కేలండర్ గర్ల్స్
కేలండర్ గర్ల్స్
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
గ్లామర్ ప్రపంచం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ రంగంలోకి ప్రవేశించే అమ్మాయిలు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సరే అది వారిని కిందకి పడేస్తుంది. ఈ రంగంలో ఎలాంటి వారు నెట్టుకొస్తారో చెప్తునే, ప్రతిభ -ఆత్మాభిమానాన్ని దీని కోసం చంపుకోనక్కర్లేదని కూడా అంతర్లీనంగా చెప్పే సినిమానే కేలండర్ గర్ల్స్ .
కుమార్ అనే బిజినెస్ మ్యాన్ ,టిమ్మి అనే ఫోటోగ్రాఫర్ జాయింట్ వెంచర్ గా ప్రతి సంవత్సరం కేలండర్ విడుదల చేస్తారు. దాని కోసం కేలండర్ గర్ల్స్ ని ప్రతి సంవత్సరం ఎంపిక చేస్తారు. అలా ఆ సంవత్సరం కూడా హర్యానా లోని రోహ్తక్ నుండి మయూరి చౌహాన్ ,కోల్ కతా నుండి పరోమా ఘోష్ ,హైదారాబాద్ నుండి నందితా మీనన్ ,లాహోర్ నుండి నజీన్ మాలిక్ ,గోవా నుండి షారోన్ ను ఎంపిక చేస్తారు.
వీరి కుటుంబ నేపథ్యాలను కూడా మొదట్లోనే పరిచయం చేస్తారు. మయూరి చౌహాన్ ను ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నారు .తమ కూతురు కచ్చితంగా సాధిస్తుంది జీవితంలో అని వారి నమ్మకం. పరోమా తల్లిదండ్రులకు ,అన్నకు ఆమె మోడలింగ్ కు వెళ్ళడం, ఇలా కేలండర్ గర్ల్ గా చేయడం ఇష్టం లేదు. ఒకవేళ వెళ్తే ఇంటికి తిరిగి రావద్దని చెప్పినా తెగించి వచ్చేస్తుంది పరోమా. నందితా కుటుంబంలో తల్లిదండ్రులు సీఈఓ లు ,అక్క కూడా ఓ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉంది. తనను తాను ఏదో ఒక దానిలో నిరూపించుకోవడానికి కేలండర్ గర్ల్ నిర్ణయం తీసుకుంది నందితా.నజీన్ తన బాయ్ ఫ్రెండ్ ఇంజామామ్ తో లాహోర్ లో ఉంటుంది. తాను జీవితంలో అప్పటి వరకు ఏమీ సాధించలేదని, కేలండర్ గర్ల్ అవకాశం ద్వారా బాలీవుడ్ లో ప్రవేశించే ఆశతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఇంజామామ్ కు ఇష్టం లేకపోయినా అతనికి బ్రేకప్ చెప్పి మరి తన నిర్ణయం మీదే నిలబడుతుంది. షారోన్ తన జీవితంలో ఎదగాలన్న ఆశతో వస్తుంది. తనకి ఇంట్రెస్టింగ్ గా ఉండే పని చేయాలని ఆమె ఆశయం. దానిని కనుగొనే దిశలో ఆమె కేలండర్ గర్ల్ అవుతుంది. ఇలా వీరంతా ముంబైకి వస్తారు.
