సైకాటిక్ అభిమాని

సినీ సంచారం 
సైకాటిక్ అభిమాని 
                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

   

ఫ్రెంచ్ రచయిత్రి డెల్ఫైన్ డి విగాన్ నవలల్లో  ఎక్కువగా మనుషుల్లో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాల ఆధారంగా,అవి వర్తమానాన్ని ,భవిష్యత్తును ఎలా నడిపిస్తాయి అనే కీలకాంశాల మీద అంతర్లీనంగా ఆధారపడి ఉంటాయి. అలా ఆమె రాసిన నవలల్లో ఒకటైన  D'apre's une histoire vraie ' ఆంగ్లం కి ''Based On A True Story'' పేరుతో అనువదించబడింది. అదే పేరుతో దాన్ని ఫ్రెంచ్ దర్శకులు రోమన్ పొలంస్కీ సినిమాగా తీశారు. ఈ సినిమా మొత్తం ఓ రచయిత్రికి ,ఆమె సైకాటిక్ అభిమానికి మధ్య ఉండే బంధం గురించి తెలుపుతుంది.
డెల్ఫైన్ అనే రచయిత్రి తన మొదటి నవలతో గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమెకు ఎంతోమంది అభిమానులవుతారు. మొదటి నవల తన వ్యక్తిగత కుటుంబంలో బంధాల గురించి ,తల్లి గురించి రాసిన నవల. ఆమె ఎల్ అనే అభిమానిని కలుసుకుంటుంది.ఆమె ఓ ఘోస్ట్ రైటర్.  అదే సమయంలో ఆమెకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పుస్తకం రాసి కుటుంబ పరువును తీసింది అని ఆమెను నిందిస్తూ అజ్ఞాతమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి. 
ఎల్ ఆమెకు దగ్గర అవుతుంది. ఆమె అభిమానిగా ఆమె జీవితంలో ప్రవేశించిన ఎల్ ఓ వారం రోజులు తనకు వేరే ఏపార్ట్మెంట్ దొరికే వరకు ఆమెతో ఉంటానని ఇంటికి వస్తుంది. డెల్ఫైన్ భర్తను వదిలేసింది. ఇద్దరు టీనేజ్ లో ఉన్న పిల్లలు దూరంగా ఉండి చదువుకుంటున్నారు. ఆమె ఓ టెలివిజన్ యాంకర్ ఫ్రాంకాయిస్ తో సహజీవనం చేస్తుంది. 
డెల్ఫైన్ రైటర్ బ్లాక్ వల్ల రాయలేకపోతుంది. అదే సమయంలో ఎల్ ఆమెను ఆమె రాయాల్సింది ఆమె జీవితంలోని చీకటి కోణాల గురించి అని, అదే ఆమె జీవితంలో బెస్ట్ అవుతుందని అది రాయమని చెప్తూ ఉంటుంది. అటువంటివి ఏవి తన జీవితంలో లేవని చెప్పినా సరే వినిపించుకోదు. ఆమె మాట విననప్పుడు ఆమె కోపంతో సైకిటిక్ గా ప్రవర్తించడం గమనించిన డెల్ఫైన్ ఆమెతో జాగ్రత్తగా ఉంటుంది. 
ఓ స్కూల్ వాళ్ళు డెల్ఫైన్ ను రైటింగ్ గురించి ట్రెయినింగ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తారు. ఆమెకు ఒంట్లో బాగోలేకపోవడం వల్ల వెళ్లలేనని అంటే ఆమె బదులు తాను వెళ్తానని బయల్దేరుతుంది ఎల్. వెళ్ళి వచ్చాక బాగా జరిగిందని ఎవరికి అనుమానం రాలేదని చెప్తుంది. తర్వాత డెల్ఫైన్ మెయిల్ నుండి అందరికీ తన తరువాతి రచన కోసం తను ఫోకస్ చెయ్యడానికి తనని ఎవరు డిస్ట్రబ్ చేయవద్దని డెల్ఫైన్ లా మెయిల్ పెడుతుంది. అది తెలిసి ఆమె అడిగితే ఆమె మంచి కోసమే అని బదులు చెప్తుంది. 
ఆమె తన వ్యక్తిగత జీవితంలోకి కూడా ప్రవేశించేసరికి విసిగిపోతుంది డెల్ఫైన్. ఇద్దరికీ పొసగకపోవడం వల్ల ఎల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత డెల్ఫైన్ కాలు జారి మెట్ల మీద నుండి పడిపోతుంది. దానితో ఆమెను చూసుకోవడానికి ఎల్ మళ్ళీ ఆమె ఇంటికి వస్తుంది. అదే సమయంలో ఫ్రాంకాయిస్ కూడా ప్రోగ్రామ్స్ పని మీద విదేశాలకు వెళ్తాడు. 
ఆ తర్వాత ఓ సారి బయటకు వెళ్లినప్పుడు ఎల్ కారుకు పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో గతంలో డెల్ఫైన్ ను స్కూల్ కి ఆహ్వానించిన వ్యక్తి ఆమెను ఆ రోజు మీటింగ్ కి రానందుకు నిందిస్తుంది. ఎల్ తన జీవితం గురించి చెప్తుంది. ఆమె అంటున్న జీవితం ఎల్ ది అనుకుంటుంది  డెల్ఫైన్ . అలా దాన్ని రికార్డ్ చేయడం మొదలు పెడుతుంది. అది చూసిన ఎల్ వాటిని చించేస్తుంది. మెల్లగా డెల్ఫైన్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఫ్రాంకాయిస్ ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చెయ్యనివ్వదు ఎల్ . ఆమె ఫోన్ లో రికార్డింగ్ విన్న ఎల్ దానిని బద్ధలు కొడుతుంది. 
ఎల్ వల్ల తన ఆరోగ్యం దిగజారుతుందని అర్థం చేసుకున్న డెల్ఫైన్ అక్కడి నుండి తప్పించుకుంటుంది, దారి మధ్యలో పడిపోతే ఎవరో చూసి ఆమెను హాస్పటల్ లో అడ్మిట్ చేస్తారు. ఫ్రాంకాయిస్ తిరిగి వస్తాడు. ఆమెకు స్లో ఫుడ్ పాయిజనింగ్ చేశారని డాక్టర్ చెప్తారు . జరిగిందంతా ఫ్రాంకాయిస్ కి చెప్తుంది డెల్ఫైన్. 
అదే సమయంలో ఎడిటర్ దగ్గరికి వెళ్తే అప్పటికే ఆమె నవల ''Based On A True Story "అందిందని చెప్తుంది. అది తన పేరు మీద రాసింది ఎల్ అని అర్థమౌతుంది డెల్ఫైన్ కు. కానీ మొదటి నవల కన్నా అదే ఘన విజయాన్ని సాధిస్తుంది. 
ప్రతి రచయిత కొన్ని సార్లు అనుకున్నది రాస్తాడు,ఇంకొన్నిసార్లు ఏదో ప్రేయరణతో రాస్తాడు. అది రచయిత వ్యక్తిగత రచనా అభిరుచిని అనుసరించి ఉంటుంది. కానీ ఇది రాస్తే ఆ రచయిత బావుంటుందని అభిమాని ఆదేశిస్తే ఆ రచయిత పాలిట అది ఎలా శాపం అవుతుందో వివరించే భావోద్వేగ పరంపరే ఈ కథాంశం. ప్రతి రచయిత తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. 
*     *    *  

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