స్త్రీత్వం ప్రతీకారజ్వాలైతే ?

 చదువరి 

                   స్త్రీత్వం ప్రతీకారజ్వాలైతే ? 

                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


          మనిషికి నిస్సహాయత, నిరాదరణ జీవితంలో భాగమై, అనుకోకుండా ఆ వ్యక్తికి ఓ ఆలంబన దొరికితే ఆ మనిషి తన జీవితాన్ని ఎలా మలుచుకుంటాడు? జీవితంలో విజయం అంటే ఏమిటో స్పష్టత లేకుండా, మనసులో అణగదొక్కబడిన అసంతృప్తి, కోపం, కసి ఎప్పుడెప్పుడూ బయట పడదామా? అని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో జీవితం అధఃపాతాళం నుండి స్వర్గానికి వెళితే ఆ మనిషి మానవుడులా ఉంటాడా? దానవుడు అవుతాడా ? ఇలా మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న విలక్షణత, విశృ౦ఖలత్వం ఎలా విహరిస్తాయో తెలిపే నవలే ఎ.లక్ష్మీకుమారి గారి 'ఆశల ఆకాశం.' 

రాణి తల్లిదండ్రులు మరణించినా, పిన్ని బాబాయిల పెంపకంలో పెరుగుతుంది. ఆమెను కనీసం మనిషిగా చూడని  ఆ కుటుంబంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉంటుంది ఆమె. ఆ పరిస్థితుల్లో రామారావు ఆమెను నాటక రంగానికి నటిగా పరిచయం చేస్తాడు. ఆ నాటకం తర్వాత ఆమెకు సినిమా అవకాశం వస్తుంది. అప్పటి వరకు బందిఖానాలా భావించిన ఆ ఇంటి నుండి బయట పడటానికి ఆమె రామారావుతో కలిసి మద్రాసు వెళ్తుంది. 

అలా మద్రాసు వెళ్ళాక ఆమె సంతోషం లోనే తన సంతోషాన్ని వెతుక్కుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రామారావు పుస్తకాల షాపులో 150 రూపాయలకు ఉద్యోగానికి చేరతాడు. రాణి సినీ స్టూడియోల చుట్టూ తిరగడం వల్ల ఆమెకు ఖర్చులు పెరుగుతాయి. తర్వాత రామారావు తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం రావడంతో అక్కడికి వెళ్తాడు. తిరిగి వచ్చాక తల్లి కోసం అక్కడ ఎవరో ఒకరు ఉండాలని చెప్తాడు. ఆమె ఆశలు సాధించాలని ఆమెను వెంట తీసుకువెళ్ళడు. అతను వెళ్ళే ముందు ఇద్దరు శారీరకంగా ఒకటవుతారు. 

అతను వెళ్ళిపోతాడు. తర్వాత ఓ ఉత్తరం రాస్తాడు. ఇంట్లో పరిస్థితుల వల్ల అసహనంతో ఏదో ఓ చోటికి వెళ్లిపోతున్నానని ఉత్తరం రాస్తాడు. ఓ సారి అతన్ని చూడాలనిపించి అతని ఇంటికి వెళ్తుంది రాణి. అప్పటికే అతనికి పెళ్లైపోయిందని  అతని తల్లి చెప్పడంతో రాణి మనసు విరిగిపోతుంది. అప్పటి నుంచి జీవితంలో పేరు,పలుకుబడి, గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. 

అప్పటికే ఆమె నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయి. రామారావు ఆమెతో కలిసి ఉండకపోవటంతో సమాజంలో ఆమె పట్ల ఏర్పడిన చులకనను కూడా ఆమె గమనిస్తుంది. భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని శారీరకంగా సంతృప్తిని ఇస్తూ తన అందాన్ని,ఆడతనాన్ని ఆసరాగా చేసుకుని అవకాశాలు తెచ్చుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. అనుకోకుండా సెక్స్ వేవ్(అర్ధ నగ్న దృశ్యాలు ,మసాలా సినిమా హిట్ ఫార్ములా అయిన సమయం ) సినిమా రంగంలో ప్రవేశించిన  పరిస్థితుల్లో అటువంటి రెండు  సినిమాలతో  విజయవంతమైన నటి అయిపోతుంది. దానితో డబ్బు,పేరు,పలుకుబడి సాధించిన తర్వాత ఆమెలో తనను అవమానించిన వారందరి మీద కక్ష సాధించాలనే మనస్తత్వం ఏర్పడుతుంది. 

తన విజయాన్ని ,అందాన్ని వినియోగించి  తనను అవమానించిన వారి మీద కక్ష సాధిస్తూ ఉంటుంది. పిన్ని ,బాబాయిల మీద కూడా అలానే కక్ష సాధిస్తుంది. వారిని అక్కడికి పిలిపించి మర్యాదలు, సౌఖర్యాలు అలవాటు చేసి తర్వాత వారిని ఆకలితో మాడ్చి ,ఇస్తానన్న డబ్బు మొత్తం ఇవ్వకుండా వారిని అవమానించి పంపుతుంది. ఆమెలో జీవితం పట్ల ఇలా ఒంటరితనం ఏర్పడుతున్న సమయంలో రంగారావు పరిచయం అవుతాడు. అతని భార్య మరణిస్తుంది, ఒక కొడుకు. అతనితో సంబంధం పెట్టుకుంటుంది. పెళ్లి మాత్రం వద్దని తేల్చేస్తాడు అతను. ఎందుకో రాణి మనసులో మాత్రం రామారావు మీద ప్రేమ అలానే ఉండిపోతుంది. 

అదే సమయంలో రామారావు ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతనికి వివాహం కాలేదని అతని తల్లి చెప్పింది అబద్ధం అని,ఆమె మరణించిందని తెలుస్తుంది. మళ్ళీ వారిద్దరు వివాహంతో ఒకటవుతారు. నవల ముగుస్తుంది. 

ఈ నవల చదువుతున్నంతసేపు ఒంటరితనానికి మందుగా ఏదో ఒక వ్యాపకం ఉండకపోతే ఆ మనిషి మనసు ఎంత క్రూరంగా తయారవుతుందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ నవల ముఖ చిత్రం దగ్గరే అందం,అభిమానం,ఆడతనం కలిసి చేసిన తిరుగుబాటు అని ఉంటుంది. ఇక్కడ తిరుగుబాటు అంటే ప్రతీకార జ్వాలే. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది సామాజిక గుర్తింపుతో పాటు తనకిష్టమైన మిగిలిన వ్యాపకాల పట్ల కూడా అదే రకమైన అనురక్తి పెంచుకోగలగడం. నవల కనుక రామారావు తిరిగి రావడంతో సుఖాంతం అయినప్పటికీ, నిజ జీవితంలో అటువంటి సుఖాంతాలు అరుదే. సమాజం గుర్తించని రోజు కూడా మనిషి బ్రతికే ధైర్యాన్ని సినీ రంగంలో ఉంటే అలవర్చుకోవాలనే పాఠాన్ని ఈ నవల చెప్పి చెప్పకుండానే చెప్తుంది. 

         *    *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!