మానవత్వంలో నగ్నత్వం
చదువరి-5 :
మానవత్వంలో నగ్నత్వం
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఒడిశా రచయిత్రి ప్రతిభారాయ్ కథ 'అంటరాని దైవం' ఈ సమాజంలో బ్రతికే ప్రతి మనిషిని ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది.ఒంటి మీద సరైన బట్టలు కూడా లేని ఆమె గర్భవతి.బిడ్డ పుట్టేసరికి ఆ పీలికైన గుడ్డ కూడా లేక బిడ్డతో నగ్నంగా ఉంది. చాలా సేపు వరకు సిగ్గుతో అలాగే దాక్కుని ఉన్నప్పటికీ,ఆకలితో మెయిన్ బజార్ కు వచ్చి నిలబడుతుంది.కొంతమంది పిచ్చిదని వ్యాఖ్యానిస్తూ తిరిగారు,ఇంకొందరు ఆమె నగ్నత్వంలో సౌందర్యాన్ని వీక్షించారు.కానీ ఏ ఒక్కరికీ ఆమె ఒంటి మీద గుడ్డ కప్పాలనే స్పృహ కలగలేదు.
అలా ఎవరైనా ఆ మానవతా దృష్టి కలిగి ఉన్నారేమో అని ఎదురు చూసిన ఆమెకు నిరాశే ఎదురైంది. చలి నుండి తల దాచుకునేందుకు గుడి బయట గోడ దగ్గర నిలుచుంది. ఆకలితో ఉన్న ఆమె ,ఆమె బిడ్డను అలా చూసి కూడా ఎవరూ స్పందించరు. ఆ బిడ్డ ఆకలితో ఆ గుడి మెట్లపై పారాడుతుంటే గుడి అపవిత్రమైందని, ఆ బిడ్డను బయట పడవేస్తారు. చివరకు ఆకలితో, చలితో ఆమె ,ఆమె బిడ్డ అక్కడ గుడి ముందే మరణిస్తారు.
ఈ కథ ద్వారా ఎన్నో అంశాల్ని రచయిత్రి స్పృశించారు.
"ఆదిమ కాలంలో సమాజం ఎంత సొగసుగా, సౌందర్యవంతంగా ఉండేదో? కూడు,గూడు,గుడ్డ లాంటి సాంఘిక అవసరాలకు వెంపర్లాడని రోజుల్లో మనుషులెంత నిష్కల్మష హృదయాలతో ఉండేవారో?రెప్పపాటులో ఇప్పుడున్న నాగరికత మాయమైతే మనిషిలో పసుప్రవృత్తి మొదలై మళ్ళీ జంతువుగా మారతాడేమో! శరీరాన్ని కప్పుకోవటానికి బలవంతంగా అవతల వాళ్ళ దుస్తుల్ని గుంజుకుంటాడా?అవమానభారంతో తల్లడిల్లుతాడా?" అని మాటలతో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఓ స్త్రీ తన ఒంటి మీద ఉన్న పీలికలైన బట్టల్ని చూసి ఇలా అనుకోవడంతో మొదలైన కథ మనిషి కనీస అవసరాలైన కూడు,గుడ్డ ,నీడ లేకపోతే వారి పట్ల ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తుంది? అదే సమాజం గుడిలో దేవుడికి ఎన్ని వస్త్రాలు సమర్పిస్తుంది? ఎన్ని నైవేద్యాలు పెడుతుంది? ఇలా అనేక అంశాలను స్పృశించారు.
మొదట నగ్నంగా ఉన్న ఆమె సిగ్గు పడినా ఆకలి ఆ సిగ్గును జయించి బయటకు వచ్చినా ఆమెను మనిషిగా గుర్తించేవారు లేరు. ఆమెను పిచ్చిదానిగా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మాతృత్వ మధురిమను అనుభవించలేకపోయింది. మనిషికి కనీస అవసరాలు తీరితేనే ఏ అనుభూతినైనా అనుభవించగలడు అనే అంతర్లీన సందేశం కూడా ఈ కథాంశంలో ఉంది.
'ఆమె శరీరం -పూర్తి వస్త్రాలతో ఉన్న స్త్రీల కంటే కవ్వించేదిగా ఆకర్షణీయంగా అనిపిస్తోంది వాళ్ళకు. గౌరవమర్యాదలున్న సమాజాన్ని ఆమె అశ్లీలతతో చెడగొడుతోందని వారు చేస్తున్న వ్యాఖ్యలు తన నగ్నత్వం కంటే అసహ్యంగా అనిపించాయి.'ఈ వాక్యాల ద్వారా మనిషిలోని అసహ్యకరమైన ప్రవృత్తిని రచయిత్రి స్పష్టం చేసింది.
