రహస్య సంబంధాల రహస్యం

చదువరి-4 :
రహస్య సంబంధాల రహస్యం 
             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


 నోబెల్ పురస్కార గ్రహీత జె.యం.కుట్టీ కథ 'సురయ్యా' ఓ వినూత్న కోణాన్ని పరిచయం చేస్తుంది. ఈ కథలో అతని వయసు  52 ఏళ్ళు. భార్య మరణించింది. ఎదిగిన కూతురుంది. కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ గా ఉద్యోగం అతనిది. ఏజెంట్ల ద్వారా సెక్స్ వర్కర్స్ కోసం ప్రయత్నించి 'సురయ్యా' అనే ఆమె ఫోటోలు చూసి నచ్చి,ఓకే చేసుకుంటాడు. ప్రతి గురువారం మధ్యాహ్నం గంటన్నర గడిపి 400 రాండ్స్ (దక్షిణాఫ్రికా కరెన్సీ ) ఇచ్చి వెనుతిరుగుతాడు. 
ఆ రూమ్ వరకే వారు పరిచితులు. బయట అపరిచితులు. అయినా తన గురించి ఆమెతో పంచుకున్నా, ఆమె మాత్రం తన వ్యక్తిగత విషయాలు గోప్యంగానే ఉంచుతుంది. ఆమె పొట్ట మీద మచ్చలను చూసి ఆమెకు పిల్లలున్నారని అనుకుంటాడు. ఓ సారి అనుకోకుండా ఆమెను రోడ్డు మీద చూస్తాడు, ఇద్దరు పిల్లలతో. వారికి ఆమె పోలికలు వచ్చాయనుకుంటాడు. ఇద్దర్ని ఒకరిని ఒకరు చూసుకున్నా అపరిచితుల్లనే వెళ్లిపోతారు. 
అప్పటివరకూ ఆమె మీద ఉన్న కోరికలు, ఆమెకు ఓ వ్యక్తిగత జీవితం ఉందని తెలియగానే కొంచెం తగ్గినట్టు అనిపించినా, ఆమె కోసం తర్వాత వెళ్ళినప్పుడు తర్వాతి వారం తనుండనని చెప్తుంది. తర్వాత నుంచి ఆమె రావడం మానేస్తుంది. కష్టపడి ఆమె నంబర్ వెతుక్కుని కాల్ చేస్తే అపరచితురాలిలాగా అతనెవరో తనకు తెలియదని, ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లయింట్ ఇస్తానని చెప్పి పెట్టేస్తుంది. 
రహస్య సంబంధం ఉన్నంత మాత్రాన  సంసారాన్ని వీధిలో పడేసుకునే స్త్రీలెవరూ ఉండరని ఆ కమ్యూనికేషన్స్ ఎక్స్పర్ట్ కు తెలియదు. రహస్య సంబంధాలు రహస్యంగా ఉన్నంతవరకే రసవత్తరంగా ఉంటాయి. ఎక్కువ తెలుసుకుంటే జీవితం ఎటు వెళ్తుందో ఊహించలేము. 
జీవితంలో ఎవరైనా ఇంకొకరిని ఎప్పుడు అధికంగా ప్రేమిస్తారు,వాంఛిస్తారు  అంటే ఎప్పుడైతే వారు కేవలం తమను మాత్రమే ప్రేమిస్తారు అని అనుకున్నప్పుడు మాత్రమే. సురయ్యా వ్యక్తిగత జీవితం గురించి తెలియనంతవరకు కూడా అతను ఆమె మీద పెంచుకున్న కోరిక కూడా అలానే ఉంది. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో రెండు రకాల ప్రవర్తన ఆ మనుషుల్లో కనిపిస్తుంది. 
కొందరు ఇక ఆ వ్యక్తి గురించి పట్టించుకోరు. కానీ ఈ కథలో అతను మాత్రం ఆమె మీద ఆసక్తి తగ్గినా సరే  ఆమె మీద కుతూహలం ప్రదర్శించాడు. తెలివైన స్త్రీగా ఆమె వృత్తిగా ఆ పని చేసినా తన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడమే ముఖ్యం అనుకుంటుంది తప్ప రహస్య సంబంధాన్ని నిలబెట్టుకోవడం కాదు. అందుకే ఒక్కసారి అతను తన జీవితం గురించి తెలుసుకుంటున్నాడు అని తెలియగానే అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. 
జీవితంలో రహస్య సంబంధాలకు ఉన్న రహస్యం ఏమిటంటే రహస్యంగా ఉన్నంతవరకే వాటిని ఇద్దరూ ఆస్వాదించగలరు. ఎప్పుడైతే వారి వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూసే ప్రయత్నం ఎదుటి వ్యక్తి చేస్తారో అప్పుడు ఆ సంబంధం బీటలు వారినట్టే.  ఆ రహస్య జీవితం వెలుపల ఉన్న జీవితంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే అది ఆ రెండు జీవితాల్లోని ఆ రహస్య మాధుర్యాన్ని లేకుండా చేస్తుంది. రహస్యం అన్నది జీవితంలో ఓ పార్శ్వంలా దాన్ని ఎవరు చూడకుండా,ఏ వారి దృష్టికి రాకుండా కాపాడుకోగలము అన్న నియమమే ఆ బంధానికి ఉన్న ఒకే రహస్యం. అది దాటితే ఈ కథలో అతని లానే ఆ బంధాన్ని కోల్పోవాలి. 
*     *      *  




Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