ఓ కులట కథ
చదువరి -9:
ఓ కులట కథ
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ప్రపంచ కథా సాహిత్యంలో చెకోవ్ కేవలం తన 44 ఏళ్ళ జీవిత కాలంలో 1000కి పైగా కథలు రాయడమే కాకుండా, రష్యన్ కథలకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనదే. అయితే ఆయన చనిపోయాక అదీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతనే ఆ గుర్తింపు రావడం గమనార్హం. ఆయన కథల్లో మేటి అనిపించుకున్న కథ 'కులట.'
ఇది 1886 నాటి తరం కథ. 'కులట' ఓ విలక్షణ కథ. లోకం దృష్టిలో వేశ్య సమాజానికి పట్టిన చీడపురుగు. కానీ ఆ చీడపురుగు ఎక్కణ్ణుంచి వచ్చిందని మాత్రం ఆలోచించదు. అందరి చెత్తా దోపిడికి గురవ్వడమే ఆ వేశ్యకు తెలిసిన విషయం. మగాళ్లు ఆమె మానాన్ని దోచుకుంటే, లోకం ఆమె గౌరవాన్ని దోచుకుంటుంది. వేశ్యల్ని నేరస్థురాలిగా అసహ్యించుకునే సమాజం అదే తప్పు చేసిన సమాజం పురుషుల పట్ల పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తుంది. పోలీసులైతే ఓ పక్క వారి నుంచి మామూళ్ళు గుంజుతూనే, మరో పక్క తీవ్ర అణచివేతనూ ప్రయోగిస్తారు. ఇక విటులకు వేశ్యలపట్ల ఆకర్షణ ఉంటుంది. తేలికదనమూ ఉంటుంది. ఈ రెంటినీ భరిస్తూ ఆమె వారికి ఆప్యాయత, సుఖమూ అందించాలి. మనసుతో పని లేదు,కేవలం శరీరంతోనే.
ఇక కథకు వస్తే పాషా మంచి వయసులో ఉన్న స్టేజ్ ఆర్టిస్ట్ ,వేశ్య. ఆమె ఆ రోజు ఓ విటుడితో ఉండగా ఎవరో తలుపు కొట్టడంతో ,ఆ విటుడు లోపల దాక్కుంటే ఆమె తలుపు తీస్తుంది. వచ్చింది ఆ విటుని భార్య. తన భర్తను తనతో పంపించమని, ఆమె కోసమే సంపాదన అంతా తగలేస్తున్నాడని, ఆమె నగలు కూడా అతనే ఇచ్చాడని ఆమె మీద అరుస్తూ, చివరకు ఆమె నగలు తనకిచ్చెయ్యమని గొడవ చేస్తూ అడుగుతుంది. అసలు ఆమె భర్త తనకెప్పుడూ అంత విలువైనవి ఇవ్వలేదని, ఇచ్చింది కేవలం గిల్టు రవ్వల దిద్దులు అని ఆమెకు అవి ఇస్తే వాటిని విసిరి కొట్టి, ఆ నగలు ఇస్తే ఆఫీసులో అతను తీసుకొచ్చిన డబ్బు కట్టేస్తానని గొడవ చేస్తుంది. పాషా ఎంత చెప్పిన ఆమె వినదు. పాషా అలానే ఆ నగలు ఇచ్చేస్తుంది. ఆమె వంటి మీద ఉన్న నగలన్నీ తీసుకునే వరకు ఆమె వదలదు. తర్వాత వెళ్ళిపోతుంది .
అప్పుడు విటుడు బయటకు వచ్చాక అతను తనకేమైనా నగలు ఇచ్చాడా అని అడిగితే లేదనే చెప్తాడు. అంతే కాకుండా తన భార్య గొప్పింటి బిడ్డ అని ,అలాంటి ఉన్నత స్త్రీ ఇలాంటి కులటను బ్రతిమలాడటం, ఆమెను అర్థించే పరిస్థితి రావడం పాపమని, అటువంటి క్షమించరాని పాపం చేశానని ఆమెనే తిత్తి వెళ్ళిపోతాడు విటుడు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న నగలు పోయి, గౌరవం పోయి అలానే ఏడుస్తూ ఉండిపోయిందామె.
ప్రతి వృత్తికి ఈ సమాజంలో ఇచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతూనే ఉంటాయి. వేశ్యా వృత్తిలో మనుగడ కొనసాగించాలంటే పురుషుల ఆసక్తి మీదే ఆధారపడి ఉంటుంది. భార్యల మీద ప్రేమ అందరి ముందు, పరాయి వారితో సంబంధాలు రహస్యంగా పెట్టుకునే వారు, చివరకు భార్య మీద ప్రేమతో ఆమెతో ఉండటం న్యాయమే. కానీ అంత ప్రేమ ఉన్నవారు పరాయి స్త్రీల దగ్గరకు వెళ్ళడం తప్పు కాదా? అవసరం తీరేవరకు ఉండే ప్రేమ,ఆ తర్వాత కనీసం వారి పట్ల మానవత్వం ప్రదర్శించడానికి కూడా వారు అర్హత పొందలేనంత దారుణమైన వ్యక్తులైతే వారిని అవసరానికి మాత్రం ఎందుకు కొనుక్కుంటున్నారు?
తప్పు-ఒప్పుల విచక్షణ అనుబంధాల్లో భార్యాభర్తల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడే విచక్షణ కోల్పోయిన వ్యక్తి తన తప్పు దాచుకోవడానికి పొట్ట కూటి కోసం వళ్ళు అమ్ముకునే వారిని చరిత్ర హీనుల్ని చేయడం కూడా మనుషులో ప్రవృత్తుల్లో ఉన్న ఓ జాడ్యమే.
* * *
ఇంకానయం వాడే భార్యకు నిజం తెలియడంతో నాటకమాడి పాషా
ReplyDeleteనగలు ఎత్తుకు పోయేందుకు నాటకమాడిండేమో. ఎధవల కదా
అది కూడా అయ్యిండొచ్చమ్మా...ఇలాంటి తెలివి గల వాళ్ళు ఉంటారు ...
Delete