సంసార సుఖం

చదువరి 

సంసార సుఖం

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



       లియో టాల్ స్టాయ్ రచనల్లో మానవత్వం, కరుణ, జాలి మనుషుల మనసుల లోతుల్లో ఎలా ఉంటాయో, కానీ వాస్తవిక పరిస్థితుల్లో వాటికి మనిషి బాహ్య ప్రవర్తనకు మధ్య తలెత్తే సంఘర్షణను అన్నీ కోణాల్లో ,అన్నీ  సామాజిక-వ్యక్తిగత సంబంధాల్లో తెలిపే ఓ ప్రత్యేకత కచ్చితంగా వీక్షించవచ్చు. అటువంటి ఆయన రచనల్లో ఒకానొక నవలిక ఫ్యామిలీ హ్యాపీనెస్. దీనిని తెలుగులోకి రెంటాల గోపాలకృష్ణ గారు అనువదించారు.

     మాషా,సోన్యా అక్కాచెల్లెళ్ళు. వారి తల్లి మరణిస్తుంది. ప్రోకోవోస్కాయ్ లో వారు నివసిస్తూ ఉంటారు. వారి తల్లి మరణం తర్వాత వారి కుటుంబానికి ఆప్తురాలైన కాట్యా వారి బాగోగులు చూసుకుంటూ వారితో పాటు పల్లెటూరులోని వారి ఇంట్లోనే ఉంటుంది. సెర్జీ మిఖాలిచ్ మాషా తండ్రికి స్నేహితుడు. అతను వారిని చూడటానికి వస్తూ ఉండేవాడు. మాషాకు పదిహేడేళ్ళ వయసు. మిఖాలిచ్ కు 36 ఏళ్ళు. అతను బ్రహ్మచారిగానే ఉన్నాడు.

     మొదట్లో కేవలం స్నేహితుడి కూతురిగా చూసిన మాషా పట్ల మిఖావిచ్ కు క్రమేపీ ఆమె పట్ల ప్రేమ కలుగుతుంది. మాషా కూడా అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అతను ఓ భూస్వామి. అతనికి తల్లి మాత్రం ఉంది. తన వ్యాపార,భూ లావాదేవీల కోసం వేరే ప్రదేశానికి వెళ్లినప్పుడు తప్ప మాషా ఇంటికి రాకపోకలు తరచూ కొనసాగించేవాడు అతను.

     మిఖావిచ్ ,మాషా ఇద్దరికీ పుస్తకాలు చదవడం, సంగీతం అంటే ఇష్టం. మాషా చక్కగా పియానో వయైస్తుంది. మిఖావిచ్ కు కూడా సంగీత పరిజ్ఞానం ఉంది. మాషా విపరీతంగా అలంకరించుకున్నా మిఖావిచ్ కు నచ్చేది కాదు. అతనికి సోకులు, దర్జాలు అంటే  ఇష్టం లేదని అర్ధం చేసుకున్న మాషా అతని మనసుకు తగ్గట్టు, అతనికి ఎలా ఉంటే నచ్చుతుందో అలాగే ఉండటం నేర్చుకుంటుంది.

     తర్వాత ఇద్దరు వివాహం చేసుకుంటారు. దానికీ వారి అభ్యంతరం ఉండదు. అప్పటి వరకు మాషా ఒకే అభిప్రాయంతో ఉంటుంది. ఆమెకు మిఖోవిచ్ మాత్రమే ఉత్తమ భర్త, ఉత్తమ పురుషుడు అని అతను కూడా తన గురించి అలాగే అనుకుంటూ ఉంటాడని. అలా మూడు నెలలు ఎంతో ఉత్సాహంతో జీవితం ముందుకు సాగిపోతుంది. కానీ ఒకేరకమైన జీవితం రోజు ఉండటం, ఏ మాత్రం మార్పు లేకుండా ఉండటం మాషా మనసులో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.

     ఆమెను ఆ మనఃస్థితి నుండి బయట పడవేయటానికి పట్టణమైన పీటర్స్ బర్గుకు తీసుకువెళ్తాడు  మిఖోవిచ్. అక్కడ నాగరికతలో భాగంగా డ్యాన్స్ పార్టీలకు ,నాటకాలకు ,సమావేశాలకు వెళ్తూ ఉంటుంది మాషా. ఎందరో మగవాళ్ళు, ఆడవాళ్ళు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఆమె కూడా వాటి మోజులో పడిపోతూ ఉంటుంది. పల్లెటూర్లో గడిపిన అన్నీ రోజులు ఇప్పుడు ఆమెకు నిరర్ధకంగా కనిపిస్తాయి. అది మిఖోవిచ్ కు నచ్చదు. దానితో వారిద్దరి మధ్య అగాధం పెరిగిపోతు ఉంటుంది.

     మళ్ళీ తిరిగి పల్లెటూరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు మాషా ను చూడటం కోసం ఓ రాకుమారుడు ఓ విందు ఇవ్వడంతో అది వాయిదా పడుతుంది. తర్వాత మిఖోవిచ్ తల్లి మరణిస్తుంది. మాషా ఆరోగ్యం బావుండకపోవడంతో ఆమె పట్టణంలోనే ఉండిపోతుంది. ఆమె ఓ బిడ్డ తల్లి అవుతుంది. అయినా ఆమె ఇంకా పట్టణపు వ్యామోహంలోనే ఉంటుంది.

     ఆమెతో పరిచయం పెంచుకున్న మగవాళ్ళల్లో ఓ ఫ్రెంచ్ దేశస్థుడుతో ఆమె హద్దులు దాటబోతుండగా ఎవరో రావడంతో ఆ తప్పు జరగకుండా ఉన్నప్పటికీ కూడా ఆమె మనసులో ఆ పశ్చాత్తాపం ఉంటుంది. మిఖోవిచ్ ఆమెకు కావాల్సినవి సమకూరుస్తున్నప్పటికీ కూడా ఆమెతో అంతకు పూర్వం ఉన్నట్టు ఉండడు. ఆమె కూడా అతనితో అలా ఉండలేకపోతుంది. ఆమె ఇంకో బిడ్డకు తల్లి అవుతుంది.

     చివరకు ఇద్దరి మధ్య అగాధం తొలిగిపోయినప్పటికీ కూడా ఆ ప్రేమ మాత్రం మొదట్లో ఉన్నంత గాఢంగా ఉండదు. దానికి మిఖోవిచ్ సమాధానం చెప్తూ ప్రేమ కాలంతో పాటు మారుతూ ఉంటుందని, అది ఎప్పుడూ ఒకేలా ఉండదని అంటాడు. ఇప్పుడు తమ ప్రేమ పిల్లల కోసమని అంటాడు. పెళ్ళి కాక ముందు ఇద్దరు సమాజానికి సేవ చేయాలనే ఆదర్శంతో ఉన్నా పెళ్ళి అయిన తర్వాత అది మర్చిపోయి, తమ సుఖాల్లో మునిగిపోవడం, చివరకు కాలంతో పాటు ప్రేమ ఒక్కో రూపంలోకి మారుతూ మానవ జీవితంలో ఏదో ఒక రూపంలో ఉంటుంది తప్ప ఒకేలా మాత్రం ఉండదు అనే అంతర్లీన సందేశంతో  టాల్ స్టాయ్ ఈ నవలికను ముగిస్తాడు.

     ఈ కథను మూడు నాలుగు వాక్యాల్లో చెప్పవచ్చు, కానీ రచనా శైలిని మాత్రం వాక్యాల్లో చెప్పలేము. మనుషుల మనసుల లోతుల్లో ఉండే కారుణ్యం, ప్రేమ ఈ రచనలోని ప్రతి వాక్యంలో ప్రవహిస్తూ ఉంటుంది. మానవ విరుద్ధ ప్రవర్తనలు-మానవత్వం వంటి అంశాల మధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణ తెలుసుకోవాలంటే ఈ నవలిక చదవాల్సిందే.

                          *     *     *

 


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!