చదువు దేని కోసం ?

 సినీ సంచారం 

                                చదువు దేని కోసం ? 

                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



 
   మన విద్యావ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయనే వాదన మనకు కొత్తది కాదు. విద్య  వ్యాపారంగా మారింది అని మనసులో ఉన్నా మన వ్యక్తిగత విషయం వచ్చేసరికి మన వ్యక్తిగత అభిప్రాయాల్ని పక్కన పెట్టేసి మన పిల్లలని కూడా అదే వ్యాపారంలో భాగం చేయడం కూడా సర్వసాధారణ అంశంగానే నేడు ఉంది. తన విలువలను ఏ పరిస్థితుల్లోనూ ఒదులుకోవడానికి సిద్ధపడని ఓ ఉపాధ్యాయురాలు  తన ఆలోచనా విధానంతో ఎలా విద్యా విలువల లక్ష్యాన్ని నిరూపించిందో తెలిపే సినిమానే 'రఫ్ బుక్. '

2016 లో అనంత నారాయణ్ మహాదేవన్ దర్శక్త్వంలో వచ్చిన సినిమా 'రఫ్ బుక్.' సంతోషి  ఫిజిక్స్ టీచర్. పిల్లలకు ఫిజిక్స్ అర్ధం కావాలంటే మన నిత్య జీవితంలో ఫిజిక్స్ ఎక్కడెక్కడ  ఉంటుందో  చూపిస్తూ, మన నిత్య జీవిత సంఘటనలతో ఫిజిక్స్ బేసిక్స్  విద్యార్ధులు బాగా నేర్చుకుని దానిని ప్రాక్టికల్ విద్యగా  మలచుకోవాలని భావించే ఉపాధ్యాయురాలు. మార్కులు, సిలబస్ త్వరగా పూర్తి చేయాలన్న హడావుడి కన్నా విద్యార్ధులకు ఏ  సబ్జెక్టులో అయినా సరే బేసిక్స్ -వాటి అప్లికేషన్ తెలియాలి అని ధృఢంగా నమ్మే టీచర్ ఆమె. 

మామూలుగా ఆమె జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఆమె భర్త ఇన్ కమ్ టాక్స్ లో  ఆఫీసర్ . తన భర్త ఎంతో మంది అవినీతిపరుల ఆస్తులను పట్టుకుని నీతిగా విలువలతో జీవిస్తున్నాడనే ఆత్మసంతృప్తితో అతనితో వ్యక్తిగతంగా కూడా సంతోషమైన జీవితం ఆమెది. అదే సమయంలో సంతోషి ఇంట్లో రెయిడ్ జరుగుతుంది. ఆమె పుస్తకాల వెనుక డబ్బు కట్టలు బయటపడతాయి. ఆ డబ్బు తన పుస్తకాల వెనుకకు ఎలా వచ్చిందో సంతోషికి అర్ధం కాకపోయినా, అందులో ఆమె భాగం లేకపోయినా ఆమెను కూడా భర్తతో పాటు అవినీతిపరురాలిగానే భావిస్తారు. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది. విలువలు బోధించే తానే ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోవడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. దానితో పాటు డైవోర్స్ కు ఫైల్ చేస్తుంది. 

తల్లి దగ్గరకు వెళ్తుంది. తల్లి  సలహాపై జీవితాన్ని అక్కడే ఆపేయ్యకుండా మళ్ళీ  ఇంకో స్కూల్లో టీచర్ ఉద్యోగానికి ప్రయత్నించి  సాధిస్తుంది. ఆమె బోధన పరంగా ఉత్తమమైన టీచర్ అయినప్పటికీ  ఆమెకు డి సెక్షన్ ఇస్తారు మేనేజ్మెంట్. డి సెక్షన్ లో మొదట ఆమె అడుగు పెట్టగానే కునాల్ అనే విద్యార్ధి ఆమె తనను తాను పరిచయం చేసుకునేలోపే తనకు తెలుసని ఆ రెయిడ్ జరిగిన మీడియా క్లిప్ చూపిస్తాడు. సంతోషి పాఠం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అవన్నీ గూగుల్ లో ఉన్నాయని  గూగుల్ లో  లేనిది బోధించమని ఆమెకు సవాలు విసురుతాడు. 

