కరంట్ బిల్లుపై పోరాటం

 కరంట్ బిల్లుపై పోరాటం   
-రచనశ్రీ దత్త (శృంగవరపు రచన)


 

మధ్య తరగతి జీవితాల్లో బిల్లులు కట్టుకోవడం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అందులోనూ ఆ బిల్లులు ఉజ్జాయింపుగా ఎంత వస్తాయో లెక్కలేసుకుని బ్రతికే జీవితాలు అవి. కానీ భారీ సంఖ్యలో వచ్చిన కరెంట్ బిల్ ఓ మధ్య తరగతి జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో ,ఆ అన్యాయాన్ని'రైట్ తో ఇన్ఫర్మేషన్ ' ద్వారా  ఎలా ఎదిరించారో తెలిపే  మరాఠి సినిమానే 'ఏక్ కప్ చాయ్.' 
మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో కాశీనాథ్ ఓ కండక్టర్.భార్య, ఇద్దరు కూతుళ్ళు ,ఇద్దరు కొడుకులు ,తల్లి కుటుంబ సభ్యులుగా నిజాయితీతో జీవితాన్ని నడిపే వ్యక్తి అతను. కొడుకుల్లో చందన్ పెద్దవాడు ,కాలేజీ విద్యార్ధి అయితే ,చిన్నవాడు అబిర్ 10 వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పిల్ల వాసంతి నర్స్ గా ఆఖరి సంవత్సరం లో ఉంటుంది, రెండో కూతురు వనాదేవి . 
ఆ నెల విద్యుత్ బిల్లు లేటుగా వస్తుంది. అది కూడా 73,000 వస్తుంది. సాధారణంగా 150-250 మధ్య వచ్చే బిల్లు హఠాత్తుగా అన్నీ వేలల్లోకి పెరిగిపోవడంతో షాక్ అవుతుంది కుటుంబం. విద్యుత్ డిపార్ట్మెంటులో అడిగినప్పటికీ ప్రయోజనం ఉండదు. తర్వాత వాళ్ళింటికి వచ్చే కారంట్ వైరును కట్ చేస్తారు. 
డాక్టర్ దుర్గా కనోల్కర్ అనే ఆర్ టి ఐ యాక్టివిస్ట్ సాయంతో ఓ అప్లికేషన్ పెడతాడు. అందులో అడగాల్సిన ప్రశ్నల గురించి కూడా ఆమె చెప్తుంది. మన సమస్యకు కారణాల గురించిన సమాచారం తెలుసుకుంటేనే ఆ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్తుంది. 
1) మా ప్రాంతంలో ఆ సమయంలో మీటర్ రీడింగ్ తీసుకున్న అధికారి ఎవరు ?
2) ఆ రీడింగుల కాపీలు 
2) మా ప్రాంతంలో ఆ సమయంలో వచ్చిన బిల్లుల మాస్టర్ షీట్ 
3)గత మూడు నెలల్లో మా ప్రాంతంలో వచ్చిన బిల్లుల షీట్ 
4) ఇదే సమయంలో పవర్ కట్ చేయబడిన వారి వివరాలు 
ఈ ప్రశ్నల వల్ల ఈ సమస్య కేవలం మనకే ఉందో, లేకపోతే మిగిలిన వారికి కూడా ఇలానే జరిగిందా అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అప్పుడు తప్పు ఎక్కడో జరిగిందో తెలుస్తుంది అని దుర్గా ఇచ్చిన సూచనలను అనుసరించి అప్లికేషన్ పెడతారు. మొదటి సారి స్పందించరు అధికారులు. రెండో సారి దుర్గా సలహాతో మళ్ళీ పెడతారు. 
'ఏక్ కప్ చాయ్ 'అంటే లంచం అనే పదానికి ఉపయోగించిన పదజాలం. లంచం ఇస్తే పని జరిపోతుందని చెప్పినా న్యాయంగా పోరాడటానికే ఇష్టపడతాడు కాశీనాథ్. 
 ప్రక్రియ మొత్తం జరుగుతున్న సమయంలోనే అబిర్ కు ఫైనల్ పరీక్షలు వస్తాయి. ఇంట్లో కరెంట్  లేకపోయినా దీపం సాయంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తాడు. చివరకు ఆ ఇంటికి మళ్ళీ పవర్ లైన్ రావడం ,అబిర్ కు స్టేట్ సెకండ్ రావడం తో కథ ముగుస్తుంది. 
ఓ మామూలు వ్యక్తిలా ఆలోచించే కాశీనాథ్ తనకు సమస్య వచ్చినప్పుడు తన రైట్ టు ఇన్ఫర్మేషన్ హక్కును ఎలా ఉపయోగించుకున్నాడో చెప్తూనే, ఆ కుటుంబ అనుబంధాలు ,నీతికి లోబడి ఉండే తండ్రిగా కాశీనాథ్ ...ఇవన్నీ సినిమాలో చూస్తుంటే ఆ లోకంలోనే ఉండిపోతాము. ఎన్నో సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అందులోనూ మన వల్ల తప్పు లేనప్పుడు ఎవరో చేసిన తప్పును మనం భరించాల్సిన అవసరం లేదు, అటువంటి సందర్భాల్లో పోరాడాల్సిన అవసరం ఉందని అంతర్లీనంగా చెప్పే సినిమా ఇది. 
         *     *      *  





Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