కార్యేషు భారతి
కార్యేషు భారతి
-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)
స్త్రీలు ఎంతో ప్రగతి సాధిస్తున్న ఈ సమయంలో వారిలో ఎంతమంది ఆ ప్రగతిశీల
వాద దృక్పథాలకు నిజంగా తమ జీవితంలో నిలబడుతున్నారు? సమాజంలో తాము
భాగం అవుతున్న కొద్ది తమ జీవితంలో సమాజం ఒక భాగంగా కాకుండా, సమాజమే
తమ జీవితాలుగా బ్రతికేస్తున్న స్త్రీలు నేడు ఎంతోమంది ఉన్నారు.
తనను తాను
మంచి కూతురు,మంచి భార్య,మంచి కోడలు అని
అనిపించుకోవాలనే తాపత్రయంలో తమ సంతోషం,సంతృప్తి ఎక్కడ ఉన్నాయో కూడా మర్చిపోతున్నారో ఎంతోమంది. బాధ్యతలు
నిర్వహించాలి అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండే ఓ నైతిక నియమం. కానీ బాధ్యతల
పేరుతో బానిస భావజాలాన్ని
పెంపొందించుకుంటే అది స్త్రీకి నిజంగా ప్రమాదం.
ఇటువంటి
విషయాల్లో ఎవరి తప్పు,ప్రమేయం ఉండదు. కేవలం ఆ స్త్రీ ఏర్పరచుకున్న లేదా
తనతో పాటు పెంచుకున్న ఆలోచనలే కారణం. తన ఆలోచనలతో,కార్యాలతో
తాను సంతోషంగా,సంతృప్తిగా ఉన్నంతవరకు ఎవరకు ఏ సమస్య లేదు.
కానీ అదే భావజాలాన్ని తన తరం తర్వాత ఉదయించే
స్త్రీల మీద కూడా రుద్దే ప్రయత్నం చేస్తే మాత్రం అది నిజంగా ఖండించాల్సిన
తప్పే.
ప్రతి
మనిషికి తన పరిస్థితుల,ఆలోచనల
రీత్యా తాను చేసే ప్రతి పని సరైనదే అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు పరిస్థితులు,మనుషుల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తాయి. స్త్రీ తాను ఓ దశ నుండి వయసుతో
పాటు ఇంకో దశలోకి పయనించే క్రమంలో పెద్దరికంతో
చిన్న వారిని ముందుకు నడిపే స్పూర్తిలా ఉండే సమయం వస్తుంది. ఆ స్త్రీ ఆ
కుటుంబానికే కాదు, ఆ కుటుంబం నుండి సమాజంలోకి పయనించే
భవిష్యత్తు తరాల వారిని కూడా గాఢంగా ప్రభావితం చేస్తుంది.
ఎప్పుడైతే
తరాలను ముందుకు నడిపించే స్త్రీ భావజాలంలో తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించే
ప్రవృత్తి దర్శనమిస్తుందో అప్పుడు అది ఆ కుటుంబాన్ని, ఆ
కుటుంబం నుండి సమాజంలో భాగమయ్యే జనులలో
కూడా ఎదురు తిరిగే ఓ రకమైన లెక్కచేయని తత్వాన్నో లేక పిరికితనాన్నో
నింపుతుంది.
పుట్టిన
పిల్లల స్థాయి నుండి ఇంట్లో తల్లి పాత్ర పిల్లలపై
ఎక్కువగా ఉంటుంది. తమ జీవితంలో ఎక్కువ కాలం గమనిస్తూ, కలిసి
పెరుగుతూ ఉండే క్రమంలో తల్లి స్వభావాన్ని బట్టి వారు మనుషుల మధ్య అనుబంధాల్ని, సమాజాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వారిలో సమన్వయ
విశ్లేషణా తీరు అలవడకపోతే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాలు
రూపుదిద్దుకుంటాయి.
కాలం
మారుతున్న కొద్దీ బాధ్యతల పట్ల నిజమైన అవగాహన లోపిస్తున్న తరాలు నేడు
దర్శనమిస్తున్నాయి. మన ప్రభావం ఇంకొకరిపై ఉంటుందని కచ్చితంగా తెలిసినప్పుడు, మన ప్రభావం జీవితాలను
నిలబెట్టేలా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తులదే. ఆ బాధ్యత ప్రతి ఇలల్లూ
తీసుకోవాల్సిందే, దాని నుండి తప్పించుకోవడానికి ఆస్కారం
లేదు.
