ఆలోచిస్తూ చదవండి!

చదువరి 

 ఆలోచిస్తూ చదవండి!

                                            -రచనశ్రీ దత్త (శృంగవరపు రచన)


            పుస్తకాలను చదవడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు ఉత్తమ పుస్తకాల జాబితాను , ఇంకొందరు అభిమాన రచయితల సాహిత్యాన్ని, మరికొందరు ఏ ప్రత్యేక సాహితీ క్రమాన్ని అనుసరించకుండా ఏది నచ్చితే దానిని పఠనాభిలాషకు  తగ్గట్టుగా అనుసరిస్తూ పుస్తకాలు చదువుతుంటారు. నా మటుకు నేను అన్నీ రకాల కలగాపులగంగా సందర్భాన్ని అనుసరించి మారుతుంటాను. మన వ్యక్తిగత గ్రంధాలయాల్లో ఎన్నో పుస్తకాలు ఉన్నా, ఏదో ఒక ప్రేరణ అంతర్లీనంగా కలిగితే తప్ప ఎవరమూ చదవలేము. అలాంటి ఓ విభిన్న ప్రేరణతో నేను డాక్టర్ అమృతలత గారి సాహిత్యాన్ని చదివాను.

            నా జీవితంలో ఎలా ఆలోచించాలి? అనే సందిగ్దత వచ్చిన దశలో, ఎంతో పెద్ద గందరగోళ దశలో ఉన్నప్పుడూ నాకు అమ్మలా ఆలంబనగా నిలిచిన గురువు జలంధరగారు. అలా ఓ సారి కలిసినప్పుడు అమ్మ ప్రస్తావించిన వ్యక్తే డాక్టర్ అమృతలత గారు. ఎంతో అత్యుత్తమ వ్యక్తి అయితే తప్ప అమ్మ పొగడటం అరుదు. రచనా ...నువ్వు కచ్చితంగా ఆవిర్భవకు ఇంటర్ వ్యూ తీసుకోవాల్సిన వ్యక్తి అని అమ్మ చెప్పినప్పుడు నాకు కుతూహలం కలిగింది. అమ్మ అలా ఇచ్చిన పుస్తకమే అమృతవర్షిణి. అది నాకు నిజంగా ఆచరణాత్మకంగా, అలాగే   శక్తివంతమైన సూత్రాల్లా కూడా అనిపించాయి. అలా అమృతలతగారి ఇంటర్ వ్యూ తీసుకోవడం జరిగింది. అలా కొన్నిసార్లు మాట్లాడటం జరిగింది. ఆ క్రమంలో తన  సాహిత్యం గురించి ఓ సమీక్షల రాయమని అమృతలత గారు అడగటం నాకొచ్చిన అరుదైన అదృష్టంగా భావించి డాక్టర్ అమృత లత గారి సాహిత్యమంతా చదివాను. దానితో పాటు అమృతలత గారి ఇంటర్వ్యూ లను , పలువురి స్పందనలను తెలియజేసే అలుపెరుగని అల కూడా చదవడం సంభవించింది.

            ఓ వ్యక్తి మీద మనకున్న సాధారణ ఆసక్తి అసాధారణమైనది అవ్వాలంటే దానికి ముఖ్యమైన అంశంగా నిలబడేది మనకు వారికి ఏదో ఓ విషయంలో ఉన్న పోలికలు. డాక్టర్ అమృతలతా గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా, అమృత్ కిరణ్ పక్ష పత్రికను నడుపుతూ  రెండేళ్ళు సంపాదకులుగా వ్యవహరించారు. గతంలో నేను కూడా ఓ ఉపాధ్యాయిని అవ్వడం, ప్రస్తుతం ఆవిర్భవ పక్ష పత్రికను నడుపుతూ సంపాదకత్వం వహించడం ఎక్కడో ఏదో సామీప్యతను నాలో కలిగేలా చేశాయి. ఆ భావనే నన్ను ఆ సాహిత్యాన్ని ఆసక్తితో చదివేళా చేశాయి.

            డాక్టర్ అమృతలత గారి ఒక్కో రచన చదువుతుంటే ఒక్కో భావన కలుగుతుంది. నాకు వ్యక్తిగతంగా అమృత గారి సాహిత్యప్రక్రియల్లో నాటకాలు బాగా నచ్చాయి. ఓ విద్యావేత్తకు సమాజం పట్ల ఉండే అవగాహన, బాధ్యత, సమస్యలు ,మార్పు రావాల్సిన కోణాలను సున్నితంగా స్పృశించినా,కథా ప్రక్రియలో అన్ రెస్ట్ వంటి కథ ద్వారా ఘాటుగానే సమాజపు జాడ్యాలను కాలానుగుణంగా ప్రశ్నించారు కూడా.

            ప్రతి రచనలోనూ సామాజిక బాధ్యత అమృత లత గారి రచనల్లో గోచరిస్తుంది. సృష్టిలో తీయనిది  నవలికలో ముఖ్య పాత్ర జయా. ఓ అమ్మాయి చుట్టూ మాత్రమే కథ అల్లడం అంత తేలికైన విషయం కాదు. కథాంశం మొత్తంలో ఎక్కడ కూడా  కళాశాల విద్య వయసులో ఉన్న ఆడ,మగల  మధ్య ఉండే ఆకర్షణ ఉండదు. ఓ లేడీస్ హాస్టల్ లో లేడీస్ కాలేజీలో జరిగే సంఘటనల ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథాంశం ఇది.

              వ్యక్తి మీద ఎల్లప్పుడూ అభిమానం ఉండాలంటే ఆ వ్యక్తి రూపు రేఖల కన్నా కూడా ఆ వ్యక్తి హుందాగా ఉండే తీరు,స్నేహాన్ని పంచే వ్యక్తిత్వం ప్రధానమని  సృష్టిలో తీయనిది  నవలలో జయ పాత్ర చిత్రీకరణను బట్టి పాఠకులకు అర్ధమవుతుంది. స్త్రీ పాత్ర చిత్రణను ఆమె వ్యక్తిత్వ పరిధిలో శిల్పంలా చెక్కడం అన్నది రచయిత్రికి స్త్రీ ఎలా ఉండాలి అనే దాని పట్ల, ఈ సమాజంలో స్త్రీ ఎలా ఉంటే తన తన హుందాతనాన్ని  నిలుపుకోగలదు అనే అంశం పట్ల ఉన్న స్పష్టతకు దర్పణంగా ఉంది. కాకపోతే కథ ముగింపుకు వచ్చేసరికి ఎందుకో కాస్త హడావుడిగా ఉన్నట్టు అనిపించినప్పటికీ, ఈ సమాజంలో స్త్రీ అయినా, పురుషుడు అయినా సరే  ముందు ఆకర్షించబడేది వ్యక్తిత్వానికి తప్ప స్త్రీ, పురుష ఆకర్షణల వల్ల కాదని జయ స్నేహితులైన  నిర్మల, రజిత, అరుణ, చంద్ర వంటి వారు జయ పట్ల పెంచుకున్న అనుబంధాన్ని బట్టి పాఠకులకు చెప్పి చెప్పకుండానే చెప్తూ తన రచనాతత్వాన్ని  జయ ద్వారా ఈ నవలికలో బలపరిచారు అమృతగారు.

            అమృత గారి నవలిక,కథా ప్రక్రియల్లో  ఓ రకమైన గంభీరమైన శైలి కనిపించినప్పటికీ, నాటక ప్రక్రియలో మాత్రం సున్నిత హాస్యం, సమస్యను సూటిగా ప్రశ్నించే వ్యంగ్యం పాఠకులకు ఆ దృశ్యాన్ని కూడా ఊహాచిత్రంలో నిలుపుతాయి. ప్రాణం లేని వాటి పట్ల మనుషులు ప్రవర్తించే తీరు ఎంత  అసహజంగా ఉంటుందో, తమ రాజకీయ గెలుపు కోసం నాయకులు, వ్యాపార విజయం కోసం వ్యాపారవేత్తలు, తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్ధులు ఖర్చు తగ్గించుకోవడానికి తమకు కనిపించిన గోడల నిండా రాతలతో నింపేయడం, అలా ఆ రాతలకు బలైన ఓ గోడకు ప్రతి శుభ సందర్భంలో సున్నాలు కొట్టించడం వల్ల ఓ అడుగు మందం అది ముందుకు రావడం వంటి  వినూత్న  అంశంతో  సామాజిక స్పృహను కలిగించే ఆలోచనను రేకెత్తించే నాటకమే  గోడలకే ప్రాణముంటే ... ‘.  ఈ నాటక సంపుటిలో ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్క నాటకం  ఓ సామాజిక సమస్యను చిత్రీకరించిందే. కాలేజీలో ఉండే రాగింగ్ అన్నది కళాశాల స్థాయిలో ప్రతి విద్యార్థి ఎదుర్కోవాల్సిన సమస్యే. ఆ సమస్య జూనియర్స్ గా ఉన్నప్పుడూ ఎదుర్కున్న విద్యార్ధులు మళ్ళీ సీనియర్స్ అయ్యేసరికి తాము రాగింగ్ వల్ల తమ సీనియర్స్ నుండి పడ్డ ఇబ్బందులను తమ జూనియర్స్ కూడా తమ నుండి అనుభవించాలి అనే పైశాచిక ప్రవృత్తి పెంచుకుని ప్రవర్తిస్తే ఆ సమస్య ఎంతో మంది విద్యార్ధుల పాలిట శాపంగా మారుతుందని, విద్య విద్యార్ధుల్లో  సంస్కార మానవత్వాన్ని పెంపొందించాలి తప్ప కక్షలను కాదు అని తెలిపే నాటకమే రాగింగ్.

            మనిషి విద్య బ్రతుకుతెరువు కోసమే. మనిషి చదువుకున్న చదువు అతనికి బ్రతకడానికి వినియోగించుకోలేకపోతే అతన్ని  ఎజుకేటెడ్ ఇల్లిటరేట్ నాటకంగా మలిచారు. ఓ ప్రాంతంలో నివసించడానికి  కచ్చితంగా ఆ ప్రాంతీయ బాషా పరిజ్ఞానం ఎంతో కొంత ఉండాలి. లేకపోతే వృత్తి రీత్యానో  లేక ఇంకేదైనా పని వల్లో ఇంకో ప్రాంతంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే అక్కడ వ్యక్తులతో సంభాషించడానికో లేదా కనీస అవసరాల రీత్యా అక్కడి బాషలోని అవసరమయినంతమేరకు నేర్చుకోకపోతే వారు కూడా చదువుకున్న నిరక్ష్యరాస్యులే అని సుతీమెత్తగా చెప్పే నాటకమే  ఎజుకేటెడ్  ఇల్లిటరేట్.

            ఉపాధ్యాయ రంగంలో ఒకే వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయ కారణాల చేత వారు ముందు ఎలా ఉంటారు? ఆ వ్యక్తి లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ? తెలిపే నాటకమే స్టాఫ్ రూమ్. రాజకీయ నాయకులు తమ పదవులను కాపాడుకోవడానికి  విద్య రంగాన్ని ఎలా వినియోగించుకుంటారో తెలిపే నాటకమే స్కూల్ పెట్టి చూడు.  బందుల వల్ల ఎవరికి లాభం? బందుల  లక్ష్యం ఎలా పక్కదారి పడుతుందో తెలిపే నాటకమే బంద్ లూ ..రాబందులూ. అమ్మాయిల పట్ల ఆకర్షణ పెంచుకుని వారిని ప్రేమ పేరుతో ఎలా తమ దారికి తెచ్చుకోవాలి ? తమ ఆధిక్యతను ఎలా ప్రదర్శించాలి అనే ఆలోచనా ప్రవృత్తి నుండి తలెత్తే ఈవ్ టీజింగ్ ను ఉద్దేశించి రాసిందే ఈవ్ టీజింగ్ . గోడలకే ప్రాణముంటే నాటక సంపుటిలో ఉన్న ఏడు నాటకాలు సమాజంలో కచ్చితంగా దృష్టి పెట్టాల్సినవే. అమృతలత గారు ‘ప్రతి టీచర్ కూడా ఒక రచయితే’ అంటారు. అమృతలత గారి ఏ నాటకం చదివినా ఆ టీచర్ రచయిత అయి రాస్తే ఎంత వాస్తవికంగా ఉంటుందో అర్ధమవుతుంది.

            జీవితంలో ఈ విషయాలు ఇలా ఉంటే ఇంకా జీవిత మాధుర్యం ఆస్వాదించవచ్చు అనే తపన అమృతలతా గారి స్పందన కథా సంపుటిలోని ప్రతి కథలోనూ స్పష్టమవుతుంది. పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండే ఎక్ష్సైట్ మెంట్ ను ఎల్లప్పుడూ కొనసాగించాలంటే వారిద్దరూ థ్రిల్ ఇచ్చే పనులు చేస్తుండాలని అలా ఉంటే వారి  దాంపత్యంలో రొటీన్ భావన రాదని తెలిపే కథే హమేషా...మజాగా..

            ఓ బిడ్డకు బాల్యంలోనే హెచ్ ఐ వి సోకి తల్లిదండ్రులను కోల్పోతే అతనికి ఆత్మీయ స్పర్శ ఇవ్వాలని తెలిపే కథే ఆత్మీయ స్పర్శ. ప్రతి మనిషికి కోరికలు ఉండటం సహజం. మన కింద పని చేసే వారు ఎప్పుడైనా మనం లేనప్పుడూ ఏదైనా తీర్చుకోగలిగే కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తే, అది యాజమానుల దృష్టికి వచ్చినప్పుడు వారికి ఆ సంతోషం ఇవ్వగలిగితే అది వారి మనసులో ఉన్న అపరాధ భావాన్ని పోగొట్టి, యాజమానుల పట్ల  గౌరవాన్ని పెంచుతుంది అని తెలిపే కథే  టెంప్టేషన్.

            బాల్యంలో పిల్లలు ఎవరికైనా సాయం చేయాలనే తలంపుతో ఉంటే వారిలో ఆ మానవత్వ స్పర్శను పెంచి పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని తెలిపే కథే నేను సైతం.  చెయ్యి చాచి అడుక్కునే  బిచ్చగాళ్ళనే మనం ముష్టి వాళ్ళగా భావిస్తాం, కానీ ఈ సమాజంలో  కొందరు మాత్రం గుర్తింపు కోసం కూడా అలాగే తమ శైలిలో అడుక్కుంటారు అని తెలిపే కథే ఇదో రకం ముష్టి.

            భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలను  డబ్బుతోనో, వ్యక్తిగత ఇగోలతోనో ముడిపెడితే దాంపత్య మాధుర్యం నిస్సారం అవుతుందని, దానిని ఎలా నిలుపుకోవాలో సూచించే కథే స్పందన. ప్రకృతి వనితగా పెరిగిన ఆమె యాచకురాలు  అయినా కష్టంలో ఉన్న దంపతులకు సాయం చేసింది, ఆ దంపతుల బిడ్డకు తల్లి అయ్యింది, కానీ తన బిడ్డ ఆకలి తీర్చడానికి అవసరమైన ఆ యాచకురాలు ఆ అవసరం తీరగానే ఆ బిడ్డ తల్లికి పనికిరాని వ్యక్తిగా కనిపించింది, ఆమెను అనుభవించాలనుకున్న  ఆ భర్తకు భార్య ఉండటం వల్ల ఆ అవకాశం లేకపోవడం వల్ల ఆమెతో అతనికి అవసరం లేదని అనిపించింది. కానీ ఇవేమీ తెలియని ఆమె వారికి రెండు సార్లు సాయం చేసినా, మూడో సారి మాత్రం విషయం గ్రహించి వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. కష్టంలో ఉన్నప్పుడూ సాయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారిని కనీస మనిషిగా కూడా గౌరవించలేని వ్యక్తులు సాయానికి అనర్హులు అని చెప్పే కథే కాలని తెప్ప.

            ప్రతి మనిషి మనసులో ఒక్కో వ్యక్తిగత స్వార్ధం ఉంటుంది. ఆ స్వార్ధమే కొన్ని అనుబంధాలకు నాంది అవుతుంది. ఆ అనుబంధాలను తమ భవిష్యత్తు కోసం ఎలా వాడుకోవాలని కొందరు ప్రయత్నిస్తారో తెలిపే కథే అంతుబట్టని ఆంతర్యాలు. ఎంత ప్రాణ స్నేహితులైనా సరే భర్త విషయం వచ్చేసరికి స్త్రీ హృదయం ఎలా మారిపోతుందో తెలిపే కథే ఆమె నవ్వు. ఎంత తెలివైనా స్త్రీ అయినా సరే భర్తలో న్యూనతా, ఆధిపత్య ధోరణి ఉంటే కలిసి జీవించడం కష్టమే అని చెప్పే కథే కన్నీళ్ళతో కాలక్షేపం.’ సమాజంలో అశాంతిని, అసమానత్వానికి కారణమవుతున్న రిజర్వేషన్లు ,అలాగే సామాజిక వివక్షల గురించి, సమస్యల గురించి పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా అరుణ విద్యార్ధినులతో చర్చించడం ఆమె ప్రాణాలను ఎలా హరించిందో, అన్యాయాన్ని ప్రశ్నించినా సరే కొన్నిసార్లు అది ఆ వ్యక్తుల జీవితాల్ని ఎలా బలిగొంటుందో తెలిపే కథే అన్ రెస్ట్.

            ఇలా మొత్తం 19 కథల సమాహారమే స్పందన. ప్రతి కథలో ఓ పరిస్థితి,సందర్భం లేదా సంఘటన సమకాలీన పరిస్థితుల్లో ఎలా జరుగుతుందో, కానీ ఎలా జరిగితే బావుంటుందో కూడా సూచిస్తూ ఓ వ్యక్తిగత, సామాజిక అవగాహనను కల్పించేవే ఈ కథలు.

            కథలు,నాటకాలతో పాటు పూర్తిగా సామాజిక బాధ్యతను గుర్తు చేసేవే  డాక్టర్ అమృత లతా గారి అమృతవర్షిణి’, ఓటెందుకు?’ పుస్తకాలు. జీవితంలో ఎలా అయినా కాలంతో గడిపేయ్యొచ్చు కానీ కొన్ని అంశాలను జీవితంలో భాగం చేసుకుంటే ఆ జీవితం అనుక్షణం ఎలా మనకు సంతృప్తికరంగా, నిత్య సంతోషంగా మారుతుందో తెలిపే పుస్తకమే అమృతవర్షిణి.

            ఈ సమాజంలో మనిషి విజయం సాధించడానికి డాక్టర్ అమృతలత గారి 45 సూత్రాల సమాహారమే అమృతవర్షిణి. ఇవి అమృత్ కిరణ్ పక్ష పత్రికలో సంపాదకీయాలుగా ప్రచురించబడినప్పటికీ కూడా చిరకాలం వర్తించే సూత్రాలివి.

            సమాజంలో ఎంతో మంది  ఓటు హక్కు గురించి తమదైన సాకులతో ప్రభుత్వాలను,ప్రజలను నిందిస్తూనే ఉంటారు. ఈ వ్యవస్థ మారేవరకు నేను ఓటు వెయ్యననే రకం కొందరు, కొందరు నాయకులపై వ్యక్తిగత ఆరాధన పెంచుకున్నాక వారు కనుక తమ సిద్ధాంతాలను అమ్ముకుంటే  వ్యవస్థ మీద ద్వేషం పెంచుకునే వారు ఇంకో రకం, సరైన అభ్యర్ధి లేనప్పుడు నేను ఓటు వెయ్యననే వారు ఇంకో రకం,ఇలా ఒక్కో రకమైన అభిప్రాయంతో ఓటు హక్కు విలువను తెలుసుకోకుండా ఎలా తమ హక్కును కోల్పోతున్నారో, దాని పరిణామాలేంటో తెలుపుతూ అమృత గారు సున్నితంగా సంధించిన వ్య౦గ్యాస్త్రమే  ఓటెందుకు?’

            సాహితీపరంగా, విద్యావేత్తగా డాక్టర్ అమృతలత గారి ప్రస్థానం ఎందరికో స్పూర్తి. స్త్రీల సాహిత్యం కోసం ప్రత్యేకంగా అమృతాలతా పురస్కారాన్ని కూడా ఏర్పాటు చేయడం వారి సాహిత్య ప్రేమకు నిదర్శనం. ఓ కొత్త కోణంలో సమాజాన్ని వీక్షించాలనుకుంటే డాక్టర్ అమృతలతా గారి సాహిత్యం చదవాల్సిందే.

                       *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!