సాంకేతిక ప్రగతి పేదరికాన్ని కాకుండా పేదల్ని నిర్మూలిస్తే ?
సాంకేతిక ప్రగతి పేదరికాన్ని కాకుండా పేదల్ని నిర్మూలిస్తే ?
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
2154 నాటికి భూమి అంతా రోగాలు, కాలుష్యం వంటి వాటితో నిండి పోయి ఉంటుంది. అందుకనే ధనవంతులైన వారు తమ కోసం భూమి కక్ష్యలోనే ఓ స్పేస్ హ్యాబీటాట్ ను ఏర్పాటు చేసుకుంటారు. దానిని ఏలూసియం అంటారు. ఎలిసియన్ అంటే స్వర్గ సమానమైన అని అర్ధం. ఈ ఏలూసియం కూడా అలాంటి ప్రదేశమే. ఇక్కడ అన్నీ రోగాలకు చికిత్స ఉంటుంది. పేదరికం, సరైన వైద్య సదుపాయాలు లేని పరిస్థితిలో భూమి మీద జీవించే వారు ఉంటే, ఏలూసియంలో మాత్రం ధనవంతులు అన్నీ సౌకర్యాలతో సుఖంగా ఉంటారు. భూమి నుండి ఎవరైనా వెళ్ళినా వారిని అరెస్ట్ చేయటం, లేదా దాడి చేయటం, లేదా వెనక్కి పంపేయటం చేస్తారు. ఏలూసియం పౌరులను తప్ప ఇంకెవరిని కూడా అక్కడికి రానివ్వరు. ఎంతో మంది వైద్యం కోసం స్పైడర్ అనే అతని దగ్గర ఫేక్ ఏలూసియం సిటిజెన్ షిప్ తీసుకుని వైద్యం కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తారు.
ఈ సినిమాలో కథా నాయకుడు మాక్స్. అతను మొదట కార్ల దొంగ అయినప్పటికీ తర్వాత ఆర్మడైన్ అసెంబ్లీ లైన్ లో పని చేస్తుంటాడు. ఆర్మడైన్ సీఈఓ జాన్ కార్ల్ ఏలూసియంను డిజైన్ చేశాడు ,అలాగే ఏలూసియం కు ఆయుధాలు,అక్కడ రోబోట్ వ్యవస్థ భూమిని కూడా మానిటర్ చేయడం అంతా అతని ప్రోగ్రామింగ్. ఫ్యాక్టరీ లో జరిగిన ఓ యాక్సిడెంట్ వల్ల మాక్స్ రేడియేషన్ కు గురవ్వటం వల్ల ఐదు రోజుల్లో మరణించే స్థితికి వస్తాడు. తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఏలూసియంకు వెళ్ళాలని అక్కడి వైద్యం వల్ల నయమవుతుందని భావిస్తాడు మాక్స్.
ఏలూసియంకు వెళ్ళడానికి స్పైడర్ ను సంప్రదిస్తాడు మాక్స్. అక్కడికి వెళ్లడానికి సరిపడా డబ్బులు లేనందువల్ల తను చెప్పిన పని చేస్తే పంపిస్తానని అంటాడు స్పైడర్.
ఏలూసియం పౌరుల్లో ధనవంతుల్లో ఎవరినైనా కిడ్నాప్ చేసి అతని బ్రెయిన్ లో ఉన్న ఆర్గానిక్ ఇన్ఫర్మేషన్ అంటే అతని బ్యాంక్ డీటెయిల్స్ వంటివి తీసుకోవాలని దానికి తన దగ్గర చిప్ ఉందని చెప్తాడు. దానికి అంగీకరిస్తాడు మాక్స్. ఏలూసియం డిఫెన్స్ సెక్రటరిగా ఉన్న డెలా కోర్ట్ అనైతికంగా అక్కడికి వచ్చే వారి పట్ల క్రూరంగా వ్యవహరించడంతో ఆమెకు వార్నింగ్ ఇస్తాడు ప్రెసిడెంట్ పటేల్. అందుకనే ఆ ఏలూసియాన్ ప్రెసిడెంట్ ను మార్చే విధంగా ప్రోగ్రాం చేయమని జాన్ కార్ల్ ని అడుగుతుంది డెలా కోర్ట్ . దానిని ప్రోగ్రాం చేసి ఏలూసియం కు బయల్దేరాక మాక్స్ అతని మీద దాడి చేసి ఆ ప్రోగ్రామింగ్ ను తన బ్రెయిన్ లోని చిప్ కు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ లోపు ఏలూసియం ఏజెంట్ కృగర్ మాక్స్ ను దాడి చేయడం, అదే సమయంలో కార్ల్ కు బులెట్ తగలడం, అతను మరణించడం కూడా జరుగుతుంది.
ఆ ప్రోగ్రామింగ్ ఎలా అయినా తీసుకోవడానికి మాక్స్ వెంట పడతాడు కృగర్ డెలా కోర్ట్ ఆదేశాల మేరకు. మాక్స్ బాల్య స్నేహితురాలైన ఫ్రే అనే నర్స్ అతన్ని గాయాలకు చికిత్స చేస్తుంది తన ఇంట్లో. ఫ్రే కూతురు లూకేమియా ఆఖరి దశలో ఉంటుంది.మాక్స్ చికిత్స తర్వాత అక్కడి నుండి స్పైడర్ దగ్గరకు వెళ్తాడు. మాక్స్ వెంటపడుతున్న కృగర్ అతను ఫ్రే ఇంటి దగ్గర నుండి వెళ్ళడం గమనించి ఫ్రే ను ,ఆమె కూతుర్ని కూడా తన నిర్బంధంలోకి తీసుకుంటాడు. మాక్స్ తలలో ఉన్న చిప్ గురించే ఈ గొడవ అని స్పైడర్ చెప్పడంతో ,కృగర్ దగ్గరకు వెళ్ళి తనను ఏలూసియామ్ తీసుకువెళ్లమని లేకపోతే గ్రేనేడ్ తో తన తలను పేల్చేసుకుంటానని అప్పుడు ఏలూసియామ్ ప్రోగ్రామింగే ఉండదని బెదిరించడంతో అతన్ని కూడా ఏలూసియామ్ తీసుకువెళ్తారు. ఆ పయనం మధ్యలో అతని మీద దాడి చేయబోతే ఆ గ్రేనేడ్ పేలి కృగర్ ముఖం అంతా ఛిద్రమైపోతుంది.
ఏలూసియంలో కృగర్ అనుచరులు అతన్ని మెడ్ బే లో చికిత్స చేసి పూర్వపు రూపు వచ్చేలా చేస్తారు. మాక్స్ కి ఆపరేషన్ చేసి చిప్ తీసెయ్యమని డెలా కోర్ట్ ఆదేశిస్తుంది. ఫ్రే ను ,ఆమె కూతురిని బంధిస్తారు. అప్పటికే ఏలూసియామ్ ను సొంతం చేసుకోవాలన్న అత్యాశతో ఉన్న కృగర్ డెలా కోర్టును హత్య చేస్తాడు. మాక్స్ స్పైడర్ బృందం సాయంతో ఆ చిప్ లో అందరూ ఏలూసియామ్ పౌరులు అయ్యేలా ప్రోగ్రామ్ చేస్తాడు. అలా ఫ్రే కూతురు కూడా చికిత్స పొందుతుంది. అప్పటి నుండి ఏలూసియామ్ నుండి వైద్య పరికరాలు భూమి మీదకు వచ్చి చికిత్స చేసేలా ప్రోగ్రామ్ చేస్తారు. అలా ముగుస్తుంది ఈ సినిమా.
సాంకేతికత పెరిగే కొద్ది ధనవంతుల ప్రపంచంలా మారిపోతుందా ? సాంకేతికత కేవలం ధనికులకే పరిమితమయ్యేలా ప్రగతి సాధిస్తే అది పేదరికాన్ని నిర్మూలించటాన్ని కన్నా పేదలనే నిర్మూలించే దుస్థితికి తిరోగమించవచ్చు. సాంకేతికత-ప్రజలాభ్యున్నతి మధ్య సమన్వయం లేకపోతే ఆ ప్రగతి అర్ధరహితమైందిగా మిగిలిపోతుంది.
* * *

Comments
Post a Comment