జూనియర్ డిటెక్టివ్

 సినీ సంచారం 

జూనియర్  డిటెక్టివ్ 

            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 

సినిమాల్లో కథకు ప్రాధాన్యత ఎక్కువ, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఎక్కువ అనే ప్రశ్న వస్తే కథాంశాన్ని బట్టే తప్ప మామూలుగా ఎవరు నిర్ణయించలేరు. ఓ టాప్ స్టూడెంట్ తల్లి దండ్రులు మరణిస్తే ఆ పదహారేళ్ళ వయసులో అతను తన మనసులో ఉన్న బాధను ఎలా జయించాడు అన్నది ఒక కోణం అయితే, డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువ చదివే అలవాటు ఉన్న అతను డిటెక్టివ్ గా ఎలా మారాడు అన్నది ఇంకో కోణం. సినిమా మరి అద్భుతం అని చెప్పలేము కానీ సినిమాల్లో అన్నీ రకాలు చూడాలనుకునేవారు తప్పకుండా 2019 లో విడుదలైన బెంగాలీ సినిమా 'గోయెండా జూనియర్ '(డిటెక్టివ్ జూనియర్ ) చూడాల్సిందే. 

16 ఏళ్ళ బిక్రమ్ చదువులో టాపర్. అల్లరి చేయడు. తల్లికి ఉన్న డిటెక్టివ్ నవలలు చదివే అలవాటు ఉంది. తండ్రి అతనికి బయాలజీ పాఠాలు చెప్పేవాడు.ఓ రోజు రాత్రి ఇంటికి వస్తున్న దారిలో బిక్రమ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ దారివ్ చేస్తూ ఉంటాడు తండ్రి. తల్లి కూడా అక్కడే ఉంటుంది. అనుకోకుండా అప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో మరణిస్తారు ఇద్దరు. ఈ యాక్సిడెంట్ తో సినిమా మొదలవుతుంది. 

అప్పటి వరకు చదువు, తల్లిదండ్రులే లోకంగా బ్రతికిన అతనికి ఒక్కసారిగా లోకమంతా శూన్యమైపోతుంది. అతన్ని అతని అంకుల్ ,ఆంటీ పెంచుకుంటారు. స్కూల్ లో కూడా టాపర్ అయిన అతన్ని చదువుకోకుండా అల్లరిగా తిరిగే విద్యార్ధులు ఏడిపిస్తూ ఉంటారు. అదే స్కూల్ లో చదువుతున్న సంజయ్ అనే సీనియర్ డిటెక్టివ్ కూతురిని ప్రేమిస్తూ ఉంటాడు బిక్రమ్.కానీ బయటపడడు. 

 డిటెక్టివ్ కు ఉండాల్సిన లక్షణం తన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎన్నో కోణాల్లో విశ్లేషించగలగడం. కేవలం డిటెక్టివ్ పుస్తకాలు చదివినంత మాత్రాన ఓ విద్యార్ధిని డిటెక్టివ్ గా చూపించలేరు ఏ దర్శకులు కూడా. వయసు చిన్నది అయినప్పటికి తన చుట్టూ ఉన్న విషయాలను బిక్రమ్ ఎంత చక్కగా విశ్లేషిస్తాడో ప్రేక్షకులకు చూపించడానికే బిక్రమ్ ప్రేమించిన అమ్మాయి డబ్బున్న వాళ్ళతో స్నేహంగా మెలిగినప్పుడు అతను ఓ సారి ఆమెను కలవడానికి వెళ్తే వారు అవమానిస్తే వారి వేసుకున్న దుస్తులు, ష్యూస్,వాచీలు నకిలివి అని అతను విశ్లేషించి చెప్పడం వంటి సంఘటనల ద్వారా బిక్రమ్ లో ఉన్న డిటెక్టివ్ లక్షణాలను ప్రేక్షకులకు చూపించారు దర్శకులు. 

