వివాహంతో జీవితం అంతం కాదు!
వివాహం స్త్రీ
జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తుంది. స్త్రీ, పురుషుల
జీవితంలో ఓ భాగస్వామ్య భావాన్ని ప్రవేశపెట్టే ఈ బంధం స్త్రీ జీవితంలో మాత్రం
అది ఓ భాగం కాకుండా అదే
జీవితంగా మారే పరిస్థితులు ఎప్పటి
నుండో మన సమాజంలో నిర్దేశించబడుతున్నాయి.
మానసిక అనుబంధ బలంతో
కొందరు, ప్రేమ-రక్షణ కోసం ఇంకొందరు ఇలా ఎన్నో
పరిస్థితుల రీత్యా ఉత్పన్నమయ్యే
కారణాలను అనుసరించి వివాహ బంధాన్ని
నిలబెట్టుకోవడం కోసం తమదన్న
ఉనికిని మరుగున పడే స్థితికి చేరుకుంటున్నారు.
సమాజంలో మనిషి ఒంటరిగా బ్రతకలేడు. స్త్రీ,పురుష
ఆకర్షణ నుండి తప్పించుకోలేడు. ఈ
వలయాన్ని ఓ పద్ధతిగా
మార్చేదే వివాహం. తరాలు మారే కొద్ది ఈ బంధంలో ఎన్నో మార్పులతో పాటు దీనిని అతిక్రమించే సంస్కృతులు కూడా వెల్లువెత్తాయి. సహజీవనం, స్త్రీ సాధికారత వంటి అంశాల వల్ల స్త్రీ
తన కుటుంబ బాధ్యతలను
తప్పించుకుంటుందని కొందరు భావిస్తే,
వాటి వల్ల ఆమె తన జీవితంలో
తన లక్ష్యాల్ని సాధిస్తుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
వివాహంలో భార్యా భర్తల మధ్య ఉండే
అనుబంధం, అవగాహన కన్నా కుటుంబ
రీత్యా ఉండే బాధ్యతలను కేవలం సమాజం కోసం
నెరవేర్చే సంస్కృతి మన వ్యవస్థ పునాదుల్లో
పాతుకుపోయింది. దీని వల్ల సమాజానికి
భయపడి అయినా స్త్రీలు కచ్చితంగా
కుటుంబంలోని అన్ని పనులకు బాధ్యత
వ్యవహరిస్తారనే భావజాలం వల్ల
కావచ్చు. కానీ కాలంతో పాటు అది స్త్రీ జీవితంలో ఓ
కచ్చితమైన నిబంధనంగా మారింది.
ఓ మంచి కూతురు, ఓ మంచి భార్య, ఓ మంచి
కోడలు, ఓ మంచి తల్లి ఇలా
ప్రతి అంశంలో స్త్రీ తన
మంచితనాన్ని నిరూపించుకోవడానికి తరతరాలుగా
ప్రయత్నిస్తూనే ఉంది. కానీ కుడి ఎడమైతే ...అంటే అదే పురుషుల్లో గమనిస్తే మంచి కొడుకు, మంచి
భర్త, మంచి తండ్రి వంటి అంశాల పట్ల పెద్ద
వెంపర్లాట కనిపించదు. దీనికి కారణం
వారు కేవలం డబ్బు సంపాదిస్తే ఇవన్నీ నెరవేర్చినట్టే అన్న
భావన కూడా పురుషుల్లో కన్నా స్త్రీల్లో ఎక్కువగా బలపడటం వల్ల.
నిత్య జీవితంలో మనం స్త్రీలను
గమనిస్తే వారిలో చాలా మంది వివాహం ముందు ఉన్నంత
స్వతంత్రంగా వివాహం తర్వాత
వ్యవహరించలేరు. దానికి కారణం ఏదైనప్పటికీ
ఒక్కసారి కోల్పోయిన ఆ హక్కును మళ్ళీ
సాధించుకోవడం చాలా కష్టమైన పనే.
వివాహం తర్వాత ప్రేమ ముసుగులో ఎంతో మంది
స్త్రీలను తమ అధీనంలోకి తెచ్చుకునే భర్తలు
ఉన్నారు. మొదట్లో అలా పరాధీనగా జీవించడం
ప్రేమకు చిహ్నంగా అనిపించినా కొన్నాళ్ళు గడిచేటప్పటికీ దానిలో ఉంది
బానిసత్వం అనే భావన బలపడుతూ
ఉంటుంది.
