మనలో సైకో ఉన్నాడా ?

సినీ సంచారం 

        మనలో సైకో ఉన్నాడా ? 

                                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  



కొన్ని సినిమాల్లో కథా గొప్పతనం అబ్బురపరిచే స్థాయిలో లేకపోయినప్పటికీ ఆ సినిమాలోని ఏదో ఒక అంశం మాత్రం ఆ సినీ రచనా,దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా ఉండిపోతుంది. అటువంటి ఓ సినిమానే వి. అష్టాచెమ్మా, సమ్మోహనం,బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాలతో సంపూర్ణ సినీ రచయితా దర్శకులుగా తన శైలిలో సాగుతున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి 2020 లో తీసిన మరో సినిమానే ''వి.""

ఈ సినిమా కథ అంత గొప్పగా అయితే లేదు. సాధారణ కథ. కథనంలో మలుపులు కూడా ఉత్కంఠభరితంగా అయితే లేవు. ఓ సూపర్ పోలీస్ కు, ఓ సైకోగా చిత్రీకరించబడిన కిల్లర్ కు మధ్య జరిగే సవాళ్ళ సమ్మేళనమే ఈ సినిమా. సాహెబా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు  విష్ణు. అతను ఆర్మీలో పని యాంటీ టెరరిస్ట్ ఫోర్స్ లో పని చేస్తూ ఉంటాడు. సాహెబా గర్భవతి అయినప్పటికీ కూడా లీవ్ దొరక్క రాలేకపోతాడు. ఓ ఆపరేషన్ లో అతను ప్రమాదంలో ఇరూకు పోయి ఎలాగో బయట పడతాడు. అతని భార్య సాహెబా ఓ మెయిల్ ద్వారా తాను  ఓ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నిస్తానని, ఆమె దగ్గర ఆమె స్నేహితురాలిని హోమ్ మినిస్టర్ కొడుకు ,మిత్రులు అత్యాచారం చేసిన వీడియో ఉందని, ఒక వేళ తాను మరణించినా వారిని వదలవద్దని మెయిల్ ద్వారా వీడియో పంపిస్తుంది. 

అలా ఆ పెద్ద వారిని కాపాడే ప్రయత్నంలో కొందరు అధికారులు  కూడా వీరి హత్యకు కారణమవుతారు. ఈ కుట్ర డీసీపీ ఆదిత్యకు తెలియదు. అతను అప్పటికే సూపర్ కాప్ గా పేరు తెచ్చుకుని ఎన్నో పతకాలు సాధించాడు. చివరికి వీరిద్దరు మిత్రులే, ఎలాగో విష్ణు వారిని హతమారుస్తాడు. ఆదిత్యా గర్ల్ ఫ్రెండ్ కు ఓ క్రైమ్ రచయిత్రి అవ్వాలనే కోరిక. సాహెబా పేరుతో నవల రాస్తుంది. ఇలా కథ ముగుస్తుంది. 

కథ మాములుగానే ఉంది. మలుపులు ఊహించినట్టే ఉన్నాయి. కానీ ఒక్క అంశం మాత్రం మొత్తం సినిమాలో రచనా ప్రజ్ఞను ప్రేక్షకులకు చూపిస్తుంది . అదే విష్ణును సైకోగా చిత్రీకరించడానికి సైకో పరిచయం ప్రేక్షకులకు చేసిన విధానం. రెండు సంఘటనలతో  విష్ణు పరిచయాన్ని ధృఢం చేశా దర్శకులు. రైల్ ప్రయాణంలో ఫోనులో ఒకతను మాట్లాడుతూ తేడా వస్తే చంపేస్తానని ముక్కలు, ముక్కలుగా నరికేస్తానని అంటాడు. అది విన్న విష్ణు అయితే ఆ కాంట్రాక్ట్ తనకు ఇప్పించమని అడుగుతాడు. దానితో అతను తాను ఏదో ఊరికే కోపంలో అన్నానని, తను నార్మల్ పర్సన్ అని అంటాడు. దానికి విష్ణు ''అయితే నేను ఎబ్ నార్మలా ? మాటల్లో చంపడం గురించి అలా మాట్లాడే మనం మనకు నిజంగానే అలా చంపేవాడు కనబడితే భయపడి పోతాము ''అంటాడు. 

రెండో సంఘటనలో పక్కన కూర్చున్న అతను హారర్ సినిమాలు చూస్తూ తనకు రక్తపాతం అంటే ఇష్టం అని చెప్తాడు. మొదటి సంఘటనలో జరిగినటువంటి సంభాషణే ఇక్కడ ఉంటుంది.  దీని ద్వారా మనందరికీ కోపం వచ్చినప్పుడో, కక్ష భావన మనసులో రూపుదిద్దుకున్నప్పుడో మానసికంగా  అందరం సైకో లానే ఆలోచిస్తామని కానీ అది భావనను దాటి కార్యం వరకు వెల్లదు కనుక మనందరం నార్మల్ వ్యక్తులుగా ఉండిపోతున్నామనే భావనను చెప్పి చెప్పకుండానే చెప్పారు దర్శకులు. ఈ ఒక్క అంశం మాత్రం సినిమాలో గొప్ప అంతర్లీన భావాలు ఉంటే ఆ సినిమా స్థాయి స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కానీ ఈ సినిమాలో అటువంటి అంతర్లీన భావనలు అంతగా లేవనే చెప్పాలి. విష్ణు వదిలిన క్లూలను సాధించడం కూడా అంత కుతూహలాన్ని ప్రేక్షకుల్లో కలిగించదు. 

సినిమా మొత్తంలో విష్ణుగా చేసినా నాని నటన కోసమైనా ఈ సినిమా చూడవచ్చు. బాడీ లాంగ్వేజ్ , నవ్వులో ఓ రకమైన పట్టనితనం ,సవాలను విసిరే పట్టుదల సినిమాను ఎంతో కొంత చూసేలా చేస్తుంది. ఇకపోతే ఆదిత్యాగా నటించిన సుధీర్ బాబు పాత్ర చిత్రణ మాత్రం అంత ధృఢంగా లేదనే అనిపిస్తుంది. కేవలం హీరోయిజం దట్టించాలనే తప్ప అతని తెలివిని ,తార్కాన్ని ప్రదర్శించే సంఘటనలు తక్కువ ఉండటం వల్ల ఆదిత్య పాత్ర తేలిపోయిందనే చెప్పాలి. సినిమాలో సంఘర్షణ సంఘటనలు -పాత్రల మధ్య ఎంత ఉంటే ఆ సినిమా ప్రేక్షకుల్లో అంత ఆసక్తిని పెంచుతుంది. అది లోపిస్తే కథ ఆకట్టుకోలేదు. ఏది ఏమైనా ఒక్క సైకో పాత్ర  పరిచయం కోసం ,నాని నటన కోసం కొంత మేరకు ఈ సినిమా చూడదగ్గదే. 

       *     *     * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!