మారుతున్న మాంగల్యబంధాలు

మారుతున్న మాంగల్యబంధాలు

-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)





            పెళ్ళి చేసుకునేముందు నేడు యువత ఎంతగానో ఆలోచిస్తున్నారు. పెళ్ళి అంటే ఒకరితో జీవితాంతం కలిసి ఉండటం, వారి బాధ్యతల్లో , బాధల్లో పాలుపంచుకోవడం, వారితో ప్రేమతో జీవనం సాగించడం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మార్పుకు గురి కావాల్సిందే. అలాగే ఈ వివాహ వ్యవస్థ కూడా చాలా మార్పులకు గురి అయ్యింది. నేడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తూ సమిష్టిగా సంతోషంగా జీవించే సంస్కృతి నేడు దాదాపు ఉంది.

            ఇద్దరు కలిసి ఉండాలంటే అది కూడా జీవితాంతం కచ్చితంగా వారి వ్యక్తిగత జీవితాలు భాగస్వామికి కూడా చెందుతాయి. దీనిని పూర్వం ప్రేమ అనే అనుకునేవారు దంపతులు. కానీ నేడు తమ స్పేస్ తమకు ఉండడం లేదని తమ జీవితంలోని అన్నీ విషయాల్లో భాగస్వామి పెత్తనం చేస్తున్నారనే ఫిర్యాదు అటు భార్యల నుంచి, ఇటు భర్తల నుంచి కూడా వినిపిస్తూనే ఉంది.

            దీనికి కారణాలు మనం ఆలోచిస్తే ఈ ప్రైవసీ తో పాటు ఇంకేన్నో కారణాలు కూడా ఉన్నాయి.భార్యాభర్తల మధ్య విశ్వసనీయత లోపిస్తే కూడా అది వారి వివాహం విచ్చిన్నానికి దారి తీస్తుంది. ఒకరి విషయాలు ఇంకొకరితో పంచుకోకుండా తమదన్న ఫ్రీడంతో ఉంటే అది మొదట భాగస్వామిలో అనుమానాలకు బీజం వేస్తుంది. దానితో ప్రతి విషయంలో ఎదుటి వ్యక్తికి తప్పులే కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇది జరుగుతుంది.

            నేటి త‌రుణంలో మ‌హిళ‌లు కూడా పురుషుల‌తో స‌మానంగా అన్ని రంగాల్లోనూ ప‌నిచేస్తున్నారు. వారికి త‌గిన వేతనాల‌ను అందుకుంటున్నారు. అయితే భార్య త‌న క‌న్నా ఎక్కువ సంపాదించ‌డాన్ని మాత్రం కొంద‌రు భ‌ర్తలు చూసి భ‌రించ‌లేరు. దీంతో అది వారి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు, ఈగోకు కార‌ణ‌మ‌వుతుంది. ఇది మనసులో ఏర్పడి ఉన్న భావజాలం, పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.

            దంప‌తులు ఇద్దరిలో ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి క‌మిట్‌మెంట్ ఉండాలి. అంటే ఒక‌రి బాధ‌లు, క‌ష్టాలు, సుఖాలను మ‌రొక‌రు పంచుకోవాలి.ఆ కమిట్ మెంట్ నుండి తప్పించుకుంటే మాత్రం ఆ బంధం నిలబడదు. ప్రేమించిన వారిని కాకుండా పెద్ద‌లు కుదిర్చిన సంబంధాలలో కూడా కలతలు చెలరేగుతాయి.

             దంపతుల్లో ఒకరిపై ఒకరికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. అవి రీచ్‌ కాలేకపోయినా, అవి లేకపోయినా దంపతుల మధ్య సఖ్యత ఉండదు. ఇద్దరు ఒకరిగురించి మరొకరు వాస్తవిక దృక్కోణంలో ఆలోచించగలగాలి. లేకపోతే ఆ టార్గెట్స్ ముసుగులో విడిపోతారు.

            ప్రతి ఇంట్లోనూ దాదాపుగా అత్త, కోడలు ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ వారు కలసి మెలసి ఉంటే ఏమీ కాదు. ఎలాంటి సమస్యలు రావు. కానీ వారి మధ్య సఖ్యత లేకుండా చీటికీ మాటికీ ఒకరినొకరు తిట్టుకోవడం, విమర్శించుకోవడం చేస్తే అది ఆ కోడలి కాపురంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఆమె భర్తతో రేగే గొడవల వల్ల కూడా కాపురాలు నిలబడవు. పక్షపాతం లేకుండా తల్లి -భార్య విషయంలో ప్రవర్తించగలిగితేనే ఆ భార్యకు భర్త మీద నమ్మకం ఉంటుంది.

