వెళ్ళిపోయిన వారు

 చదువరి 

                       వెళ్ళిపోయిన వారు 

                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


 

అంతర్జాతీయ బాల సాహిత్యంలో ఎన్నో విభిన్నతలు, వైవిధ్యాలు ఉన్నాయి. దానికి కారణం పాశ్చాత్య దేశాల్లో బాలల నివసించే ప్రాంతం,మానవ సంబంధాలు విభిన్నమైనవి కనుక. ముఖ్యంగా ఆ సాహిత్యంలో సిరీస్ గా రాయడం వల్ల బాల్యంలో ఉండే అనేక పార్స్వాలను   ఒకే ప్రధాన పాత్ర ద్వారా పాఠకులకు కనక్ట్ చేయడంతో చదవాలనే ఆసక్తితో పాటు ప్రపంచ వ్యాప్త పరిస్థితులను, బాల్యంలో మనసులో గాఢంగా నాటుకునే బీజాలకు మూలాలు అర్ధం చేసుకునే అవగాహన కూడా పాఠకుల్లో వయసుతో సంబంధం లేకుండా ఏర్పడుతుంది. అలా బాల సాహిత్యంలో బాలికలను ప్రధాన పాత్రగా మహిళా బాల సాహిత్య రచయిత్రులు ఎన్నుకోవడం జరిగింది. అటువంటి కోవకు చెందిన రచయిత్రే  పాలా డ్యాంజిగర్. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ఆమె ఎన్నుకున్న బాల్య కోణాలు ఆమె ఉపాధ్యాయురాలిగా చూసినవో లేక ఏదో ఒక దశలో స్వయంగా అనుభవించినవో అనిపిస్తాయి. 

పాలా డ్యాంజిగర్ ది ఆనందకరమైన బాల్యం కాదు. 12 ఏళ్ల వయసులో ట్రాంక్విలైజర్స్ తో ఆమె నిద్ర పోయేది. ఆమె తండ్రి ఆలంబన పెద్దగా లేదు, తల్లి ఆమె గురించి దిగులు పడటం ,సమాజం ఏమనుకుంటుందో అని భయపడటం మినహా ఆమెకు ధైర్యంగా మారలేకపోయింది. హై స్కూల్ లో  ఇంగ్లీష్ టీచర్ గా ఉన్న ఆమెకు ఓ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆమె రాతలో ఓ సమస్య వచ్చింది. వెనుక నుండి ముందుకు రాయడం ఆ యాక్సిడెంట్ వల్ల ఆమెలో వచ్చిన  మార్పు. మామూలుగా రాయడం కూడా కష్టపడి సాధించిన ఆమెకు వెనుక నుండి రాయగలగడం ఓ అదనపు నైపుణ్యంగా మారింది. ఈ సంఘటనతోనే ఆమె  రాయడాన్ని వృత్తిగా తీసుకుంది. 'The Cat Ate My Gymsuit' హిట్ అవ్వడంతో టీచర్ ఉద్యోగం వదిలేసి పూర్తిగా రచనా వ్యాసంగానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె రాసిన సిరీస్ లో 'ఎంబర్ బ్రౌన్ 'సిరీస్ మొత్తం 15 పుస్తకాలు. ఎంబర్ బ్రౌన్ అనే అమ్మాయి ప్రధాన పాత్రగా ఉన్న ఈ సిరీస్ చదువుతుంటే బాల్యం పట్ల పరిస్థితుల-కుటుంబ సంబంధాల -స్నేహితుల ప్రభావం బాల్యంలో పిల్లల జీవితంలో మార్పుకు ఎలా దోహదం చేస్తాయో అర్ధమవుతుంది. ఆ సిరీస్ లో ఓ మంచి పుస్తకమే 'AMBER BROWN GOES FOURTH.' 

    నిజంగా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాల్సిందే అని అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తదనం అంటే మనకు కూడా కొంత ఉత్సాహం, కొంత బిడియం, ఇంకొంత భయం కూడా ఉంటాయి. దీనికి సామీప్యం గల విషయమే పిల్లలుగా మనమందరం బాల్యంలో ఉన్నప్పుడూ కొత్త తరగతికి వెళ్ళేటప్పుడు మన  మనసులో ఉండే భయాలు -ఉత్సాహం -బిడియం అనే కోణాలు. 

ఎంబర్ బ్రౌన్ సారా ,ఫిల్ ల కూతురు. ఆమె మూడో గ్రేడ్ లో ఉన్నప్పుడూ ఆమె తల్లిదండ్రులు విడిపోతారు. ఆమె తల్లి దగ్గర ఉంటుంది. తండ్రి అంటే ఆమెకు చాలా ఇష్టం కూడా. తల్లి మాక్స్ అనే ఇంకొక వ్యక్తిని ఇష్టపడటం, అతనితో డేట్లకు వెళ్ళడం కూడా ఎంబర్ బ్రౌన్ గమనిస్తూ ఉంటుంది. ఆమెకు ఇది నచ్చదు. ఎప్పటికైనా తండ్రితో తల్లి కలిసి ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఆమె వేసవి సెలవులు అయిపోయి నాలుగో గ్రేడ్ కు స్కూల్ కు వెళ్లాల్సిన సమయం వస్తుంది. ఈ సమయానికి ఆమె తండ్రి ఉండడు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయిన జస్టిన్ డేనిల్స్ కూడా అతని తండ్రికి కొత్త ఉద్యోగం రావడంతో బదిలీ మీద కుటుంబం వెళ్ళడం వల్ల ఉండడు. ఆ రెండు  విషయాలు ఆమెను బాధిస్తూ ఉంటాయి. తండ్రి దగ్గర లేకపోవడం, తన మనసులోని అన్నీ విషయాలు తల్లికి చెప్పుకోలేకపోవడం వల్ల 'DAD BOOK' అనే ఒక స్క్రాప్ బుక్ తయారు చేసుకుని దానిలో తండ్రి ,తల్లి, తాను ఉన్న ఫోటోలన్నీ జోడించి దానిలో ఉన్న తండ్రి ఫోటోతో మాట్లాడుతూ తన మనసులో ఉన్న విషయాలు చెప్పుకుంటూ ఉంటుంది. 