ఈ సంఘటనలు జరుగుతున్న సమయంలో బెంగాల్ లో స్వీట్స్ అధినేత అయిన దిబ్రాంచి బాగ్చి మరణం సంభవిస్తుంది. దిబ్రాంచి బాగ్చి పుట్టిన రోజుకి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేస్తుంది అతని కుటుంబం. ఆ పార్టీలోనే హఠాత్తుగా అతను మరణిస్తాడు. ఆ కేసు సంజయ్ డీల్ చేస్తాడు. కానీ అది హత్య అని అతనికి అనిపిస్తుంది. బిక్రమ్ అంకుల్ సంజయ్ దగ్గర పని చేస్తూ ఉంటాడు. బిక్రమ్ బయాలజీ సరిగ్గా  చదవడం లేదని ఆఫీసులో చదివిస్తానని తీసుకువస్తాడు అతని అంకుల్. ఆ సమయంలో సంజయ్ బిక్రమ్ ను కలుస్తాడు. ఆ కేసు గురించి మాట్లాడుతున్న సమయంలో బిక్రమ్ అసలు దిబ్రాంచి పుట్టిన రోజు మూడు వారాల తర్వాత అని, మరి ముందే ఎందుకు పార్టీ పెట్టారో ? అని అంటాడు. అతనిలో డిటెక్టివ్ లక్షణాలు చూసిన సంజయ్ అతన్ని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో తనతో పాటు తీసుకువెళ్తాడు. 

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దిబ్రాంచి ఇంటికి వెళ్తారు. అక్కడికి అతని పార్టనర్స్ ఇద్దరు రాకపోవడంతో వారి మీద అనుమానం వస్తుంది. దిబ్రాంచికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు అసలు పార్టీ జరిగినప్పుడు అక్కడ లేకపోవడం వల్ల అతను కాదని తేల్చేస్తారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అది ఎపిలెప్టిక్ సీజర్ వల్ల వచ్చిందని, సహజ మరణమని తేలుతుంది. ఎపిలెప్సీ అనే న్యూరాలజికల్ డిజార్డర్ దిబ్రాంచికి ఉంది. దాని లక్షణాలైన ఎపిలెప్టిక్ సీజర్స్ వల్ల ఆ రోగి ఎగిరెగిరి పడటం వల్ల అది మరణానికి దారి తీస్తుంది. అదే దిబ్రాంచి విషయంలో జరిగిందని తేలుతుంది. అది సహజ మరణమని మెడికల్ రిపోర్ట్  తేల్చేస్తుంది. 

అయినా అనుమానం తీరక ఆ కేసును సంజయ్, బిక్రమ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. దిబ్రాంచి అప్పటికే ఎన్నో రోజుల నుండి మందులు వేసుకోలేదని, వీళ్ళు సిద్ధం చేయమని, తను డ్రాఫ్ట్ పంపిస్తానని లాయర్ కు చెప్పాడని తెలుస్తుంది. వీలునామా రాయబోయే ముందు రోజు ఈ పార్టీలో అతను మరణించడంతో ఆ వీలునామాకు, ఈ మరణానికి ఏదో సంబంధం ఉందని బిక్రమ్ కు అనిపిస్తుంది. దిబ్రాంచి ల్యాప్ టాప్ లో మెయిల్ బాక్స్ లో వెతికినా ఎక్కడ ఆ డ్రాఫ్ట్ కనిపించదు. కానీ కచ్చితంగా ఇంట్లో ఎక్కడో పెట్టె ఉంటాడని అనిపించి బాగ్చి విల్లాకు వెళ్తాడు బిక్రమ్,తను ప్రేమించిన టూకీ తో కలిసి. దిబ్రాంచి గదిలో వెనుక ఓ సీక్రెట్ లాకర్లో అతనికి వీలునామా కనిపిస్తుంది. ఆస్తి మొత్తం అతను పెద్ద కొడుకు పేరున రాస్తాడు. అప్పుడు జరిగింది అతనికి అర్ధమవుతుంది. 

అదే సమయంలో అక్కడికి వచ్చిన దిబ్రాంచి చిన్న కొడుకు, వారిద్దరిని వారితో పాటు అన్న కొడుకును కూడా కిడ్నాప్ చేస్తాడు. ఆస్తి ఇద్దరు అన్నదమ్ములకు సమానంగా ఇచ్చేట్లు వీలునామా తెస్తేనే వారిని విడిచిపెడతానని చెప్తాడు. తాను సంజయ్ కు విషయం చెప్పి అలాగే చేయమంటానని బిక్రమ్ ఫోన్ నుండి సంజయ్ కు కాల్ చేసి భయపడుతున్నట్టు చెప్తాడు. అదే సమయంలో అతను రికార్డర్ కూడా ఆన్ చేస్తాడు. ఫోన్ మాట్లాడాక ప్రేమ్ (దిబ్రాంచి చిన్న కొడుకు )ఫోన్ లాక్కుంటాడు. అలా వారిని కిడ్నాప్ చేశాక జరిగింది ఇక తనను ఎవరు ఏం చేయలేరనే ధైర్యంతో చెప్తాడు ప్రేమ్. అది అప్పటికే ఊహిస్తాడు బిక్రమ్. 

ప్రేమ్ డ్రగ్ ఎడిక్ట్. అతని చేతిల్లో ఆస్తి పడితే అంతా దానికే తగలేస్తాడని పెద్ద కొడుక్కి ఆస్తి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు దిబ్రాంచి. అందుకే అతన్ని చమపాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రేమ్. అందులో భాగంగానే దిబ్రాంచికి రోజు మందులిచ్చే పని వాడిని మాన్పించేస్తాడు. దిబ్రాంచి ఏ మందులు వేసుకుంటున్నాడో పెద్దగా పట్టించుకోడు. అలా మూడు వారాలు మందులు వేసుకోడు దిబ్రాంచి. ఎపిలెప్సీ ఉన్నవారిని షాక్ కు గురి చేస్తే వారికి ఎపిలెప్టిక్ సీజర్స్ వస్తాయి. అందులోనూ  హై మ్యూజిక్ ,ఫ్లాష్ లైట్స్ ,పార్టీ వాతావరణం వంటి వాటిని మర్డర్ వేపన్స్ గా వాడి మూడు వారాల నుండి మందులు వేసుకోకపోవడం వల్ల తండ్రికి ఎపిలెప్టిక్ సీజర్స్ వచ్చేలా చేసి తండ్రి మరణాన్ని పెర్ఫెక్ట్ మర్డర్ గా చేస్తాడు ప్రేమ్. క్రిమినాలజీలో పర్ఫెక్ట్ మర్డర్ అంటే నేరస్థుడు ఎవరో ఎప్పటికీ కనుక్కోలేకపోవడం, ఏ ఆధారం దొరక్కపోవడం. తండ్రిని హత్య చేసినా దాన్ని సహజ మరణంగా మార్చి పర్ఫెక్ట్ మర్డర్ గా చేసినా ప్రేమ్ ,రికార్డర్ ఆన్ అయ్యి ఉండటం వల్ల అంతా రికార్డ్ అవ్వడం ,సంజయ్ రావడం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలా ఈ కేసుతో బిక్రమ్ జూనియర్ డిటెక్టివ్ గా మారతాడు. 

సినిమాల ద్వారా కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటా0. మనం చూడని మనుషులను, అనుభవించని సంఘటనలను అతి దగ్గరగా ప్రేక్షకులుగా చూస్తూ ఉంటాం. కేవలం ప్రేమ,పెళ్లి చుట్టూ తిరిగే సినిమాల్లో దర్శకులకు విపరీతమైన కష్టం ఉండదు. కానీ ఓ విద్యార్ధిని హీరోగా ,అందులోనూ విశ్లేషణా శక్తి ఉన్న వ్యక్తిగా చూపించాలంటే అతని వ్యక్తిత్వాన్ని పరిచయం చేయాలి. డిటెక్టివ్ సినిమాలు నిజానికి కష్టతరమైన సినిమాలు. దానికి కారణం డిటెక్టివ్ గా పరిచయం చేయబోయే కథానాయకుడి తెలివితేటలు ప్రేక్షకులకు అమోఘంగా అనిపించకపోతే ఆ సినిమా ఎవరు చూడరు. ఓ స్కూల్ విద్యార్ధిని డిటెక్టివ్ గా చూపించడంలో తన శక్తి మేరకు దర్శకులు మాణిక్ భౌమిక్ సఫలీకృతులయ్యారనే చెప్పాలి. 

     *    *  * 


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!