న్యాయాన్ని వంకర్లు తీస్తున్న మహిళలు!

న్యాయాన్ని వంకర్లు తీస్తున్న మహిళలు!

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



భారతీయ సంస్కృతి స్త్రీ రక్షణ కోసం చట్టరీత్యా ఎంతో పటిష్టంగా స్త్రీను అత్యాచారుల నుండి,ఆమెను వేధించే వారు తన వారైనా సరే, పరాయి వారైనా సరే పోరాడటానికి చట్టాన్ని ఆయుధంగా అందించింది. నిర్భయ,దిశ కేసుల్లో జరిగిన న్యాయం స్త్రీకి అండగా చట్టం ఎంత దృఢంగా నిలుస్తుంది అన్న అంశానికి నిదర్శనం.కానీ ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. కానీ ఈ రక్షణ వలయాన్ని దానిని ప్రవేశపెట్టిన కారణం కోసం కాకుండా వ్యక్తిగత కక్షలు సాధించడానికి నేడు స్త్రీలను ఆయుధంగా వినియోగిస్తున్న వారి వల్ల ఈ చట్టం దాని బాధ్యతను దాటి న్యాయానికి నిదర్శనంగా కాకుండా అన్యాయానికి అండగా నిలిచే ఉదంతాలు నేడు పెరిగిపోతున్నాయి.

            కొన్ని ఉదంతాలు మన సన్నిహితులకు జరిగితేనో లేక న్యూస్ లో చూస్తేనే నిర్ధారించుకుంటాం.కానీ నా జీవితంలో ఇది ఎదురైంది కనుక ఇది నిజాయితీకి నిదర్శనంగా ఉంటుందనే భావిస్తున్నాను.

            ఓ పత్రిక దృష్టికి ఓ వ్యక్తికో,వర్గానికో జరుగుతున్న అన్యాయం దృష్టికి వచ్చినప్పుడు దానిని అందరికీ తెలిసేలా చేసి పరిష్కారానికి వారథిగా నిలబడాల్సిన బాధ్యత కచ్చితంగా తీసుకోవాలి.అదే ఆవిర్భవ చేసింది కూడా.జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు ఆవిర్భవ క్రియేటివ్ హెడ్ శ్రీదత్త దృష్టికి వచ్చినప్పుడు, అన్యాయం చేస్తున్న నాయకులను ప్రశ్నించినందుకు, సాక్ష్యాలు బయటపెట్టినందుకు, ఎన్నో గళాలు ముందుకొచ్చి సమస్యలు బయటపెట్టినందుకు ఈ మేలో ఎందరో జూనియర్ ఆర్టిస్టులైన ఆడపిల్లలను వేధించినట్టు కేసులు పెట్టించారు. అసలు ముఖం చూడని అమ్మాయిలను ఎలా విట్నెస్ అండ్ విక్టిమ్ గా పేర్కొంటారో ఆ దేవుడికే తెలియాలి.కానీ ఇన్ వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ అధికారులు కూడా కేవలం వ్యక్తిగత కక్షతో సరిగ్గా చేయకుండా కేసులు బనాయించడం స్వయంగా చూశాను, అనుభవించాను ఓ భార్యగా. ఇంకొక విచిత్రమైన మరియు అర్థం కానీ విషయం ఏమిటంటే ఓ కేసులో అప్పటికే విట్ నెస్ అండ్ విక్టిమ్ గా ఉన్న స్త్రీ చేత మరో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టించడం.

                        సమాజంలో దాదాపు అందరికీ పోలీసులన్నా,కేసులన్నా భయం.పరువు పోతుందన్న భయం తప్ప నిజంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు.కానీ ఈ పోరాటంలో నాకు స్త్రీలకు చట్టపరంగా ఉన్న రక్షణను తమను తాము కాపాడుకోవటానికి అవినీతిపరులు ఎలా దుర్వినియోగపరుస్తారో అర్థమైంది.

            స్త్రీ రక్షణకై ఉద్దేశించబడిన చట్టాన్ని తమ సౌలభ్యం కోసం వాడుకునే అవినీతిపరులను,అలా వారి కోసం తమ హక్కుల్ని దుర్వినియోగపరుస్తూ, ఇంకొకరి క్యారెక్టర్ ని హత్య చేస్తున్న ఆ స్త్రీలను శిక్షించే విధానం మన సమాజంలో ఇంకా లేదు. ఎందుకంటే ఈ కేసులు సంవత్సరాలు నడుస్తాయి. ఈలోపు మామూలుగా భయపడే వారైతే రాజీలకొచ్చి సెటిల్ మెంట్లు చేసుకుంటారు. లేనివారు పోరాడతారు.

            భారతీయ రాజ్యాంగం,చట్టం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటమే ఈ సమస్యకు పరిష్కారం. ఎందుకంటే దాదాపు చాలాసార్లు ఇలాంటి దొంగ కేసులు బనాయించేటప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఇన్ వెస్టిగేషన్ కు అని తీసుకెళ్తారు.ఒకవేళ ఎవరు అడగరు అనుకుంటే రోజంతా వారి అధీనంలో ఉంచుకుని వదిలేస్తారు.నిజంగా ఇది సమస్య అవుతుందని భావిస్తేనే  మెజిస్ట్రేట్ ముందు సబ్ మిట్ చేస్తారు.

