కాదంబరి

 సినీ సంచారం 

కాదంబరి 

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


రవీంద్రనాథ్ టాగూర్ భారత సాహిత్యానికి పరిచయం అవసరం లేని పేరు. టాగూర్ కుటుంబంలో సాహిత్య స్పర్శ ఆయన సోదరుడైన జ్యోతీంద్రనాథ్ టాగూర్ కు కూడా ఉంది. ఆయన ఓ థియేటర్ ను నడిపేవాడు, షిప్పింగ్ వ్యాపారం చేసేవాడు, ఓ పత్రికకు సంపాదకులుగా, ఓ సంగీత విద్వాంసుడిగా ఇలా ఎన్నో కళల ప్రజ్ఞ కలిగిన జ్యోతీంద్రనాథ్ టాగూర్  పదేళ్ళ కాదంబరి దేవిని వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్ళైన పదహారేళ్లకే అంటే తన 26 వ ఏటనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా మంది దానికి కారణం ఆమె రవీంద్రనాథ్ టాగూర్ వివాహాన్ని తట్టుకోలేకపోవడమనే  భావించారు. అసలు కాదంబరి దేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ అంశాన్ని కథాంశంగా తీసుకుని బెంగాలీ దర్శకులు సుమన్ ఘోష్ 'కాదంబరి' సినిమా తీశారు. ఇప్పటికీ కాదంబరి దేవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.బెంగాలీ వాతావరణాన్ని, రవీంద్రుని స్మృతుల్ని దర్శించాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

కాదంబరి దేవి తండ్రి దేబెంద్రనాథ్ టాగూర్ దగ్గర పని చేసేవాడు. ఏ మత,కుల తారతమ్యాలు చూడని దేబెంద్రనాథ్ టాగూర్ తన రెండో కొడుకు అయిన జ్యోతీంద్రనాథ్ టాగూర్ ను ఆయన కూతురు కాదంబరిదేవితో వివాహం చేశారు. ఆ రెండు కుటుంబాల మధ్య కుల వ్యత్యాసం ఉంది. దానితో ఆ ఇంట్లోని మిగిలిన ఆడవారు కాదంబరిని తక్కువగా చూసేవారు. ఆమె వివాహమై వచ్చేటప్పటికీ ఆమె కన్నా రెండేళ్ల చిన్నవాడైన రవీంద్రనాథ్ టాగూర్ తో ఆమెకు స్నేహం కుదిరింది. అలా బాల్యం నుండి వారిద్దరి మధ్య సాహిత్యపరమైన స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. 

రవీంద్రనాథ్ టాగూర్ భారతిలో ఉత్తరాలు కాదంబరిదేవి కోసమే రాశాడు. అలాగే రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ఎన్నో కవితలకు స్పూర్తి కాదంబరి దేవే.వారింటికి ఎందరో కవులు, సాహితీవేత్తలు వస్తూ ఉండేవారు. అలా కాదంబరిదేవి సాహిత్యం పట్ల ఆసక్తి కూడా పెంచుకుంది. ఇంట్లో ఉన్న వారంతా ఆమె అలా రవీంద్రనాథ్ తో సాహిత్య చర్చలు చేయడం గురించి గుసగుసలాడేవారు. వారిద్దరి మధ్య సంబంధం  ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారు. 

అదే సమయంలో భారతి లో ప్రచురితమైన రవీంద్రనాథ్ లేక కాదంబరి గురించి రాసిందే అని అందరికీ అర్ధమవుతుంది. అందుకనే అతన్ని కొంతకాలం ఇంగ్లాండ్ పంపిస్తాడు అతని తండ్రి. ఆ సమయంలో కాదంబరి, రవీంద్రనాథ్ టాగూర్ ఒకరికొకరు లేఖలు రాసుకునేవారు. జ్యోతీంద్రనాథ్ టాగూర్ పూర్తిగా తన వ్యాపారంలో నిమగ్నమై పోయాడు. దానితో పాటు అతను ఓ డ్రామా థియేటర్ ను కూడా నడుపుతూ ఉండేవాడు. అందులో  నటించే ఓ స్త్రీతో అతనికి సంబంధం ఉంది. ఆ విషయం అప్పటికే కాదంబరి దృష్టికి కూడా వచ్చింది. 

ఇంగ్లాండ్ నుండి రవీంద్రనాథ్ తిరిగి వచ్చాక రవీంద్రనాథ్, జ్యోతీంద్రనాథ్ ,కాదంబరి ఓ రెండు వారాలు బయటకు వెళ్తారు. ఆ సమయంలో జ్యోతీంద్రనాథ్ ఎక్కువ సేపు కలకత్తాలో ఉండేవాడని, రవీంద్రనాథ్ కు కాదంబరికి మధ్య సంబంధం బలపడిందని అందరూ అనుకుంటూ ఉండటంతో రవీంద్రనాథ్ టాగూర్ కు వివాహం నిశ్చయించి మృణాళిని తో వివాహం జరిపిస్తాడు అతని తండ్రి. 

తర్వాత రవీంద్రనాథ్ కాదంబరి అతనికి ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడూ రాసిన ఉత్తరాలు తిరిగి ఇచ్చేస్తాడు. పిల్లలు లేక ,భర్త పట్టించుకోక, ఇంట్లో ఆమెకు విలువ లేక, అప్పటి వరకు సాహితి మిత్రుడుగా ఉన్న రవీంద్రనాథ్ వివాహంతో పూర్తిగా దూరం అవ్వడంతో ఎంతో బాధపడుతూ ఉంటుంది కాదంబరి. ఆ సమయంలో భర్తతో సంబంధం ఉన్న స్త్రీ గర్భవతి అతని వల్ల అయ్యిందనే విషయం తెలియడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సినిమా ముగించినా, ఆమె ఆత్మహత్యకు అసలైన  కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరినే. 

   నిజ జీవితంలో జరిగిన విషాయాన్ని సినీ అంశంగా తీసుకున్నప్పుడు ఎంతో సున్నితంగా అంశాన్ని తెరపై చూపించాలి. రవీంద్రనాథ్ లేఖలు, మరియు చరిత్ర నిర్ధారించిన నిజాలు కొన్నిటిని ఆధారంగా తీసుకుని చేసిన సినిమా ఇది. చూస్తున్నంతసేపు ఓ సాహిత్య ,సున్నిత లోకాలలో ప్రేక్షకులను విహరింపజేసే సినిమా ఇది. 

       *    *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!