కళ్ళతో చూసి ....

కళ్ళతో చూసి...

  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


తాను చూసింది ,అనుభవించింది తప్ప వేరేది నమ్మను అనే నిర్ణయానికి వచ్చిన ఓ వ్యక్తి జీవితమే ఈ ఆంకోన్ దేఖీ  సినిమా. వినూత్న కోణాలను  ఇష్టపడేవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా. అనుభవం,నిజం ఈ రెండిటితో జీవితం నడుస్తుంది, కానీ ప్రతిదీ ఒక్కరికే ఎదురయ్యే అనుభవాలు,నిజాలుతో అయితే జీవితం నడవదు. ఈ విషయం పైన నిర్ణయం అనేది మనిషి విచక్షణకు సంబంధించింది.

55 ఏళ్ళ రాజేష్  బాబు తన కుటుంబం, తమ్ముడి కుటుంబంతో కలిసి ఉమ్మడి కుటుంబంలో  ఢిల్లీలో  జీవిస్తూ ఉంటారు. రాజా బాబుకు ఓ కూతురు, ఓ కొడుకు. అతని తమ్ముడు,అతని భార్య ,వారికో కొడుకు. ఇది వారి కుటుంబం. సినిమా మొదట్లో రాజేష్ బాబు కలతో మొదలవుతుంది.తాను పక్షిలా ఎగురుతూ ఈ ప్రపంచ సంబంధాలన్నీ విడిపించుకున్నట్టు కల కంటాడు. రాజేష్ బాబు కూతురు ఓ అబ్బాయిని ప్రేమించడం,అతనితో కలిసి తిరగడం ఆమె కుటుంబానికి తెలుస్తుంది. వారంతా ఆ అబ్బాయి చెడ్డ వాడని, అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఇలా అతని గురించి చెప్తారు. అతనికి బుద్ధి చెప్పడం కోసం ఆ కుటుంబంలోని మగ వాళ్ళు  రాజా బాబును కూడా ఒప్పించి అతన్ని కొట్టైనా వారి అమ్మాయి జోలికి రావద్దని బుద్ధి చేబ్డామని అనుకుంటారు. కానీ అక్కడ  రాజేష్ బాబు అతని సౌమ్యత చూసి అతనికి మెల్లగా చెప్పి వచ్చేస్తాడు.

ఆ సంఘటనతో అతను తాను చూసింది, అనుభవించింది తప్ప మిగిలిన ఏ విషయాన్ని నమ్మకూడదనే నిర్ణయాన్ని తీసుకుంటాడు. రాజేష్ బాబు  వరల్డ్  టూర్ ఏజెన్సీలో  టికెట్స్ బుక్ చేసే ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడ కస్టమర్లకు తాను చూడని అనుభవించని ప్లేన్ వివరాలు,వాతావరణం, టైమింగ్స్ గురించి అబద్దం చెప్పలేనని ఆ ఉద్యోగం మానేస్తాడు. అప్పటి వరకు దేవుడికి పూజ చేసిన అతను తాను చూడని దేవుడిని పూజించడం కూడా మానేస్తాడు. ఆ తర్వాత అతని కొడుకు షామి గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉద్యోగం వచ్చిందని చెప్పి అప్పు చేస్తాడు. రాజేష్ బాబు మారిన మనస్తత్వం నచ్చని అతని తమ్ముడు,భార్య అక్కడి నుండి వేరే ఇంటికి వెళ్లిపోతారు.

తర్వాత కొడుకు అప్పును గురించి తెలుసుకుని ఆ అప్పు తీర్చే ప్రయత్నంలో తాను కూడా గ్యాంబ్లింగ్ ఆడతాడు. తన అనుభవం అది మోసం కాదని అది భిన్న సాధ్యాసాధ్యాలు ఉన్న ఒక్క ఆటే అని గ్రహిస్తాడు. అన్ని ఆటల్లో అతను గెలవడం చూసి అతన్ని ఆ ఆట ఆడటానికి 20 వేల జీతం ఇచ్చి పెట్టి కుంటాడు షామికి అప్పు ఇచ్చిన వ్యక్తి. ఇదే సమయంలో రాజేష్ బాబును గుడ్డిగా కొందరు అనుసరించే వారు కూడా తయారు అవుతారు. పులి ఘండ్రిస్తుందా లేదా కుక్కలా మొరుగుతుందా అన్న విషయాన్ని స్వయంగా తెలుసుకోవడానికి అతను జూకి వెళ్ళడం వంటివి నవ్వును తెప్పిస్తాయి.

రాజేష్ బాబు కూతురి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయిస్తాడు. తర్వాత కుటుంబం బాధ పడుతుందని తన అనుభవంతో నిజంగా గ్రహించిన తర్వాత గ్యాంబ్లింగ్ వదిలేస్తాడు. అప్పుడు అతన్ని అనుసరించేవారికి తనను అనుసరించవద్దని వారి అనుభవంతో తెలుసుకొమ్మని చెప్తాడు. అన్నా దమ్ములు కూడా ఆ పెళ్లిలో కలుస్తారు.పెళ్ళి బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అతను తన కల అయినా ఎగరడాన్ని స్వయంగా అనుభవించడానికి  ఓ లోయలోకి దూకడం,ఆ ఎగిరే అనుభూతిని చూపించడంతో సినిమా ముగుస్తుంది.

పుకార్లు, ఇతరులు చెప్పినవి విని ప్రతి అంశం,మనుషుల మీద అభిప్రాయాలూ ఏర్పరచుకోకూడదు. అలా అని మూర్ఖంగా ప్రతిదీ మన అనుభవంతోనే  తెలుసుకోవాలి అంటే ఈ జీవితం జీవించడానికి ఆ స్వీయానుభవాలు సరిపోవు. ఆ విచక్షణ వ్యక్తులకు ఉండాల్సిందే. అదే ప్రజ్ఞ.

   *    *    *  

           

           

           

 

 

 

 

           

 

           

           

 

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