రచయిత్రి అయితే .....

చదువరి-18                     

                             రచయిత్రి అయితే .....

                                 -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)


          కొమ్మూరి వేణుగోపాలరావు గారి కథల్లో మా ఆవిడ కథ‘ లో భార్యా భర్తలు ఇద్దరు రచయితలైతే అప్పుడు స్త్రీ రచయితల పట్ల పురుషులు చూపే ఆసక్తి పురుష రచయితపై చూపరని చెబుతూనే  అభిమానుల్లో కూడా ఆపోజిట్ జెండర్ పట్ల చూపే ఆసక్తి ,రచనల పట్ల ఉండదని అనే సందేశాన్ని అంతర్లీనంగా చెప్పారు రచయిత.

          కథలో కథానాయకుడు రచయిత. అతని భార్య పేరు అనురాధ. ఆమె బిఏ దాకా చదువుకుంది. భర్త రచయిత అనే ఆరాధన కూడా ఆమెకు ఉంది. ఓసారి ఆమె స్నేహితుల కోసం భర్తను ఓ నాటకం రాయమంటే  అతను రాయలేకపోతాడు. కానీ నాటక రచయితగా అతని పేరే ఉంటుంది. భార్యే రాసిందని అతను గ్రహిస్తాడు.

          క్రమేపీ అనురాధా కూడా ఓ రచయిత్రి అవుతుంది. ఆమె కథలు ప్రచురితమవుతూ ఉంటాయి. ఎక్కువగా మగ అభిమానుల నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఓ సారి ఒకతను ఆమెను అభిమాని పేరిట చూడటానికి వచ్చినప్పటికీ ఆమె ఆసక్తి చూపదు.

          తర్వాత  రచయిత ఓ నవల రాస్తాడు. దానికి ఓ విమర్శకుడు దానికి అనవసరంగా అంత  పేరొచ్చిందని దానికంత అర్హత లేదని రాసి, అనురాధ మాత్రం మంచి రచనలు చేస్తుందని రాస్తాడు. తర్వాత అనురాధ ఓ నవల రాయబోతుందని తెలిసి సలహాలు ఇవ్వడానికి వస్తే చడామడా తిట్టి పంపేస్తుంది ఆమె.

         తర్వాత ఆమె నవల అచ్చవుతుంది. దాని ఆవిష్కరణ అయ్యాక ఆ సంపాదకుడు ఆమెను టాక్సీలో ఇంటి దగ్గర దింపి చనువుగా ప్రవర్తించబోతే ఓ చెంపదెబ్బ ఇచ్చి బుద్ధి చెప్తుంది. భర్తతో జరిగింది చెప్పి తానింకా రాయనని అంటే, నీలాంటి మహారచయిత్రి మానకూడదు అని రాయడానికి ప్రోత్సాహం ఇస్తాడు. ఆ ప్రోద్బలానికి ఆమె సంతోషిస్తుంది.

          ఇది కథగా కొన్ని సంఘటనలుగా కనబడినప్పటికీ కూడా మనిషిలో మానసికంగా ఉండే ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది. సినిమా రంగంలో కూడా అమ్మాయిలు హీరోలను తమ కలల రాజకుమారుడిగా ఊహించుకుంటే,అబ్బాయిలు హీరోయిన్లని ఇష్టపడతారు. ఇంకా రచనా రంగంలో అయితే స్త్రీల పేర్లతో రాస్తే ఎక్కువ మంది చదువుతారనే ఉద్దేశ్యంతో ఎంతోమంది మగ రచయితలు  కూడా ఆడవారి పేర్లతో రాసిన ఉదంతాలు ఎన్నో. మనిషి ఆలోచనలను,ప్రతిభా సామర్ధ్యాల కంటే ముందు మనుషులు ఆడా?మగా ? అందం చందం చూసే వారు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ పైకి ఎవరు ఒప్పుకోరు. కారణం ప్రతి ఒక్కరికీ మనిషి ప్రతిభ ఆధారంగా కాకుండా లింగ, రూపురేఖల ఆధారంగా అభిమానం చూపించడం తప్పని తెలుసు కనుక. జీవితంలో ఆ దశ దాటాలంటే మనిషిలో మానసిక పరిణతి ఉండాలి.

          రచన ఏదైనా మనకు ఓ కొత్త ఆలోచనా లోకానికి వారధి అని దానిని ఆ కోణంలో మన నేస్తంలా ఆహ్వానిస్తేనే రచయితకు,పాఠకులకు మధ్య కూడా ఆరోగ్యకరమైన అనుబంధం ఉంటుంది. అది దాటి ఒకరి లోకంలోకి ప్రవేశించినా అది సంతోషంగా మాత్రం పరిణమించదు. రచన పట్ల అభిప్రాయం ఉండాలి కానీ, రచయిత పట్ల మాత్రం కాదు. అప్పుడే రచనల గౌరవం పదిలంగా ఉంటుంది.

                    *    *   *

         

           

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!