నాలుగవ గ్రేడ్ లో టీచర్లు ఎవరు ఉంటారో, తనకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్  దొరుకుతారో, లేదో, తనకు ఇచ్చే డెస్క్ సరిగ్గా ఉంటుందో లేదో , ఒకవేళ తన మెదడులో మొదటి, రెండవ ,మూడవ గ్రేడ్ల సమాచారం నిండిపోయి ఈ నాలుగవ గ్రేడ్ లో చదువు ఎక్కడానికి స్పేస్ లేకపోతే ఎలా ? ఇలా రకరకాల భయాలు ఆమె మనసులో ఉంటాయి. అలా స్కూల్ కి మొదటి రోజు వెళ్లబోయే ముందు ఆమె తండ్రి ఫోన్  చేయడం ఆమెకు సంతోషాన్ని ,విచారాన్ని రెండింటినీ కలుగజేస్తుంది.తండ్రి తనను అంత ప్రాధాన్యత ఇవ్వడం  సంతోషం కలుగజేస్తే ,తండ్రి దగ్గర లేకపోవడం ఆమెకు విచారాన్ని కలిగిస్తుంది. స్కూల్ కి వెళ్ళిన ఆమె అక్కడ ఉన్నవారితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించినా ఆమెను కలవనివ్వరు ,ఎందుకంటే ఎవరికి వారికి వారి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కనుక. ఆ కంగారులో తన స్కూల్ బ్యాగ్ మర్చిపోతే ప్రిన్సిపాల్ ఇస్తే క్లాస్ కు వెళ్తుంది. ఆమె ఆలస్యంగా వెళ్ళినా టీచర్ మిసెస్ హోల్ట్ ఆమెతో ఫ్రెండ్లీ గానే వ్యవహరిస్తుంది. ఆ తర్వాత మొత్తానికి బ్రాందీ అనే  ఆమ్మాయి ఎంబర్ బ్రౌన్ పక్కన ఉన్న సీట్లో కూర్చోవడం వల్ల ఆమెను బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవడానికి ఎంబర్ బ్రౌన్ ప్రయత్నిస్తుంది. ఆమె బాగానే మాట్లాడినా మధ్యలో ఎంబర్ బ్రౌన్ జస్టిన్ తో పోల్చడంతో బ్రాందీ మనసు బాధపడటంతో మామూలు స్నేహితుల్లానే ఉండిపోతారు ఆ ఇద్దరూ. 

జస్టిన్ ఉన్నప్పుడూ అతనితో కలిసి స్కూల్ నుండి ఇంటికి నడిచి వెళ్ళేది ఎంబర్ బ్రౌన్. కానీ అతను లేకపోవడం వల్ల ,ఆమె తల్లి బిజీగా ఉండటం వల్ల అక్కడ ఉన్న ఎలిమెంటరీ సెషన్ లో ఉండి తల్లి వచ్చేవరకు వేచి చూసి ఇంటికి ఆమెతో వెళ్ళాల్సి వస్తుంది ఎంబర్ కు. తర్వాత అదే సెషన్లో బ్రాందీ కూడా ఉండటం వల్ల వారిద్దరి మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుంది. ఆ ప్రక్రియలో బ్రాందీ ఇంటికి వెళ్ళడం ఆమె ఎంబర్ కు జడ వేయడం, వారిద్దరు ప్రాణ స్నేహితులుగా మారడం జరుగుతుంది. ఎంబర్ కు ఇష్టమైన మెర్మాయిడ్ బొమ్మను మాక్స్ తల్లి ద్వారా ఇచ్చి ఆమెతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. మొదట్లో ఎంబర్ నిరాకరించినా తనకు బెస్ట్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల కొత్త ఫ్రెండ్ ను వెతుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు తల్లి కూడా కొత్త ఫ్రెండ్ ను వెతుక్కోవడంలో తప్పేమీ లేదని అనిపిస్తుంది. తను మెంటల్ గా సిద్ధం అయ్యాక మాక్స్ ను కలుస్తానని తల్లికి చెప్తుంది ఎంబర్. దీనితో కథ ముగుస్తుంది. 

జీవితం ఎవరి కోసం ఆగదని, ఒకరు వెళ్లిపోతే వారితో ఉన్న సంతోషకరమైన జ్ఞాపకాల్ని మనసులో స్మృతులుగా మిగుల్చుకుని ,కొత్త వారితో జీవితం సాగించడం నేర్చుకోవాలని ఈ పుస్తకం  అంతర్లీనంగా పాఠకులకు చెప్తుంది. దొరికితే తప్పక చదవండి. మనం ఎక్కడో ఎప్పుడో విన్న లేదా చూసిన లేదా బాల్యంలో అనుభవించిన ఎన్నో స్మృతులు మీ మనసును నింపేస్తాయి. 

          *    *     * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!