అప్పటికప్పుడూ తమ హక్కును తిరిగి
గెలుచుకోవాలంటే దానికి పోరాటం చేయక
తప్పదు. ఇక్కడ స్త్రీలకు ఎదురయ్యేది ఎమోషనల్ అనుబంధమే. ప్రతి విషయంలో స్త్రీని తన అధీనంలో ఉంచుకోవడానికి కుటుంబం,ప్రేమ,ఆపేక్ష వంటి బంధాలను పలుపు
తాడులుగా బిగిస్తూ ఉంటారు భర్తలు.
అలా అని
బాధ్యతలు వదిలేసి ప్రవర్తించమని కాదు. కానీ తన వ్యక్తిగత గౌరవానికి, సమిష్టి
నిర్ణయాధికారానికి భంగం వాటిల్లుతూ, దానికి ప్రేమ,’ఏం చేసినా నీ కోసమే బంగారం’ లాంటి
ముసుగులు తొడుగుతూ ఉంటే సహిస్తూ
ఉంటే జీవితం అంతా ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది.
వివాహం అనంతరం స్త్రీ జీవితంలో ఇంకో
అంశం గమనిస్తే స్త్రీ మాత్రం తన
అత్తింటివారిని ఏ పరిస్థితుల్లోనైనా సరే
బాగా చూసుకోవాలి, లేకపోతే ఆమెకు మంచి కోడలు అనే బిరుదు రాదు,
చెడ్డ వ్యక్తి అనే ముద్ర వేసేస్తారు. అదే పురుషుడి విషయంలో మాత్రం
అతను తన అత్తమామలతో ఎలా
ప్రవర్తించినా సరే ఆ అత్తమామలే
సర్దుకుపోవాలి, ఎందుకంటే పిల్లను ఇచ్చారు కనుక.
కాలం మారుతూ ఉంది. ఇంకొకరి అధికారాన్ని అంగీకరించే మనస్తత్వం నేడు ఎవరిలోనూ
లేదు. ప్రతి స్త్రీ
బాగా చూసుకొని కోడళ్ళ గురించి మాట్లాడే ముందు కేవలం తమ అధికారాన్ని
నిరూపించుకోవడం కోసం భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమయ్యే పెద్దల గురించి కూడా
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కరే కొడుకో ,కూతురో ఉంటే అప్పుడు ఆ
పరిస్థితి వేరు. కానీ అంతకు మించి పిల్లలు ఉన్నప్పుడూ ఆ పిల్లల మధ్య గొడవలు పెట్టి, తమ సింపతీ
కార్డులు వేసుకుంటే బ్రతికే పెద్దలు కూడా నేడు ఎంతో మంది ఉన్నారు.
వివాహంతో తమను తాము మరచిపోయే
స్త్రీలు ఆలోచించాల్సిన అంశం ఇంకొకటి కూడా ఉంది. అదే వివాహం తమ భర్తలను కూడా
తమలానే ఎందుకు మార్చలేదు అని? ఎందుకంటే
స్త్రీలకు మానసికంగా ఉండే ఓ పరాధీన భావం మాత్రమే వారిని ఎన్నో విషయాల్లో తర్కానికి
దూరంగా ఉంచుతుంది.
జీవితంలో ఏది సింపుల్ గా మనకు దొరకదు. ఆఖరికి మనం అనుకున్నట్టు బ్రతకాలన్నా సరే పోరాడాలి, సాధించాలి.
కనుక ఓ స్త్రీకి వివాహం అయినంత మాత్రాన ఆమె జీవితంలో ఆమె ఆశయాలు మరణించాలి అని
కాదు. తన ఆశయాల కోసం ఆమె ఎంతవరకూ పొరాడి నిలబడుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ
ప్రశ్నకు సమాధానం ఆ స్త్రీ మాత్రమే ఇవ్వగలదు. ఓ స్త్రీ మేలుకో ఎప్పుడూ నీ జీవితం నీ
చేతుల్లోనే ఉంది, దాన్ని ఇంకొకరి పగ్గాల్లో పెట్టకు.
* * *

Comments
Post a Comment