భార్యాభర్తల ప్రేమ నలుగురి కోసమా ?
చదువరి -6:
భార్యాభర్తల ప్రేమ నలుగురి కోసమా ?
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
హిందీ రచయిత్రి కమలా చౌదరి కథ 'కర్తవ్యం' భార్యలు తమ భర్తలు తమను అమితంగా ప్రేమిస్తున్నారనే భావనను ఎంతగా ఇష్టపడతారో, అది వాస్తవంలో అబద్ధం అని ఋజువైనప్పటికీ దానిని ఇంకా నిజమనే భ్రమలోనే బ్రతకడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలియజెప్తుంది. ఉష భర్త ఆమెను అమితంగా ప్రేమిస్తాడని, ఇతర ఆడవాళ్ళ కన్నా ఆమె ఎంతో అదృష్టవంతురాలని భావిస్తూ ఉంటారు. ఉష కూడా ఇతర భర్తలెవరు తన భర్తలా భార్యల్ని ప్రేమించరు.గౌరవించరు. ఇది ఆమె బాగా పరిశీలించిన మీదట తెలుసుకున్న నగ్నసత్యం. తన భర్త తన గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఉండడు. ఎప్పుడూ ఏ విషయంలోనూ తనను అశ్రద్ధ చేయడు. అందుకే తనను పుట్టింటికి వెళ్లినా ఉండలేడు. ఇలా భర్త గురించి ఉష కూడా అనుకుంటుంది.
ఓ సాయంత్రం భర్తతో బోటు షికారుకు వెళ్తుంది ఉషా. ఎక్కాల్సినా దాని కన్నా రెట్టింపు జనం ఎక్కడంతో ఆ పడవ బరువు ఎక్కువై మునిగిపోయే పరిస్థితి రావడంతో అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందులోంచి దూకేస్తూ ఉంటారు.
ఉష భర్త కూడా అదే పనికి సిద్ధపడుతూ ఉండగా ఉష, అతను దూకి తనను కూడా రక్షిస్తాడు లేదా ఈ ప్రయత్నంలో ఇద్దరం మరణిస్తాము అని అనుకుంటుంది. తను దూకి ఒడ్డుకి చేరుకున్న ఆ భర్త భార్య వైపు కన్నెత్తి కూడా చూడడు. ఈ సంఘటనతో ఆమె దిగ్భ్రాంతికి లోనవుతుంది. ఎలాగో ఆ ప్రమాదం తప్పి ఆ పడవ ఒడ్డు చేరుకుంది. గజ ఈతగాడైన ఆ భర్త ఆ భార్యను అలా వదిలెయ్యడంతో కొందరు అతన్ని చీవాట్లు కూడా వేస్తారు.
మనసులో ఉష కూడా ఇన్నాళ్ళు తన భర్త తనను ఎంతో బాగా ప్రేమిస్తాడని తెలిసిన విషయం కాస్తా ఈ సంఘటన వల్ల బంధుమిత్రుల్లో ఎలా మారుతుందో అని ఆలోచిస్తుంది. భర్త మాత్రం ఆమె ముందు దోషిలా నిలబడతాడు. అందరి ముందు ఉక్రోషం చూపించలేక భర్తను అంతకు ముందు లాగే ప్రేమతో ఉండి అక్కడి నుంచి బయల్దేరదీస్తుంది.దీనితో కథ ముగుస్తుంది.
మన సమాజంలో కూడా భార్యాభర్తల మధ్య ప్రేమ నేడు నిజంగా ఉందా ? లేక లేకపోయినా నలుగురి ముందు గొప్ప కోసం అలా నటిస్తున్నారా? నిజంగా ప్రేమ అంటే జీవిత భాగస్వామి పట్ల బాధ్యతగా వ్యవహరించడం. అది లేనప్పుడు నగలు,బట్టలు, సినిమాల ద్వారా ప్రేమ వ్యక్తపరచినా అది నిజమైన ప్రేమ అవుతుందా? అంటే కచ్చితంగా ఎన్నో పెళ్ళిళ్ళల్లో ఈ సమాజ ప్రదర్శన కోసం ఈ ప్రేమ నగలు,బట్టలు లేదా సౌకర్యాల ద్వారా ఓ సాధనంగా మలుచుకున్నారేమో అనిపించక తప్పదు.
ఓ పక్క అంత పెద్ద ప్రమాదంలో భర్త తన స్వార్ధం గురించి మాత్రమే ఆలోచించుకుని ఆమెను మధ్యలో వదిలేసినా ఉష మాత్రం,'భారతీయ స్త్రీకి కావాల్సింది ఏమిటి ? పసుపు కుంకుమా? తన భర్త తనకు అవి మిగిల్చాడు. ఇక విచారించాల్సింది దేనికీ?' అని అనుకుని గట్టిగా గాలి పీల్చుకుంది. ఈ వాక్యాలతో స్త్రీ తన భర్త తనను వ్యక్తిగతంగా ఎలా చూసుకున్నా సరే సమాజంలో మాత్రం అమితంగా తననే ప్రేమిస్తాడు అనే భావనను ప్రదర్శించగలిగితే సంతోషిస్తుంది అనే దృక్కోణాన్ని రచయిత్రి ఈ కథ ద్వారా స్పష్టం చేసింది.
మనుషుల జీవితాల్లో మరి ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధాల్లో ఈ నలుగురి ముందు నటన మనం దాదాపు చూసేదే. ఈ కథ చదువుతుంటే 'అవును నిజమే!' అని అనిపించక మానదు.
* * *

Comments
Post a Comment