకరనారాయణన్ అనువదించారు. ఈ నవలలో మలయాళ సమాజం 19 వ శతాబ్దపు మలి దశలో ,20 వ శతాబ్దపు తొలి దశలో ఎలా ఉండేదో ,నంబుద్రి స్త్రీలు,ఇతర స్త్రీలు ,నంబుద్రి బ్రాహ్మణులు, మిగిలిన వారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నియమాలు  ఉన్నప్పటికి అవి ఒక్క నంబుద్రి బ్రాహ్మణ స్త్రీలకు మాత్రం ఎంత క్రూరంగా ఉండేవో మన కళ్ళకు కట్టినట్టు రాశారు రచయిత.

          చైమైత్రి ఒట్టికన్ కేరళలో ప్రముఖ గురువు. ఆయన తండ్రి అక్కితన్ వారసత్వాన్ని అంది పుచ్చుకున్నాడు ఆ పెద్ద కొడుకు. చైమైత్రి సోదరులు వాసు ఒట్టికన్ ,పచు ఒట్టికన్. ఇది ఓ నంబుద్రి కుటుంబం. ఆచన్ నంబుద్రి కుటుంబం కూడా అధికారం, డబ్బు ఉన్న కుటుంబం. కుటుంబ పెద్ద అయిన ఆచన్ కు ఆరుగురు సోదరులు. వారి మధ్య గొడవలు రాకుండా ఉండటానికి ఎవరికి వారికి బంగ్లాలు, వసతులు ఉన్నాయి. ఆచన్ ఏనుగుల వ్యాపారం, భూమి మీద ,అతని అధీనంలో ఉన్న గుడుల మీద కూడా ఆ కుటుంబానికి ఆదాయం ఉంది. అతని రెండో సోదరుడుకి కథాకళి అంటే ఇష్టం, రెండో -మూడో సోదరులు ఏనుగులను ఇష్టపడేవారు.ఐదో సోదరుడైన నంబ్యాట్టన్ కు చెస్ అన్నా,ఆడవాళ్ళన్నా ఇష్టం. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశాడు. ఓ పని మనిషి మోసం చేసినందుకు ఎదురు తిరిగితే హత్య కూడా చేశాడు. అలా వారి అకృత్యాలను ప్రశ్నించేవారు లేరు.

          అలాగే రాజు గారి భవనంలో స్త్రీలకు సంబంధం పేరిట నంబుద్రి మగవారితో సంబంధాలు ఉండేవి. అలా చిన్నమ్ము రాజు గారి బంధువు. ఆమె ముగ్గురు కూతుళ్లకు అలా సంబంధం పేరిట ముగ్గురు నంబుద్రి మగవారిని తీసుకువస్తారు. వారిలో ఆమె కూతురు రమణకుట్టి తో ఉండటానికి వచ్చిన కున్హుకుట్టన్ మాత్రం దీనికి వ్యక్తిగతంగా వ్యతిరేకి అయినప్పటికి పేదరికంతో వచ్చినా,కొన్నాళ్ళ తర్వాత మనసు మార్చుకుని తను కావాలనుకుంటే రమణకుట్టి నే తన ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమెకు వెళ్లడానికి ఇష్టమున్నా సంప్రదాయాల రీత్యా వెళ్ళలేదు. నంబ్యాట్టన్ ఓ యోగిలా మారిపోతాడు.  

          అలా ఓ నంబుద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పాప్టి కుట్టి (కురియేదతు తాట్రీ
) విద్య పూర్తి చేసుకున్నాక ఆమెకు పెళ్లి చేస్తారు. ఆమె భర్త అన్నకు వివాహం కాకపోయినా సరే అతనే దగ్గరుండి ఈ వివాహం జరిపిస్తాడు. ఆ అన్న పెళ్ళి తర్వాత ఆమెను మొదట అనుభవిస్తాడు
,తర్వాత ఆమె భర్త. అలా ఆ సోదరుల వ్యవహారం చూసిన ఆమె మనసులో కక్ష పెరిగిపోతు ఉంటుంది. నంబుద్రి వ్యవస్థలో కొందరినైనా నాశనం చెయ్యాలి అని ఆమె గొప్ప వారైనా 64 మందితో సంబంధం పెట్టుకుంటుంది. అలా వారు,ఆమె కూడా బహిష్కృతులౌతారు. వారిలో వాసు ,పచు ,రాజా వంశీయులు ,ఎందరో పదవుల్లో ఉన్నవారు కూడా ఉంటారు.

          ఈ సంఘటన నంబుద్రి వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది. అలాగే అందరినీ ఆలోచించేలా కూడా చేసింది. ఆమె డబ్బు కోసం ,కామ కోరికతో చేసేదే అయితే ఒకరిద్దరితోనే ఉండేది. కానీ ఆ వ్యవస్థలో నంబుద్రి స్త్రీ పట్ల జరుగుతున్న వివక్షను ఎలా ఎదిరించాలో తెలియక దానిని కక్షపూరితంగా చేసినప్పటికీ అది నంబుద్రి వ్యవస్థ లో ఉన్న ఈ బలహీనతలను గురించి అందరూ ఆలోచించేలా చేసింది. ఇది ఆమె తన శైలిలో చేయిశ్న విప్లవమే. ఈ నవలలో వ్యక్తుల వ్యక్తిగత ఆలోచనలకు వదిలేస్తూ ముగించారు రచయిత. మలయాళ సమాజకోణాలను పరిచయం చేస్తుంది ఈ నవల. నవల విపరీతంగా చదివించే శైలిలో కన్నా మలయాళ సంప్రదాయాల్ని గురించి చెప్తున్నా చారిత్రక కాల్పనిక నవలా శైలిలో ఉన్న ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్న భావన అయితే కచ్చితంగా పాఠకులకు కలుగుతుంది.

           

         

         

         


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