ఆలయంలో దేవతా విగ్రహానికి భక్తులు మొక్కుబడుల పేరుతో సమర్పించే చీరలు ఎన్నో ఉంటాయి. పూజారులు అమ్మవారిపైన అలా కప్పి తీసేస్తున్నారంతే. అది సంప్రదాయం. అంతకు మించి అమ్మవారెప్పుడూ ఆ వస్త్రాలను ధరించదు. ఆ తర్వాత ఆ చీరలు ఏమవుతాయో ఆ భగవంతుడికే ఎరుక. ఒక్క చీర అయినా నా లాంటి అభ్యగ్యులకు ఇవ్వకూడదు ? ఆ దేవతా విగ్రహం రాయో, కట్టో తెలీదు. పూజాలందుకుంటోంది. ఆ రాయికి భోజనం అక్కర్లేదు. బట్టల అవసరం రాదు. ధూప దీప నైవేద్యాలతో పని లేదు. పూలు, సుగంధ ద్రవ్యాలతో కొలవమని కోరదు ఎప్పుడూ . అయినా దైవత్వాన్ని సంతరించుకోంటోంది. ప్రాణం ఉన్న మనిషి మాత్రం దీనత్వంతో మగ్గుతోంది .ఈ వాక్యాల ద్వారా మనిషి పుణ్యం పేరిట చేసే పనుల వల్ల ఎవరు లాభపడుతున్నారు అనే ప్రశ్నను రచయిత్రి సూటిగా ప్రశ్నించింది.
'అంటరానివాడు ...అందుకే పూజారులెవ్వరూ వాడిని తాకే ప్రయత్నం చేయలేదు లేకపోతే ఈపాటికి వాడి శరీరాన్ని ఖండఖండాలుగా చేసి మాంసం ముద్దను బయటకు విసిరేసేవారు 'అని ఆమె తన బిడ్డ ఆలయంలో ప్రవేశించినప్పుడు వాడిని పాల వాడి ఎడమ చేతితో బయటకు పడవేసినప్పుడు ఆమె అనుకుంది.
అంటరానివాడు దేవుడా ? లేక మనిషా? అంచనా వేయలేకపోయింది. దైవమే అని తనకు తానే సమాధానం చెప్పుకుంది. దేవుడ్ని ముట్టుకోవటానికి మనిషికి ఎలాంటి ప్రతిబంధకాలు లేవు. దైవమే మనిషి తనను ముట్టుకోవటానికి నిరాకారిస్తున్నాడనిపిస్తోంది. దైవం...పూజారులు,ఆలయ పెద్దలు , మహారాజుల ద్వారా మాత్రమే సంభాషిస్తాడు. ఈ వాక్యాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి .
ఆమె మరణం తర్వాత వేడి,చలి,వాన,ఉప్పెనలా బాధ తెలియని భగవంతుని లాగా ఆమె కూడా మరణం తర్వాత ఆ బాధల నుండి విముక్తి పొందింది. ఈ ఇద్దరి మధ్య ఏమైనా తేడా ఉందా? ఆ దైవం మనిషి? ఈ మనిషి దైవం -అని చెప్పుకోవచ్చా? దైవం అంటే స్పందించనివాడా ?లేక ఈ మనుషులు తమలోని భక్తిని,సేవను ప్రదర్శించడానికి అలా ఆ దేవుడిని నిర్మించారా ? అనే ప్రశ్న కూడా ఈ కథలో తలెత్తుతుంది.
మానవత్వం కొరవడిన వాతావరణం మనిషికి సాయం చేసే మనసు లేకపోవడం వల్లే తప్ప చేసే స్థోమత లేక కాదు. మనిషి సేవను ,మానవత్వాన్ని గుడుల్లో వెతుక్కుంతున్నాడే తప్ప తోటి మనుషుల్లో కాదు అని చాలా గట్టిగా రచయిత్రి ఈ కథ ద్వారా చెప్పింది. ఈ కథలోని ప్రతి వాక్యం అనేకసార్లు పాఠకులను ఆలోచించేలా చేస్తుంది. సమాజంలో కాలం గడిచే కొద్దీ ప్రగతి పథంలో పయనించవచ్చు ,కానీ మనిషి మనసు మాత్రం అంత ప్రగతి సాధించలేదనే నిందా స్తుతి కూడా ఈ కథలో మనకు కనిపిస్తుంది. కథా ప్రేమికులు కచ్చితంగా చదవాల్సిన కథ ఇది.
* * *

Comments
Post a Comment