భర్తల మీద అనుమానం కూడా జబ్బే!
భర్తల మీద అనుమానం కూడా జబ్బే!
(కోలి సినిమా సమీక్ష)
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
2003 లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా 'నటాలియా' కు 2009 లో చేసిన ఇంగ్లీష్ రీమేక్ 'కోలే' సినిమా. తన భర్త మీద అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఓ వైద్యురాలు ఓ అమ్మాయిని నియమించి చివరకు ఎలాంటి చిక్కుల్లో చిక్కుకుందో తెలిపే సినిమా ఇది.
క్యాథరిన్ ఒక గైనకాలజిస్ట్. ఆమె భర్త డేవిడ్ ప్రొఫెసర్. అతని పుట్టిన రోజుకు ఓ సర్ ప్రజ్ పార్టీ ఏర్పాటు చేస్తుంది క్యాథరిన్. కానీ తను ఫ్లైట్ మిస్ అయ్యానని అందుకే రాలేనని చెప్తాడు. మర్నాడు అతని ఫోనులో ఓ స్టూడెంట్ తో కలిసి దిగిన ఫోటో చూసి క్యాథరిన్ భర్త తనను మోసం చేస్తున్నాడని అనుమానిస్తుంది. ఒక రోజు రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు కోలి పరిచయమవుతుంది.
కోలి ఓ కాల్ గర్ల్ . తన భర్త మీద తనకు అనుమానం ఉందని , అతన్ని పరీక్షించాలని అనుకుంటున్నానని ,అందుకే ఆమె అతనితో సన్నిహితంగా ఉండి అతని ప్రవర్తన గురించి చెప్పాలని అడుగుతుంది. అందుకు డబ్బులు ఇస్తానని చెప్తుంది.
అలా కోలి రోజు ఆమె భర్తను కలిసిన విషయాలు అన్ని చెప్తుంది. ప్రతి రోజు అతన్ని కలిసినట్టు , ఆ కలుసుకున్న వివరాలు అన్ని చెప్తుంది కోలి ఆమెకు. అలా ఓ రోజు అతనితో కలిసినట్టు చెప్పి ఆ హోటల్ కు రమ్మంటుంది. ఆ రోజు అక్కడకు వచ్చిన క్యాథరిన్ విచిత్ర పరిస్థితుల్లో కోలితో సంపర్కం పెట్టుకుంటుంది.
ఆ తర్వాత కోలి చెప్పినవేమీ నిజాలు కావని భర్త ఉన్న చోటకు ఆమెను రమ్మంటే అతన్ని చూడగానే ఆమె పారిపోవడాన్ని బట్టి గ్రహించిన క్యాథరిన్ జరిగిందంతా భర్తకు చెప్తుంది.డేవిడ్ తనకు ఎవరితోనూ ఏ సంబంధం లేదని ఆ పార్టీ ఇష్టం లేక తప్పించుకున్నానని, అలాగే అమ్మాయిలను చూసినప్పుడు ఫీలింగ్స్ కలిగిన మాట నిజమే కానీ ఏనాడూ ఏ సంబంధం పెట్టుకోలేదని చెప్తాడు. దానితో వారిద్దరి మధ్య ఉన్న మిస్ కమ్యూనికేషన్ పొర తొలగిపోతుంది.
కోలిని వదిలించుకోవడానికి క్యాథరిన్ ప్రయత్నించినా కోలి తనకు ఆమె అంటే ఇష్టమని ఆమెను వదిలిపెట్టలేనని చెప్తుంది. క్యాథరిన్ కొడుక్కి క్యాథరిన్ పోలికలు ఉండటంతో అతనితో పరిచయం పెంచుకుని అతనితో క్యాథరిన్ బెడ్ రూమ్ లో క్యాథరిన్ వస్తువులు చూస్తూ సంభోగిస్తుంది. ఈ లోపు క్యాథరిన్ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు కోలి తనను ప్రేమిస్తున్నట్టు చెప్పమని క్యాథరిన్ ను బెదిరించి ఓ ముద్దు పెట్టుకోబోతుండగా అదే సమయంలో క్యాథరిన్ కొడుకు మైకేల్ రావడంతో క్యాథరిన్ ఆమెను పక్కకు తోస్తే కోలి కిటికీ అద్దం లోంచి పడిపోబోతూ ఫ్రేమ్ ను పట్టుకున్నా కావాలని వదిలేసి కింద పడి చనిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత కోలి తనకిచ్చిన హెయిర్ పిన్ ను క్యాథరిన్ పెట్టుకుంటుంది.
భార్యాభర్తల మధ్య అనుమానాలు వారిద్దరి జోక్యానికి మాత్రమే పరిమితమైతే అప్పుడు ఆ బంధంలో ప్రేమ మిగులుతుంది. ఎప్పుడైతే ఆ అనుమానం మూడో వ్యక్తి ప్రవేశానికి తావు ఇస్తుందో అప్పుడు ఆ అనుబంధంలో మిగిలి ఉన్న ప్రేమ కూడా అంతమవుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం మనసుకు సంబంధించింది. అది వారిద్దరు తమ ప్రవర్తనలతో గెలుచుకోవాల్సిందే తప్ప పరీక్షల ఆధారంగా కాదు అని ఈ సినిమా స్పష్టం చేస్తుంది.
ఆ ప్రవేశించిన మూడో వ్యక్తి ఎప్పుడు తన లాభానికి వారిద్దరి మధ్య అపోహలు ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించే మనస్తత్వాన్నే కలిగి ఉండవచ్చు.అప్పుడు పరిస్థితులు పూర్తిగా చేజారుతాయి. తమను ఎదుటి వ్యక్తి అనుమానించి ఇంకో వ్యక్తిని తమపై నిఘాకు వినియోగించారనే ఆలోచన మానసికంగా ఆ జీవిత భాగస్వామిని ఎంతో వ్యథకు గురి చేస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం వ్యక్తిగత పనుల వల్ల ,ప్రేమ వల్ల గెలుచుకోవాల్సిందే తప్ప సాక్ష్యాలతో కాదు అని తెలిపే సినిమా ఇది.
* * *

Comments
Post a Comment