ఇల్లు అద్దెకు ఉందా ?

ఇల్లు అద్దెకు ఉందా ? 
     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
 

సొంత ఇల్లు ప్రతి ఒక్కరికీ ఓ సుందర స్వప్నం. అద్దె ఇళ్ళల్లో నివాసం మన ప్రవర్తనతో పాటు ఆ ఇంటి యజమానికి మన పట్ల ఉన్న అభిప్రాయంతో పాటు మనమిచ్చే అద్దె కూడా నచ్చితే తప్ప అక్కడ ప్రశాంతంగా ఉండలేము. ఐటీ సెక్టర్ ఉద్యోగులు చెన్నైలో పెరిగిపోయిన సందర్భంలో చెన్నైలో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ సమయంలో సినీ రచయితగా పని చేసే ఇలాంగో ఇంటి యజమాని అతని కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయమంటే ఇంకో అద్దె ఇంటి కోసం ఆ కుటుంబం పడిన పాట్లే 2019 లో విడుదలైన 'టు లెట్ 'తమిళ్ సినిమా. 
ఇక సినిమా విషయానికి వస్తే  ఎంతో వాస్తవికంగా తీసిన సినిమా ఇది. దీనిలో పాటలు లేవు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనం ఆ ఇలాంగో కుటుంబంతోనే ఉంటాము. సినీ దర్శకులు చేజియన్ కు దర్శకులుగా మొదటి సినిమా అయినప్పటికీ వాస్తవాన్ని చిత్రించే సినిమాను ప్రేక్షకులు ఆ సినిమాతో పయనించేలా చేయడం దర్శకుడిగా ఆయన విజయం సాధించారనే చెప్పవచ్చు. 
ఇలాంగో సినీ రచయిత. ఓ అద్దె ఇంట్లో భార్య, కొడుకుతో ఉంటాడు. అప్పటికి అతని వివాహమై ఆరేళ్లు. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువ అద్దెలు ఇచ్చే పరిస్థితులున్న సమయం అప్పుడే చెన్నైలోకి ప్రవేశించింది. 10 నెల్లల అడ్వాన్సు కూడా ఇంటి ఓనర్లు డిమాండ్ చేస్తున్న రోజులు. అలా తన ఇంటిని కూడా వారికే అద్దెకిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇలంగో ఇంటి యజమాని వారిని ఓ నెలలో ఇల్లు ఖాళీ చేయమని చెప్తుంది. 
దానితో ఇలాంగో ఇంకో ఇల్లు వెతుక్కోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటాడు. అందులోనూ సినిమా పని చేస్తున్నాము అని చెప్తే ఇల్లు అద్దెకిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో ఇలాంగో కథను అమ్మేస్తే 50 వేలు ఇస్తానని ఓ నిర్మాత చెప్తాడు. అయినా దానికి ఒప్పుకోదు ఇలాంగో. ఎలాగో మిత్రుడి సలహాపై ఆ మిత్రుడి బంధువుల్లో ఒకరికి సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని ,ఆ కంపెనీలో పని చేస్తున్నట్టు విజిటింగ్ కార్డ్ కూడా డమ్మీది తీసుకుంటాడు ఇలాంగో. ఎలాగో అడ్వాన్స్ కు ,అద్దెకు డబ్బు సమకూర్చుకుంటాడు. 
దినపత్రికల్లో వచ్చే ప్రకటనలు చూసి కూడా అద్దె ఇల్లు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ ఇల్లు దొరుకుతుంది. కానీ అంతా అయిపోయాక చివర్లో విజిటింగ్ కార్డ్ విషయం బయట పడటంతో ఆ ఇల్లు అద్దెకు ఇవ్వరు. అక్కడితో సినిమా ముగుస్తుంది. 
అద్దెకు ఓ ఇంట్లో ఉన్నప్పుడూ ఇంటి అద్దె కడుతున్నప్పటికీ కూడా ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారు ఆ ఇంటి యాజమాని పట్ల ప్రదర్శించాల్సిన వినయం,అలాగే అద్దెకు ఉండేవారిని తమ కింద పనిచేసే వారీగా భావించే యాజమానుల మనస్తత్వం కూడా స్పష్టంగా చూపించారు దర్శకులు.వేరే ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ కొత్త ఇల్లు ఇచ్చే ఇంటి వారు అద్దెకు ఉండేవాళ్లు ఇంటిని ఎలా చూసుకుంటారు అనే విషయం నిర్ధారించుకోవడానికి పాత ఇల్లు చూడాలనే ఆంక్షలు పెట్టడం వంటివి కూడా అద్దె ఇంట్లో ఉండేవారు ఒకరి అధీనంలో ఉండాలి అనే అంతర్లీన భావం కూడా ఈ సినిమా లో ఉంది. ఇవన్నీ మనకు తెలిసిన నిజాలే. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడూ మనమేవరం చెప్పుకోలేని ఎన్నో విషయాలు మన మనసులో ఉన్నవి ఆ పాత్రలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. 
ఇలాంగో ఇల్లు ఖాళీ చేయకముందే ఆ ఇంటిని చూసుకోవడానికి ఎందరో రావడం, ఆ ఇంట్లో ఉన్న ఇలాంగో భార్య ఎంతో ఇబ్బంది పడటం, ఇలాంగో భార్యను ఇంటివావిడ పని మనిషిలా చూడటం, అద్దె కడుతున్నా సరే టాయ్లెట్ బ్లాక్ అయితే బాగు చేయించకపోవడం వంటి అంశాలన్నీ అద్దెకుండే వారి పట్ల ఇంటి వాళ్ళ ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వేరే ఇంటికి మారడానికి ముందు ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే దానిని ఎగ్గొట్టడానికి ఇంటి కండిషన్ చెక్ చేయాలని ఆ ఇంటి ఆవిడ అనడం మన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను మనకు జ్నప్తికి  తెస్తుంది. 65 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో 'బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'అవార్డ్ పొందింది ఈ సినిమా. అంతర్జాతీయ 49 వ సినీ ఉత్సవాల్లో ప్రత్యేక జూరీ పురస్కారం కూడా ఈ సినిమాకు దక్కింది. 
దర్శకులు చేజియన్ తన భార్య ప్రేమతో కలిసి 'లా సినిమా' కంపెనీని స్థాపించి దాని ద్వారా విడుదల చేశారు. రియలిస్టిక్ సినిమాలు మీ అభిరుచి అయితే తప్పక ఈ సినిమా చూడండి. మీ జీవితంలో అద్దె ఇల్లు కూడా ఓ భాగమైతే మిమ్మల్ని మీరు ఈ సినిమాలో తప్పకుండా ఎక్కడో ఓ చోట చూసుకుంటారు. 
*    *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!