స్త్రీలు
ఎక్కువగా నేడు ఉంటే మోతాదుకు మించిన వినయాన్ని,భయాన్ని నింపుకుని జీవితాన్ని
సాగిస్తున్నారు లేకపోతే పూర్తిగా ఎవరిని లెక్క చేయని ధోరణిని కూడా
ప్రదర్శిస్తున్నారు. తమ విద్య ,చూసే ప్రపంచాన్ని బట్టి తమను
తాము బ్యాలన్స్డ్ గా ఉండేలా చూసుకునే వారు ఉన్నారు. కానీ మధ్యస్థ గీతను దాటి అటో,ఇటో నిలిచే వారి వల్ల కుటుంబం ఏదో విధంగా ప్రభావితం అవుతూనే ,తమలో తాము దీనికి ఎవరో బాధ్యులో తెలియక చివరికి బాధపడే వారు ఉన్నారు.
ఎమోషనల్ మరియు
ప్రేమను వ్యక్తీకరించడంలో స్త్రీ గురుతర పాత్రను పోషిస్తుంది. అందుకే అమ్మంటే
అందరికీ ఓ ప్రేమ ప్రతీకగా నిలిచిపోతుంది. అందుకనే సమాజం పట్ల,కుటుంబం
పట్ల స్త్రీ బాధ్యతల ఎక్కువ ఉంటాయి.
ఒకప్పుడు
ఆదిమానవుల కాలంలో మహిళలదే ఆదిపత్యం ఉండేది. రాను రాను పురుషాదిక్యతతో మహిళలపై
అధికారం చెలాయించడం ప్రారంభించారు..కొంత కాలానికి మహిళను కట్టు భానిసలుగా
మార్చారు. కానీ ఇప్పుడు కాలం మారింది..మహిళలు చైతన్య వంతులు నిజానికి మన దేశాన్నే
మనం ఒక స్త్రీగా మూర్తీభవించి భారత మాతగా పేర్కొంటున్నాం. అవుతున్నారు. పురుషులతో
సమానంగా అన్ని రంగాల్లో వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
క్రీ.పూ. 6000
సంవత్సరాలకు పూర్వం నుండి అనగా సింధూనాగరికత కాలం నుండి భారతీయులు స్త్రీలను
గౌరవిస్తూ, స్త్రీని దేవతగా (అమ్మతల్లి) పూజించేవారు. అలాగే నేడు 1947,
ఆగష్టు 15 అనంతర మేర్పడిన స్వతంత్ర భారతదేశాన్ని కూడా
"భారతమాత" గా కొనియాడుతూ, గౌరవిస్తూ, పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.
భారతదేశంలో స్త్రీని గృహలక్ష్ష్మిగా, మాతృమూర్తిగా, హితైషిగా, దైవస్వరూపిణిగా వర్ణించి, 'శ్రీ' అంటూ స్త్రీని మంగళదేవతగా ప్రతి నామవాచకానికి
ముందు, ప్రతి శుభకార్యానికి చేర్చి అవగాహన చేసే అత్యున్నత
సాంప్రదాయం మనది అని అనేక మంది మహర్షులు మరియు ప్రాచీనులు, ఆధునికులు
కూడా దీనిని నొక్కి చెప్పడం జరుగుతుంది. ఇది చారిత్రక కోణం. మరి ఇంత గౌరవం ఆపాదించబడిన
స్త్రీ తన బాధ్యతల్లో ఏ తప్పు చేసిన అది భారత సంస్కృతిపై కూడా గాఢమైన ప్రభావం
చూపుతుంది.
కార్యేషు
భారతి అంటే తను చేసే ప్రతి పనితో కుటుంబాన్నో ,సమాజాన్నో ప్రభావితం చేస్తూ
భారతమాత అంశగా నిలిచే వ్యక్తిత్వం అని. ఆ వ్యక్తిత్వ ఉనికి అనేది హోదా కాదు ,గురుతర బాధ్యత. ఆ బాధ్యతను ఎటువంటి ప్రలోభాలు,వ్యక్తిగత
అనుభవాలకు లోనై స్త్రీ నిర్వహించలేని స్థితికి ఎన్నడూ తిరోగమించకూడదు. ఆ పరిస్థితి ఉద్భవించనంతవరకు కూడా
స్త్రీ తల్లి భారతికి ప్రతికే.
*
* *

Comments
Post a Comment