            భర్త కుటుంబంలో ఉండే వ్యక్తులు సాధారణంగా అతని భార్య తరఫు కుటుంబం వారి ఆధిక్యతను భరించలేరు. ఈ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి అవి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. ఇది కూడా పరోక్షంగా భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంది.

            దంపతుల్లో ఆడైనా, మగైనా తమ పార్ట్‌నర్‌కు దూరంగా ఉండేందుకు యత్నిస్తుంటే అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. దీంతో వారు విడిపోయేందుకు ప్రయత్నిస్తారు. చివరకు అలాగే జరుగుతుంది కూడా. దంపతులకు నిత్య జీవితంలో ఏ విషయంలో అయినా ఏకాభిప్రాయం కుదరదు. ఇద్దరూ తేడాగా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో అంశంలో భేదం ఉంటుంది. అయితే ఇవి సాధారణంగా ఉంటే ఏమీ కాదు, కానీ తీవ్రంగా మారితే మాత్రం అవి దంపతులు విడిపోయేందుకు కారణమవుతాయి. పార్ట్‌నర్‌ తనను సరిగ్గా చూసుకోలేడని/లేదని అనిపిస్తే నమ్మకం పోతుంది. దీంతో అది విడాకులకు దారి తీస్తుంది.

            భర్త ఎప్పుడు తన మాటే వినాలని తల్లి మాట వినరాదని భార్యలు భావించడం వల్ల ఈగో ప్రాబ్లం ఏర్పడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కొందరు స్త్రీలు భర్తలపై లేనిపోని నిందలు వేసి సంఘటనల వల్ల కూడా విడాకులకు సిద్ధమవుతున్నారు. కొందరు భార్యలు భర్తలను ఎంత ప్రేమగా చూసుకున్నా వారి పరిసరాల ప్రభావం వల్ల పెరిగిన వాతావరణం వల్ల అవసరం లేని విషయాలకు కూడా ఆడవాళ్లను కొట్టడం, హింసించడం చేసిన మగవాళ్లు కూడా ఉన్నారు. సంసారంలో ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకోవాల్సి ఉండగా అనవసరమైన ఫోన్‌కాల్స్‌కు సెల్‌మెసేజ్‌ల వల్ల అనుమానాలు పెనుభూతమై సంసారాలలో చిచ్చు రేపుతుందని పోలీసులు, మానసిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. మద్యం త్రాగే వారిలో అనుమానించి గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా విడాకులు కోసం పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ, కోర్టుల మెట్లు ఎక్కుతున్న దంపతులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.ఇవన్నీ ఇంకో కోణం.

            ఆలుమగలు ఇద్దరూ ఒకేసారి కోపంతో ఉండకూడదు. తన కోపమే తన శత్రవు. తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఒకరు కోపంగా ఉన్న ప్పుడు మరొకరు మౌనం వహిస్తే పరిస్థితి అదుపులో ఉంటుంది. కోపం తెచ్చుకో వద్దని చెప్పడం సులువే. ఇది వినడానికి ఎంతోబాగుంటుం ది. కానీ ఆచరణే కష్టం. ఎందుకంటే చికాకులకు ఏ స్వీట్‌ హోమ్‌ అతీతంకాదు. కోపం అంటువ్యాధి వంటిది. మనిషి నుంచి మనిషికి సోకుతుంది. దుష్ప్రభావం కల్గిస్తుంది. అది గతం నుంచి వర్తమానానికి కూడా ప్రస్తావించగలదు. బాధను మరచిపోవచ్చు. కాని కాలాన్ని అదుపులో ఉంచడం కష్ట మే. కోపానికి జవాబు కోపమే కావచ్చు. కాకపోతే మనస్తాప లు చోటు చేసుకుంటాయి. ఇది అంతా మామూలే కావచ్చు. మరి కోపాలు ఎలా చల్లారతాయి? పట్టరాని కోపంతో ఊగిపోతుంటే మరో పక్క ఎవరో అదే పనిగా నవ్వుతూ పలకరిస్తుంటే ఏం జరుగు తుంది?కోపం చల్లారవచ్చు లేదా తారాస్థాయికి చేరనూవచ్చు.