            స్త్రీ శక్తి సృష్టినే నిలబడుతుంది. అటువంటి స్త్రీ ఓ అవినీతికి అండగా నిలబడితే దాని పర్యావసానాలు ఓ వ్యవస్థ పతనానికే కారణమౌతాయి. ఆకాశంలో సగం, మేము ఎవ్వరికీ తీసాపోము ,మేము సాధించగలమనే ధైర్యంతో నేటి స్త్రీ ముందడుగు వేస్తున్న ఈ సమయంలో స్త్రీకి కావాల్సింది రిజర్వేషన్ లనే కోటాలు కాదు. స్త్రీ,పురుష సమానత్వం కేవలం అవకాశాలకే పరిమితం కాకూడదు. తప్పు చేస్తే స్త్రీలైనా సరే పురుషులతో సమానంగా శిక్ష అమలు చేసే సంస్కృతి వస్తేనే అన్యాయానికి అండగా నిలబడే చీకటి కోణం నశిస్తుంది.

            ఇక్కడ ఆలోచించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ప్రలోభాలకు లోనై ఇలా చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్న వీరందరి గురించి నిజాలు తేలినప్పుడు మనమందరం ఓహో నిజం ఇప్పటికైనా బయటపడింది అని వదిలేస్తామే తప్ప మనలో ఎవరూ దాన్నీ సీరియస్ గా తీసుకోరు. అప్పటికే రోజులో,నెలలో,సంవత్సరాలో ఈ వ్యథతో విసిగిపోయిన బాధితుడి మనఃస్థితికి, ఆ వ్యక్తి కుటుంబ గౌరవానికి,కేసులకయ్యే ఖర్చులకు ఎవరూ బాధ్యత వహిస్తారు?

            సమాజంలోనో కాదు ప్రతి మనిషి మనసులో జైలు అనేది ఒక సైకోకండిషనింగ్.దాని వల్ల అక్కడ ఉన్నన్నీ రోజులు ఆ వ్యక్తి ధైర్యం నీరసపడిపోతుంది. బయట దీని వల్ల తన కుటుంబం లేదా సంస్థ ఎన్ని అవస్థలు పడుతున్నారో అన్న వ్యథకు చేయని తప్పుకు బలయ్యానన్న భావన తోడై ఆ వ్యక్తి మానసికంగా క్షోభను అనుభవిస్తాడు.అంతేకాక దీని వల్ల అప్పటికే అతనికి ఉన్న వ్యాపార సంబంధాలో లేక మిత్రుల అనుబంధాలో కూడా దెబ్బతింటాయి. వీటికి తోడు అతను జైల్లో ఉన్నంతకాలం అతని కుటుంబం పడే మనఃక్షోభకు జవాబుదారీ ఎవరు?

            ఏ తప్పు చేయకుండా కేవలం కక్షకు బలైనప్పుడు అది మనిషిలో ధైర్యాన్ని చంపేస్తుంది,ఉద్యమాలను నీరుకారుస్తుంది. కానీ కేసు తేలిపోయాక ఇవన్నీ ఎవరూ ఆలోచించరు.అందరికీ ఇవి అనవసరం కూడా.కానీ అనుభవించిన వ్యక్తికి,ఆ వ్యక్తి కుటుంబానికి మాత్రం ఇవి కచ్చితంగా కావాల్సిన అంశాలు.

            ఆలోచించండి...స్త్రీలలో తమ హక్కుల కోసం పోరాడుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న వారు నేడు ఎంతోమంది ఉన్నారు.వారి గురించి అందరికీ తెలిసిందే.కానీ కొందరు స్త్రీల వల్ల బాధితులుగా మారే వారి గురించి ఎందుకు ఈ మౌనం? ఆ బాధితుల భార్యలు,ఇంకా కుటుంబంలో తల్లో,చెల్లో కూడా స్త్రీనే.

    ఏ వస్తువునైనా,అంశాన్ని అయినా మనం చూసే దృష్టి,వినియోగించే తీరును అనుసరించే మంచి,చెడు అనే కోణాలు ఉత్పన్నమవుతాయి. చట్టం స్త్రీ తనను తాను కాపాడుకోవడానికి ఉన్న అస్త్రం. అటువంటి అస్త్రాన్ని విచక్షణతో వినియోగించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన కనీస జవాబుదారీతనం కూడా స్త్రీదే.

            హక్కులకు,బాధ్యతలకు,జవాబుదారీతనంకు మధ్య ఉండే సమన్వయాన్ని స్త్రీలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పౌర హక్కులు కూడా ప్రతి పౌరునికి జీవించే హక్కుని ప్రసాదించాయి. మీ వరకు ఇలాంటివి రాకముందే గళమెత్తండి,చట్టాన్ని దుర్వినియోగపరచకుండా ఉండే యజ్ఞంలో భాగం కండి.

   *    *    *  


Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష