ఫ్రీ లాన్సింగ్ రైటర్స్ రాజీ పడాలా?

ఫ్రీ లాన్సింగ్ రైటర్స్ రాజీ పడాలా?
(శ్రీలాన్సర్   సినీ సమీక్ష) 
       -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)

  

 అక్షరాన్ని,సృజనాత్మకతను నమ్ముకున్న ఎంతోమంది కళాకారుల జీవితమే  'శ్రీలాన్సర్' సినిమా  ఓ రకంగా. ఫ్రీ లాన్సింగ్ పనుల్లో చాలా వరకు పేమెంట్స్  సకాలంలో అందవు, కొన్నిటికి రానే రావు కూడా. శ్రీపాదనాయక్  బెంగుళూరులో  నివసించే  ఓ ఫ్రీ లాన్స్ కాపీ  రైటర్ . మధ్య ఇరవైల్లో ఉన్న ఇతను బిటెక్ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ రైటింగ్ మీద ఉన్న ప్యాషన్ తో యాడ్స్ ,వెబ్ సైట్స్, మరణ సంతాప వార్తల వరకు అన్ని అసైన్ మెంట్స్ చేస్తూ ఉంటాడు.తల్లి మరణం తర్వాత వస్తున్న ఫిక్స్ డ్ డిపాజిట్ ,తండ్రి పెన్షన్ జీవనాధారంగా గడుపుతున్న కుటుంబం శ్రీపాదనాయక్ ది.
ఓ స్నేహితుడి వివాహానికి నార్త్ ఇండియా వెళ్ళిన శ్రీపాద అతని స్నేహితుడు తన స్నేహితుల రెస్టారెంట్ కు కంటెంట్ రైటింగ్ అసైన్మెంట్ మాట్లాడానని చెప్తే ఆ వివాహం అయ్యాక,వారితో కలిసి అనుకోకుండా మనాలి వెళ్తాడు. అక్కడ ఆ స్నేహితుల మధ్య అయిన గొడవల్లో జోక్యం చేసుకోవడంతో అతన్ని స్పృహ తప్పేలా కొట్టి ఓ ట్రాక్ లో వదిలేస్తారు. 
ఆ ట్రక్ అసాంఘిక కార్యకలాపాలు చేసేది కావడంతో వారు అతనికి హాని తల పెట్టబోతుంటే అక్కడ ఉన్న స్త్రీ సాయంతో తప్పించుకుంటాడు. అక్కడ నుండి ఇంటికి వెళ్లడానికి డబ్బులు కూడా ఉండవు. ఆ సమయంలో లిఫ్ట్ అడిగి ఓ కార్ ఎక్కుతాడు. ఆ కార్ డ్రైవర్ తన వెబ్ సైట్ మార్చమంటే దాని కోసం ఆ రాత్రి అక్కడ వారితో హోటల్ లో ఉండిపోతాడు. ఆ కారులో ఉన్న టూరిస్ట్ జంటలో స్త్రీతో రోమాన్సులో ఉండగా ఆమె భర్త రావడంతో అక్కడ నుండి పారిపోతాడు. ఆ వెబ్ సైట్ కు ఇచ్చిన అడ్వాన్సుతో ఇంటికి చేరుకుంటాడు. 
తండ్రి సలహాపై ఓ ఇంటర్ వ్యూ కి హాజరై ఉద్యోగంలో చేరతాడు. కానీ అక్కడ సంతృప్తి లేక ఆ ఉద్యోగం వదిలేస్తాడు. అతని తండ్రి ఓ భద్రత ఉన్న ఉద్యోగంలో మంచి ప్యాకేజీలో కొడుకు స్థిరపడాలని కోరుకున్న వ్యక్తి. ఆ ఉద్యోగం వదిలేశాక తండ్రితో కేరళ వెళ్తాడు మధుర స్మృతుల కోసం. తర్వాత శ్రీలాన్సర్ పేరుతో ఫ్రీ లాన్సర్స్ కోసం ఒక కో వర్కింగ్ స్పేస్ కొంత ఫీజు కట్టి అక్కడ ఫ్రీ లాన్సర్స్ పని చేసుకునేలా ఏర్పాటు చేస్తాడు. అలా మొదట తను ప్రతిభపై నమ్మకం లేని స్థాయి నుండి ఆ నమ్మకం బలపడిన వ్యక్తిగా ఎదగడంతో కథ ముగుస్తుంది. 
ఈ సినిమాలో ఇంట్లో పని చేసుకోవడానికి  డిస్ట్రబెన్స్ అనిపించి తన మూడ్ కు తగ్గట్టు ఒక్కో కేఫేలో  పని చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఫేస్ బుక్ లో అప్డేట్స్ పెడుతూ తన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని దాని ద్వారా పంచుకుంటూ ఉంటాడు. 
ఈ సినిమా చూస్తుంటే కేవలం తన సృజనాత్మకతను నమ్ముకుని, తమ మనసుకు సంతృప్తిని ఇచ్చేలా బ్రతకాలని ఆశపడే ప్రతి ఆత్మ ఇక్కడ కనిపిస్తుంది. తమకు నచ్చినట్టు బ్రతకాలనుకునే వారు,తమ కళలో లీనం అవ్వాలనుకునేవారు తమ ఆలోచనలలో అత్యున్నత ఆచారణాత్మక వ్యూహాలతో కొనసాగితేనే జీవితంలో విజయవంతం అవుతారనే అంతర్లీన సందేశం కూడా ఉంది. తన స్నేహితుడి పెళ్ళికి వెళ్లడానికి కూడా ఆ స్నేహితుడే డబ్బులు ఇవ్వడం ఫ్రీ లాన్సింగ్ లో కళా సంతృప్తి ఉన్నప్పటికీ ఆర్థికంగా రాజీపడక తప్పని సందర్భాలు ఉంటాయని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఫ్రీ లాన్స్ రైటర్స్ కు ఈ పరిస్థితులు అధికంగా ఎదురవుతాయి. ఈ సినిమాలో మనలో మనల్ని కచ్చితంగా కొన్ని సందర్భాల్లోనైనా చూసుకోవచ్చు. 
                             *      *       *  
























Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష