జీనియస్ జీవితం

 జీనియస్ జీవితం

-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)


నిషి జీవితంలో సాధించే అసాధారణ విజయాలను బట్టి  లేదా మనకు వ్యక్తిగతంగా మనిషి తెలివితేటలపై ఉన్న నమ్మకాన్ని అనుసరించి ఓ మనిషిని మనం జీనియస్ అని భావిస్తాం. ప్రపంచం మొత్తం చేత ‘హ్యూమన్ కంప్యూటర్ ‘గా కీర్తించబడి  భారతీయ స్త్రీకి మేధస్సు పరంగా ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన స్త్రీ శకుంతలా దేవి.

                        ప్రతి మనిషి మేధస్సు పరంగా ఓ రకమైన వ్యక్తిత్వాన్ని, కుటుంబపరంగా ఇంకో రకమైన ఉనికిని కలిగి ఉంటారు. శకుంతలా దేవి గణిత మేధస్సులో  కంప్యూటర్ ని కూడా మించిపోయినప్పటికీ ఆమె కుటుంబ జీవితం గమనిస్తే తన మనస్తత్వమే తన కూతురికి కూడా   ఉంటుందని భావించి ఆమె తనలాంటి జీవన శైలి ఆమెకు అలవాటు చేయాలనే ప్రయత్నం చేయటం,దానికి కూతురు నుండి వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది.

                        బాల్యంలో తండ్రి కుటుంబ బాధ్యతను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, శకుంతలదేవికి  తండ్రి పట్ల విముఖత ఏర్పడింది. తండ్రి సరిగ్గా వైద్యం చేయించకపోవడం వల్ల ఆమె సోదరి మరణించడంతో అది కోపంగా మారింది.  శకుంతల దేవి  కుటుంబ నేపథ్యంలో తండ్రి బాధ్యతరాహిత్యంగా, పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఎందుకు తల్లి ఎందుకు మౌనంగా ఉంది ? తన భర్త బాధ్యతారాహిత్యాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు?కూతుర్ల బాధ్యతను ఎందుకు తీసుకోవడంలేదు ? అనే అసంతృప్తి ఆమె మనసులో ఉండిపోయి అది తల్లిమీద కూడా క్రమేణా కోపంగా మారింది.అందువల్ల తల్లిదండ్రులతో ఆమె అంత ప్రేమానుబంధాలు పెంచుకోలేకపోయింది.
ఆ సమయంలోనే ఆమెలో ఉన్నటువంటి ఈ గణిత ప్రతిభకు గుర్తింపు లభించింది.ఆమె ఎక్కడికెళ్లినా ఏ షోస్ చేసినా సరే ప్రజలు ఆమెను గుర్తించేవారు. దాంతో ఆమెమీద ఆమెకు ఆత్మవిశ్వాసం పెరిగింది. తన జీవితం తాను గడపగలననే ధైర్యం వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె ఆదాయం మీదే ఆమె  కుటుంబం బ్రతుకుతుంది...కానీ, ఆమె తల్లిదండ్రులమీద విముఖత అనేది బాల్యంతో పాటు అలాగే పెరుగుతూ వచ్చింది.ఆ సమయంలో ఆమెకి లండన్ లో మంచి అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళింది. అక్కడ తనను తాను నిరూపించుకుని షోస్ ఇవ్వడం లాంటివి చేసి హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమె ఎప్పుడు కూడా తన తల్లిదండ్రుల గురించి ఒక రకమైనటువంటి ఫీలింగ్ లో ఉండేది. వాళ్ళు నన్ను కేవలం డబ్బు కోసమే ఆశిస్తున్నారు తప్ప, బాధ్యతగా అనేది ఏనాడూ లేరు అనేది ఆమె బాధ... అందుకే తన కుటుంబం గురించి అంతగా ఆరాటపడేది కాదు.

        ఈమె కలకత్తాకు చెందిన ఐ ఏ ఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకోవడం, పాప పుట్టడంతో క్రమంగా గణితాన్ని, షోస్ ని వదిలేస్తుంది. ఆ సమయంలో తను ఆలోచించింది..'నేనెందుకు నా వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాను? నాకు నంబర్స్ అంటే ఇష్టం కదా, మళ్ళీ నా షోస్ ని స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా' అని తన భర్తని అడుగుతుంది. దానికి ఆయన ప్రోత్సాహం అందిస్తాడు.

       ఈమె ప్రపంచం అంతా తిరుగుతుంటుంది కూతుర్ని మాత్రం ఆమె భర్త చూసుకుంటూ ఉంటాడు... కూతురిని భర్త బాగా చేసుకుంటున్నా కూడా ఆమె తన కూతురు తనతోనే ఉండాలి, నేను కన్నాను కాబట్టి తను నా వెన్నంటే ఉండాలి అని భర్త దగ్గర్నుండి తనతోపాటే విదేశాలు, వివిధ ప్రాంతాలు తిప్పుతుంది. దాంతో ఆమె కూతురికి సరైన విద్య అందదు, ఉండడానికి సరైన చోటు ఉండదు. దాంతో ఆ కూతురు మనసు బాధపడుతూ ఉంటుంది. 'నాకెందుకు మా అమ్మ అందరి అమ్మల్లా లేదు' అనే ఫీలింగ్ ఆమెలో కలుగుతుంది... దీనికి తగ్గట్టు తండ్రికి రాసే లేఖల్ని, అలాగే తండ్రినుంచి వచ్చే లేఖల్ని కూడా తనవరకు చేరనివ్వదు శకుంతల దేవి. తండ్రి తనకు రాసిన ఉత్తరాలు చేరకపోయినా కూడా తండ్రిపై ప్రేమ అలాగే ఉండిపోతుంది.

  ఇక్కడ మేధస్సు పరంగా చుస్తే శకుంతల దేవి చాలా తెలివైంది. మిషన్స్ కూడా ఆమె తెలివితో పోటీ పడలేకపోయాయి. కానీ, కుటుంబ పరంగా, వ్యక్తిగత అనుబంధాల పరంగా వచ్చేసరికి ఆమె ఓడిపోయింది. నా కూతురు కూడా నాలాగే ఆలోచిస్తుంది అనే భ్రమలో ఉంటుంది. తను ప్రపంచమంతా  తిరుగుతుంది, ప్రపంచంతో పోటీపడుతోంది, దానిద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటుంది అనుకుంటుంది శకుంతల దేవి.  చిన్నప్పుడు ఈమె ఏం చదువుకోలేదు. పుట్టుకతో వచ్చిన అసాధారణ ప్రతిభ వల్ల శకుంతలాదేవికి  అటువంటి వ్యకిత్వం ఏర్పడింది. కూతురిని కూడా తనలా తయారుచేయాలనే తత్వం ఆమెది. కానీ కూతురు వేరేవారి జీవితాలని చూస్తూ 'నేను ఎందుకు మామూలు వ్యక్తిగా ఉండట్లేదు?!, నాకెందుకు మాములు విద్య దొరకడం లేదు?, ఎందుకు ఒకచోట ఉండలేకపోతున్నాం" అనే సంకోచంలో తన బాల్యాన్ని కోల్పోతుంటుంది... చిన్నప్పుడు శకుంతల దేవి కూడా ఇలాగే తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుందో, ఇప్పుడు కూతురు కూడా శకుంతల దేవిపైన కోపం, ద్వేషం పెంచుకోసాగింది.

     ఈ మొత్తం ప్రక్రియలో చివరకు ఆ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు కూడా కూతురిపై ప్రేమతో, తనని వదిలి ఉండలేక తన అల్లుడిని కూడా తమతో పాటు రమ్మంటుంది. అంతటి అనుబంధాన్ని కూతురిపై పెంచుకుంటుంది శకుంతల దేవి. ఇక్కడ  గమనించాల్సిన అంశమేమిటంటే  శకుంతల దేవికి  అంత మేధస్సు ఉన్నంత మాత్రానా, అన్నింట్లో కూడా అదే మేధస్సు, అదే ప్రజ్ఞను, అదే తెలివిని ప్రదర్శించాలని  మనం అనుకోలేం.మనం ఎంతోమంది జీనియస్ లా జీవితాలని గమనిస్తే వారి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు అసాధారణంగా ఉంటారు. మిగిలిన వ్యక్తులు ఉన్నట్టు వాళ్ళు ఉండలేరు. 

                        దాని వల్ల వారు తమ  ప్రతిభా పరిధి బయటకు వచ్చి నిలుచుంటే సామాన్యుల్లా బ్రతకలేరు. స్త్రీ అని తనను తాను శకుంతలాదేవి ఏనాడూ బలహీనంగా భావించలేదు, తనను తాను శక్తివంతురాలిగా నిర్మించుకునే క్రమంలో ఆమె వ్యక్తిగత అనుబంధాల పట్ల శ్రద్ధ వహించకపోయినప్పటికీ తన మేధా రంగంలో మాత్రం ఆమె ఎప్పటికీ ధ్రువతారే.


 


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!