ఫేమస్ అవ్వాలనుకోవడం సహజమా? అసహజమా?

 చదువరి 

                 ఫేమస్ అవ్వాలనుకోవడం సహజమా? అసహజమా?

                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


అంతర్జాతీయ బాల సాహిత్యంలో సృజనాత్మకతతో పాటు బాలల మనసుల్లో దాగి ఉండే అనేక కోణాలను సిరీస్ గా రాసిన రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి రచయితల్లో ఒకరే మెగన్ మెక్ డోనాల్డ్ . జూడీ మోడీ అనే మూడవ గ్రేడ్ చదువుతున్న అమ్మాయి ప్రధాన పాత్రగా 15 పుస్తకాలు సిరీస్ గా రాసారు మెగన్ . బాల్యంలో బాలల మనసుల్లో ఉండే ప్రతి ఊహకు,వారు చెప్పుకోలేని,చెప్పిన మనం గమనించలేని ఎన్నో కోణాలను,కొత్త ఆలోచనలను ఈ సిరీస్ పాఠకుల ముందు ప్రత్యక్షం చేసారు.వీటితో పాటు జూడీ మోడీ పాత్ర  తమ్ముడైన స్టింక్ సిరీస్ కూడా 10 పుస్తకాలు రాసారు.ఇవి ఆమె ప్రసిద్ధ రచనలు. వీటితో పాటు కొన్ని నవలలు రాసారు.2011 లో 'Judy Moody  and Not The Bummer Summer' సినిమాగా కూడా తీసారు. బాలల లైబ్రేరియన్ గా భవిష్యత్తును ప్రారంభించిన మెగన్ జూడీ మోడీ సిరీస్ లో ఒకటైన 'Judy Moody Gets Famous' అనే పుస్తకం బాల్యంలోనే కాదు దాదాపు జీవితాంతం మనల్ని వెంటాడే ఓ ప్రవృత్తిని మనకు జ్ఞప్తికి తీసుకువస్తుంది.

      జూడీ మోడీ మూడవ గ్రేడ్ విద్యార్థి. ఆమె తమ్ముడు స్టింక్ .మోడీ తరగతిలో జెస్సికా అనే అమ్మాయి 'స్పెల్ బి' కాంటెస్ట్ లో గెలవడం వల్ల ఆమె ఫోటో,పేరుతో సహా పేపర్ లో పడుతుంది. అది చూసిన మోడీకి తాను కూడా ఎలా అయినా  ఫేమస్ అవ్వాలనుకుంటుంది. మోడీ ఫేమస్ అవ్వడానికి ఏమేమి ప్రయత్నాలు చేసిందన్నదే ఈ కథ.
    మొదట స్పెలింగ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది జెస్సికాలా అవడానికి. అది ఆమెకు సాధ్యం కాదు. తర్వాత  మెడీ తండ్రి  తమ పాత సామాన్లు అమ్ముతున్న సందర్భంలో  చెర్రీ పిట్  (చెర్రీ గింజలు వేసే డబ్బా లాంటిది) కు డెకరేషన్ చేసి దాని మీద జార్జి వాషింగ్టన్ వాడిన చెర్రీ పిట్ అని నమ్మించేలా దాన్ని తయారు చేస్తుంది.కానీ ఆ రోజు వచ్చిన అబ్బాయి దాన్ని మింగేయడం వల్ల  ఆ పథకం ఫలించదు.తర్వాత పెట్ కాంటెస్ట్ లో ఎలాగో కష్టపడి తన ఎలుకను ట్రెయిన్ చేసి రెండో బహుమతి సాధిస్తుంది.బహుమతులు పొందిన మూడు పెట్స్ ,వాటి ట్రెయినర్స్ మిగిలిన ఇద్దరివి ఫోటోలు చక్కగా పడితే, ఆ ఫోటోలో మోడీది మాత్రం  మాత్రమే పడుతుంది.అలా అది కూడా బెడిసికొడుతుంది.
      తర్వాత తన తమ్ముడు స్టింక్ , ఫ్రెండ్స్ ఫ్రాంక్ ,రాకీలతో కలిసి 'హ్యుమన్ సెంటిపీడ్ 'చేసి గిన్నిస్ రికార్డు సాధించాలనే ప్రయత్నంలో ఫ్రాంక్ కు దెబ్బ తగలడంతో ఓ హాస్పటల్ కు వెళ్తారు . అక్కడ టాయ్స్ రూమ్ లో బొమ్మలన్నింటికి తలలు,మొండాలు ఉండవు,అన్ని పేషెంట్స్ లా ఉంటాయి.వాటిని దొంగతనం చేసి ఇంటికి తెచ్చిన మోడీ వాటిని రిపేర్ చేసి వాటికి హాస్పటల్ గౌన్లు తొడిగి అదే హాస్పటల్ కు అజ్ఞాతంగా పంపిస్తుంది. ఆ అజ్ఞాత వ్యక్తిని 'Phantom Doll Doctor' గా ప్రశంసిస్తూ పేపర్ లో పడుతుంది.అలా అజ్ఞాతంగా ఫేమస్ అయిన జూడీ మోడీ అజ్ఞాతంగా  అటువంటి బొమ్మలను రిపేర్ చేసి ప్రతి హాస్పటల్ లోని చైల్డ్ వింగ్ కు పంపాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. 
    జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఓ సారి ఎదురయ్యే పరిస్థితే ఇది. మన తోటివారితోనో లేక స్నేహితులతోనో ఏదో ఒక విషయంలో పోటీ పడీ అదే గుర్తింపు తెచ్చుకోవాలని కచ్చితంగా అనిపిస్తుంది. దానికి కారణాలు ఏవైనా సరే అది అసహజం కాదు, ఓ రకమైన ప్రేరణ కూడా. దీనికి బీజం బాల్యంలోనే పడుతుంది. బాల్యం నుండి ఏదో ఓ రకంగా ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నవారు అదే గుర్తింపును జీవితాంతం కోరుకున్నా వాస్తవంతో రాజీపడిపోతారు.అలాగే అలా గుర్తింపు తెచ్చుకున్నవారితో పోల్చబడడం వల్ల ఇంకొందరు న్యూనతకు గురై అదే గుర్తింపు కావాలనుకటారు.ఏదీ ఏమైనా ఇది సర్వ సాధారణమైన విషయమే. మీకు జూడీ మోడీ సిరిస్ లో ఏది దొరికినా చదవండి, ఏ కథకది ప్రత్యేకమైనదే. మనల్ని ఏదో ఒక కోణంలో ఆలోచింపజేసేదే.

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!