పబ్లిసిటి స్టంట్ల సంఘర్షణ

పబ్లిసిటి స్టంట్ల సంఘర్షణ

      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు? మొదటి మహిళా వ్యోమగామి.ఎవరు? మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలు చాలాక్విజ్‌ పోటీల్లో మనం వింటూనే ఉంటాం. కానీ ఏనాడు దేశానికి మొదటి మగప్రధాని ఎవరు? మొదటి మగవ్యోమగామి ఎవరు? మొదటి మగ న్యాయమూర్తి ఎవరు? ఈ తరహా ప్రశ్నలు ఎన్నడూ వినమూ. అలా 'మహిళ అనే పదం తగిలించబడటం ఆ స్త్రీ  సమానత్వం లేదా విజయం సాధించింది అనడానికి సంకేతమా? స్త్రీకి రిజర్వేషన్‌ శాతం పెరగడం సమానత్వమా?

  ఏదైనా అత్యాచారమో, అఘాయిత్యమో జరిగినప్పుడు పలు మహిళా సంఘాలు మీడియాలో గగ్గోలు పెట్టి, కొన్ని రోజుల తర్వాత ఆ ఉదంతాలు మరుగున పడటం సమానత్వమా? “మహిళను ఓ వివాదాస్పద వస్తువుగా మారుస్తూ,దానికి స్త్రీ  ఉద్దరణ అనే పేరు పెట్టడం ఇవన్నీ పబ్లిసిటీ కోసం పరోక్షంగా చేసే స్టంట్లేనేమో! ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన అంశం రామ్‌గోపాల్‌ వర్మ 'గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' ఈ యూట్యూబ్‌ ఫిల్మ్‌లో అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ నటించడం, అన్నది సంచలనాన్ని రేపింది. అది స్త్రీ  ఆత్మాభిమానాన్ని,గౌరవాన్ని కించపరచడమే కాకుండా, ఇటువంటివి స్త్రీపై అత్యాచారాలు పెరిగేలా పురిగొల్పుతాయని మహిళా సంఘాలు మీడియా సాక్షిగా ఉద్యమాలు చేసాయి.

పోర్న్‌ అనేది మనకు కొత్త అంశం కాదు. భారతదేశం పోర్న్‌ చూడటంలో మూడవస్థానంలో ఉంది. ఎన్నో పోర్న్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తూనే ఉంటాయి. ప్రతిరోజు. కానీ వాటి వేటి మీద ధ్వజమెత్తని వీరంతా ఒక్క ఈ “జిఎస్‌టి మీదే ఎందుకు దండెత్తారు? సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు ఏ మనిషిని ప్రత్యక్షంగా ప్రభావితం చేయవు. అవి పరోక్ష మాధ్యమాలే. మరి రాష్ట్రంలో జనవరి నెలలో ప్రేమోన్మాదానికి  బలైన యువతులు ఉన్నారు. అలాగే ఒడిషాలో ఓ మైనర్‌ బాలికపైగ్యాంగ్‌రేప్‌ జరిగిన తర్వాత ఆ పాప సూసైడ్‌ చేసుకున్న ఉదంతం ఆ రాష్ట్రాన్నేకాదు దేశాన్నే అట్టడుకించింది.

ఈ ఉదంతాలు పక్కన పెడితే పద్మావత్‌ సినిమా విషయంలో దీపికాపదుకొనె లాంటి స్త్రీ ఆత్మగౌరవం నిలబెట్టడానికై ఎవరూ ఇంతగా ఉద్యమించలేదే? జరుగుతున్న ఉదంతాలు, పరిష్కారానికై ఉద్యమిస్తాం అనే ముసుగుతో కొనసాగే కుహనావాదులను నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్లు అని అర్హమవుతాయి.

