మట్టి- ప్రాణం

చదువరి 

        మట్టి- ప్రాణం

                                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



            "ఈ నేల నా పలక. నాగలే  నా బలపం. పొలమే నా బడి. భూమ్మీద దిద్దాను. రోజుకు ఒక్కొక్కమాట  నాకు ఈ భూమే నేర్పింది. నా తల్లీ, దైవం,గురువు ఈ భూమేరా రవీ! ఇప్పుడు  చెప్పరా మనవడా? నీ బడి  గొప్పదో నా బడి గొప్పదో? నీ చదువెక్కువో నా చదువెక్కువో ?" సాంబయ్య తన మనవడు రవికి మట్టి మనిషిగా జీవించే క్రమాన్ని నేర్పుతూ అన్న మాటలివి. భూమిని నమ్మి తన కష్టర్జితం మీద బ్రతుకుతూ ఎవరిని పట్టించుకొని వ్యక్తి సాంబయ్య. అనుబంధాల ముడులు, వ్యామోహాలు అతన్ని తాకలేదు. ఆ తండ్రి రక్తం పంచుకుని పుట్టి పెళ్లయ్యేవరకు తండ్రి మాటను, పెళ్ళయ్యాక భార్య  వ్యామోహంలో పడి భూమిని తండ్రిపై దౌర్జన్యం చేసి లాక్కున్న కొడుకు వేంకటపతి. అదే భార్య మరణించాక దిక్కు తోచని పరిస్థితుల్లో తండ్రికి తన ముఖం చూపించలేక కొడుకును మాత్రం పంపి తప్పుకున్న వెంకటపతి కొడుకు మాత్రం చిరు ప్రాయంలో ఉన్నా మంచెదో ,చెడేదో తెలుసుకునే విచక్షణ కలిగి తన తాతను చేరుకుని, తాత మరణంతో   దోచుకునే వ్యవస్థకు ఎదురు తిరిగి చివరకు తాత సిద్ధాంతాన్ని నమ్మినందుకు అన్యాయానికి బలై జెయిలుకు వెళ్తాడు. ఇదే మూడు తరాల కథ అయిన వాసిరెడ్డి సీతాదేవి గారి ''మట్టి మనిషి."

            మట్టి మనిషి చదువుతుంటే మనుషుల్లోని అన్నీ రకాలను మనం అక్షరాల్లో చూడవచ్చు. ప్రతి పాత్ర  తనదైన వ్యక్తిత్వ శైలి ఏమిటో ప్రతి సారి పాఠకులు మర్చిపోకుండా  బలంగా గుర్తుచేస్తూనే ఉంటుంది. నాగరిక జీవనం, దర్జాలు ,కాపీనత్వం, పదవి -డబ్బు వ్యామోహాల మధ్య జరిగే సంఘర్షణను ఎంతో చక్కగా మట్టి మనిషిలో చిత్రీకరించారు సీతా దేవి.

            వెంకయ్య ఉత్తరాది నుండి వచ్చి వీరభద్రయ్య అనే షావుకారు దగ్గర పాలేరుగా తన జీవితాన్ని మొదలు పెడతాడు. పాతికేళ్ళల్లో సొంత స్థలం ,ఇల్లు కట్టుకునే స్థాయికి ఎదిగాడు వెంకయ్య. అతని కొడుకు సాంబయ్య తండ్రి దగ్గర నుండి భూమి పాఠాలు నేర్చుకుని అదే భూమిని పెంచే పనినే తన జీవితంగా పెట్టుకున్నాడు.

            సాంబయ్యకు భూమితో తప్ప   దేనితోనూ అనుబంధం,మమకారం లేదు.అతని భార్య   దుర్గమ్మ  బిడ్డను కన్నాక ఆమెకు జబ్బు చేస్తే డబ్బులు  దండగ అని ఆచరులు చెప్తే పాము విషం పోస్తే ఆమె మరణిస్తుంది.  అతనికి ఉన్నది భూమి దాహం మాత్రమే.   వీరభద్రయ్య   దగ్గర పాలేరుగా పని చేసిన తన తండ్రి వెంకయ్య  వారసుడిగా వారి కన్నా ఎక్కువ భూమిని సంపాదించాలనే కోరిక సాంబయ్య మనసులో గాఢంగా బలపడిపోతుంది. అలా ఎంతో కష్ట పడి  దానిని సాధించే క్రమంలో ఆ ఊరిలో కనకయ్య అనే దళారి చేతిలో  మోసపోయినా కష్టపడి అప్పులు తీర్చి తన కొడుకు  వయసుకు వచ్చేసరికి  ఆ ఊరిలో అందరికన్నా పెద్ద భూస్వామి అవుతాడు. అదే సమయానికి వీరభద్రయ్య  కొడుకు బలరామయ్య అప్పుల పాలవుతాడు, కుటుంబం కష్టాల్లో ఉంటుంది. పంతం పట్టి తన కొడుకు వెంకటపతిని బలరామయ్య ఆఖరి కూతురు వరూధినితో వివాహం చేస్తాడు. ఆ తర్వాత కట్నం బలరామయ్య పూర్తిగా ఇవ్వలేకపోవడం వల్ల కొన్నేళ్లు కోడలిని కాపురానికి తీసుకురానివ్వడు.తర్వాత  కొడుకు కోసం ఆలోచించి తీసుకు రానిస్తాడు.