ఇలా ఈ ఐదుగురు ఆ సంవత్సరం కేలండర్ గర్ల్స్ అవుతారు. జనాలకు వీరి పేరు బాగా తెలుస్తుంది. చిన్న చిన్నగా వీరికి అవకాశాలు వస్తూ ఉంటాయి. వీరిలో నందితా కుటుంబ నిర్ణయంతో సమ్మతించి ఓ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష నరాంగ్ ను వివాహం చేసుకుంటుంది. ఆ కుటుంబం వారు చెప్పినట్టు మోడలింగ్ ను వదిలేస్తుంది. నజీన్ కు ఓ సినిమాలో మంచి అవకాశం వస్తుంది. కానీ అదే సమయంలో పాకిస్తాన్ మీద ద్వేషం పెల్లుబుకడంతో పాకిస్తాన్ కళాకారులు ముంబై గ్లామర్ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాలని నిరసనలు జరుగుతుండటంతో ఆమెకు వచ్చిన అవకాశం వెనక్కి వెళ్ళిపోతుంది. తిరిగి లండన్ కు వెళ్ళలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్కార్ట్ గర్ల్ గా మారుతుంది. అలా ఉన్న సమయంలో నజీన్ దగ్గరకు ఓ సారి వచ్చిన క్లయింట్ హర్ష అవ్వడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక ఆ వృత్తిని వదిలేద్దాము అనుకున్న సమయంలో లాస్ట్ క్లయింట్ అధికంగా వయాగ్రా వేసుకోవడంతో అది అతని ప్రాణాల మీదకు తెస్తుంది, ఆ సమయంలో హడావుడిగా బయట రోడ్ మీద చూసుకోకుండా నడవటంతో యాక్సిడెంట్ కు గురై మరణిస్తుంది. పరోమా బాయ్ ఫ్రెండ్ అయిన పినాకి ఆమె ప్రేమను బలహీనతగా చేసి ఆమెను తన క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ క్లైంట్స్ కు తార్చి లక్షలు సంపాదిస్తాడు. అదంతా అతని మీద ప్రేమతో చేస్తుంది పరోమా. చివరకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ బయట పడి, ఆమెను అరెస్ట్ చేస్తారు మిగిలిన వారితో పాటు. అప్పటికే పినాకి పారిపోతాడు. ఆమెను అన్న,తండ్రి విడిపించి తిట్టి వెళ్ళిపోతారు.
షారోన్ తన ఎసైన్ మెంట్స్ హ్యాండిల్ చేయడానికి పెట్టుకున్న అనిరుధ్ తనతో సంబంధం ఉన్నట్టు అతనే రూమర్స్ సృష్టిస్తున్నాడని తెలుసుకుని అతన్ని ఆఫీసులో చెంప దెబ్బ కొట్టి అతన్ని క్యాన్సిల్ చేస్తుంది. దానితో అనిరుధ్ తో గొడవ వల్ల ఆమెకు ఆఫర్స్ రావు. తర్వాత ఆమె శశాంక్ అనే జర్నలిస్ట్ ను కలుస్తుంది. అలా యాంకర్ గా ,ఆ తర్వాత న్యూస్ స్ట్రీమ్ జర్నలిస్ట్ గా ప్రమోట్ అవుతుంది షారోన్. మయూరి తన సోషల్ నెట్వర్కింగ్ స్కిల్స్ తో చివరకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాధించే స్థాయికి ఎదుగుతుంది.
ప్రతి అమ్మాయి ఎన్నో కలలతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ప్రతి రంగం ఎలా అయితే వ్యక్తి ప్రతిభకు వేదికలో అలాగే ఈ గ్లామర్ ప్రపంచం కూడా. ఇక్కడ మనుషులతో సంబంధాలు అనేవి చాలా ముఖ్యం. నొప్పించక, తానొవ్వక అన్నట్టు ప్రవర్తిస్తేనే ఇక్కడ విజయం సాధించగలరు. అందుకే షారోన్ స్ట్రెయిట్ గా ఉండటం వల్ల అవకాశాలు కోల్పోయింది. కానీ తన ప్రతిభతో జర్నలిస్ట్ అయ్యింది. ఇక కుటుంబం కోసం రాజీ పడిపోయి ,భర్త అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్న భరించిన అమ్మాయి నందితా. గతి లేని పరిస్థితుల్లో ఎస్కార్ట్ గార్ల్ గా మారింది నజీన్ . బాయ్ ఫ్రెండ్ కోసం మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుంది పరోమా. ఇలా పరిస్థితులు మనుషులను మారుస్తాయి. మయూరి మాత్రం టెక్నాలజీ ని ,హ్యూమన్ రిలేషన్స్ ని సమన్వయ పరుస్తూ తన లక్ష్యాన్ని సాధించింది .కానీ ఏదైనా సాధించాలి అన్న తపన ఉన్నవారు ఏ రూపంలో అయినా సరే తమను తాము నిరూపించుకుని తీరుతారు అని అంతర్లీనంగా చెప్పే సినిమానే కాలెండర్ గర్ల్స్.
* * *

Comments
Post a Comment