 సమస్య (లేదా) చర్చలువచ్చినప్పుడు మాత్రమే మొహాలు తెరలపై చూపించుకునే వీరు ఆ తర్వాత ఆ సమస్య చివరికి ఏమైందో మాత్రం చెప్పడానికి నోరు విప్పరు. వాస్తవిక కోణంలో గమనిస్తే అసలు సమానత్వం అన్న అంశాన్ని ఏ ప్రమాణాల అధారంగా నిర్ధారించాలి అన్న స్పష్టత దాదాపు ఎవరికీ లేనట్టే కనిపిస్తూ ఉంటుంది.
 అభిరుచి,ఆత్మాభిమానం కలయిక సమానత్వం అని కొంతమేరకు నిర్వచించవచ్చు. అసలు సమానత్వం అన్న అంశం కేవలం యవ్వనంలో, ప్రౌఢ దశలో ఉన్న స్రీలకుమాత్రమే చెందిన అంశంగా ఎందుకు చిత్రీకరించబడుతుంది? మనం పెరిగిన వాతావరణం, ఆ వాతావరణం మనపై చూపే ప్రభావం గాఢంగా ఉంటుంది.బాల్యంలో ఓ ఆడపిల్ల తనకు ఇష్టమైన పనులు చేస్తానన్నప్పుడో లేక యవ్వనదశలో తనకు నచ్చిన చదువు చదువుతానని అన్నప్పుడో వచ్చే కుటుంబ వ్యతిరేకతతో సమానత్వాన్ని వ్రశ్నించే బీజం మొలకెత్తుతుంది. అక్కడి స్థితిగతుల్లో రాజీపడిపోయిన ఆ బాలిక లేదా యువతి తర్వాత జీవితంలో అటువంటి పరిస్థితులు పునరావృతం అయినా సాధ్యమైన మేరకు రాజీపడి సర్దుకుపోవాలనే మనస్తత్వాన్నే అలవరచుకుంటుంది.
 బాల్యం నుంచే సొంత అభిరుచుల్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోగలిగే ధైర్యాన్ని బాలికల్లో నింపగలిగే వాతావరణం నిర్మించగలిగితే నిజమైన సమానత్వం సజీవంగా వర్ధిల్లుతుంది. ఇది ఓ కోణం.

ఇంకో కోణాన్ని పరిశీలిద్దాం. మానవుని మనుగడకు, భవిష్యత్తుకు కేంద్రబిందువు “బాలిక యావత్‌ ప్రపంచం 'సీవ్‌ గర్ల్‌ చైల్డ్‌ అంటూ గొంతెత్తి నినదిస్తున్నది.రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఆదశిశువుల జననమరణాల లెక్కలు చూసి ఆందోళన చెందుతున్నది. క్షణక్షణం '“ఆడపిల్లను  రక్షించుకోడానికి తపనపడుతున్నది నేటి సమాజం. ఇంతగా ఆరాటపడే ఈ సమాజంలోని బాలిక పుట్టగానే చెత్తకుప్పలలో,మురికి గుంటలలో పారేసేవారు, ఆర్థికంగా కుంగిపోయి అమ్మాయిలను అమ్ముకొంటున్న వారు ఉండడం శోచనీయం. అదేవిధంగా బాలికలను యువతులను, అదవారిని చులకనగా చూస్తూ మనోవేదనకు గురి చేస్తూ, చిత్రహింసలు పెడుతూ, చివరికి దుర్మార్గమైన పనులకు పూనుకుంటూ వారి జీవితాలకు అర్జాంతరంగా ముగింపు పలుకుతున్న దాష్టికదుష్టులు కూడా మనం జీవిస్తున్న ఈ సమాజంలోనే బతుకుతుండడం అత్యంత బాధాకరం.

2008వ సంవత్సరం నుండి మనదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నది. సేకరించిన జనాభా లెక్కలలో బాలబాలికల నిష్పత్తిని పరిశీలిస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నది. ఆరు సంవత్సరాలలోపు ప్రతి వెయ్యిమంది బాలురకు ఆడపిల్లలు 914 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితే ఆందోళన కలిగించేలా ఉందంటే మనదేశంలో ఆడపిల్లను బతకనిచ్చేపరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఒక దగ్గర చదువు చెప్పవలసిన అధ్యాపకుడే విద్యార్థిని వేధిస్తాడు. దేశ రాజధాన అయిన ఢిల్లీలో ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులపై సామూహిక లైంగికదాడి(17-10-2015) మరో దగ్గర కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తల్లిదండ్రులే కూతురిని వ్యభిచారం రొంపిలోకి తోయడం, ప్రభుత్వ ఉద్యోగాల పేరు చెప్పి యువతులకు గాలం వేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం... ఇవన్నీ నాణేనికి రెండోవైపు!

తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే సంఘర్షణ ఓ వైపు, సమాజంలోదాష్టీకాల బారిన నపడకుండా తమను తాము కాపాడుకోవడం ఇంకో వైపు, స్త్రీ ఈ రెండు సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తమ పబ్లిసిటీ పబ్బం గడుపుకునే వారు ఇంకొందరు. సమానత్వం, వ్యక్తిగతఅభిరుచులు, ఆలోచనలతో మేళ వించబడిన నిలువెత్తు స్రీ ఆత్మగౌరవ కోణమే తప్ప ఇదో పరుగు పందెమో, పోటీనో కానేకాదు.

    *   *  * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!