ఏది చెత్త ?

ఏది చెత్త ? 
                                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



భార్యాభర్తలు ఇద్దరికీ  కూడా పెళ్ళి కాక ముందు తమ జీవిత భాగస్వామి ఇలానే ఉండాలి అనే కలలు కనే స్వేచ్చ ఉంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ ఊహలు వాస్తవానికి దూరంగా ఉన్నప్పుడూ, జీవితంలో కచ్చితంగా  రాజీ పడాల్సి వస్తే, ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి ఇంకో ఉచ్చులోకి దిగితే అప్పుడు మొదటి పరిస్థితి  కన్నా రెండో పరిస్థితి మరింత దారుణంగా తయారు కావచ్చు. భర్త మీద అసహ్యం కలిగిన సమయంలోనే ఆమెకు ఇంకొక వ్యక్తి తారసపడటం అన్నది ఆమె జీవితాన్ని ఎలా మార్చింది, నిజమైన ప్రేమ ఎవరి మనసులో నిలిచే ఉంటుందో తెలిపే తమిళ సినిమా 'ఓరు కుప్పై కథై 'అంటే 'చెత్త కథ 'అని అర్ధం. ఈ సినిమా అటు దర్శకులు కాళి రంగస్వామికి దర్శకులుగా మొదటిది. అలాగే అప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా ఉన్న దినేష్ ను హీరోగా పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. 
కుమార్ చెత్త ఎత్తే పారిశుద్ధ్య కార్మికుడు. అతనికి ఉంది తల్లి ఒక్కటే. నివసించేది ఓ స్లమ్ ప్రాంతంలో. అతనికి పొంగడితో పెళ్ళి కుదర్చడానికి ఆ పెళ్ళిళ్ళ పేరయ్య కుమార్ ఓ క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాడని అబద్ధం చెప్తాడు. అది పెళ్ళి చూపుల రోజే పెళ్ళి కూతురి తండ్రికి నిజం చెప్తాడు కుమార్. అతని నిజాయితీ నచ్చి తన కూతురితో పెళ్ళికి ఒప్పుకుంటాడు ఆ తండ్రి. కానీ కొంతకాలం వరకు ఆ విషయం తన కూతురికి చెప్పవద్దని, సమయం వచ్చినప్పుడు తామే చెప్తామని,అప్పటికి అతని మనసును ఆమె బాగా అర్ధం చేసుకుంటుందని నచ్చచెప్పి వివాహం చేస్తాడు. 
తన భర్త క్లర్క్ అనే అనుకుంటుంది పొంగడి. మూడు నెలలకు ఆమె గర్భవతి అవుతుంది. హాస్పటల్ నుండి వచ్చేటప్పుడు భర్త చెత్త ఎత్తడం చూసి నిజాన్ని గ్రహిస్తుంది. అప్పటి నుండి భర్త మీద అసహ్యం పెంచుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అతన్నే సమర్ధిస్తారు. అందుకే చేసేది లేక అతనితోనే ఉన్నా అతనికి దూరంగానే మసులుతూ ఉంటుంది. భార్య కోసం మంచి అపార్ట్మెంటులోకి మారతాడు కుమార్. తల్లి ఆ స్లమ్ ఏరియాలోనే ఉంటుంది ,ఈ దంపతులు మాత్రం ఇక్కడ ఉంటారు. 
వారికి అపోజిట్ ఫ్లాట్ లో ఉండే అర్జున్ ధనవంతుడు,సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు. క్రమక్రమంగా అతని పట్ల ఆకర్షణతో బిడ్డతో సహా అతనితో వెళ్లిపోతుంది పొంగడి. ఆ రోజే భార్య కోసం తనకు ఎంతో ఇష్టమైన  ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగంలో చేరదామనుకున్న కుమార్ ఈ విషయం వాచ్ మెన్  ద్వారా తెలిసి కృంగిపోతాడు. 
ఆ తర్వాత అతను మానసికంగా క్రుంగిపోయి మందుకు బానిస అవుతాడు. కొంత కాలానికి అతని తల్లి కూడా మరణిస్తుంది. తన తల్లిదండ్రులకు తెలియకుండా ఓ స్నేహితుడి ప్రోద్బలంతో  పొంగడితో సహజీవనం కొనసాగిస్తూ ఉంటాడు అర్జున్. అర్జున్ బంధువులకు అతను పెళ్ళైన పిల్ల తల్లితో ఉంటున్నాడని తెలిసి మందలించడంతో ఆమెను వదిలించుకోవడానికి ఆమెను  తన స్నేహితుడికి అప్పగించి తను తిరిగి వస్తానని ఆమెకు చెప్పి వెళ్తాడు. అలా తను మోసపోయిందని అర్ధం చేసుకుంటుంది పొంగడి. ఆ స్నేహితుడు ఆమెను లొంగదీసుకోబోతుంటే అతన్ని హత్య చేస్తుంది ఆమె. తర్వాత తన బిడ్డను చూడటానికి ఆమె దగ్గరకు వచ్చిన ఆమె భర్త కుమార్ నిజం తెలుసుకుని ఆ హత్యా నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్తాడు. తప్పు భార్య చేసిన ప్రేమతో ఆమెను క్షమిస్తాడు. 
పొంగడి తిరిగి ఆ స్లమ్ ప్రాంతానికి కూతురుతో వెళ్ళిపోతుంది. అప్పటి వరకు అసహ్యించుకున్న ఆమె భర్త యూనిఫార్మ్ ను తానే ధరించి పారిశుద్ధ్య కార్మికురాలిగా మారడంతో సినిమా ముగుస్తుంది. 
ఆ స్లమ్ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు కూడా ఏ నాడు కోపం చూపించని పొంగడి తన భర్త ఉద్యోగం గురించి తెలిసినప్పుడు మాత్రం అసహ్యించుకోవడానికి కారణం ఆమెకు తన మిత్రుల్లో ,బంధువుల్లో తన భర్త క్లర్క్ ఉద్యోగ గొప్ప ఇప్పుడు లేదని. ఇవే ఆమెను అర్జున్ వైపుకు ఆకర్షించబడేలా చేశాయి. 
నిజమైన చెత్త కుమార్ ఉద్యోగానిదా ? లేక మనుషుల మనసుల్లో ,మోసం చేసే ప్రవృతుల్లో ఉందా ? అన్న ఆలోచన ప్రేక్షకులకు వదిలెయ్యడమే ఈ సినిమా అంతర్లీన సందేశం. అందుకే ఈ సినిమా ట్యాగ్ లైన్ కూడా 'టు ఎర్ ఈజ్ హ్యూమన్ ' అని పెట్టి ఉండవచ్చు. ఏదైనా మనిషి ఆలోచనల్లో ఉండేదే చెత్త తప్ప ,ఏ ఉద్యోగంలోనూ కాదు అని చెప్తూనే మనిషి ఉద్యోగం ,హోదా కన్నా భర్తగా భార్యను ఎంత భరిస్తాడు అన్నదే నిజమైన ప్రేమకు నిదర్శనం అని కూడా ఈ సినిమా చెప్పకనే చెప్తుంది. 
*   *    *  




Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