సంతోషి వారికి ఓ అప్లికేషన్ ఇచ్చి దానికి సమాధానం తర్వాతి రోజుకు చెప్పమని చెప్తుంది. దానికి సమాధానం  గూగుల్ లో ఉండదు. కునాల్  టాపర్ సెక్షన్  మిత్రుల్ని అడిగినా వారు చెప్పలేకపోతారు. మరుసటి రోజు గూగుల్ సమాచారం ఇస్తుంది కానీ ఎలా వాడాలో చెప్పదు అనే పాఠం ఆ విషయం ద్వారా వారికి నేర్పిస్తుంది సంతోషి. వారికి ఫిజిక్స్ బేసిక్స్   మొదట నేర్పించడం మొదలుపెడుతుంది. దానితో విద్యార్ధులు ఇంటర్ అయినప్పటికి అంతకన్నా తక్కువ తరగతుల పుస్తకాల్లోని బేసిక్స్  కూడా నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి పాఠాన్ని నిత్య జీవితంతో అనుసంధానిస్తూ చెప్తూ ఉంటుంది. 

అదే సమయంలో సెమిస్టర్  పరీక్షలు వస్తాయి. తన విద్యార్ధులు అప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నారని ఇప్పుడు ఆ పరీక్ష రాసే  పరిస్థితుల్లో లేరని ఆమె  మేనేజ్మెంట్ కు చెప్పడానికి ప్రయత్నించినా వారు మాత్రం విద్య అంటే డిమాండ్ అండ్ సప్లై అని ర్యాంకులు ,మార్కులు  సప్లై చేస్తేనే మేనేజ్మెంట్ కు విద్యార్ధుల సంఖ్య పెరిగి డిమాండ్ ఉంటుందని అప్పుడే  విద్యా సంస్థలు నడుస్తాయని చెప్తారు. ఆ మేనేజ్మెంట్ మార్గంలో  వారికి సరిగ్గా న్యాయం చేయలేనని  సంతోషి రిజైన్ చేస్తుంది.  

 వేరే ఫిజిక్స్ టీచర్ వచ్చినా కేవలం సిలబస్ కంప్లీట్ చేయడం కోసం మాత్రమే అవడం వల్ల ఆ డి  సెక్షన్ లో కొందరు విద్యార్ధులు సంతోషి దగ్గరే విద్య నేర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. సంతోషి తన ఫ్రెండ్స్ తో వారికి లెక్కలు ,సోషల్ కూడా చెప్పిస్తుంది. మేనేజ్మెంట్ మాత్రం సంతోషి  దగ్గర చదువుకోవడానికి విద్యార్ధుల మార్కులతో తమకు సంబంధం లేదని  తేల్చేస్తుంది. ఈ సందర్భంలో ఉన్న ఓ సంఘటన సినిమాకే కీలకం. సంతోషి దగ్గర చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్ధుల తల్లిదండ్రులను మేనేజ్మెంట్ పిలిచినప్పుడు మాకు మీ పిల్లల చదువుతో, మార్కులతో సంబంధం లేదని అన్నప్పుడూ కునాల్  తండ్రి అక్కడ చదవకపోతే సంబంధం ఉంటుందని రాసిస్తారా అని అడుగుతాడు. దానికి మేనేజ్మెంట్ నుండి  సమాధానం ఉండదు. 

అలా సంతోషి దగ్గర చదివిన విద్యార్ధులు బోర్డ్ పరీక్షల్లో  పాసు మార్కులతో గట్టెక్కుతారు. కానీ అప్లికేషన్ కు అవకాశం ఎక్కువ ఉన్న ఐఐటీ జెఈఈ లో మాత్రం ఎంట్రన్స్  పరీక్షలో ఎంపికవుతారు. ఆ మేనేజ్మెంట్ కూడా షాక్ అవుతుంది. టాపర్స్ కూడా అది క్లియర్ చేయలేకపోతారు. 

నేటి విద్యా వ్యవస్థలో చదువుకు దాని ప్రయోగానికి మధ్య పొంతన కుదరకపోవడం వల్లే నేడు విద్యా వ్యవస్థ బీటలు బారిందనే సత్యం ఈ సినిమా స్పష్టం అవుతుంది. కొన్ని సినిమాలు చూస్తుంటే మన మనసులోనే ఎన్నో పరిష్కారాలు దర్శనమిస్తాయి. మనం ఉపాధ్యాయులమైనా ,తల్లిదండ్రులమైనా ఏదైనా సరే నింద పక్క వారి మీద తోసే ముందు మన బాధ్యత గురించి ఆలోచించాల్సిన  అవసరాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. 

        *     *     * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!