విషయ పరిజ్ఞానం ,లోక జ్ఞానం ఎక్కువైతే ?

చదువరి -3: 
విషయ పరిజ్ఞానం ,లోక జ్ఞానం ఎక్కువైతే ? 
(కొడవటిగంటి కుటుంబరావు గారి అరుణోదయం సమీక్ష) 
                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



కాలంతో పాటు రచనాశైలి మారుతూ ఉంటుంది. నాటి రచయితల్లో మేటిగా వాసికెక్కిన వారిలో కొడవటిగంటి కుటుంబరావుగారు ఒకరు.జగత్తులో స్థలము(స్పేస్ ),కాలము(టైమ్ ) అనే రెండు కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు నిర్థారించారు.కానీ ఈ రెండు కొలతలే కాకుండా బుద్ది అనేది కూడా కొలతగా పనిచేస్తుందని,దానిని 'బుద్ధి కొలతవాదం' పేరుతో కొడవటిగంటి కుటుంబరావు గారు ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదన అనేక చర్చలకు దారి తీసింది. కొడవటిగంటి కుటుంబరావుగారి రచనల్లో సమాజంలో ఆర్థికంగా,ఆలోచనల పరంగా వచ్చే మార్పులను తన కథాంశంలోని పాత్రల ద్వారా నడిపే శైలే ఎక్కువ ఉంటుంది.ఆయన రచనల్లో ఊహాలు అరుదు. ఆయన నవలల్లో అరుణోదయంలో ఇదే దృక్కోణం కనిపిస్తుంది.
రామ్మూర్తి బియ్యే ఫస్టు మార్కులతో పాసవుతాడు.ఇరవై ఎకరాల ఆస్తి ఉండటం వల్ల ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని భావిస్తాడు.ఓ కవి సమావేశానికి వెళ్ళినప్పుడు కవిత్వం మీద ఆసక్తి కలుగుతుంది.ఎంత ప్రయత్నించినా కవి కాలేడు,కథా రచయిత అవుతాడు.
     తరువాత 1930 లలో వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల ధరలు పడిపోయేసరికి,అతనికున్న అప్పుల వల్ల ఉన్న పొలం తక్కువకే అమ్మేసి అప్పులు తీరుస్తాడు.అదే సమయంలో ఎన్నో ప్రెస్సులు రావడంతో, అందులో ఓ పత్రికకు ఎడిటర్ గా చేరతాడు.
    కాలక్రమంలో తరువాత నాటకరచయితగా మారతాడు.నాటకాలలో వేషాలు వేసే సుభద్రతో శారీరక  సంబంధం  కలిగి ఉంటాడు.తర్వాత సినీ రచయితగా మారతాడు.వ్యాపారాలు కూడా చేస్తాడు. ఈ క్రమంలో అతనికున్న విషయ పరిజ్ఞానం,లోకజ్ఞానం కూడా విస్తృతమవుతూ ఉంటుంది.
ఓ యువ రచయిత రామ్మూర్తిని కలిసి మార్కిజం-సోషలిజం-కమ్యూనిజం గురించి పరిచయం చేస్తాడు,కొన్ని పుస్తకాల లిస్టు ఇచ్చి,అతను అందులో ఉన్నదంతా వాస్తవమని నమ్మవద్దని,స్వానుభవంతో గ్రహించమని చెప్తాడు.ఆ గ్రంథాలు చదవడం మొదలుపెడతాడు రామ్మూర్తి.అది అతన్ని ఎలా మార్చిందన్నది కాలమే చెప్పాలి అని ముగిస్తాడు రచయిత.
అరుణోదయంలో కాలంతో పాటు వచ్చిన మార్పులతో తన ప్రజ్ఞను పలు రంగాల్లో ప్రదర్శిస్తూ,జీవితాన్ని సాగించిన రామ్మూర్తిలో ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకుపోయే మనఃస్థితి ,దాని వల్ల విషయజ్ఞానం పెరిగే కొలది మనుషుల్లో వచ్చే అస్థిరత,దాని ప్రభావం జీవితంలో ఎలా ఉంటుందో తెలియజేసారు.ఇక్కడ రామ్మూర్తి ఓ వ్యక్తే కాదు,అంతర్లీనంగా అతను నాటి మార్పుల్లో తనను తాను ఇముడ్చుకోవాలని ప్రయత్నించిన మనస్తత్వానికి నిదర్శనం కూడా.
ఈ రచనాకాలం నాటికి సమాజంలో ఆర్థికమాంద్యం,రెండవ ప్రపంచ యుద్ధం,మార్కిజం-సోషలిజం-కమ్యూనిజం వంటి అంశాలు గాఢంగా ప్రభావితం చేస్తున్నాయి.'అరుణోదయం'లో ముగింపును పాఠకులకే కొంతమేరకు వదిలేసారు కుటుంబరావుగారు.
ఈ నవల యువ మాసపత్రికలో ప్రచురించబడింది. కుటుంబరావుగారు రచనల్లో నాటి సమాజంలో వచ్చిన ఆర్థిక,విప్లవ మార్పుల పరిణామాలు తన రచనలోని పాత్రల పైన చూపించిన ప్రభావం ద్వారా నాటి సమాజంలో వ్యక్తులను ఆ మార్పులు ఎలాంటి ప్రభావానికి గురి చేసాయో చెప్పే ప్రయత్నం చేస్తారు. రచనల ద్వారా కాలాన్ని,కాలంతో నడిచిన సమాజంతో పయనించాలంటే కుటుంబరావుగారి రచనలు చదవాల్సిందే.

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