అందంగా ఉన్నా,లేకున్నా ....

చదువరి -19

     అందంగా ఉన్నా,లేకున్నా ....

         -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)


          అడవికొలను పార్వతి గారి అందమే నేరమా?’ కథ సూక్ష్మ మానసిక సమస్యను ప్రతిబింబింపజేస్తుంది. పురుషుడు అన్ని విధాలా  స్త్రీ తనకంటే తక్కువగా ఉండాలని ఎలా అనుకుంటాడో ఇందులో చెప్పబడింది. స్థూలంగా చూస్తే పురుషునిలో ఉన్న ఈ “సుపీరియారిటీ కాంప్లెక్స్ “,స్త్రీలలో పెంపొందుతున్న “ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ “  ఈ రెండు స్త్రీ పురుషుల జీవితాల్లోని అక్రమ పరిణతికి కారాణాలు. ఈ కథలో కావాలని అందమైన భార్యను పెళ్ళాడి ఆ అందానికి వచ్చే ఆకర్షణ,గౌరవాల వల్ల ఆ భర్త తనకి తాను ఎంత మధనపడతాడో, భార్య మీద ఏ విధమైన హీనమైన అభిప్రాయాలకు, నికృష్టమైన చర్యలకు పూనుకుంటాడో, వివరించబడింది. ఇది కేవలం మనస్తత్వం ఆధారంగా సృష్టింపబడిన  సంఘర్షణ మీద కల్పించబడిన కథ.

          మాధురి అందగత్తె, ఆమెకు నల్లగా, పీలగా ఉండే సుందరరావుతో వివాహమౌతుంది. మొదట్లో ఆమెను ఎంతగానో ఇష్టపడిన సుందరరావు బంధువుల్లో బయట ఫంక్షన్లలో  వారిద్దరి జంటలో మాధురికి గౌరవం ఇవ్వడం, అతన్ని తక్కువ చేయడంతో దానికంతటికి కారణం మాధురేనన్న  ద్వేషం పెంచుకుంటాడు. ఆమె మంచి చీరలు కట్టుకున్నా, పూలు పెట్టుకున్నా, ఏ పని చేసినా ఆమెను అనుమానిస్తూ ఉంటాడు. మానసికంగా చిత్రవధ అనుభవిస్తుంది మాధురి.

          ఈ లోపు సుందరరావు ఫారిన్ వెళ్ళవలసి వస్తే వెళ్తాడు. మాధురి అన్న దగ్గరకు వెళ్తుంది. ఆనందరావు అన్న, జయశ్రీ వదిన. ఆనందరావు మంచి రచయిత కూడా అవ్వడంతో ఎవరైనా స్త్రీలతో మాట్లాడినా అనుమానిస్తూనే ఉంటుంది జయశ్రీ. మాధురికి మశూచి సోకడంతో జుట్టు పీలికై, ముఖంపై మచ్చలతో  అందహీనంగా మారుతుంది. దీని వల్ల తన భర్త తనను ప్రేమిస్తాడని ఆశిస్తుంది.

          ఫారిన్ నుండి తిరిగి వచ్చేసరికి సుందరావు కాస్త రంగు తేలి వస్తాడు. అనాకారంగా ఉన్న మాధురిని ఛీత్కరించుకుంటూ ఉంటాడు. ఓ సారి భోజనానికి అతిధులు వస్తున్నప్పుడు ఆమె వంటలు చేశాక, ఆమెను గదిలోనే ఉంచి, వంటవాడితో వడ్డింపజేసి భార్య లేదని అబద్ధం చెప్తాడు సుందరరావు. మాధురి ఆడదానికి కురుపాం కూడా శతృవేనని దుఃఖిస్తుంది.

          మనుషుల లోపల ఉండే భావోద్వేగాలు ఓ స్తిరమైన అభిప్రాయంగా ఏర్పాడ్డాక వాటికి బయటి కారణాలతో పని లేదు. అందం,అనాకారం ఏదైనా సరే ఒకసారి మనసులో ప్రేమ లేదా ద్వేషం ఏది ఏర్పడ్డా సరే అది అలానే ఉండిపోతుంది. దానిని వల్ల ఎదుటివారు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేంతవరకు కూడా. ఇది భార్యా భర్తల మధే కాదు,ఏ అనుబంధంలో అయినా సరే వర్తిస్తుంది.

     *   *   *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