            ఒకపక్క ఇంట్లో వాతావరణం ఉద్రేకపూరితంగా ఉంటే మరోపక్క ఆలుమగలు అరుచుకోవ డం అగ్నికి ఆజ్యంపోయడమే. ఇద్దర్లో ఎవరో ఒకరు కోపంగా లేకపోతే అరుచుకునే పరిస్థితి ఉండదు. సరసాలు, సరా గాలు నిండినచోట రుసరుసలు, ఉక్రోషాలు మొదలవుతాయి. కంఠస్వరాలు తీవ్రమవుతాయి. అరుపులు పెరుగుతాయి. మాటలు ఈటెల్లా విసురుకుంటారు. ఎత్తిపొడుపులకు దిగుతా రు. స్థిమితాన్ని కోల్పోతారు. ఇదంతా అవసరమా..? ఆలోచించండి. అరచి అనర్థం తెచ్చుకోవడం ఎందుకు? విమర్శించదలిస్తే ఆ పనిని ప్రేమపూర్వకంగా చేయాలి. భార్యా భర్తల మధ్య అలకలు, తగువులు, బుజ్జగింపులు ఇవన్నీ సహజం. మాటకు మాట అంటే జరిగేది వాగ్యుద్ధమే. ప్రపంచ పోకడ గమనించాలి. ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకునేకన్నా ప్రపంచ పోకడల్ని గమనించండి.

            కొద్దిపాటి శ్రద్ధ, జాగ్రత్త వహిస్తే మీది కలతలు లేని కాపురమే అవుతుంది. సంతోషం, ప్రేమ, పేరు ప్రఖ్యాతలు, ఆర్థిక ఉన్నతి సామాజిక ప్రతిపత్తి ఎన్ను కున్న రంగంలో వికాసం ఇవన్నీ సమ కూరాలంటే ఎవరికైనా భాగస్వామి తోడ్పాటు అవసరం. వైవాహిక జీవితం అంటే ఒకేలా ఆలోచించడం కాదు. ఆలుమగలు ఇద్దరూ కలిసి ఆలోచించడం. కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవడం. పొరపాటునో, గ్రహపాటునో ఏదో జరిగింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఆవేశం హద్దులు దాటింది. మీరే ‘సారీ చెప్పవచ్చు మన్నింపును కోరడం చిన్న తనం కాదు..తప్పు తనదే అయినప్పుడు భర్త తన అహాన్ని, పురుషాధిక్య భావనని పక్కనపెట్టి భార్యకు సారీ చెబితే అది ఆమెకు ఎంతో స్వాంతననిస్తుంది. ఊరడింపు బలవర్థక ఔషధంలా పనిచేస్తుంది. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. మాటమాట పెరిగితే జగడాలు. అతిగా మాట్లాడే వారే ఎక్కువగా పొరపాటుచేస్తుంటారు.

            అత్తాకోడళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. శ్రీవారిని, పిల్లల్ని ఆనందపరచడానికి, చిన్నచిన్న బహుమతులు ఇచ్చినట్టే అప్పుడప్పుడు అత్తగారికి కూడా బహుమతులు ఇస్తుండాలిట. అలాగే అత్తగారి తరఫు వారితో, అంటే ఆమె పుట్టింటి వారితో మంచి సంబంధాలు కలిగి వుండాలిట. అన్నిటికంటే ముఖ్యంగా ఎంత బిజీగా వున్నా, అలసిపోయినా సరే అత్తగారితో ఆరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి చెబుతూ కాసేపు కబుర్లు చెప్పాలిట. ఆమె చెప్పే విషయాలని ఓపిగ్గా వినాలిట. ఇలా చేస్తే అత్తాకోడళ్ళ మధ్య మంచి బంధం వుంటుందని అంటున్నారు. అదేంటి... అత్తగారి వైపు నుంచి చేయాల్సినవి ఏం లేవా అంటే... వున్నాయి... అవి కోడలిని ఏ విషయంపైనా ప్రశ్నించకుండా వుండటం. ఆమె పుట్టింటి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పచుకోవటం, మధ్యమధ్యలో ఫోన్ చేసి పలకరించడం వంటి చిన్న చిన్న విషయాలు వారి మధ్య బంధాన్ని చక్కగా వుంచుతాయట.

            ఇక పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇలా బంధం ఏదైనా కానివ్వండి సూత్రం ఒక్కటే అంటున్నారు అధ్యయనకర్తలు. ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకోవడం, తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవటం, కొంచెం సున్నితంగా వుండటం ఇవి ఏ బంధాన్ని అయినా తాజాగా వుంచుతాయిట. ముఖ్యంగా కలిసి గడిపే సమయాన్ని అలవాటుగా మార్చుకుంటే చాలుట. మరి ఆలోచిస్తారు కదూ.

*   *  *


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!