నేను పాఠాలు చెప్పను!

చదువరి -17

                   నేను పాఠాలు చెప్పను!

                             -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)


          బిహారీ రచయిత జయనందన్ కథ ఓటు హక్కు టెక్స్ట్ బుక్స్ లో పాఠాలకు,వాస్తవ జీవితంలో సమాజానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్తుంది. ఆయన ఓ సోషల్ మాస్టారు. ఆ ఊళ్ళో ఎన్నికల సమయం దగ్గర పడింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే వారి ప్రవర్తన,అంకితభావం,సమాజాసేవ గుణాల్ని గురించి తెలుసుకోవాలని, వారిలో మంచి వ్యక్తిని ఎన్నుకునేలా అప్పుడు ప్రజలను చైతన్యపరచాలని ఆయన గ్రామ పెద్దలతో చెప్పారు. పైకి సరే అన్నట్టు మాట్లాడినా అందరూ మనసులో నవ్వుకున్నారు ఆ మాస్టారి మాటలకు.

          వారి గురించి వాకబు చేయడానికి రమ్మంటే అందరూ తల ఓ కారణం చెప్పి తప్పించుకున్నారు. వారి గురించి అర్థమై ఆ మాస్టారు ఒక్కరే వారి గురించి తెలుసుకోవడానికి బయల్దేరాడు. పోటీ చేసే అభ్యర్ధులు నలుగురు.అలా ఆయన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి వారు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. అయినా,ఆయన అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.

          అందరి గురించి వివరాలు సేకరించిన ఆయనకు ఆశ్చర్యం కలిగింది.ఎన్నికకు తగిన అర్హత,యోగత ఉన్న అభ్యర్ధి ఒక్కరూ ఆయనకు కనబడలేదు. అభ్యర్ధుల్లో ఒకరు ఆయనకు ద్దోరపు బంధువు కూడా. అతను అయిదు హత్యల్లో, పలు బలాత్కారపు కేసుల్లో నిండుతుడని బైటపడింది. మరో అభ్యర్ధి ఒకానొకప్పుడు బందిపోటు దొంగ. ఇంకొకరు అక్రమ రవాణా, దొంగ సరుకుల వ్యాపారంలో ఘనుడు. ఇంకొకరు పల్లెప్రజల పాలిట యమకింకరుడు.

          మాస్టరికి ఏం చేయాలో తోచలేదు. బందిపోటు మోరన్ సింహ్ ఒక్కడే మిగతా వారికన్నా కాస్తంత నయంగా అన్పించసాగాడు. చదువుసంధ్యలున్న అతను పరిస్థితుల ప్రభావం వల్ల దొంగ అయ్యాడు. భార్యాపిల్లల్తో సహ మోరన్ సింహ్ కు వోటెయ్యమని ప్రచారానికి దిగారు మాస్టారు. అందరూ ఆయన్ని చూసి నవ్వుకున్నారు,పిచ్చివాడిగా భావించారు. జనాల్లో చాలా మంది మాత్రం హర ప్రతాప్ నే గెలిపించాలనే నిర్ణయంతో ఉన్నారు.

          మాస్టారి బంధువు హరప్రతాప్  ఊళ్ళో అందరినీ అక్కా ,బావా ,చెల్లి అంటూ పిలుస్తూ ప్రచారం చెయ్యసాగాడు. ఎన్నికల రోజు అందరికంటే ముందే పోలింగ్ బూత్ కి వెళ్ళారు ఆయన. తన ఓటు ఎవరో వేశేశారని తెలిసేసరికి హతాశులయ్యారు. బాధగా ఇంటి ముఖం పట్టారు.

          ఖూనీలు,మానభంగాలు చేసిన హరప్రతాప్ ఎన్నికల్లో నెగ్గాడు. అది విని మాస్టరీ భార్యా,కొడుకు అందరూ ఆనందిస్తుంటే మాస్టారు మాత్రం వ్యథ చెందారు. నేనింక పౌరశాస్త్రం చెప్పను. ఓటు హక్కు గురించి పిల్లలకు ఏ పాఠం చెప్పను అని నిర్ణయించుకున్నారు ఆ మాస్టారు.

          పాఠాల్లో బోధించే ఆదర్శాలు నిజ జీవితాలకు ఎంత దూరంగా ఉంటాయో తెలిపే కథ ఇది. వాస్తవికంగా జీవించడం సులభమే కానీ ఆదర్శంగా జీవిస్తే పిచ్చి వారనే అంటుంది సమాజం అని కూడా ఈ కథ అంతర్లీనంగా చెప్తుంది. మనందరం మన డైనిక జీవితంలో చూసే కథ కూడా ఇదే.

                       *     *     * 

 

 

                            

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!