            తండ్రి షావుకారి బలరాం దగ్గర దర్జాగా పెరిగిన వరూధిని అవే పద్ధతులు అత్తింట్లో కూడా అమలు చేస్తుంది. వెంకటపతిని పొలానికి కూడా వెళ్లనివ్వదు. ఆఖరికి అతనితో పట్టణంలో కాపురం పెట్టించి, సాంబయ్యను మోసం చేసి ,బెదిరించి అతని పొలం మొత్తం సినిమా హాలు కట్టడానికి రాయించుకుంటుంది. దీనికి మూల సూత్రధారి అయిన రామనాధబాబుతో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. మొదట వరూధిని పిక్చర్ ప్యాలస్ పేరుతో వచ్చిన ఆ సినిమా హాలు ఆజామాయిషీ మొత్తం రామనాధబాబే చూసేవాడు. తర్వాత వరూధిని వెళ్ళి చూడటంతో భార్యతో కలిసి కుట్ర ఫన్నీ కేసు వేయించి ఆ సినిమా హాలు సొంతం చేసుకుంటాడు రామనాధబాబు. హై కోర్టు లో ఆపిలు చేద్దామని  డి ఎస్ పి సాయంతో శంకరరావు అనే వకీలును పెట్టుకుంటుంది వరూధిని. అతను డబ్బులు తీసుకున్నా ఆమెను మోసం చేస్తాడు. దానితో కేసులో ఓడిపోతుంది.

            ఆమె కొడుకు రవిని మాత్రం పెద్ద స్కూల్ లో చదివిస్తూ ఉంటుంది. ఆ హాలు పోవడంతో ఉన్న ఆస్తులు కూడా కేసు కోసం ఖర్చు పెట్టడంతో ఆమె బంగారం తప్ప ఏమి మిగలదు. దానితో రామనాధబాబును చంపించాలని కిరాయి గుంఢాలకు డబ్బులిస్తుంది. కానీ ఆ గుంఢా ఆ కారులో ఉన్న రామనాధబాబు బామ్మర్దిని హత్య చేస్తాడు. అదే రాత్రి హైదరబాద్ హోటల్ లో ఉన్న వరూధిని కూడా మందు ఎక్కువ్వడం వల్ల గుండె అసలే బలహీనంగా ఉండటం వల్ల మరణిస్తుంది. అప్పటికే తాగుడికే బానిస అయిన వెంకటపతి మెడకు ఆ హత్య చుట్టుకోబోతుందని తెలుసుకుని కొడుకును సాంబయ్య పల్లెలో వదిలేసి తన ముఖం చూపించలేక వెళ్ళిపోతాడు.

            అలా రవి తాతయ్య సాంబయ్య ఒడిలోకి చేరుకుంటాడు. మనవడి రాకతో జీవితంపై ఓ కొత్త ఆశ చిగురించడంతో  బంజర భూమిని సాగు చేసి ఎలాగో కష్టపడి రవి సాయంతో వృద్ధిలోకి తీసుకువస్తాడు. అదే సమయంలో ఆ స్థలం ఓ రాజకీయ బాధితుడికి ఇవ్వబోతుంది ప్రభుత్వం అని తెలిసి ఆ మట్టిలోనే ప్రాణాలు  వదులుతాడు సాంబయ్య. మనవడు రవి ఆ భూమి తనదేనని గట్టిగా అడుగుతూ, దాన్ని లాక్కోవడానికి వచ్చిన ఆ రాజకీయ బాధితుడిపై ఓ రాయి విసురుతాడు. రవిని కష్టదిలోకి తీసుకుంటారు పోలీసులు. విప్లవ గళంతో రవి నినదిస్తాడు ఆ బాల్యంలోనే. దానితో నవల ముగుస్తుంది.

            ఇది ఈ ఒక్క కుటుంబం కేంద్రంగా ఉన్న కథ అయినప్పటికీ సాంబయ్య కుటుంబంతో పాటు కనకయ్య,బలరాం  కుటుంబాల  పరిణామ  దశను కూడా అదే క్రమంలో చూపిస్తూ  అటు కాపీనంతో వ్యవహరించినా, ఇటు దర్జాగా వ్యవహరించినా సరే బ్రతకడం కష్టం అని కనకయ్యాలా అవసరాన్ని బట్టి జిత్తులమారి నక్కలా ఉంటేనే ఈ లోకంలో  బ్రతకగలమనే భావాన్ని రచయిత్రి పరోక్షంగా చెప్పినట్టు అనిపిస్తుంది. ధర్మం -అధర్మం లా  విచక్షణ కన్నా  కూడా మనిషిలో అంతర్లీనంగా ఉండే డబ్బు, భూ -ఆధిపత్య దాహాలే మనిషి జీవితానికి జీవంలా మారిపోయాయని ఈ నవల స్పష్టం చేస్తుంది. వాసిరెడ్డి సీతాదేవి గారి ప్రతి నవలలో సుఖాంతం కన్నా కూడా వాస్తవిక దృక్కోణ ప్రదర్శన, ముగింపు పాఠకుల ఆలోచనకే వదిలేసే శైలి ఎక్కువగా ఉంటుంది.

            కచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల ఇది. దీనిలో బాషా శైలి, సంభాషణా చాతుర్యం, అందరి వ్యక్తిత్వాలు తేటతెల్లం చేసిన తీరు చక్కగా ఈ నవలను చదివింపజేస్తూనే,ఆలోచనల్లో కూడా పరిగెడుతూ ఉంటాయి.

             *      *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!